Sunday, September 9, 2018

ఈ విలయంలో జీవించే చోటు ఎక్కడ?

 

ఆగస్టు నెలంతా రెండు విపత్తులు చుట్టుముట్టాయి. ఒకటి ప్రకృతి విపత్తు, రెండు రాజకీయ విపత్తు. కేరళ విలయం, దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదుల ఇళ్ల మీద పోలీసు దాడులు. కాకతాళీయంగా రెండూ ఒకే రాజకీయ సందర్భంలో మనతో కలిసాయి. అయితే ఇవి వేరువేరుగా కనిపిస్తున్నా నిజానికి రెంటికీ సంబంధం ఉంది. ఘటనలుగా కనిపిస్తున్నా వీటి వెనక ఒక పరిణామ క్రమం ఉంది. రాజకీయార్థిక నేపథ్యముంది. 

అత్యద్భుతమైన పడమటి కనుమల చెంత ప్రాకృతిక సౌందర్యంతో అలరారే కేరళ కనీవినీ ఎరుగని కల్లోల వరదలో చిక్కుకుపోయింది. మృత్యు భీభత్సం నగ్నంగా నర్తించింది. జీవనదులతో తొణికిసలాడే నేల జీవం కోల్పోయింది. ప్రపంచంలోనే అరుదైన, విస్తృతమైన జీవవైవిధ్యం ఉన్న ప్రాంతాల్లో పడమటి కనుమలు ఒకటి. దక్షిణ భారతదేశపు నదులన్నీ దాదాపు ఇక్కడే పుడతాయి. గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ కొండలు విస్తరించాయి. కేరళ అయితే పూర్తిగా పడమటి కనుమల చెంతనే ఉంది. ఈ రాష్ట్రానికి ఒకవైపు పడమటి కనుమలు ఇంకోవైపు మలబారు తీరం పరుచుకున్నాయి. నలభై నదులున్న ఈ చిన్న రాష్ట్రం సగటు వర్షపాతం దేశంలో తక్కిన ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువే (3,300 మిల్లీమీటర్లు). నిత్యం పచ్చదనంతో కళకళలాడే ఈ నేలను దైవభూమి(గాడ్స్ ఓన్ కంట్రీ)గా చెప్పుకుంటారు. ఇప్పుడు చూస్తే మొత్తం 14 జిల్లాలో 10 జిల్లాలను వరద ఘోరంగా దెబ్బతీసింది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 500 మంది చనిపోయారు. 14 లక్షల 52 వేల మందిని పునరావాస శిబిరాల్లోకి తరలించారు. 54 లక్షల 11వేల మంది జీవనాధారం కోల్పోయారు. కోట్లాది జీవరాశులను కడుపులో పెట్టుకొని సాకే ప్రకృతి ఇంత విధ్వంసం చేసిందా? ఎందుకు? పాపం పండిందని ఒకడంటాడు. బీఫ్ తినేవాళ్లను దేవుడు శిక్షించాడని మరొకడంటాడు. ఆడవాళ్లను తన గుడిలోకి అనుమతించినందుకు అయ్యప్పకు కోపమొచ్చిందని ఇంకోడంటాడు. వరద వచ్చినట్లే ఇప్పుడు మూర్ఖత్వానికి కాలమొచ్చింది. బిజెపి రాజ్యం మూలాన మూఢత్వం వెర్రితలలు వేస్తోంది. సరే, దాని దగ్గరికి మళ్లీ వద్దాం. ఈ విలయంలో మానవ తప్పిందం పాలెంత అని కూడా అంతటా చర్చ జరుగుతోంది. 2013 ఉత్తరాఖండ్ వరదల తర్వాత మళ్లీ పర్యావరణ సమతుల్యత అనే అంశం తెరమీదికి వచ్చింది.

ఇక్కడ మానవ తప్పిదం గురించి మాట్లాడుకోవాలంటే సుమారు ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లాలి. విదేశీ పెట్టుబడికి దారులన్నీ తెరిచి దేశీయ పరిశ్రమలు మూసిపడేసే ఆర్థిక విధానాలు వచ్చిన దశ. పెట్టుబడుల కోసం కార్మిక చట్టాలను, పర్యావరణ చట్టాలను చాపచుట్టేసే క్రమం మొదలైన కాలం. ఇంచుమించు ఆరోజుల్లోనే సేవ్ వెస్ట్రన్ ఘాట్స్ (పడమటి కనుమల్ని కాపాడండి) నినాదం పుట్టింది. పడమటి కనుమల పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా స్థానికులు సుదీర్ఘకాంగా పోరాడుతూనే ఉన్నారు. అడవుల్ని యదేచ్ఛగా ఆక్రమించి సాగుచేస్తున్న కాఫీ, టీ ప్లాంటేషన్లు వివిధ రకాల తోటలకు తోడు రియలెస్టేట్, మైనింగ్, రసాయన పరిశ్రమలు, జలవిద్యుత్ కేంద్రాలు అన్ని పర్యావరణ చట్టాలను, నిబంధనలు ఉల్లంఘించాయి. సహజ ప్రకృతి సౌందర్యాన్ని సంపన్న వర్గాల విలాసాల కోసం టూరిస్ట్ కేంద్రాలగా మార్చారు. దీనిని మానవ తప్పిదం అనకూడదు. ఇది కేవలం కార్పొరేట్ పెట్టుబడి దురాశ. నిజానికి అక్కడి నిజమైన మానవులు ప్రకృతిని కాపాడుకోడానికి పోరాటం చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోకి అక్రమంగా చొచ్చుకొని వచ్చిన పెట్టుబడిదారులు ఆదివాసులను, దళితులను తమ ఆక్రమిత భూముల్లో కూలీలుగా పెట్టుకొని శ్రమ దోపిడి చేస్తుంటే, అటు భూమిపై హక్కు కోసం, ఇటు అడవుల్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలు దొడ్డి మిలిటెంట్ పోరాటాలు కూడా చేస్తున్నారు. వెస్టన్ ఘాట్స్ కోసం వివిధ రంగాల నుండి చేస్తున్న పోరాటం నేపథ్యంలో 2010లో సేవ్ వెస్ట్రన్ ఘాట్స్ ఉద్యమానికి అప్పటి పర్యావరణ మంత్రి జైరాం రమేశ్ స్పందిస్తూ మాధవ గార్డిల్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించాడు. ఈ కమిటీ 1500 కిలోమీటర్ల పొడవున ఉన్న పడమటి కనుమల పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని అధ్యయం చేసి వాటి పరిరక్షణకు చేపట్టవలసిన చర్యలను సూచించాలి.

గాడ్గిల్ కమిటీ ఎంతో శ్రమపడి నివేదిక తయారుచేసి చాలా విలువైన సూచనలనే చేసింది. మొత్తం పడమటి కనుమల పరిధి 1.4 లక్షల చదరపు కిలోమీటర్లుగా నిర్ధారించడంతో పాటు దానిని నాలుగు జోన్లుగా విభజించి జీవావరణ సున్నితత్వాన్ని బట్టి నిబంధనలు సూచించింది. ఈ మొత్తం ప్రాంతంలో ఎక్కడా జన్యుమార్పిడి పంటలు వేయకూడదు. మూడేళ్ల వ్యవధలో ఇక్కడి నుండి ప్లాస్టిక్ సంచులను పూర్తిగా తలగించివేయాలి. ప్రత్యేక ఆర్థిక మండళ్లను, హిల్ స్టేషన్ల వంటి విహారయాత్రా కేందాలను అనుమతించకూడదు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చకూడదు. ముఖ్యంగా జోన్ 1,2లలో అటవీ భూమిని వేరే ఏ అవసరాల కోసమూ మార్చేయకూడదు; మైనింగ్, కాలుష్యకారక పరిశ్రమలు, రైల్వే లైన్లు, పెద్ద రోడ్లు అనుమతించయూడదు. 5-8 ఏళ్ల కాలంలో పంట భూముల్లో పురుగు మందుల వాడకం లేకుండా చేయాలి. జోన్ 1లో డ్యాములు కట్టకూడదు. మొత్తం ఏరియాలో (నాలుగు జోన్లు) టూరిజం మీద కఠినమైన నియంత్రణ ఉండాలి. అట్లాగే ఇక్కడ ఏ ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చినా సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనా వేయాలి.

గాడ్గిల్ కమిటీ రిపోర్టు 2011 ఆగస్టులో వచ్చింది. స్పష్టంగా ఇది పెట్టుబడిదారులకు వ్యతిరేకం. ఏ అభివృద్ధి నమూనా అయితే పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నదో దానిని నిలిపివేయాలని అది గట్టిగా చెప్పింది. ఇంకేముంది. పారిశ్రామిక వర్గాలు గగ్గోలు పెట్టాయి. వాళ్లకు అడవంతా విస్తరించాలని, దొరికిందంతా అమ్ముకోవాలని ఆశ. ఈ వర్గాల ఒత్తిడి, పాలకుల వ్యక్తిగత స్వార్థం వెరసి ఆరు రాష్ట్రాలు లెఫ్ట్, రైట్ తేడా లేకుండా గాడ్గిల్ కమిటీ రిపోర్టును వ్యతిరేకించాయి. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కట్టుబడి నిస్సిగ్గుగా 'ప్రజల ప్రయోజనాల కోసం గాడ్జిల్ కమిటీ సూచనలను అంగీకరించలేమని' అన్నాయి. 2012లో గాల్ కమిటీ రిపోర్టును సమీక్షించడానికి కస్తూరి రంగన్ కమిటీని నియమించారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా కొత్త రిపోర్టు తయారైంది. దీనిని పర్యావరణవాదుల దగ్గరి నుండి మావోయిస్టుల దాకా ఎంతోమంది తీవ్రంగా నిరసించారు. కేరళలో ఇసుక తవ్వకాలు, క్వారీలు విపరీతంగా పర్యావరణాన్ని నాశనం చేశాయి. గ్రానైట్ క్వారీలపై ప్రజలు వివిధ రూపాల్లో పోరాటాలు చేశారు. పడమటి కనుమల ట్రై జంక్షన్లోనైతే (కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కలిసే ప్రాంతం) ఆదివాసులకు మావోయిస్టు ఉద్యమం దన్నుగా నిలబడింది. 70ల తర్వాత మళ్లీ 21వ శతాబ్దపు తొలి సంవత్సరాల నుండి అక్కడ మావోయిస్టు ఉద్యమం ఎగసింది. గ్రానైట్ క్వారీల మీద దాడులు కూడా జరిగాయి. సరిగ్గా దండకారణ్యంలో అడవులను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న కంపెనీలను నిలువరిస్తున్నట్లుగానే. ఈ దేశంలో మావోయిస్టులను మొత్తంగా నిర్మూలించే ఆపరేషన్ గ్రీన్ హంట్ లో భాగంగా ఈ ప్రాంతంలో ఆపరేషన్ థండర్ బోల్ట్ పేరుతో ప్రత్యేక పోలీసులు దళాలు, పారా మిలిటరీ బలగాలు కూంబింగ్ చేపట్టి కా.దేవరాజ్, కా. అజితలను హత్య చేసిన ఘటన ఇక్కడ మనం గుర్తుచేసుకోవచ్చు.

పడమటి కనుమల విధ్వంసం అక్కడి ఆదివాసుల సమస్య మాత్రమే కాదు. ఇది మునుపటికన్నా వరద భీభత్సం తర్వాత విస్పష్టంగా అర్థమవుతోంది. పడమటి కనుమలు దెబ్బతినే కొద్దీ దాని ప్రభావం చుట్టుపక్కలున్న తడినేలలపై పడింది. ఏదైతే జోన్ 1 కింత అత్యంత సున్నితమైన ప్రాంతమని గాడ్జిల్ కమిటీ చెప్పిందో ఆ పరిధిలోకి వచ్చే ఇడుక్కిలో భూమి కోతకు గురికావడం వల్ల కొండ చరియలు విరిగిపడి అపార నష్టం కలిగింది. అడవి తగ్గిపోయే కొద్దీ భూమి కోతకు గురవుతుంది. ఈ విషయం ముందే హెచ్చరించారు. ప్రజలు ఉద్యమించారు కూడా. పర్యావరణం పట్ల, ప్రజల పట్ల పాలకుల నేరపూరిత నిర్లక్ష్యమే ఇది. అడవిపోతే, దాని ప్రభావం ఎట్లా ఉంటుందో కొచ్చి విమానాశ్రమాన్ని కూడా ముంచెత్తిన వరద కన్నా ఇంకేది మనకు అర్థమయ్యేలా చెప్తుంది? వేల కోట్ల పెట్టుబడులు ఒక్క గాలివానకు చెల్లు. నదులనాక్రమించి, ఇసుకను తోడేసి, డ్రైనైట్ రాళ్లు పెళ్లగించి చేసిన విధ్వంసం అంతా పెట్టుబడిదారులు చేస్తే దాన్ని ప్రజలు అనుభవిస్తున్నారు.

ఇక్కడ ఇంకో రకమైన ప్రకృతి విలయం గురించి కూడా చెప్పుకోవాలి. పడమటి కనుమలకు వెనకున్న వర్షఛాయ ప్రాంతం తీవ్రమైన కరువుతో అల్లాడుతోంది. కనిపించని, వినిపించని విధ్వంసం కరువు. నిశ్శబ్దంగా ప్రాణాలు తోడేస్తుంది. ఈ ప్రాంతంలో రాయలసీమ వంటి సహజంగా వర్షపాతం తక్కువున్న ప్రదేశాలున్నాయి. అయితే ఈ మధ్య అంతకంతకూ వర్షాలు తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు ఈ సీజన్లో రాయలసీమలో చాలా ప్రాంతాలు మామూలుగా కన్నా 50శాతం తక్కువ వర్షపాతం నమోదు చేసుకున్నాయి. ఇక్కడి నుండి వలసబోయిన వ్యక్తి కేరళ వరదలో చిక్కుకొని చనిపోయిన ఘటన ఒక విషాదాంత నాటకంలాగా అనిపిస్తుంది గాని అతివృష్టి, అనావృష్టి ఈ దేశ జీవనంలో పక్కపక్కనే ఉండటం విచిత్రం ఏమీ కాదు. రెంటికీ కారణం పాలకుల నిర్లక్ష్యం, పట్టణ కేంద్రంగా జరిగే విధ్వంస అభివృద్ధి విధానం.

వీటన్నిటినీ దాచేసి నెపం ప్రకృతి మీద పెట్టడం మోసపూరితమైతే కేరళ అల్లాడుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ చిమ్మిన విషం అమానుషం. మనుషులు చచ్చిపోతుంటే సహాయం చేయకండి అని ప్రచారం చేయగలిగే దుర్మార్గులు ప్రపంచంలో ఎక్కడైనా ఉ ంటారా? నాజీలతో పోటీపడే సంఘీయులు ప్రకృతి విలయాన్ని కూడా ద్వేషరాజకీయాలకు వాడుకోజూశారు. ఈ ప్రచారం దగ్గరి నుండి కేంద్రం ప్రకటించిన నామమాత్రపు సహాయం, విదేశీ సాయాన్ని తిప్పికొట్టడం దాకా సంఘపరివార్ మరుగుజ్జుతనం బైటపడింది. కేరళ ప్రజానీకపు మానవత్వం, సహానుభూతి ముందు సంఘపరివార్ చిందులు పరమ వికారంగా, అసహ్యకరంగా తేలిపోయాయి. ఆర్ఎస్ఎస్ మానవత్వానికే శతృవు అని తేలిపోయింది. దేశ ప్రజలు కేరళతోనే నిలిచారు. ముఖ్యంగా దక్షణ భారతం ఇది తనకే వచ్చిన కష్టంగా తలచి కదిలివచ్చింది. కేరళ విలయం అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తూ రాజకీయార్థిక కోణం నుండి, సంఘపరివార్ ద్వేషభావాలను ఎత్తిచూపుతూ సాంస్కృతిక కోణం నుండి విలువైన పాఠాలు నేర్పుతుంది.

...       ...       ...

ఆగస్టు 28న ప్రధానమంత్రి హత్యకు కుట్ర జరిగిందనే ఆరోపణ మీద దేశవ్యాప్తంగా పది మంది ఇళ్ల మీద జరిగిన పోలీసు దాడులు, అరెస్టులు ఎమర్జెన్సీని స్పృహలోకి తెచ్చాయి. హైదరాబాద్ లో వరవరరావు, క్రాంతి, కూర్మనాథ్, ప్రొ.సత్యనారాయణ, ఢిల్లోలో గౌతమ్ నవలాఖా, గోవాలో ప్రొ.ఆనంద్ తేలుంబ్లే, ముంబైలో వెర్నన్ గొంజావ్వెజ్, సుసాన్ అబ్రహం, అరుణ్ ఫెరీరా, రాంచీలో ఫాదర్ స్టాన్ స్వామి ఇళ్ల మీద పూణే పోలీసులు తుఫానులా విరుచుకుపడి భీతావహ వాతారణం సృష్టించారు. వీరంతా రచయితలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, మేధావులు. అందరికందరూ సమాజం పట్ల అక్కర ఉన్నవారు. తమ సౌఖ్యాన్ని పక్కన పెట్టి పీడిత ప్రజల కోసం పని చేస్తున్నవాళ్లు. బిజెపి ప్రభుత్వ ఫాసిస్టు పోకడలపై గొంతెత్తుతున్నవాళ్లు. అందువల్ల ఈ దాడులు ఒక్కసారిగా దేశాన్ని ఉలికిపడేలా చేశాయి. నాలుగేళ్లుగా దేశంలో జరుగుతున్న పరిణామాలకు, ముదురుతున్న ఫాసిస్టు ప్రమాదానికి పతాక స్థాయి వ్యక్తీకరణగా ఈ దాడులను, అరెస్టులను అందరూ చూశారు. రొమిలా థాపర్ వంటివాళ్లు సుప్రీం కోర్టును కదిలించారు. 

దీని వెనక జరిగిన ఘటనల క్రమాన్ని చూస్తే ఇది భీమా కోరేగావ్ హింస దగ్గర మొదలై అనేక మలుపులు తిరిగి ప్రధానమంత్రి హత్యకు కుట్ర జరిగిందనే ఆరోపణలదాక వందల సంఖ్యలో అరెస్టులు జరిగాయి. హింసకు కారకులైన ఆర్ఎస్ఎస్ అనుబంధ హిందుత్వ సంస్థల నాయకులు శంభాజీ భిడే, మిలింద్ ఎక్బోటేలను కాదని నిరసన తెలిపిన దళితులను, 14ఏళ్ల పిల్లవాడితో సహా మూడు వందల మందిని అరెస్టులు చేశారు. అక్కడి నుండి మొదలై కబీర్ కాలా మంచ్ కళాకారులు, సుధీర్ ధావ్రే వంటి దళిత నాయకులతో సహా న్యాయవాది సురేంద్ర గార్లింగ్, కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ నాయకుడు రోనా విల్సన్, ప్రొఫెసర్ షోమాసేన్, ఆదివాసీ హక్కుల కోసం పనిచేస్తున్న యువ సామాజిక కార్యకర్త మహేశ్ రౌత్ ల ఇళ్లలో రెండు దఫాలుగా సోదాలు, అరెస్టులు జరిగాయి. వీరంతా పట్టణ మావోయిస్టులని, భీమా కోరేగావ్ లో లక్షలాది మందితో సభ జరిపిన ఎల్గార్ పరిషత్ నిర్వాహకులని, ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు దళితులను అల్లర్లకు ప్రేరేపించారని తీవ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలే హింసకు పాల్పడ్డారని వీడియోల్లో స్పష్టంగా ఉన్నా వారిని తప్పించి, రివర్స్ లో ఆ సంస్థలే చేసిన ఫిర్యాదులను చూపి పోలీసులు కేసులు నమోదు చేస్తూ పోయారు. రోనా విల్సన్ దగ్గర దొరికాయని చెప్తూ మావోయిస్టు లేఖలను సృష్టించారు. వాటిని పట్టుకొని ఆగస్టు 28నాడు పోలీసులు సామాజిక కార్యకర్తల ఇళ్ళపై దాడులు చేసారు. ఆర్ఎస్ఎస్, పోలీసులు కలిసి రాసిన కుట్ర కథను బిజెపి నాయకుడికి చెందిన రిపబ్లిక్ టివి సంచలనాత్మకంగా ప్రచారం చేసింది. దళితుల ప్రతిఘటనా పోరాట సభను ఆర్.ఎస్.ఎస్ శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేసి, ఘర్షణలు ప్రేరేపించండంతో మొదలైన పన్నాగం మోడీ హత్యకు కుట్ర జరిగిందనే దాకా పోయింది. బిజెపి అధికారంలోకి వచ్చాక ఆర్ఎస్ఎస్ శక్తులు ముస్లింలు, దళితుల మీద, రచయితలు, మేధావులు, యూనివర్సిటీ విద్యార్థుల మీద చేస్తున్న మూకదాడులు దేశవ్యాప్తంగా ఫాసిస్టు వ్యతిరేక ఐక్యప్రతిఘటనకు దారితీసాయి. గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర మొదలైన చోట్ల ఎగసిన దళితుల ప్రతిఘటన బిజెపికి ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని తీసుకొస్తున్నది. ముస్లింలను కలుపుకొని దళితులు చేస్తున్న పోరాటంతో వివిధ ప్రజాసంఘాల మేధావుల ఫాసిస్టు వ్యతిరేక కూటములు కలుస్తున్నాయి. ఇంకో వైపు మోడీ తెంపరితనంతో చేపట్టిన నోట్ల రద్దు, జిఎస్టి, ఇంధన ధరల పెంపు వంటి ఆర్థిక విధానాలు, అమిత్ షా కొడుకు బ్యాంకు వ్యవహారం, రాఫెల్ కుంభకోణం వంటి అనేక స్కాములు బిజెపిని అప్రదిష్ట పాలుచేసాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపించే వేళ ప్రజల దృష్టి మళ్లించడానికి, అసమ్మతిని ఎదుర్కోవడానికి ఈ అరెస్టులు.

ఈ ఘటనల క్రమానికి కొంచెం వెనక్కిపోదాం. ఇట్లాగే ప్రొ.సాయిబాబా ఇంటి మీద రెండు విడతలుగా రైడ్ జరిగింది. అప్పుడు యు.పి.ఎ అధికారంలో ఉంది. మొదటిసారి ఎక్కడో దొంగతనం జరిగిందని, ఆ దొంగసొత్తు సాయిబాబా ఇంట్లో వెదకడానికి సోదాలు చేసారు. రెండోసారి మావోయిస్టు సంబంధాల ఆరోపణలపై సోదాలు చేసారు. ఒకానొక రోజు దొంగల్లా మీద పడి ఆయన్ని అపహరించుకుపోయి కేసులు పెట్టేసారు. అనేక నిరసనల తర్వాత ఒకటిన్నర సంవత్సరాలకు బెయిలుపై విడుదలైతే కొద్దినెలల్లోనే అనూహ్యంగా కేసును ఆఘమేఘాల మీద నడిపి జీవిత ఖైదు విధించారు. నిన్న మొన్న అరెస్టయి వాళ్లంతా సాయిబాబాను విడుదల చేయాలని పోరాడుతున్నవాళ్లే.

ఇంకొంచెం వెనక్కి వెళ్లి ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తల మీద అణచివేత క్రమం చూద్దాం. నిజానికి ప్రజాస్వామిక గొంతుకలపై రాజ్యం ఉక్కుపాదం ఎప్పటి నుండో ఉంది. అయితే 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఏకంగా ప్రజలపై యుద్ధం మొదలయ్యాక ఇది తీవ్రమైన, నిర్దిష్టమైన రూపం తీసుకుంది. భారత ప్రభుత్వం తన ప్రజల మీదే యుద్ధం ఎందుకు మొదలు పెట్టింది? తూర్పు, మధ్య భారతదేశంలో విస్తారమైన అడవులున్నాయి. చత్తీస్ ఘడ్, మహరాష్ట్ర, ఝార్ఖండ్, బీహార్, ఒడిసా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దాకా విస్తరించిన అడవుల్లో అపార ఖనిజ సంపద ఉంది. ఒక్క ఆంధ్రా ఒడిసా సరిహద్దులోని బాక్సైట్ ఖనిజం విలువ భారతదేశపు స్థూల జాతీయోత్పత్తికి రెండు రెట్లు ఉంటుంది. కొన్ని మిలియన్ టన్నుల నాణ్యమైన ఇనుప ఖనిజం చత్తీస్ ఘడ్, ఝార్ఖండ్ అడవుల్లో ఉంది. వీటితో పాటు తూర్పు మధ్య భారతాల్లో బొగ్గు, గ్రానైట్, రాగి, బంగారం, వజ్రాలు, యురేనియం, డోలమైట్, క్వాడ్జెట్ వంటి మరో 29 రకాల గనులు ఉన్నాయని కనుక్కున్నారు. ఈ ఖనిజ సంపదను తవ్వుకోడానికి అనుమతినిస్తూ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మైనింగ్ కంపెనీలతో మన ప్రభుత్వం పదిపన్నెండేళ్ల కింద ఒప్పందాలు కుదుర్చుకుంది.

వీటిని తవ్వితీస్తే పచ్చటి అడవులన్నీ శ్మశానాలుగా మారతాయి. అడవులున్నీ నాశనమైతే వర్షాలు పడవు. భూగర్భజలాలు ఇంకిపోతాయి. కాలుష్యం పెరుగుతుంది. భూమి విపరీతంగా వెడెక్కుతుంది. కనుక పర్యావరణ చట్టాల ప్రకారం అక్కడ మైనింగ్ చేయకూడదు. ఆదివాసీ ప్రజలు నివసించే ప్రాంతాల మీద ఆదివాసులకే హక్కులున్నాయని 5వ షడ్యూల్, వన్ ఆఫ్ సెవెంటీ వంటి చట్టాలు చెప్తాయి. కాబట్టి స్థానిక ఆదివాసులు ఒప్పుకుంటేనే అక్కడ ఏ కంపెనీలైనా రావాలి. వీటన్నిటినీ పక్కన పెట్టి అడవుల్లో ఖనిజ సంపదను తవ్వుకోడానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఈ ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి వల్ల దేశానికేమైనా ఆదాయం ఉంటుందా అంటే తవ్వినందుకు రూపాయికి ఏడు పైసల రాయల్టీ తప్ప ఇంకేమీ రాదు. దానికి తోడు రవాణా సౌకర్యాల కోసం రోడ్లు, విద్యుత్తు ప్రాజెక్టులు, ఆ కంపెనీలకు నీరు సరఫరా చేసేందుకు నదులను మళ్లించి డ్యాములు, ఆనకట్టలు అన్నీ ప్రభ్వుత్వమే సమకూర్చాలి. ప్రకృతి విధ్వంసం, అనారోగ్యాలు ప్రజలకు, లాభాలు విదేశీ కంపెనీలకు. దీన్నే మన ప్రభుత్వం అభివృద్ధి అంటుంది. ఈ అభివృద్ధినే పర్యావరణవాదుల దగ్గరి నుండి దేశంలో చాలా మంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఈ విధ్వంసాన్ని ఆయా ప్రాంతాల్లోని ఆదివాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ప్రతిఘటిస్తున్నారు. ఆదివాసులందరినీ చంపైనా సరే పెట్టుబడిదారుల సేవ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇంత పెద్ద ప్రభుత్వాన్నే ఎదిరించే శక్తి ఆదివాసులకు ఎలా వచ్చింది అంటే వాళ్లకు మావోయిస్టుల అండ దొరికింది. కాబట్టి ఇప్పుడు ఆదివాసులందర్నీ మావోయిస్టులని చెప్తూ అరెస్టులు, అత్యాచారాలు, చిత్రహింసలు, ఎన్ కౌంటర్లు, గూడేలకు గూడేలు తగలబెట్టడాలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ మీడియాలో, పేపర్లలో రాకుండా పోలీసులు కట్టడి చేశారు. ఇప్పుడు ఈ అటవీ ప్రాంతాల్లో వివిధ విభాగాలకు చెందిన సుమారు నాలుగు లక్షల సైన్యం ఉంది.   

ప్రజాసంఘాలు, మేధావులు ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ ను వ్యతిరేకిస్తూ ప్రచారం అందుకున్నారు. దీనిని అడ్డుకోడానికి ప్రభుత్వం అన్నిరకాల అణచివేతను ప్రయోగిస్తోంది. ఇది నిన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఇప్పుటి బి.జె.పి ప్రభుత్వం దాన్ని పరాకాష్టకు తీసుకుపోయింది. పట్టణంలో కోట్ల ఆదాయాన్ని కాదని నిస్వార్థంగా ఆదివాసులకు వైద్యం చేసే డా.బినాయక్ సేనకు జీవిత ఖైదు విధించారు. ప్రజాకళాకారుడు జీతన్ మరాండీకి మరణశిక్షను విధించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదుల తీవ్ర నిరసనలతో డా.బినాయక్ సేన్ కు సుప్రీం కోర్టు బెయిలు ఇచ్చింది. జీతన్ మరాండీ విడుదలయ్యాడు. వీళ్లిద్దరే కాదు, అక్కడ జరుగుతున్న విషయాలను బైటి ప్రపంచానికి వెల్లడి చేస్తున్నారని మాలినీ సుబ్రమణ్యం లాంటి జర్నలిస్టులను ఇళ్లు ఖాళీ చేయించి అక్కడి నుండి వెళ్లగొట్టారు. వందలాది ఆదివాసులపై కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధిస్తుంటే వారికి న్యాయసహాయం అందిస్తున్న శాలినీ గేరా, ఈషా కందెన్ వాల్ లను బెదిరించి జగదల్ పూర్ నుండి ఖాళీ చేయించారు. ప్రొఫెసర్ నందినీ సుందర్ వంటి వారిపై హత్య కేసులు పెట్టారు. సోనీసోరీపై కేసులు, పోలీసు నిర్బంధంలో ఘోరమైన లైంగిక హింస, యాసిడ్ దాడి కూడా చేసారు. పౌరహక్కుల సంఘాలపై, నిజనిర్ధారణ కమిటీలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. వీళ్లనందరినీ 'పట్టణ మావోయిస్టులు' అంటున్నారు. అప్పట్లో మన్మోహన్, చిదంబరంలు వైట్ కాలర్ మావోయిస్టులంటే, ఇప్పుడు మోడీ, అమిత్ షాలు అర్బన్ నక్సలైట్లు అంటున్నాడు. ఇప్పుడు ఈ పదం ఎంత విస్తృత అర్థంలో వాడుతున్నారంటే ప్రత్యామ్నాయ భావాలు గల రచయితల దగ్గరి నుండి పార్లమెంటరీ ప్రతిపక్ష కాంగ్రెస్ దాకా మోడీని వ్యతిరేకించే వాళ్లందరూ అర్బన్ నక్సలైట్లే.

... ... ...  

సామ్రాజ్యవాద మార్కెట్ ఆర్థిక విధానాలు దేశవ్యాప్తంగా అన్ని రంగాలను అతలాకుతలం చేశాయి. రెండు భిన్నమైన తలాల్లో రైతులు, విద్యార్థుల ఆత్మహత్యల రూపంలో సంక్షోభం వ్యక్తీకరించబడడటం మనం చూస్తున్నాం. అత్యంత విషాదంగా దిగ్ర్భాంతికరంగా ఈ బలవన్మరణాలు సమాజంలోచోటు చేసుకుంటున్నాయి. మరొకవైపు దేశవిదేశీ పారిశ్రామిక సంస్థల కోసం, రియలెస్టేట్ వ్యాపారాల కోసం, మైనింగ్ కంపెనీల కోసం ప్రజల నిర్వహణలో ఉన్న భూముల్ని ప్రభుత్వం లాగేసుకుంటోంది. ప్రభుత్వరంగ పరిశ్రమల మూసివేతతో మొదలై, దేశీయ మార్కెట్ మీద పట్టు సంపాదించి, సముద్రతీర ప్రాంతాలను, నీటి వనరులను, ఖనిజ సంపదను బహుళజాతి కంపెనీలు తమ గుప్పిట్లోకి తీసేసుకుంటున్నాయి. భూముల కోసం, భూగర్భంలో ఉన్న వనరుల కోసం పెద్దఎత్తున జనాన్ని నిర్వాసితులను చేస్తున్నాయి. దీని వ్యతిరేకించే ప్రజలను దారిలోకి తెచ్చుకోడానికి సామదానబేద దండోపాయాలు ప్రయోగిస్తున్నాయి. ఉద్యోగాలు, పెద్ద ఎత్తున నష్టపరిహార ప్యాకేజీ ఆశ చూపి కొంతవరకు రైతుల్ని లొంగదీసుకుంటున్నారు గాని ఆదివాసులు మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలకు ఎంతగా కట్టుబడిందటే ఆదివాసులను తరిమేయడానికి లక్షలాది సైన్యంతో అంతర్యుద్ధం చేసేదాకా పోయింది. పైన చెప్పిన ఆత్మహత్యల దగ్గరి నుండి లక్షలాది రైతుల, ఆదివాసుల విస్థాపన దాకా ఇదంతా సామ్రాజ్యవాద పెట్టుబడి విధ్వంసం. 

ఈ పెట్టుబడే ఫాసిస్టు బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చింది. జనాన్ని మేనేజ్ చేయడానికి అంతకు ముందటి ప్రభుత్వాలు దానికి సరిపోలేదు కావొచ్చు. అటు రాజకీయార్థిక పరిణామాలతో పాటు క్రమంగా శక్తిని పుంజుకున్న ఆర్ఎస్ఎస్ గుజరాత్ లో ఒక ప్రయోగం చేసి విజయవంతమైంది. అదే సమయంలో ఆర్థిక సంక్షోభంతో పాటు రైతుల, కార్మికుల, ఆదివాసుల పోరాటాలు బలపడి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగలేకపోయాయి. భావజాలరంగంలో ఆర్ఎస్ఎస్ పాలకవర్గాల బలమైన శక్తిగా ఎట్లా అవతరించిదనే విషయం మరెక్కడైనా చర్చించుకుందాం కాని అది తన బ్రాహ్మణీయ హిందూ జాతీయవాద సాంస్కృతిక ఆధిపత్యంతో మెజారిటీ ప్రజల ఆమోదాన్ని పొందగలిగింది. ఈ ఆమోదం హిందూ మత విశ్వాసాలు, విద్వేషంతో కూడిన దేశభక్తి నుండి పన్నులు వేసినా, పెద్ద నోట్లు రద్దు చేసి జనాన్ని అష్టకష్టాల పాలుజేసినా తమకు విధేయులుగానే ఉంచుకునే దాకా చాలా మటుకు తెచ్చుకోగలిగింది. అయితే ముందు చెప్పినట్లు బిజెపి ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రతిఘటన కూడా మొదలైంది.

ఎంతటి అణచివేత ప్రయోగించినా లొంగిరాని ఆదివాసీ పోరాటాలను, వాటికి అండగా ఉండడమే కాదు రాజకీయ సైద్ధాంతిక భావజాల ప్రత్యామ్నాయంగా ఉన్న మావోయిస్టులను నిర్మూలించడానికి వందలాది మందిని ఎన్కౌంటర్లలో చంపడం దగ్గరి నుండి వారిని టెర్రరిస్టులుగా ప్రచారం చేయడం దాకా అన్ని రకాల శక్తియుక్తులను ప్రభుత్వం ప్రయోగిస్తోంది. ఇది ఒక పార్శ్వమైతే తూత్తుకుడి నుండి భీమా కోరేగావ్ దాకా కార్పొరేట్ విధ్వంసాన్ని, బ్రాహ్మణీయ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్న వారందరి మీదా మావోయిస్టు ముద్రవేసి అణచివేయడం దాని ఎటెన్షన్. ఇది ఎందుకు అనంటే ఈ దేశ ప్రత్నామ్నాయం- అది రాజకీయార్థిక ప్రత్యామ్నాయం అయితే కార్పొరేట్ పెట్టుబడి విధ్వంసాన్ని వ్యతిరేకించే పోరాటం, సాంస్కృతిక ప్రత్నామ్నాయం అయితే బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని ఎదిరించే అట్టడుగు సమూహాల, ముఖ్యంగా దళితుల పోరాటంలో ఉంది. ఈ రెండూ కలవాలి. కలుస్తాయేమోనన్న భయం ఫాసిజానికి ఉంది. ప్రజాపోరాటాల్లో ఇంతటి విస్తృతి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాలేదు. ముఖ్యంగా దళిత ఉ ద్యమం. ఫాసిజం వల్ల అనివార్యంగా ఇది పుంజుకుంటోంది. ఇది భారతదేశంలో కరడుగట్టిన సాంఘిక వ్యవస్థను కదలబార్చడానికి చాలా అవసరం కూడా. ఇందులో భాగంగానే ప్రజల పక్షాన దృఢంగా నిలిచే విద్యావంతులు - జెఎన్‌యూ విద్యార్థుల దగ్గరి నుండి విశ్వాసాల కోసం ప్రాణాలు పణంగా పెట్టిన గౌరీలంకేష్, ఎన్నో తీర్ల వేధింపులను, నిర్బంధాలను ఎదుర్కొంటున్న న్యాయవాదులు, రచయితలు, మేధావుల దాకా అటు అడవిలో పోరాడుతున్న ఆదివాసీ హక్కుల కోసం, ఇటు దళితులు, ముస్లింల జీవించే హక్కుల కోసం గొంతెత్తున్నారు.

సామ్రాజ్యవాద మార్కెట్ దురాశ కేరళ వంటి ప్రకృతి కల్లోలాలు తోసుకొచ్చేలా చేసింది. భోపాల్ గ్యాస్ నుండి తూత్తుకుడి స్టెరిలైట్ దాకా అది పెద్ద ఎత్తున జీవన విధ్వంసం చేస్తోంది. సకల జీవరాశులకు నెలవైన ప్రకృతిని వికృతంగా మార్చేస్తుంది. కేరళ విలయం మనం తక్షణం ప్రతిస్పందించాల్సిన ఒక ఎమర్జెన్సీని గుర్తుచేస్తోంది. 

అదే సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ శక్తులు మరోవైపు తన విధ్వంసక దోపిడి కోసం ఆర్ఎస్ఎస్ ఫాసిజాన్ని తీసుకొచ్చాయి. దాని విధ్వంసం ఆర్థికంగా, నైతికంగా, సాంస్కృతికంగా ఎట్లా ఉంటుందో అన్ని రకాలుగా పతమవుతున్న మన వ్యవస్థ కళ్లకు కడుతున్నది. ఆర్ఎస్ఎస్ ఎంతగా మానవత్వానికి శతృవని మనం మాట్లాడుకుంటున్నామో, అది చేస్తున్న విలయతాండవం వెనక దానికున్న బలం రాజకీయార్థిక వ్యవస్థలో ఉందన్నది మర్చిపోకూడదు. విశ్వాసాల వరకే అయితే ఫాసిజం మెజారిటీని తనవైపు ఉంచుకోగలదు. ఎంత నిజాయితీ గల ఉద్యమకారులనైనా ఒంటరిని చేయగలదు. రోజువారీ ఉపాధి, పన్నుల దోపిడి, ధరలు, రైతుల, కార్మికుల, నిరుద్యోగుల దుర్భర జీవితం మొత్తంగా జీవన విధ్వంసం విషయంలో గనక మాయమాటలు చెప్తే అది కేరళ కల్లోలంలో తన హిందుత్వ వికారాన్ని బైట పెట్టుకున్నట్లుగా తేలిపోతుంది. ఈ విషయంలో దాన్ని కార్నర్ చేస్తూ ప్రత్నామ్నాయ సంస్కృతి, రాజకీయాల నిర్మాణం చేయాలి. ముంచుకొస్తున్న ఫాసిజాన్ని ఇట్లా అన్ని వైపుల నుండి ఎదుర్కోకపోతే ఈ విలయంలో జీవించే చోటు ఉండదు.

(అరుణతార సెప్టెంబర్ 2018)

 

ప్రకృతి విధ్వంసక ఇ.ఐ.ఎ. 2020

లాక్ డౌన్ సమయంలో బహిరంగ కార్యకలాపాలన్నీ రద్దయిపోయాయి. సమావేశాలన్నీ ఆన్లైన్ మాధ్యమానికి పరిమితమైపోయాయి. అన్ని రకాలుగా చీకటి ఆవరించిన స్థి...