Monday, April 9, 2012

ఆదివాసీ ప్రాంతాల్లో వనరుల దోపిడి- సామ్రాజ్యవాదం


ఇది గ్రీన్ హంట్ సందర్భం.విరగ్గాస్తున్న వెన్నలను రాజ్యం వెంబడిస్తోంది, ఆత్మవిశ్వాసంతో అరణ్యం తిరగబడుతోందిఅని ఈ సందర్భాన్ని అభివర్ణిస్తూ ఈ వేదికపై రాసుకున్నాం. ఈ వేట లక్షల కోట్లు విలువజేసే ప్రకృతి సంపద కోసమేనన్న విషయం ఇప్పుడు కొత్తగా చెప్పనవసరం లేదు. ఈ వేట మధ్యభారతదేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాల తరబడి ప్రకృతి ఒడిలో జీవిస్తున్న అన్ని ఆదివాసీ సమూహాలపై జరుగుతున్నది. ఒక అంచనా ప్రకారం 70 దేశాల్లో 370 మిలియన్ల మూలవాసులు ఇటువంటి వేటవల్ల నిర్వాసితులయ్యారు. వారు మధ్య ఆఫ్రికాలోని బయాకా అడవుల్లో కలపకోసం, నికరాగువాలోని మిస్ టోలో బంగారం కోసం, కెనెడాలోని డెనె, క్రీ ప్రాంతాల్లో యురేనియం కోసం తమ సొంత గడ్డపై నుండి తరిమివేయబడ్డారు. చేపలవేటకోసం రష్యాలోని చికుచీ, ఎస్కిమో ఆదివాసులు నిర్వాసితులయ్యారు. గడ్డి మైదానాల కోసం, కాఫీ ప్లాంటేషన్ల కోసం, చమురు పైప్ లైన్ కోసం ఆదివాసులు నివసించే అమేజాన్, వియత్నాం, నైజీరియా ప్రాంతాలు ధ్వంసం చేయబడ్డాయి. ఇవి ఉదాహరణలే. ప్రపంచవ్యాప్తంగా వనరుల కోసం పెట్టుబడి సాగిస్తూ వస్తున్న వేటకు అంతే లేదు. ఇప్పుడు ఒరిస్సా నియంగిరి కొండలనుండి బాక్సైట్ వెలికితీయడానికి స్థానిక డోంగ్రియా కోందులను, అట్లాగే మధ్యభారతదేశంలోని దండకారణ్యవ్యాప్తంగా నిక్షిప్తమై ఉన్న 28 రకాల ఖనిజాల కోసం గోండు, సంథాల్, ముండా, హో, ఒరాన్ తెగల ఆదివాసులను వెళ్ళగొట్టే ప్రయత్నమైనా అటువంటిదే. తేడా అల్లా ఇక్కడి ప్రజలు మావోయిస్టు పార్టీ అనే ఒక పటిష్టమైన రాజకీయ నిర్మాణంలో సమీకృతమై పోరాడుతున్నారు.

సామ్రాజ్యవాద దేశాల ఆర్థిక వ్యవస్థను పోషించేలా ప్రపంచవ్యాప్తంగా నేడు అన్ని దేశాల ప్రభుత్వాలు పరిశ్రమలను, వ్యవసాయాన్ని తయారు చేసుకోడంలో తలమునకలుగా ఉన్నాయి. సామాజిక శాస్త్రాలు ప్రపంచంలో రెండు రకాల దేశాల గురించి చెప్తుంటాయి. అవి అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు. ప్రపంచ మార్కెట్ల వల్ల ధనిక దేశాల కేంద్రం నుండి వాటి చుట్టూ ఉండే పేద దేశాల్లోకి సాంకేతి పరిజ్ఞానమా, దానితోపాటు సంపదా ప్రవహిస్తుంది అని స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధికవేత్తలు చెప్తుంటారు. అందుకని వీళ్ళు పేద దేశాలను 'ప్రపంచ వ్యవస్థలో' భాగం కమ్మని కూడా చెప్తారు. దాని వల్ల జరిగేది మాత్రం వీళ్ళు చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అభివృద్ధి చెందని దేశాల నుండి సంపద వెలికి తీయబడి అది ధనికదేశాల కేంద్రంలోకి ప్రవహిస్తుంది. అది ఆ కేంద్రంలో ఆర్ధికవృద్ధిని, సంపదను నిరంతరం పెరిగేలా చేస్తుంది. అత్యధికంగా నదులు, ఖనిజ వనరులు, మానవ వనరులూ కూడా ఉన్న దక్షిణార్ధ భూగోళంలో ఎక్కువ భాగం అభివృద్ధి చెందని దేశాలుగా, ఇవేవీ లేని ఉత్తరార్థ భూగోళంలో ధనిక దేశాలుగా ఉండటం మనకు కనపడుతుంది. ఇదిలా ఉంటే ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తమవుతుంటే, ప్రపంచ పెట్టుబడి కొత్త మార్కెట్ల కోసం మరింతగా అణ్వేషిస్తోంది. బడా కంపెనీలు ఇప్పటిదాకా వినియోగంలోకి రాకుండా ప్రకృతి గర్భంలో ఉన్న వనరులపై కన్నువేసి ఆయా ప్రాంతాలను తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నాలను మమ్మరం చేశాయి.  

పెట్టుబడి సహజసూత్రం అపరిమిత విస్తరణ. ఉత్పత్తి పెరుగుదల, భారీ ఉత్పత్తి, మరింత భారీ ఉత్పత్తి... ఇట్లా ఉంటుంది పెట్టుబడిదారీ విధానం నడక. ఇటు వంటి ఉత్పత్తి ఎక్కువెక్కువ వనరులను డిమాండ్ చేస్తుంది. సరుకు విలువలో ముడి పదార్థాలు, పరికరాలు, శ్రమ విలువ కలగలిసి ఉంటాయని అర్థశాస్త్రం చెప్తుంది. ఉత్పత్తిని పెంచడం కోసం పెట్టుబడి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ పరికరాల విలువ పెరుగుతుంది. శ్రమవిలువ తగ్గుతుంది. ముడిపదార్థాల విలువా తగ్గుతుంది. నిజానికి ప్రకృతి వనరులను ఏ ప్రాతిపదికపై విలువ గట్టగలం అనేది ప్రశ్నే. అయితే కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో త్వరత్వరగా సంపదను వెలికి తీయడం సాధ్యమవుతుంది. పెట్టుబడి ఎక్కువ లాభం కోసం చవక ముడిపదార్ధాల కోసం వేట సాగిస్తుంది. అట్లా వలసల చరిత్రంతా వనరులు కొల్లగొట్టడం మీదే ఉంది. ఎంత ఎక్కువ వనరుల వాడకం జరుగుతుందో అంత ఎక్కువ స్థానిక సామాజపు విధ్వంసం, ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. 18, 19వ శతాబ్దాల్లో పెట్టుబడిదారీ దేశాలు నాగరికత పేరుతో, అనాగరికులను నాగరీకులుగా తీర్చిదిద్దే బృహత్ కర్తవ్యాన్ని మీదేసుకున్నామని చెప్తూ తమ వలస దోపిడిని సమర్థించుకునే వాదాలు తీసుకొచ్చాయి. అమెరికాలో ఇప్పటికీ కొలంబస్ డే జరపడం వాళ్ళ అహంకారానికి నిదర్శనం.

వలసలు అంతమయ్యాక వనరులపై సామ్రాజ్యవాదుల ఆధిపత్యం కొత్త పద్ధతిలో కొనసాగింది. మార్కెట్ల కోసం యుద్ధాలు, వలసలు, దోపిడి రూపాల్లో గుణాత్మక మార్పు వచ్చింది. స్వతంత్ర్య దేశాల్లో మార్కెట్ల చొరబాటు ద్వారా స్థానిక మార్కెట్ల పైనేగాక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో సామ్రాజ్యవాదుల ఆధిపత్యం పెరిగి దోపిడి మరింత ప్రణాళికాబద్దమైంది. దీనికోసం దళారీవర్గం ఉండనే ఉంది. సామ్రాజ్యవాద మార్కెట్ ప్రయోజనాలను కాపాడే విధంగా దళారీవర్గంతో చేసుకున్న ఒప్పందాలు చాలా దేశాలకు స్వాతంత్ర్యం ఇవ్వడనికి ముందస్తు శరతులయ్యాయి. ఒక రకంగా పేరుకు దేశాలు స్వాతంత్ర్యం పొందినా అవి ఒక ప్రపంచ గుత్త పెట్టుబడి చట్రంలో బందీ అయ్యాయి. ఈ విధంగా వనరుల దోపిడికి శాశ్వత మార్గాలు ఏర్పడ్డాయి. భారతదేశం విషయంలో ఇది అక్షరాలా అమలయ్యింది. ప్రపంచంలో ఒక సోషలిస్టు కేంద్రం ఉన్నంత వరకూ మన ప్రభుత్వానికి ఒక సోషలిస్టు ముసుగైతే ఉండేది. అది పోయాక పాలకవర్గాలు బహిరంగంగా పెట్టుబడి ప్రయేజనాలతోనే ముందుకొచ్చాయి. పూర్తిగా సామ్రాజ్యవాద అనుకూల విధానాలు తయారైపోయాయి. '91నుండి సంస్కరణల పేరుతో నూతన ఆర్థిక విధానాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చేశాయి. వనరుల విషయానికొస్తే ప్రభుత్వాలకు చట్టాల పేరుతో ప్రకృతి సంపదమీద ఎలాగూ అధికారం ఉంటుంది. మూలవాసులకు వాళ్ళ భూమిపై హక్కులు స్థిరపరిచే రక్షణ చట్టాలైతే ఉన్నాయిగాని అవి పేరుకే. తాను చేసిన చట్టాలనే ప్రభుత్వాలు నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తున్నాయి. ఉదాహరణకు రాజ్యాంగం షెడ్యూల్ 5 ప్రకారం గిరిజన భూములను ఇతరులకు అమ్మకూడదు. కాని ఆదివాసీ భూములు అన్యాక్రాంతమవుతూనే ఉన్నాయి. దీని కోసం దొంగ పెళ్ళిళ్ళు చేసుకోడం దగ్గరినుండి నకిలీ పత్రాలు, తప్పుడు సర్వేల వరకూ చేయని ఫీట్లు లేవు. ప్రభుత్వమే కబ్జాల తొలగింపు పేరుతో, అటవీ సంపదను రక్షించే పేరుతో, సంక్షేమం పేరుతో అటవీ భూములను ఆదివాసుల నుండి కాజేస్తోంది. సరళీకరణ విధానాలు వచ్చాక ఇది మరింత పెరిగింది.

ఇక దళారీ పాలకవర్గం ఎంత బహిరంగంగా మందుకొచ్చిందంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐయంఎఫ్) సూచించిన వ్యక్తి మనదేశ ఆర్థిక మంత్రి అవుతాడు, తర్వాత ప్రధాని అవుతాడు. హోంమంత్రి చిదంబరం వేదాంత సంస్థకు నాన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ గా ఉండి రాజీనామా చేసి ఆర్థికమంత్రి అయ్యాడు. అలా మంత్రి అయిన వెంటనే ఇలా వేదాంత గ్రూపు కంపెనీల్లో ఒకటైన స్టెర్ లైట్ షేర్లను కొనేలా మారిషస్ కంపెనీకి ఎఫ్ డిఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి) అనుమతులిచ్చాడు. అందుకే ఈయన అటు ఎన్డీఏ ప్రభుత్వంలోనైనా, ఇటు యూపిఏ ప్రభుత్వంలోనైనా హోంమంత్రిగా ఉండగలడు. ఇటువంటి ప్రభుత్వం సామ్రాజ్యవాద, బడా పెట్టుబడిదార్ల ప్రయోజనాల కోసం జనాన్ని చంపుతున్నదంటే ఆశ్చర్యమేముంది? దండకారణ్య ప్రకృతి సంపదను బహుళజాతి కంపెనీల చేతుల్లో పెట్టడానికి ఈ ప్రభుత్వం ఎంతగా ఉవ్విళ్ళూరుతున్నదంటే అది టాటాలతో ఒప్పందాలు కుదుర్చుకున్న కొద్దిరోజులకే 2005లో దంతెవాడలో స్థానిక ప్రభుత్వ అండతో ప్రైవేటు హంతకముఠా సల్వాజుడుంను ప్రారంభిస్తుంది. కేంద్రంలో, రాష్ట్రంలో వేరువేరు పార్టీలు అధికారంలో ఉన్నా సామ్రాజ్యవాద ప్రయోజనాల కొరకు రెండూ అరమరికలు లేకుండా కలసిపోతున్నాయి.

పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్ గడ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల గుండా విస్తరించిన దండకారణ్య ప్రాంతాన్ని రెడ్ కారిడార్ గా అభివర్ణిస్తుంటారు. ఇప్పుడది యంవోయూ (వాణిజ్య ఒప్పందాల) కారిడార్. ఈ ప్రాంతంలో విస్తారంగా పరుచుకుని ఉన్న ఖనిజసంపదను తవ్వుకోడానికి టాటా, ఎస్సార్, జిందాల్, వేదాంత వంటి కంపెనీలు దళారీ పాలకులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక వెంటవెంటనే సైన్యం, ప్రైవేటు హంతకముఠాల కనుసన్నలలో బూటకపు ప్రజాభిప్రాయ సేకరణలు జరిపి, పర్యావరణ అనుమతులూ పొంది మైనింగ్ పరిశ్రమలకు సర్వం సిద్ధం చేశారు. అడ్డుగా మిగిలింది మావోయిస్టులే. అత్యంత సహజంగా వారు ప్రజల పక్షాన నిలబడ్డారు. బహుళజాతి కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయడానికి అత్యంత తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కుంటున్న ప్రభుత్వం 2009 సెప్టెంబర్ లో గ్రీన్ హంట్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇరాక్, ఆఫ్ఘానిస్తాన్లలో మోహరించిన సైన్యం కంటే ఎక్కువ బలగాలను ఇక్కడ మోహరించారు. వందలాది గ్రామాలను తగులబెట్టినా, జైళ్ళన్నీ ఆదివాసులతో నింపేసినా, ఎంతో మందిని ఊచకోతకోసినా ప్రజలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం యుద్ధాన్ని తీవ్రతరం చేస్తూ 2011 జనవరి నుండి రెండోదశ గ్రీన్ హంటును మొదలు పెట్టింది. 

ప్రభుత్వం గ్రీన్ హంట్ వంటిది లేనే లేదంటుంది. అయితే అభివృద్ధికి మావోయిస్టులు అడ్డుగా ఉన్నారని, వాళ్ళను నిర్మూలించాలని నేరుగానే అది చెప్తూనే ఉంది. మన్మో హన్ సింగ్ దేశ అంతర్గత భద్రతకు మావోయిస్టులు అతిపెద్ద ముప్పు అని ప్రకటించాడు. ఇక ఆదివాసీ హక్కుల గురించి, చట్టాల గురించి, షెడ్యూల్ 5 గురించి మాట్లాడేవాళ్ళు అభివృద్ధి నిరోధకులే కాదు, మావోయిస్టు సానుభూతిపరులని కూడా అనిపించుకుంటున్నారు. ఇప్పుడు అభివృద్ధి గురించి హోంమంత్రి మాట్లాడతాడు. దేశ వనరులన్నీ వినియోగంలోకి తేవాలని, వాటిని ఎంత తొందరగా సొమ్ముచేసుకుంటే అంతగా దేశభివృద్ధికి దోహదం చేయడమని చిదంబరం అంటున్నాడు. అభివృద్ధి అంటే ఎవరి అభివృద్ధి అనే ప్రశ్న ఉండనే ఉ ంటుంది. అయితే ప్రభుత్వం చెప్పే ఆర్థికాభివృద్ధి వల్ల దేశ స్వరూపమే మారిపోతుందని మధ్యతరగతిని భ్రమల్లో ముంచారు. వనరులన్నీ వినియోగంలోకి తేవడం జరిగితే అదెలా ఉంటుందో ఆఫ్రికా దేశాలను చూస్తే అర్థమవుతుంది. ఈ రోజు నోకియా, మోటరోలా, ఎరిక్సన్, సోనీ మొదలైన కంపెనీల సెల్ ఫోన్లు, కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అవసరమైన కోల్టన్ అనే పదార్థం 80 శాతం ఆఫ్రికా దేశాలనుండే వస్తోంది. అట్లనే లిథియం అయాన్ బ్యటరీల్లో వాడే కోబాల్ట్ 80 శాతం ఆఫ్రికా దేశాలనుండే వస్తోంది. అమెరికాకు అవసరమయ్యే చమురు 24 శాతం ఇక్కడి నుండే వస్తోంది. ఇది దక్షిణాసియా దేశాల నుండి అమెరికాకు ఎగుమతయ్యే చమురు శాతం కన్నా ఎక్కువ. ఇట్లా బహుళాతి కంపెనీల కోసం వనరుల్ని వెలికితీసిన ఈ దేశాలన్నీ నేడు దుర్భర దారిద్ర్యంలో ఉన్నాయి. విస్తార సంపద వల్లే ఆఫ్రికా బానిసత్వంలో మగ్గుతున్నదంటే అతిశయొక్తి కాదు. ఇక్కడి ప్రజలు విషాన్ని తింటూ, విషాన్ని తాగుతూ, విషాన్ని శ్వాసిస్తూ చస్తూ  బతుకుతున్నారు. వనరులన్న దేశాలపై పెత్తనం కోసం అమెరికా ఎన్ని సైనిక కుట్రలు జరిపిందో లెక్క లేదు. అది 8 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న 1994 రువాండా జాతుల ఘర్షణకు కారణమైంది. అదే సమయంలో సూడాన్లో సైనిక కుట్రలు జరిపింది. 90ల దాకా ఎందుకు? మొన్నటికి మెన్న ఆఫ్రికన్ యూనియన్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన గడాఫీకి ఏమయ్యుందో చూశాం.

ఆఫ్రికా దేశాలవరకూ పోనవసరం లేదు. గనుల చుట్టూ కమ్ముకున్న దేశీయ, అంతర్జాతీయ మాఫియా, గనుల తవ్వకాల చుట్టూ భారతదేశవ్యాప్తంగా జరుగుతున్న విధ్వంసాన్ని చూస్తే అర్థమవుతుంది. సబ్ సహారన్ ఆఫ్రికాలో ఉన్న 26 దేశాల పేదల కన్నా మనదేశంలో 8 రాష్ట్రాల్లో ఎక్కువ మంది పేదలున్నారు. వీళ్ళందినీ అభివృద్ధిలో భాగం చేస్తామని ప్రభుత్వం అనవచ్చు. అసలు అభివృద్ధి అంటూ ఉన్నా, అది ఏ అర్థంలోనైనా సరే, తమ ఉత్పత్తి విధానంతో, జీవన విధానంతో పొసగని అభివృద్ధి నమూనాలోకి వీళ్లని తీసుకుపోవడం సాధ్యం కాదు. అదే సాధ్యమైతే విస్థాపన సమస్య ఇంత గంభీరంగా ముందుకు రాదు. దీనికన్నా ప్రజలు నివసించే భౌగోళిక పరిస్థిల్లోనే వాళ్ళు తరతరాలుగా పోగు చేసుకున్న జ్ఞానాన్ని అభివృద్ధి చేసి అక్కడి నుండి వారి జీవన విధానాన్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా నిజమైన అభివృద్ధిని సాధించవచ్చని, అందులో ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం ఉంటుందని ఈ రోజు దండకారణ్యంలో జనతన సర్కార్లు నిరూపిస్తున్నాయి. సర్వస్వాన్ని ఊడ్చిపడేసి, నిర్మించే సామ్రాజ్యవాద అనుకూల అభివృద్ధి నమూనాను కాదని ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను నిర్మించుకుంటున్నందుకే దండకారణ్య ఆదివాసులపై ప్రభుత్వం దేశ చరిత్రలోనే అతి పెద్ద సైనిక దాడిని మొదలు పెట్టింది. ఆదివాసులు తమ వీరోచిత ప్రతిఘటన ద్వారా జల్, జంగల్ జమీన్లపై తమ హక్కులను రచించుకోవడమే కాదు, మొత్తం దేశసంపదను, దేశాన్ని బహుళజాతి సంస్థలు కాజేయకుండా అడ్డుకుంటున్నారు. కాబట్టి గ్రీన్‌హంట్ సమస్య మావోయిస్టులదో, ఆదివాసులదో కాదు, మొత్తం దేశానిది. దీని పట్ల బుద్ధిజీవులు, రచయితలు, ప్రజాస్వామికవాదులు మౌనంగా ఉండటం బాధ్యతారాహిత్యమే కాదు, నేరం కూడా.

(2012 మార్చ్ లో కర్నూలులో జరిగిన విరసం మహాసభల ప్రసంగ పాఠం)

(అరుణతార మార్చ్-ఏప్రిల్ 2012)

ప్రకృతి విధ్వంసక ఇ.ఐ.ఎ. 2020

లాక్ డౌన్ సమయంలో బహిరంగ కార్యకలాపాలన్నీ రద్దయిపోయాయి. సమావేశాలన్నీ ఆన్లైన్ మాధ్యమానికి పరిమితమైపోయాయి. అన్ని రకాలుగా చీకటి ఆవరించిన స్థి...