కరోనా విపత్తు తొలగిపోకముందే మరో మహావిపత్తు ముంచుకొచ్చింది. అది వైరస్ అయితే ఇది ఓ ఎడారి పురుగు. ఇండియా 1997 తర్వాత మళ్ళీ ఇప్పుడు మిడతల దాడి చూస్తోంది. మామూలుగా వర్షాకాలంలో -అంటే జులై, ఆ తర్వాత నెలల్లో మిడతలు దండుగా వచ్చి పచ్చదనం ఎక్కడుంటే అక్కడ వాలిపోయి విపరీతంగా తినేస్తాయి.
ఇంగ్లీష్ లో swarm అనబడే ఈ మిడతల గుంపు ఒక దానిలో 15 కోట్ల మిడతలు ఉంటాయి. ఒక గుంపు ఒక చదరపు కిలోమీటర్ వరకు కనిపిస్తుంది. ఇంకా పెద్ద గుంపులు కూడా ఉంటాయి. సంతానోత్పత్తి తర్వాత ఆహార అన్వేషణ కోసం ఇవి పొడి నెలల నుండి ఇలా గుంపులుగా వలస వస్తాయి.
ఎంత విపరీతంగా తింటాయి అంటే ఒక చదరపు కిలోమీటర్ మేర ఉన్న మిడతల దండు ఒక్క రోజులో 35 వేల మంది జనం తినేంత ఆహారాన్ని శుభ్రంగా ఖాళీ చేస్తాయి.
తూర్పు ఆఫ్రికా దేశాల నుండి ఇరాన్, పాకిస్తాన్ మీదుగా భారతదేశంలోకి ఇవి ప్రవేశించాయి. మొదట రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలో, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట ప్రాంతాల్లోకి ఇవి వచ్చేసాయి. వెనువెంటనే లక్ష ఎకరాలకు పైగా పంటపొలాలు వీటి బారినపడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోకి కూడా ఇవి విస్తరిస్తాయని అంటున్నారు.
ఒక అనావృష్టి తర్వాత తుఫాన్లు, భారీవర్షాలు కురిస్తే ఆ వాతావరణ
మార్పులో ఇవి వృద్ధి
చెంది దూర ప్రాంతాలకు విస్తరిస్తాయి. పర్యావరణ విధ్వంసమే దీనికి కారణం. ఆర్థిక అభివృద్ధి పేరు
చెప్పి పెట్టుబడిదారులకు పచ్చని ప్రకృతిని అప్పగించేస్తే జరిగే నష్టం ఇది.
మే 28, 2020
