లాక్ డౌన్ సమయంలో బహిరంగ కార్యకలాపాలన్నీ రద్దయిపోయాయి. సమావేశాలన్నీ ఆన్లైన్ మాధ్యమానికి పరిమితమైపోయాయి. అన్ని రకాలుగా చీకటి ఆవరించిన స్థితి. ఇదంతా కరోనా నియంత్రించడానికని జనం అనుకున్నారు కానీ ఆ ఉద్దేశం ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదు. అది చేసిందేమిటంటే ప్రజల కళ్లుగప్పేసి కీలక చట్టాలను సవరించడం. ఈ కాలంలో అది ప్రజల ఉమ్మడి ఆస్తులను ఎన్నింటినో అమ్మేసింది, లేదా అమ్మకానికి పెట్టింది. అన్నిటికన్నా ఎక్కువగా ప్రకృతి వనరులకు మార్కెట్ తలుపులు తెరిచేసింది. ఇదంతా ఎంత ఆబగా చేసిందో చూస్తే అందరూ ఆదమరిచి నిద్రపోయే నిశిరాత్రి కోసం దోపిడి దొంగలు మాటుగా సేది మనకు గుర్తొస్తుంది.
మార్చ్ నుండి పెట్టుబడిదారుల కోసం ఇచ్చిన పర్యావరణ అనుమతులు, చట్ట సవరణల కోసం తీసుకొచ్చిన ప్రతిపాదనలు చూస్తే సాధారణంగా ప్రభుత్వాల దోపిడి నైజం తెలిసినవాళ్లు కూడా ఆశ్చర్యపోతారు. లాక్ డౌన్ టైంలో అటవీ ప్రాంతాల్లో గనులు, ప్రాజెక్టులు, రోడ్లు వంటి అనుమతులు వీడియో కాన్ఫరెన్సుల్లో ఇచ్చేశారు. మామూలుగా ఇలాంటి అనుమతులు రావడానికి నెలలు, ఒక్కోసారి సంవత్సరాలు కూడా పడుతుంది. అంటే ఏమీ అడక్కుండా, చూడకుండా అన్ని కాగితాల మీద సంతకాలు పెట్టి అప్రూవల్స్ రావడానికి కూడా కొన్ని నెలలు పడుతుంది. ఏప్రిల్ 7న నేషనల్ బోర్డ్ ఫర్ వైల్ లైఫ్ (వన్య ప్రాణుల సంరక్షణ కోసం ఉండే జాతీయ సంస్థ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 30 ప్రతిపాదనలను ఆమోదిస్తూ అనుమతులలిచ్చేసింది. నిజానికి ఈ సంస్థ 2014 తర్వాత ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. ఇప్పుడు ఇంత హడావిడిగా సమావేశమైంది వన్య ప్రాణుల సంరక్షణ కోసమైతే కాదని తెలుస్తూనే ఉంది.
తాము చేసిన ఘనకార్యం గురించి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్విట్టర్ లో రాశాడు. తన ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశంలో (వీడియో కాన్ఫరెన్స్) 11 రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చాము అని. ఇందులో నల్లమలలోని ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం సమీపంలో యురేనియం దగ్గరి నుండి తూర్పు, మధ్య భారతదేశంలో 41 కోల్ బ్లాక్స్ (బొగ్గు నిల్వలు) దాకా మైనింగ్ అనుమతులు ఉన్నాయి. బొగ్గు నిలువలున్న ప్రాంతాలన్నీ దట్టమైన అడవులు, ఆదివాసీ ప్రాంతాలు. అంటే నియమానుసారం పర్యావరణ, అటవీ చట్టాలతో సహా ఆదివాసీ చట్టాలు కూడా వీటిని అనుమతించవు. 'ది వైర్' పత్రిక దీని గురించి రాస్తూ ఇండియాలో వన్య ప్రాణులకు అతి పెద్ద ప్రమాదంగా ఉన్నది దాని పరిరక్షణా సంస్లే అన్నది. ఇది అడవులకూ, పర్యావరణానికి కూడా వర్తిస్తుంది. తమాషా ఏమిటంటే మన దేశంలో పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు శాఖకు, భారీ పరిశ్రమల శాఖకు మంత్రి ఒకరే. ప్రకాశ్ జవదేకర్ కుడి చేత్తో పరిశ్రమలకు ప్రతిపాదనలు తీసుకొని ఎడమ చేత్తో వాటిని సాంక్షన్ చేస్తాడన్నమాట.
లాక్ డౌన్ సమయంలో పర్యావరణాన్ని, జనావాసాలను, ప్రజల జీవించే హక్కును దారుణంగా దెబ్బతీసే ఒక దుర్మార్గమైన చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. డ్రాఫ్ట్ ఇ.ఐ.ఎ. 2020 పేరుతో దానిని ముందు తీసుకొచ్చారు. దీనికి దేశవ్యాప్తంగా పర్యావరణవాదుల నుండి మానవ హక్కుల సంస్థలు, ప్రజాసంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అససెస్మెంట్ 2020 డ్రాఫ్టు 2006 నాటి ఇ. ఐ.ఎ.కు కీలక సవరణలను ప్రతిపాదించింది. ఇంతకూ ఏమిటీ ఇ.ఐ.ఎ.? పర్యావరణ (పరిరక్షణ) చట్టంలో ఇది అంతర్భాగం. 1986 నాటి పర్యావరణ (పరిరక్షణ) చట్టాన్ని మరింత పటిష్టం చేయడానికి 1994లో ఆ చట్టం కిందికి ఇ.ఐ.ఎ.ను చేర్చారు. 2006లో ఒకసారి ఇ.ఐ.ఎ.ను సవరించారు. సవరణ ఉద్దేశం దానిని మరింత ప్రజానుకూలం చేయడం. ఇందుకు సుదీర్ఘ ప్రజా ఉద్యమాలు, ముఖ్యంగా విస్థాపనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు దోహదం చేశాయి. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అససెస్ మెంట్ (ఇ.ఐ.ఎ.)ను తెలుగులో పర్యావరణ ప్రభావ అంచనా లేదా విశ్లేషణ అని వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఒక పరిశ్రమను గాని, ప్రాజెక్టును గాని ఒక ప్రాంతంతో నిర్మాణం చేయాలనుకుంటే దాని ప్రభావం పర్యావరణం మీద ఎలా ఉండబోతోందో ముందుగా అంచనా వేస్తారు. అక్కడి భౌగోళిక స్థితిగతులు, జీవవైవిధ్యం, వాతావరణం వంటివి వేరువేరు రుతువుల్లో ఎలా ఉంటాయో అధ్యయం చేసి రిపోర్టు తయారుచేయాలి. దీనితోపాటు సామాజిక ప్రభావాన్ని కూడా అంచనావేయాలి. తర్వాత ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ఊర్ల నుండి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. ఇందుకోసం కాలుష్య నియంత్రణ మండలి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఒక పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేస్తారు. ప్రజలు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను చెప్పొచ్చు. దీనికి నెల రోజుల సమయం ఇస్తారు. నిజానికి ఈ చట్టం మరింత ప్రజానుకూలం, పర్యావరణ అనుకూలం చేయాల్సి ఉంది. పబ్లిక్ హియరింగ్ లో వ్యక్తమైన అభ్యంతరాలకు మొత్తంగా ప్రాజెక్టు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలన్న నియమమేమీ లేదు. ఇ.ఐ.ఎ. రిపోర్టు తయారుచేయడంలో, పబ్లిక్ హియరింగ్ లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇ.ఐ.ఎ.లో ప్రతిపాదించిన సవరణలు దానిని మొత్తానికి మొత్తంగా బలహీనపరిచేలా, దాని చేతులు విరిచేసేలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి చూద్దాం.
1) అన్నిటికన్నా ప్రమాదకమైన సవరణ 'పోస్ట్ ఫాక్టో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్’. దీని ప్రకారం కొన్నిరకాల అనుమతులు లేకపోయినా పరిశ్రమ మొదలు పెట్టి నడుపుకోవచ్చు. అలా పరిశ్రమ నడుపుకుంటూ కొంత సమయం తీసుకొని మెల్లగా అవసరమైన సర్టిఫికెట్స్ తెచ్చుకోవచ్చు. ఈలోగా ఫ్యాక్టరీ వల్ల ఏమైనా ప్రమాదం జరిగితే జరిమానా విధిస్తారు. ఇటీవలే విషవాయువు లీకైన ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ ఇరవై ఏళ్ళ నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే నడుస్తోంది. అలాంటివి దేశంలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అట్లా అక్రమంగా నడుస్తున్న పరిశ్రమలన్నీ ఈ సవరణతో చట్టబద్ధం అయిపోతాయన్నమాట.
2) ప్రజాభిప్రాయ సేకరణకున్న 30 రోజుల గడువును 20 రోజులకు కుదిస్తున్నారు. లాక్ డౌన్ లో కొన్ని ప్రాజెక్టులకు చడీచప్పుడు కాకుండా అనుమతులిచ్చారని పైన చెప్పుకున్నాం. కొన్నిటికి పబ్లిక్ హియరింగ్ అయిపోయిందని కూడా చెప్పారు. స్థానిక ప్రజలు లేకుండా స్టేజ్ డ్రామాల్లాగా పబ్లిక్ హియరింగ్ జరపడం, నిజమైన ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ప్రజలు ఆందోళన చేయడం గతంలో చాలా సార్లు జరిగింది. ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా కొన్ని రకాల అభివృద్ధి ప్రాజెక్టులకు, ఉదాహరణకు నీటిపారుదల ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, రక్షణ అవసరాల కోసం చేపట్టే నిర్మాణాలు వంటివాటికి పబ్లిక్ హియరింగ్ అవసరం లేదని సవరణ చేస్తున్నారు.
3) ఏదైనా ప్రాజెక్టు/పరిశ్రమ వల్ల పర్యావరణానికి నష్టం కలిగితే సంబంధిత అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. సాధారణంగా బాధిత ప్రజలు, వారి తరపున సామాజిక కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తుంటారు. ఇప్పుడు సవరిస్తున్న నిబంధనల ప్రకారం ఇక ఆ అవకాశం ఉండదు. ఫిర్యాదు చేసే అధికారం ప్రభుత్వ ఏజెన్సీలకు, ప్రాజెక్టు సభ్యులకు మాత్రమే ఉంటుంది. ఇదెంత తమాషానో చూడండి. మేం తప్పు చేశామని ఎవరికివారే కంప్లైంట్ చేసుకోవాలట!
4) ఎకో సెన్సిటివ్ జోన్ (సున్నితమైన జీవావరణాలు) నిర్వచనాన్ని బలహీనపరిచే సవరణ మరొకటి. దీని ప్రకారం ఇదివరకు అవకాశం లేని జీవవైవిధ్యం ఉన్న ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి ప్రాజెక్టులు కట్టుకోవచ్చు). చిన్నవాటిని పెద్దవిగా విస్తరించుకోవచ్చు.
5) ఔషదాలను (డ్రగ్స్) పునర్ వర్గీకరణ (రీ-కేటిగరైజేషన్) చేశారు. ఫార్మా పరిశ్రమల్లో ఉత్పత్తయ్యే మందులను బట్టి, అవి తయారయ్యే క్రమంలో గాలి, నీరు, నేలలోకి వెలువడే వ్యర్థాలను బట్టి వాటి వర్గీకరణ ఉంటుంది. దీనిని సవరిస్తూ ప్రమాదకరమైన 'ఎ' వర్గం (కేటగరీ)లో ఉండే కొన్ని రసాయనాలను ప్రమాదకరం కాని 'బి2' వర్గం కిందికి తీసుకొచ్చారు. బి2 కింద ఉండేవాటికి ఇ.ఐ.ఎ. వర్తించదు.
ఇలాంటి సవరణతో తీసుకొచ్చిన కొత్త ఇ.ఐ.ఎ. నిబంధనల ప్రతిని 'ఇ.ఐ.ఎ. 2020 నోటిఫికేషన్ డ్రాఫ్ట్' పేరిట ఇంటర్నెట్లో పెట్టి జూన్ 30 వరకు గడువిస్తూ ప్రజల అభిప్రాయాలు కోరారు. దీని గురించి ప్రజలకు తెలిసేలా ప్రకటనలు ఇవ్వడం గాని, మీడియాలో మాట్లాడటం కానీ చేయలేదు. లాక్ డౌన్ లోపలే ఈ తంతును ముగించాలని ప్రభుత్వం అనుకుంది. ఈ కాలమంతా ప్రభుత్వం ఎన్ని అసంబద్ధ విషయాల చుట్టూ ప్రజల ఆలోచనలు మళ్లించిందో మనం గుర్తుచేసుకుంటే దాని కుట్ర అర్థమవుతుంది. అయితే దేశవ్యాప్తంగా పర్యావరణవాదులు, సంస్థలు ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. కరోనా లాక్ డౌన్లో జనం కన్నుగప్పి ఇటువంటి కీలకమైన విధాన నిర్ణయం తీసుకోవడాన్ని ఆక్షేపించారు. దీనిని కోర్టులో సవాలు చేయగా గడువు ఆగస్టు 11కు పెంచారు. కేవలం గడువు పెంచితే సరిపోదు, ఈ డ్రాఫ్ట్ ఏమిటో ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని, కనుక ఇది ఇంగ్లీషు, హిందీలో మాత్రమే కాక 22 ప్రాంతీయ భాషల్లో ఉండాలని ఢిల్లీ, కర్ణాటక హైకోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పిల్ కొట్టేయాలని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు పోయింది కానీ కోర్టు తిరస్కరించింది. ఇంత మాత్రమే కాదు, డ్రాఫ్ట్ ఇ.ఐ.ఎ.కు వ్యతిరేకంగా జరగుతున్న ప్రచారాన్ని అది నిస్సిగ్గుగా అడ్డుకునే ప్రయత్నం చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్న వివిధ సంస్థలు డ్రాఫ్ట్ ఇ.ఐ.ఎ. గురించి పెద్ద ఎత్తున ఆన్లైన్ ప్రచారం చేశాయి. ఇ.ఐ.ఎ. 2020ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ అవి సంబంధిత శాఖకు ప్రజల నుండి వేలాది ఈ మెయిల్స్ వెళ్లేలా చేశాయి. దీనిని కూడా సహించలేని ప్రభుత్వం Let India Breathe, There is no earth B, Fridays for future వంటి వెబ్ సైట్స్ ను బ్లాక్ చేసింది. వాటి మీద ఐటి చట్టం, ఊపా చట్టం కూడా ప్రయోగించబోయింది. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా తీవ్ర విమర్శలు వచ్చాక వెనక్కి తగ్గింది. ఆగస్టు 11 నాటికి 17 లక్షల మంది డ్రాఫ్ట్ ఇ.ఐ.ఎ.పై స్పందిస్తూ ఈ మెయిల్స్ పంపారు.
ఇక 22 ప్రాంతీయ భాషల్లో డ్రాఫ్ట్ ను ప్రచురించాలన్న విషయంపై న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వ వాదన హిందీ భాషాధిపత్యాన్ని చాటేలా ఉంది. హిందీ అధికార భాష కాబట్టి ప్రాంతీయ భాషల్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అది వాదించింది. (సెప్టెంబర్ 23న దీనిపై తదుపరి వాదనలు జరగనున్నాయి.) అసలు ఏదైనా ప్రజలకు అర్థం కావాలంటే వారి మాతృభాషలో ఉండాలన్న కనీస ఇంగితం దానికి లేకుండా పోయింది అనేకన్నా, ప్రజాభిప్రాయం పట్ల దానికి ఎంత మాత్రం గౌరవం లేదని, దానికి కావలసింది పెట్టుబడిదార్ల ప్రయోజనాలను యుద్ధ ప్రాతిపదికన నెరవేర్చడమేనని అనుకోవడం సరైనది.
కరోనాను అవకాశంగా తీసుకొని తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మేధావులను, విద్యార్థులను, నిరసన తెలిపిన సాధారణ ప్రజలను 1300 మందిని అరెస్టులు చేసిన ప్రభుత్వం నుండి ఏ నైతికతా ఆశించలేం. ఆరోగ్య అత్యాయక స్థితి (హెల్త్ ఎమర్జెన్సీ)ని రాజకీయ అత్యాయక స్థితిగా మార్చివేసిన ప్రభుత్వం దేశాన్ని సంపూర్ణంగా కొల్లగొట్టడానికే కీలకమైన విద్య, వ్యవసాయ, పర్యావరణ విధానాలలో విధ్వంసక మార్పులు చేస్తున్నది. వీటిపై ఎక్కడా చర్చ లేకుండా చేయడానికి మీడియాతో అసహ్యకరమైన ఫీట్లు చేయిస్తున్నది. కనుక మనం చేయవలసింది వీటిని వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయడం.
(September 15, 2020, virasam1970.blogspot.com)

No comments:
Post a Comment