భారతదేశ భవిష్యత్తు అణుశక్తి అవసరాల కోసం యుసిఐఎల్ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ఆంధ్రదేశ్ ను కీలక యురేనియం కేంద్రంగా చేయడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. దేశఅవసరాల్లో దాదాపు 25 శాతం యురేనియం ఖనిజాన్ని ఇక్కడి నుండి అది ఆశిస్తోంది. 1987 ఎన్టీ రామారావు హయాంలోనే నాగార్జునసాగర్ దగ్గర, ఆ తర్వాత రణక్షేత్రంలో అణుకేంద్రాన్నినిర్మించే ప్రయత్నాలు చేసి విఫలమైంది. మళ్ళీ 2003లో నల్గొండ యురేనియం ప్రాజెక్టు లంబాపూర్, పెదగట్టు ఆదివాసీ ప్రజల తీవ్ర ప్రతిఘటనను ఎదుక్కొంది. కడపజిల్లాలో విజయం సాధించాక అది రాష్ట్రమంతా విస్తరించే ప్రయత్నం చేస్తోంది. కాని 2009లో మరోసారి పెద్దమూల గ్రామస్తులు నల్గొండ జిల్లా చందా పేట వద్ద చిత్రియాల్ గ్రామంలో జరుగుతున్న సర్వే పనులను అడ్డుకున్నారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ లో యురేనియం మైనింగ్ అవకాశాల గురించి అణుశక్తి విశ్లేషకులు చాలా మాట్లాడుతున్నారు. తుమ్మలపల్లి(పులివెందుల), కడపజిల్లాలోని దాని పరిసర ప్రాంతాలు కలిపి ప్రపంచంలోనే అతి పెద్ద యురేనియం స్థావరాల్లో ఒకటి అవుతుందని, కొత్తగా కనీసం ఒక డజను భారీ యురేనియం గనుల నుండి ఖనిజాన్ని వెలికితీయొచ్చని అంటున్నారు. వేంపల్లెలో 160 కిలోమీటర్ల పొడుగునా మద్దిమడుగు నుండి చేలుపల్లి దాకా యురేనియం ఖనిజం లభ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్క తుమ్మలపల్లె చుట్టూతా 30 కిలోమీటర్లలోపల 10 యురేనియం బ్లాకులు కనుగొన్నట్టు చెప్తున్నారు.
యుసిఐఎల్ 2007లో తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టు రూపంలో అప్పటి సియం వైయస్ రాజశేఖరరెడ్డి దన్నుతో ఆంధ్రప్రదేశ్ లో కాలుమోపింది. తుమ్మలపల్లె యురేనియం నిక్షేపాలు వైయస్ సొంత నియోజకవర్గం పులివెందులో ఉన్నాయి. రాష్ట్రంలో యుసిఐల్ కార్యకలాపాలు మొదలు పెట్టడానికి అది వ్యూహాత్మకంగా మంచి ప్రారంభం అయింది. అయితే తొలుత సహజంగానే అది ప్రజల నిరసనను ఎదుర్కోవలసి వచ్చింది. పర్యావరణవాదులు, పౌర ప్రజాస్వామిక హక్కుల సంఘాలు వాళ్ళను నడిపించాయి. 30 ఏళ్ళ వైయస్ కుటుంబ నియంతృత్వంలో ఎన్నడూ వినపడని ధిక్కార స్వరం అది. కాని ఇక్కడి గ్రామీణ ఫ్యాక్షన్ రాజకీయ పద్ధతిలో తొందరగానే దాన్ని అణచివేయడం వాళ్ళకు పెద్ద కష్టం కాలేదు.
పులివెందులలోకి రాకముందు అది ప్రవేశించిన ప్రతిచోటా గట్టి ప్రతిఘటనను ఎదుర్కొంది. ఒకరకంగా యుసిఐఎల్ పై నల్గొండ ప్రజల పోరాటవిజయం ఇక్కడ జనాన్ని కదిలించడానికి పర్యావరణవాదులకు, హక్కుల సంఘాలకు నైతికబలంగా ఉండింది. అయితే ఒకప్పుడు నల్గొండ యురేనియం మైనింగును గట్టిగా వ్యతిరేకిస్తూ 'ఒక ప్రతిపక్ష నాయకుడిగా కంటే వైద్యుడిగా' అయన వైఖరి ప్రకటించిన వైయస్ ముఖ్యమంత్రి హోదాలో సొంత నియోకవర్గంలోకి దాన్ని స్వాగతించడం కడపజిల్లా దురదృష్టం.
సెప్టెంబర్ 10, 2006న తుమ్మలపల్లెలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఆధునిక ప్రజాస్వామ్యాన్ని పరిహసించిందని హక్కుల సంఘాలు వ్యాఖ్యానించాయి. వైయస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు, స్థానిక యంపి వైయస్ వివేకానందరెడ్డి కనుసన్నలలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల అభిప్రాయాన్ని వినేందుకు నిరాకరించింది. స్వయంగా మానవహక్కుల కార్యకర్త బాలగోపాల్ తో సహా అణుశాస్త్రవేత్త గడేకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫ్యాక్షన్ మూకలు విసిరిన రాళ్ళలో ఒకదాని నుండి గడేకర్ గారు వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. జనాన్ని చాలా సునాయసంగా అంతే వ్యూహాత్మకంగా ఉద్యోగాల ఆశ చూపించి వర్గాలుగా చీల్చారు. మైనింగ్ ప్రాంతంలో గ్రామాలు భిన్న భౌగోళిక పరిస్థితులుండడం వాళ్ళకు కలిసి వచ్చింది. నీటి సౌకర్యం ఉండి మంచి వ్యవసాయ భూములున్న భూమయ్యగారి పల్లె ప్రజలు వాళ్ళ భూములకు బదులుగా ఇవ్వజూపిన నష్టపరిహారాన్ని తిరస్కరించారు. కాని కనాకష్టంగా పండే బీడు భూములున్న వాళ్ళను స్థానిక రాజకీయ నాయకులు యుసిఐఎల్ అధికారులు సులభంగా బుట్టలో పడేశారు. చాలామంది తమ భూముల్ని ముందుగానే మూడోపార్టీలకు అమ్మేసుకున్నారు. ఆ గ్రామాల వాళ్ళు, భూములు కొన్న బైటి ప్రాంతాలవాళ్ళు ప్రాజెక్టు వ్యతిరేకుల మీద తిరగబడ్డారు. నిస్సందేహంగా అది పాలకులు పన్నిన వ్యూహంలో భాగమే. ఇరువర్గాలు యురేనియం వ్యతిరేక, అనుకూల నినాదాలు చేస్తూ రాళ్ళు రువ్వుకున్నారు. పోలీసులు ప్రాజెక్టు వ్యతిరేకులపైనే లాఠీచార్జీ చేసి కేసులు బనాయించి ఆ తర్వాత తీవ్ర పరిణామాలుంటాయంటూ బెదిరించారు. ఫలితంగా 971.63 హెక్టార్లలో విస్తరించిన యురేనియం ప్రాజెక్టు వచ్చింది. అక్కడి భూగర్భం నుండి యురేనియం ఖనిజాన్ని హైడ్రోమెటలర్జికల్ విధానంలో వెలికితీయడానికి అన్నీ సిద్ధమయ్యాయి. దీని ముందైతే మానవజీవితాలకు ఏ విలువా లేకుండా అయిపోయిందో ఆ అత్యంత విధ్వంసక పదార్థం అక్కడ మొలకెత్తింది.
నాలుగు సంవత్సరాలు గడిచాయి. గ్రామస్తులకు స్థానిక నాయకులు, యుసిఐఎల్ హామీ ఇచ్చిన ఉద్యోగాలు రాలేదు. కాని మొదటి దశ మైనింగ్ వాళ్ళపై సమ్మెట దెబ్బలు వేసింది. భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతూ 200 బోర్లు ఎండిపోయాయని, ఉన్న భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, వాటివల్ల పాత్రలకు చిల్లులు పడుతున్నాయని వాళ్ళు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్నవారు లేరు. వాటిని పరీక్షించేందుకు కూడ ఎవరూ రాలేదు. ఇదిలా ఉండగా ఉత్పత్తి లక్ష్యాలను పెంచుతూ (రోజకు 3000 టన్నుల నుండి 4500 టన్నులకు) మైనింగ్ విస్తరణ కోసం యుసిఐఎల్ పెట్టిన ప్రతిపాదన మరింతగా మంటలు రేపింది.
ఈలోగా ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణం, అతని కొడుకు జగన్మోహనరెడ్డి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడం రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని ఆశిస్తున్న జగన్ ఇప్పుడు ప్రజల తరపున మాట్లాడుతున్నాడు. ప్రజల డిమాండ్లు నెరవేర్చేంతవరకు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామంటూ యుసిఐఎలను హెచ్చరిస్తున్నాడు. కాని ఇక్కడ సమస్యను ఉద్యోగకల్పన చుట్టూ తిప్పుతూ దాన్నే ముందుకు పెట్టి కీలకమైన పర్యావరణ, ప్రజారోగ్య విషయాలను పక్కకు నెడుతున్నారు. అయితే ప్రజాభిప్రాయ సేకరణ మూడుసార్లు వాయుదా వేయవలసి రావడం చూస్తే యుసిఐఎల్ ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతోందో అర్థమవుతుంది. ఏ ప్రజలనైతే ప్రహరీ గోడ ఆవలకు గెంటివేశారో వాళ్ళకిప్పుడు సమాధానం చెప్పుకోవాలి. చెప్పుకునే అవసరం ఉండకనూ పోవచ్చు. ఎందుకంటే భూగర్భజలాలన్నీ ఎండిపోతే జీవనాధారాన్ని కోల్పోయిన ప్రజలు అనివార్యంగా ఊళ్ళోదిలి వెళ్ళిపోవచ్చు.
అయితే ఈ ఆందోళనల నేపథ్యంలో యుసిఐఎల్ ఇక్కడ ఒక సర్వే నిర్వహించి అవన్నీ అర్థరహితమైన భయాలని కొట్టిపడేస్తూ ప్రకటన విడుదల చేసింది. ప్రజాసంఘాలు చొరవ చూపి శాస్త్రవేత్తలచే ఒక స్వతంత్ర్య పరిశీలన జరిపించింది. గ్రామాల్లో పర్యటించాక ఇక్కడి ప్రజలు లేవనెత్తిన సమస్యలను పరిశీలించిన జియాలజీ ప్రొఫెసర్ జి.కృష్ణారావు వాటి కారణాలను విశ్లేషిస్తూ ఒక రిపోర్టు తయారుచేశారు. ఒకసారి గనిలో ఉత్పత్తి మొదలయితే ఈ ప్రాంతంలో భూరర్భజలం భవిష్యత్తు ఆందోళనకరంగా ఉన్న విషయాన్ని ఆయన రిపోర్టు నొక్కిచెబుతుంది. జూన్ నెలలో జరిపిన ఈ పరిశోధన గ్రామస్తులు పదే పదే చేస్తున్న ఫిర్యాదులపై దృష్టి పెట్టింది.
మైనింగ్ లోతు భూగర్భజలం కన్నా 75 నుండి 145 మీటర్ల వరకు పోయింది. ఇక్కడ భూఉపరితలం నుండి 13, 14మీటర్ల లోపల నీటినిలువ ఉంటుంది. ఈ నీటిని వెడెల్పాటి దిగుడు బావుల ద్వారా లేదా ఇటీవలి కాలంలో బాగా ఎక్కువగా 19 నుండి 58 మీటర్ల వరకు దించిన బోరు పంపుల ద్వారా వినియోగించుకుంటున్నారు. గని నుంటి నీటి విడుదల రోజుకు 1845 క్యూబిక్ మీటర్లుగా చెప్తున్నారు.
మైనింగ్ వల్ల పరిసర గ్రామ ప్రజలు అనుభవిస్తున్న దుష్పరిణామాల పై శాస్త్రీయ వివరణలు ఇవి:
1. ఈ ప్రాంతంలో భూగర్భజలాలు ఇంకిపోవడం వల్ల 130బోర్లు ఎండిపోయాయి. మైనింగ్ లోతు బోరుబావుల లోతుకన్నా ఎక్కువ ఉండటం వల్లే ఈ పరిస్థితి. ఈ యురేనియం ప్రాజెక్టు ప్రాంతంలో ప్రతి ఏటా వర్షపాతం వల్ల 490000 క్యూబిక్ మీటర్ల నీరు భూగర్భంలోకి చేరుతుంటుంది (8.4% ఇన్ ఫిట్రేషన్ ఫ్యాక్టర్ ప్రకారం). గని తవ్వడం వల్ల బైటికిపోయే నీరేమో ఏడాదికి 670000 క్యూబిక్ మీటర్లు. అంటే నీటి విడుదల, నీటి పునరుద్దరణ కన్నా ఎక్కువన్నమాట. అంటే ప్రకృతి నుండి మితిమీన నీటి దోపిడి జరుగుతోంది. ఇక్కడి భూగర్భ నీటితో అనుసంధానంలో ఉన్న పరిసర ప్రాంతలకు కూడ ఈ పరిస్థితి విస్తరిస్తుంది. మైనింగ్ కార్యకలాపాలు నడిచే 30 ఏళ్ళపాటు భూగర్భజలాన్ని గనులు తోడేస్తాయి. దాంతో అన్ని నీటివనరులు కాలక్రమేణా ఎండిపోయి జనానికి తాగు, సాగు నీటి కరవు ఏర్పడుతుంది. ప్రభావిత ప్రాంత విస్తీర్ణం నమూనా అధ్యనాల నుండి అంచనా వేయొచ్చు. ఇప్పటికే జిల్లాలో ప్రాజెక్టు ప్రాంతం, దాని పక్కగ్రామాలు భూగర్భజలం లభ్యతలో ప్రమాదస్థాయిని (సెమీ క్రిటికల్ స్థాయిని మించి) చేరుకున్నాయి.
2. ఈ ప్రాంతంలో భూగర్భజలాలు కలుషితమయినట్లు, వాటివల్ల పాత్రలకు చిల్లులు పడుతున్నాయని చెప్తున్నారు. మైనింగ్ ప్రాంతాల్లో తవ్వకాల వద్ద, ఖనిజం కుప్పగా పోసిన దగ్గర, శుద్ధి చేసేటప్పుడు వెలువడే వ్యర్థాల వల్ల ఉపరితల, భూగర్భజలాల కాలుష్యం తెలిసిందే. కాల్షియం, మెగ్నీషియం, ఇనుము వంటి రసాయనాలు ఖనిజం ఉన్న రాతిలోకన్నా గని అంచుల (టెయిల్ ఎండ్స్) వద్ద తక్కువగా ఉండటాన్నిబట్టి అవి నీటి ప్రవాహాలకు గురయ్యాయని చెప్పొచ్చు. నీటిలో కరగని నికెల్, మాంగనీస్ టెయిల్ ఎండ్స్ వద్ద కేంద్రీకరించడ్డాయి.
మైనింగ్ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం, దాని పరిసర ప్రాంతాలు భూగర్భజల కాలుష్యానికి గురవుతాయి. ఈ నేల స్వభావరిత్యా పెద్ద రంధ్రాలున్న జల్లెడలాగా ఉండటం వల్ల కలుషిత పదార్ధాలను దూరాలకు వ్యాపింపజేయగలవు. మొత్తం భూగర్భజలమంతా పోయి ఇది బీడుబారిపోతుంది. తిండి, నీళ్ళు లేక జనం ఊర్లు ఖాళీ చేసిపోయే పరిస్థితి రావచ్చు.
3. ప్రాజెక్టు ప్రాంతంలో ఖనిజ నిల్వలు, వ్యర్థాలు నిలువేసే టెయిల్ పాండకు సంబంధించి ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టక వాటిని నిర్లక్ష్యంగా నేలపైనే వదిలేశారు. మొట్టమొదట వాటిని నీళ్ళికని ప్రత్యేక గుంటల్లో, చెరువుల్లో నిల్వచేయాలి. వ్యర్థాలు భూమిలోకి ఇంకకుండా వాటిని సాంకేతిక పద్ధతిలో నిర్మించాలి. తర్వాత రేడాన్ వయువు, రేడియోధార్మికతను తగ్గించడానికి వ్యర్థాలను ఉపరితలంలో నీటితో తడపాలి. చివరిగా వాటిని కేవలం మట్టితో కాక రెండు మీటర్ల మందంతో బంకమట్టి, ఇసుకతో కప్పాలి.
4. ఖనిజాన్ని చాలా మెత్తని పొడిగా (100 మెష్ గుండా పోయేంత సున్నగా) చేస్తున్నారు. మెత్తని పిండిలాగా ఉన్నప్పుడు ఆల్ఫా కిరణాల ప్రభావం ప్రమాదకర స్థాయిలో ఉంటుంది.
తాజాగా సెప్టెంబర్ 9న ప్రొ.కృష్ణారావు స్వయంగా యురేనియం మైనింగ్ జరుగుతున్న ప్రాజెక్టు పరిధిలోని మొత్తం ఐదు గ్రామాలనూ- తుమ్మలపల్లె, రాయకుంటపల్లె, మబ్బుచింతలపల్లె, భూమయ్యగారిపల్లె, కొట్టాలు - పర్యటించి మరోసారి ఇక్కడి నేలస్వభావాన్ని, నీటి పరిస్థితిని అధ్యయనం చేసి ఈ కింది అంచనాలకు వచ్చారు.
మైనింగ్ ప్రాంతం ఎగుడుదిగుడు గుట్టలు, లోయలతో కొండప్రాంతపు భౌగోళిక స్వరూపంతో ఉంది. యురేనియం ఖనిజం డోలమైట్ ఉన్న సున్నపురాయి, బంకమట్టితో ఏర్పడిన పర్పల్ షేల్, క్వార్టైట్లతో కూడిన ఎగుడుదిగుడు కడపరాతి పలకలతో (షియర్ జోన్) ఏర్పడిన నేలలో ఉంది. ఈ రాయి దట్టంగా, చీలికలతో ఏర్పడుతంది. ఈ చీలికలు మరింత ఎక్కువై రాతిని రెండుగా చీల్చాయా అన్నట్టు ఉంటుంది. (జియాలజీలో వీటిని జాయింట్ సెట్స్ అంటారు). ఇలాంటి ప్రాంతంలో పుష్కలంగా భూగర్భజలం ఉంటుంది. ఇక్కడ అధిక సంఖ్యలో వేసిన బోర్లు, వాటికింద అరటితోటల సాగు ఇందుకు రుజువుగా కనపడుతుంది.
యురేనియం కోసం సర్వేలు చేస్తున్నపుడు వాటికి సంబంధించిన చర్యల వల్ల బోర్ల నుండి నీళ్ళు పైకి వచ్చాయని తెలిసింది. అంటే భూగర్భజలం మహా అయితే ఐదారేళ్ళ క్రితం నుండి వృద్ధి చెంది ఉండొచ్చు. భూమి స్వభావాన్నిబట్టి బోరుబావుల లోతు 150నుండి 300అడుగుల వరకు ఉంది. 2-3 ఇంచిల వ్యాసార్థంగల పైపుల నుండి వారు నీటిని తోడుకుంటున్నరు. జిల్లాలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే పరిమాణంలో ఇవి చాలా పెద్దవి. మైనింగ్ మొదలవ్వడం వల్ల రెండు సంవత్సరాల నుండి చాలా వరకు బోర్లు ఎండిపోయాయి. జనం ఇంకా లోతుకు 350 నుండి 450 అడుగుల వరకు బోర్లు దించారు. కొన్ని చోట్ల 600 నుండి 800 అడుగుల లోతుకు పోయారు. వీటిలో కొన్ని ఫెయిలయ్యాయి. లోతుకు పోవడంతో రాతి స్వభావంలో మార్పురావడం వల్ల అలా జరిగిందనేది స్పష్టం.
మొదట్లో స్థిర నీటి నిలువలు అంతలోతుకు లేకుండా ఉండేవి. సబ్ మెర్సిబుల్ పంపులు 100 అడుగుల వరకు ఉండేవి. కొత్తగా వేసిన బోర్లలో ఇప్పుడవి 300 నుండ 400 అడుగుల వద్ద ఉన్నాయి. భూమయ్యగారిపల్లెలో 50అడుగుల దూరంలో ఉన్న రెండు తాగునీటి బావుల్లో నీటి నిలువ (అవి నిజానికి వాస్తవమైనవి కావు- సూడో వాటర్ లెవెల్స్) భూమినుండి 132 అడుగుల లోతున ఉన్నాయి. కాని స్విచ్చి వేసిన 5నిమిషాలకే నీళ్ళైపోయాయి. బోరు 350 అడుగులకు తవ్వితే పంపు 300 అడుగుల వద్ద పెట్టారు. అంటే మొదటి నీటి ఊట ఎండిపోయింది. ప్రస్తుతం అది 350 అడుగుల లోపల ఉండొచ్చు. ఒకప్పుడవి 50 అడుగుల లోతులోను ఉండేవి. ఈ లెక్కన నీటి మట్టం పడిపోతూ వస్తే 2000 అడుగులలోతు వరకు మైనింగ్ చేరుకునేసరికి క్రమంగా ఆ ప్రాంతంలో పూర్తిగా నీరు మాయమవుతుంది. ఇక నీటి నాణ్యత భూమిపొరలనుబట్టి, అందులోని ఖనిజాలనుబట్టి మారిపోతూ ఉంటుంది. ఏమైనా నీరే లేకుండా పోతున్నప్పుడు దాని నాణ్యత అంత ప్రాముఖ్యతున్న విషయం అవదు.
అణువిద్యుత్ ఒక విధ్వంసకశక్తి రూపమే కాదు. అది పెట్టుబడి సంచయనానికి, మానవసమాజంపై ఆధిపత్యానికి ఒక నమూనా. అది అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలకు ప్రపంచాన్ని బెదిరించి వనరులను దోచుకునే శక్తిగా ఉపయేగపడుతుంది. జపాన్ పై అణుబాంబు దాడి సామ్రాజ్యవాద శక్తి ఎంత గొప్పదో ప్రపంచానికి చాటింది. అప్పటి నుండి మిలిటరీ శక్తికో, ఆత్మరక్షణకో అణుశక్తి దేశాల రక్షణ వ్యయంలో ప్రధాన భాగమైపోయింది. సామ్రాజ్యవాదం యురేనియం అన్వేషణ, దిగుమతి, అణుసాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకోడమో, కొనుక్కోడమో తప్పనిసరి చేసింది. ఇదంతా అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందాల మాటునే జరుగుతుంది. ఎవరికి అణుసహకారం అందించాలి(అమ్మాలి), అణ్వాయుధాల్ని తయారు చేస్తున్నారన్న నెపంతో ఏ దేశాలపై దాడులు చేయాలి అన్నది సామ్రాజ్యవాద మార్కెట్ వ్యూహాల్లో భాగం. మరోవైపు అణువిద్యుదుత్పత్తి భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇందులో ఎంత తక్కువ శాతం చేతులు మారినా విపరీతంగా డబ్బు కూడబెట్టుకోవచ్చు. అందుకే కావొచ్చు, అధికార్లకు, ప్రజాప్రతినిధులకు దీని పట్ల విపరీతమైన ఆసక్తి.
నేరుగా ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని ప్రభావితం చేసే అణువిద్యుత్ గురించి కాని అణు ఒప్పదాల గురించి కాని చర్చ ప్రజల్లోకి వెళ్ళింది చాలా తక్కువ. అణుశక్తిని వ్యతిరేకిస్తే వాళ్ళు తరచుగా దేశభక్తి దాబాయింపులను, అభివృద్ధివాదాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అణుశక్తికి వ్యతిరేకంగా నిర్మాణమయ్యే సామాజిక ఉద్యమాలు దానిని రాజకీయంగా, భావజాలపరంగా ఎదుర్కోవలసిన అవసరం ఉంది.
(వీక్షణం, నవంబర్ 2011)
