Saturday, May 5, 2018

మార్క్సిజం - పర్యావరణం

పెట్టుబడిదారీ వ్యవస్థలోని అంతర్గత వైరుధ్యాల గురించి మార్క్స్ విస్తారంగా చర్చించాడు. దాని అహేతుక, స్వార్థపూరిత ఉ త్పత్తి విధానం ఎలా పదే పదే సంక్షోభాలను సృష్టించుకుంటుందో మార్క్సిస్టు రాజకీయర్థశాస్త్రం విశ్లేషిస్తుంది. కార్మికవర్గం తన రాజకీయ చైతన్యంతో వర్గపోరాటం ద్వారా వ్యవస్థను కూలదోసి ఉత్పత్తి సంబంధాలను మార్చివేయడం ద్వారా నూతన వ్యవస్థను నిర్మిస్తుందని కమ్యూనిస్టు మానిఫెస్టో చెప్తుంది. వర్గపోరాట సిద్ధాంతంగా మార్క్సిజాన్ని ఇంతమటుకే అర్థం చేసుకునేవాళ్లు మార్నిజం 'చెప్పకుండా వదిలేసిన వైరుధ్యాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆమేరకు మార్క్సిజంలో ఖాళీలున్నాయనడం దగ్గరి నుండి అది ఆర్థిక నిర్ణాయకవాదమని, ఉత్పత్తివాదమని వాదిస్తూ ఉంటారు.

తత్వశాస్త్రం, చరిత్ర, రాజకీయర్థశాస్త్రాలతో పాటు విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధిని అధ్యయనం చేసే క్రమంలో మార్క్స్ వందలకొద్దీ పరిశీలనలు చేశాడు. సాహిత్యం , కళల గురించి కూడా అనేక ప్రస్తావనలు చేశాడు. ఆయనకు సుదూరంగా ఉండే ఇండియా సమాజం గురించి కూడా ఆయన రాశాడు. అయితే దేని గురించి ఎక్కడ ఏ ఉటంకింపు ఇచ్చాడన్నది పై వాదనలకు సమాధానం కాదు. అవసరమైతే అవి గూడా ఉదహరించవచ్చుగాని అది మార్క్సిజం అవ్వదు. మార్క్స్ శాస్త్ర, సామాజిక పరిశీలనలకు అద్భుతమైన పరికరాలను అందించాడు. తన రాజకీయర్థశాస్త్ర సిద్ధాంతాన్ని రూపొందించే క్రమంలో చారిత్రక భౌతికవాద పద్దతిని ఆవిష్కరించాడు. చరిత్ర పట్ల భౌతికవాద దృక్పథం మార్క్స్ ఆవిష్కరణల్లో అత్యున్నతమమైనది. మానవ సమాజ పరిణామ క్రమాన్ని, సమాజ చలన సూత్రాలను అర్థం చేసుకోడానికి ఇంతకన్న అభివృద్ధిచెందిన శాస్త్రీయ పద్ధతి మరొకటి లేదు. ఇరవయ్యో శతాబ్దంలో తమ పరిశోధనలో ఒక్కచోటైనా మార్క్స్ ను అనుసరించని సామాజిక శాస్త్రవేత్త ఉండరు. అంటే మార్నిజంలోనే అంతా ఉందని చెప్పడం కాదు. మార్క్స్ పరిశీలనలు మార్క్స్ దగ్గరే వదిలేయకుండా 21వ శతాబ్దానికి అభివృద్ధి చేయడానికి మార్క్సిజమే దారి చూపుతుంది. అట్లాగే మార్క్స్ 'చెప్పకుండా' వదిలేసిన వాటిని అర్థం చేసుకోడానికి కూడా.

సోవియట్ యూనియన్, చైనా సోషలిస్టు ప్రయోగాల అనంతర కాలంలో 'పర్యావరణ' సమస్య ప్రబలంగా ముందుకొచ్చింది. ఇరవయ్యో శతాబ్దపు చివరి దశాబ్దాల్లో పర్యావరణ మార్పులు చర్చనీయాంశమయ్యాయి. భూతాపం పెరిగిపోవడం, అడవులు క్షీణించడం, ప్రకృతి వైపరిత్యాలు పదేపదే వచ్చిపడి మానవ ఆవాసాలను విధ్వంసం చేయడం, రుతువులు గతి తప్పడం, అతివృష్టి, అనావృష్టి, ప్రాణాంతక కాలుష్యం ఆవరించడం, రోగకారక క్రిములు శక్తిని పుంజుకొని విజృంభించడం, కొత్త కొత్త వ్యాధులు పుట్టుకురావడం వంటి పరిణామాలు వాతావరణ మార్పుల గురించి, పర్యావరణ సంక్షోభం గురించి సీరియస్ గా పట్టించుకోక తప్పని స్థితిని కల్పించాయి. పర్యావరణవాదం కూడా రంగంమీదికొచ్చింది. పారిశ్రామిక యుగం కాలుష్యాన్ని విపరీతంగా పెంచేసింది. ప్రకృతిలో మానవ ప్రమేయం వల్లనే కొన్ని వేల సంవత్సరాలలో జరగని అనూహ్య మార్పులు గడిచిన ఒకటిన్నర శతాబ్దంలో వాతావరణంలో చోటుచేసుకుంటున్నాయి. భూమిని వేడెక్కించే హరిత వాయువులు 25శాతం పెరిగాయి. భూమి సగటు ఉష్ణోగ్రత 2 డిగ్రీలు పెరిగితే వినాశకర పరిణామాలు ఉ ంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. పరిస్థితి చూస్తుంటే ఆ దరిదాపుల్లోకి చేరుకోడానికి ఎక్కువ సమయం పట్టేలా లేదు. పరిశుభ్రమైన తాగునీటి లభ్యతే నానాటికీ దుర్లభమవుతోంది. కలుషిత నీటి వల్ల వచ్చే జబ్బులబారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలకొద్దీ జనం చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ప్రతి ఆరులో ఒక మరణానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాతావరణ కాలుష్యమే కారణం. ఒక్క క్యాన్సర్ కేసులే తీసుకుంటే లక్ష మందిలో 440 మంది కొత్తగా ప్రతి ఏటా ఈ ప్రాణాంతక జబ్బుబారిన పడుతున్నారు. ఇందులో నిస్సందేహంగా వాతావరణంలోకి విడుదలవుతున్న విషరసాయనాల పాత్ర ఉంది.

వేగవంతమవుతున్న వాతావరణ మార్పు ఎప్పటికప్పుడు ప్రమాద సంకేతాలు పంపుతూనే ఉంది. ఢిల్లీ పొగమంచు తాజా ఉదాహరణ. ఇట్లా అనేక నగరాలు తయారవుతున్నాయి. పెరుగుతున్న మురికివాడలు, వర్షానికి కొట్టుకుపోయే బీదప్రాణాలు, వైద్యులకు, మందులకు కష్టార్జితమంతా ధారపోసేలా జబ్బుల నిలయాలవుతున్న దేహాలు ...ఇలా జీవావరణం మృత్యు కాసారమైపోతోంది. ఆరోగ్య కేంద్రమైనా లేని మారుమూల జనావాసాలు అలా ఉండగా అధునాతన వసతులున్న చోట విషతుల్యమైన పరిసరాలు పరుచుకుంటున్నాయి. పెరిగిపోతున్న కాలుష్యాన్ని నిలువరించడం ఎలా? అతివృష్టి, అనావృష్టి, భూవిలయాల నుండి మానవజాతిని కాపాడుకోవడం ఎలా?

తొలిసారిగా 1972లో స్టాక్ హెూంలో జరిగిన అంతర్జాతీయ సదస్సు మొదలుకొని, అభివృద్ధి-పర్యావరణ పరిరక్షణ అంశం కేంద్రంగా 1992 రియో డి జనేరియో వరకు జరిగిన సదస్సుల్లో వాతావరణ మార్పులకు సంబంధించిన పలు అంశాలు చర్చకొచ్చాయి. 1997 క్యోటో వాతావరణ మహాసభ నాటికి భూతాపాన్ని పెంచుతున్న హరితగృహ వాయివులను తగ్గించుకోవాలని అన్ని దేశాలు ఒప్పందాలు చేసుకొని సీరియస్ ప్రతిజ్ఞలు తీసుకున్నాయి. కానీ పెట్టుబడిదారీ దేశాలు వాటిని ఉల్లంఘించాయి. ప్రతి ఏడాదీ ఇది చర్చకొస్తూనే ఉంది. తాజాగా 2015లో ప్యారీస్ ఒప్పందంపై 196 దేశాలు సంతకాలు పెట్టాయి. దీనిని చారిత్రాత్మక మలుపుగా పలు దేశాల అధినేతలు, వాతావరణ నిపుణులు ప్రకటించారు. అయితే తంతుల్లాగా జరిగే ఈ సమావేశాలకు నిరసనగా ప్రజా ప్రదర్శలు కూడా జరిగాయి. ఆ ఒప్పందాలు, వాటి ఉల్లంఘనలు ఆ వివరాల జోలికి ఇక్కడ పోవడం లేదు. అయితే కార్పొరేట్ పెట్టుబడి కనుసన్నల్లో నడిచే ప్రభుత్వాలు, పేరుకే తప్ప చేతల్లో ఏమీ లేని ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలూ ఈ సమావేశాలను తూతూ మంత్రంగానే జరుపుతున్నాయని చెప్పవచ్చు.

ఆందోళనకరమైన వాతావరణ మార్పుల గురించి పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు, కార్యకర్తలకే పరిమితమైన చర్చ క్రమంగా జనసామాన్యానికి సంబంధించిన జీవన్మరణ సమస్యగా అనేక సందర్భాలలో ముందుకొస్తున్నది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన వంటి వాటిని 'ప్రమాదాలుగా' కొట్టిపడేయవచ్చు. 2004 సునామీ, 2013 ఉత్తరాఖండ్ వరదలు వంటి వాటిని ప్రకృతి వైపరిత్యాలుగా సర్దిచెప్పుకోవచ్చు. కానీ వాతావరణంలో రోజువారీ మార్పు ఇప్పుడందరికీ అర్థమవుతోంది. ఆనకట్టలు, అణువిద్యుత్ కేంద్రాలు, రసాయన పరిశ్రమలు, గనుల తవ్వకాలు చేపట్టినప్పుడు విస్థాపనతో పాటు ప్రకృతి విధ్వంసం గురించి బాధిత ప్రజలు మాట్లాడుతున్నారు. ఈ విషయాల్లో ఆయా వర్గాలకు ఇప్పటికే చాలా అనుభవం ఉంది. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం అందరికీ అన్నం పెట్టే ప్రకృతిని నాశనం చేస్తున్నారన్న భావన విస్థాపన సమస్యతోపాటు ముందుకొస్తోంది. పర్యావరణం, అడవుల పరిరక్షణ, జీవివైవిధ్యం గురించి ఎప్పుడూ గంభీరమైన ప్రకటనలు చేసే ప్రభుత్వాలు తన చర్యల గురించి ప్రజలు ప్రశ్నిస్తే మాత్రం అభివృద్ధి జరగాలంటే కొంత నష్టం భరించక తప్పదు అంటాయి. పర్యావరణవాదనను చాదస్తంగా, అభివృద్ధి నిరోధకత్వంగా కొట్టిపడేస్తాయి. ప్రభుత్వాల చిత్తశుద్ధి ఇలాగే ఉంటుంది. అయితే పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడానికి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పునరుద్ధరించడానికి వ్యవస్థలో ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? రసాయన ఎరువులు, పురుగుమందులు లేకుండా వ్యవసాయం, సాంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం, జలసంరక్షణ వంటి విధానాలకు ఉన్న అవకాశాలు, పరిమితులు ఏమిటి? ఈ విషయాలను ఆలోచించాలంటే మనం ఉత్పత్తి విధానం దగ్గరికి పోవలసిందే.

ఉత్పత్తి విధానం అనగానే శ్రామికులకు యజమానికి ఉండే సంబంధం, అదనపు విలువ దోపిడి గురించి మార్క్స్ చెప్పింది గుర్తుకు వస్తుంది. అంతకన్నా మౌలికమైన విషయం పదార్థం, మానవ శ్రమ కలిస్తేనే ఉత్పత్తి జరుగుతుంది. మనుషులు ఉత్పత్తి సాధనాలతో తమ శ్రమను వెచ్చింది ప్రకృతిలోని ముడిపదార్థాన్ని వస్తువుగా తయారుచేస్తారు. అట్లా మానవులు ప్రకృతితో సంపర్కంలోకి వెళతారు. 'మనకు ప్రకృతికి మధ్య పరస్పర ప్రభావం, నియంత్రణ, ఆదాన ప్రదానాలు జరిపించే ప్రక్రియే శ్రమ' అని మార్క్స్ అంటాడు. ప్రకృతి, మానవ సమాజపు చలన సూత్రాలను శాస్త్రీయంగా అర్థం చేయించేది మార్క్సిజమే. ప్రకృతిని గురించి తక్కిన తత్వశాస్త్రాలు చేప్పేదానికి, మార్క్సిజం చెప్పేదానికి మౌలికమైన తేడా ఉంది. మార్క్స్ అభివృద్ధి చేసిన గతితార్కిక నియమాలు మొట్టమొదట మనుషులు జ్ఞానాన్ని పొందే క్రమంలో ప్రకృతిని ఎట్లా అర్థం చేసుకున్నారో కూడా వివరిస్తాయి. మానవ పరిణామ క్రమంలో శ్రమ పాత్రని గురించి ప్రకృతి గతితర్కంలో ఎంగెల్స్ చెప్తాడు. శ్రమ ద్వారా ప్రకృతితో సంబంధాన్ని ఏర్పరచుకుంటున్న క్రమంలో మనిషికి జ్ఞానమొస్తుంది. మిగతా జంతువుల నుండి మనిషిని విడదీసేది శ్రమే. శ్రమ ద్వారా పొందిన అనుభవమే ప్రకృతిని, దాని నియమాలను మనిషి మరింతగా అర్థం చేసుకునేలా చేసింది. 

ప్రకృతిలో ప్రాణులు, వాటి చుట్టూ భౌతిక పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ నిరంతరం ఒకదానితో ఒకటి ప్రభావం చెందుతూ, పరిణామం చెందుతూ ఉంటాయి. ఈ పరస్పర సంబంధాల నుండే మనం పర్యావరణాన్ని అర్థం చేసుకోవాలి. ప్రకృతిలోని ఇతర ప్రాణులకన్నా మనిషి ప్రకృతి పై వేసే ప్రభావం అధికంగా ఉంటుంది. ఇక్కడ మనిషి అంటే ఒక వ్యక్తి కాదు, మానవ సమాజం. మానవ సమాజం ఏ భౌతిక, చారిత్రక స్థితిలో ఉంది అనేది కూడా ప్రభావితం చేసే అంశం అవుతుంది. గతితర్కం ప్రకృతిలోని విడివిడి దృగ్విషయాలన్నిటి మధ్య ఉండే పరస్పర సంబంధాలను గుర్తిస్తుంది. చలనశీలతను, మార్పును అర్థం చేసుకుంటుంది. మార్క్స్ కాలంనాటికి అభివృద్ధి చెందిన విజ్ఞాన శాస్త్రాలను ఆయన అధ్యయనం చేస్తూ ఒక శాస్త్రీయ సంవిధానాన్ని రూపొందించాడు. గతితార్కిక నియమాలను ప్రకృతి కన్నా మరింత సంక్లిష్టమైన మానవ సమాజానికి అన్వయించి చారిత్రక భౌతికవాదాన్ని అభివృద్ధి చేశాడు. ముందే చెప్పినట్లు మార్క్స్ కీలకమైన ఆవిష్కరణ అదే. ఫ్యూడల్ సమాజం నుండి పెట్టుబడిదారీ సమాజం ఆవిర్భవించిన కాలంలో పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి క్రమాన్ని ఆయన దగ్గరగా పరిశీలించే అవకాశం వచ్చింది. కార్మికవర్గ సిద్ధాంతాన్ని తయారుచేసే చారిత్రక పాత్ర మార్క్స్ పోషించాడు.

పెట్టుబడిదారీ వ్యవస్థలో మానవ సమాజానికి, ప్రకృతికి ఉండే సంబంధాన్ని మార్క్స్ అద్భుతంగా వివరిస్తాడు. అయితే మార్క్స్ చేసిన ఈ పరిశీలన గురించి రెండు మూడు దశాబ్దాల క్రితం వరకు పెద్దగా చర్చ జరగలేదు. మార్క్స్ తర్వాత మార్క్సిస్టు ఆలోచనాపరుల నుండి కొన్ని అధ్యయనాలు వెలువడినాయి. అయినా మార్క్సిస్టు పద్ధతిలో పర్యావరణాన్ని అర్థం చేసుకోవడం అనే భావన ఇటీవల పర్యావరణ సంక్షోభంపై చర్చ విస్తృతమయ్యే క్రమం దాకా పైకి రాలేదు. పర్యావరణవాదం మార్క్సిజం మీద విమర్శలు చేయడం మొదలు పెట్టింది. మార్క్స్ పర్యావరణాన్ని గురించి పట్టించుకోలేదు అనడం దగ్గరి నుండి మార్క్సిస్టులు ప్రకృతిని ఒక వినియేగవస్తువుగా చూస్తారు, మార్క్సిజానిది ఉత్పత్తివాదం, మార్క్స్ యంత్రాన్ని విపరీతంగా ఆరాధిస్తాడు అనేదాకా కుతర్కాలు ఉన్నాయి. సోషలిస్టు దేశాల కార్యాచరణ ఉత్పత్తి పెంచే లక్ష్యంతో పర్యావరణ స్పృహ లేకుండా ఉండిందన్న విమర్శ అన్నింటికన్నా బలమైనది. అయితే ఆనాడు పర్యావరణ స్పృహ ఇప్పుడున్నంతగా లేకపోయిన మాట వాస్తవం. యుద్ధాలతో, ఆర్థిక సంక్షోభాలతో సంక్షుభితమైన ఆనాటి సమాజంలో ప్రజలందరికీ తిండి పెట్టడమే సోషలిజం ముందున్న తక్షణ సవాలు. అప్పటి ప్రత్యేకతల నుండే ఆనాటి సోషలిస్టు ప్రయోగాలను చూడాలి.

ప్రకృతి, మానవ సమాజం మధ్య నున్న అన్యోన్యక్రియ గురించి మార్క్స్ అవగాహనను జాన్ బెలామీ ఫాస్టర్, పాల్ బర్కెట్, కోహీ సైటో వంటి మార్క్సిస్టు మేధావులు విశదీకరిస్తూ మార్క్సిస్టు దృక్పథంతో పర్యావరణ సంక్షోభాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, పర్యావరణ దృష్టితో ప్రత్యమ్నాయ ఉత్పత్తి విధానం ఎలా ఉండవచ్చో విశ్లేషించారు. 

మార్క్స్ మనిషి శ్రమకు, ప్రకృతికి మధ్య పరస్పర సంబంధాన్ని చెప్పడానికి మెటబాలిజం అనే ప్రక్రియను పరిచయం చేస్తాడు. మానవ సమాజానికి, ప్రకృతి మధ్య మానవ శ్రమ ద్వారా ఒక మెటబాలిజం (జీవక్రియ) ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఈ మెటబాలిజంలో సమతుల్యత ఉంటుంది. సమష్టి ఉత్పత్తి ద్వారా మానవులు ప్రకృతితో హేతుబద్ధమైన మెటబాలిజంతో ఉంటారు. దీన్నిలా వివరించొచ్చు. నేల, జీవరాశుల మధ్య పోషకాల ఆదాన ప్రదానం జరుగుతూ ఉంటుంది. మట్టిలో నుండి పోషకాలను తీసుకొని చెట్టు పెరుగుతుంది. చెట్టు నుండి పోషకాలను జంతుజాలాలు తీసుకుంటాయి. ఈ జీవులు విసర్జన ద్వారానూ, చనిపోయిన తర్వాత శరీరభాగాలు కుళ్లిపోయి మట్టిలో కలవడం ద్వారానూ తిరిగి పోషకాలను నేలలో చేరుస్తాయి. ఈ నియమాలను అర్థం చేసుకున్న మానవులు తమ శ్రమ జోడించి (వ్యవసాయం) అవసరమైన ఫలితాలను పొందుతారు. పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు చొరబడి దీనిని విచ్చిన్నం చేస్తాయంటాడు మార్క్స్. ఉత్పత్తి నుండి పరాయీకరణ మొదలవ్వడంతోనే ప్రకృతికి మనిషికి ఉండే అన్యోన్య సంబంధం బీటలువారుతూ వస్తుంది. గ్రామాలు, పట్టణాల మధ్య వ్యత్యాసం పెరిగే కొద్దీ మనుషులు ఒకేచోట విపరీతంగా కేంద్రీకృతమై సమతుల్యత దెబ్బతింటుంది. గ్రామాల ఉత్పత్తి పట్టణాలకు చేరడం, జనసాంద్రత పెరగడం, పట్టణాల్లో వ్యర్థాలు పోగుపడటం అంటే భూసారం తరలిపోవడమే. పెట్టుబడి ప్రవేశించాక ఆధునిక వ్యవసాయంలో విధ్వంసక కోణం పెరుగుతూపోయింది. కాపిటల్ రచనాకాలంలో జస్టస్ వాన్ లీబిగ్ అనే శాస్త్రవేత్త వ్యవసాయంలో రసాయనాల వినియోగం గురించి చేసిన పరిశోధనను మార్క్స్ సన్నిహితంగా ఫాలో అయ్యాడు.

'పెట్టుబడిదారీ వ్యవస్థలో మెట్టమెదటి సారిగా మానవజాతి దృష్టిలో ప్రకృతి పూర్తిగా ఒక ఉపయోగ వస్తువుగా మారిపోతుంది. అది స్వయం ప్రతిపత్తిగల ఒక శక్తిగా గుర్తింపుకోల్పోతుంది. ప్రకృతి నియమాలపై పరిశోధనలు, సిద్ధాంతాల ఆవిష్కరణ కేవలం మానవావసరాలకు ప్రకృతిని వినియోగ వస్తువుగా, ఉత్పత్తి సాధనంగా పరిమితం చేసే ఒక కుయుక్తి అయిపోతుంది'. మార్క్స్ చేసిన ఈ సూత్రీకరణకు ఎంతటి ప్రాసంగికత ఉందో ఈనాడు కార్పొరేట్ విధ్వంసం చూస్తే మనకు అర్థమవుతుంది. గొర్రెల మందల్ని మేపడానికి పెద్దఎత్తున భూముల్ని స్వాధీనం చేసుకొని రైతుల్ని గెంటివేసిన ఆనాటి పెట్టుబడిదారులను చూసి మార్క్స్ ప్రకృతి పట్ల పెట్టుబడిదారీ అరాచకాన్ని గురించి చెప్తాడు. ప్రకృతితో మానవ సమాజం ఎలా మెలగాలో చెప్తాడు. మనం భూయజమానులం కాదు, తాత్కాలిక లబ్దిదారులం మాత్రమే అంటాడు. ఈ జాగాలో మనం అద్దెకున్నాం అంతే, అని కూడా అంటాడు. ఈ నేలను పూర్వీకుల నుండి మనం ఏ రూపంలో తీసుకున్నామో అంతే జాగ్రత్తగా తర్వాతి తరాలకు అప్పగించాల్సిన బాధ్యత మనమీద ఉందంటాడు. మార్క్స్ రచనల్లో, ఉత్తరాల్లో అడవుల విధ్వంసం గురించి, వాతావరణ మార్పు గురించి, జీవజాలం అంతరించిపోవడం గురించి, రోగాలు, అధిక జనాభా వంటి పెట్టుబడిదారీ వికృత రూపాలెన్నిటి గురించో వివరించాడు.

మార్క్సిస్టు దృక్పథంతో పరిశీలిస్తే పర్యావరణ సంక్షోభం ఆధునిక విజ్ఞానం వల్ల వచ్చింది కాదు. అది పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం వల్ల తలెత్తింది. లాభాల లెక్కలు తప్ప ప్రణాళికాబద్ధ ఉత్పత్తి లేకపోవడం వల్ల తలెత్తింది. కార్పొరేట్ పెట్టుబడి వనరుల మీద ఆధిపత్యం కోసం, తద్వారా ప్రపంచ మార్కెట్ మీద ఆధిపత్యం కోసం భూగర్భాలను తవ్వి పడేస్తోంది. వినిమయ సంస్కృతిని విపరీతంగా పెంచి పోషించడానికి తెలివితేటలన్నీ వాడుతుంది. అవసరాలకు మించిన ఉత్పత్తి కాలుష్యాన్ని, వ్యర్థాలనూ పోగేస్తూ పోతుంది. అది మందులమ్ముకోవడం కోసం రోగాలను వృద్ధి చేసే బాపతు. శాస్త్ర విజ్ఞానం పెట్టుబడి సంకెళ్ల నుండి విడివడి సమాజపరమైతేగానీ మానవాళికి పరిపూర్ణంగా ఉపయోగంలోకి రాలేదు. అలాగే పెట్టుబడి కబంధ హస్తాల నుండి భూమిని, సమస్త వనరులను విడుదల చేస్తేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. ఉత్పత్తి విధానం వల్ల తలెత్తిన ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోకుండా పర్యావరణానికి హానిచేయని సుస్థిర అభివృద్ధి ప్రణాళికలు ఎన్ని రూపొందించినా అవి కాగితాలకే పరిమితమవుతాయి.

(అరుణతార మే 2018)

 

ప్రకృతి విధ్వంసక ఇ.ఐ.ఎ. 2020

లాక్ డౌన్ సమయంలో బహిరంగ కార్యకలాపాలన్నీ రద్దయిపోయాయి. సమావేశాలన్నీ ఆన్లైన్ మాధ్యమానికి పరిమితమైపోయాయి. అన్ని రకాలుగా చీకటి ఆవరించిన స్థి...