Monday, November 18, 2019

ఆ చావు ఎవరికీ రావొద్దు. యురేనియం ఎక్కడా తవ్వొద్దు.

   ఉదయం నాగప్ప చనిపోయాడని (19.11.2019) మెసేజ్. నిన్ననే చూసామతన్ని. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, పాలమూరు అధ్యయన వేదిక, జనసేన పార్టీ నుండి ప్రతినిధులు తుమ్మలపల్లె యురేనియం బాధిత గ్రామాలను చూడ్డానికి వచ్చినప్పుడు జయశ్రీ (మానవ హక్కుల వేదిక) తో పాటుగా నేనూ వెళ్ళాను. సేవ్ నల్లమల ఉద్యమం వచ్చిన తర్వాత కడప జిల్లాలో యురేనియం అనుభవం తెలుసుకుందామని తరచుగా ఎవరో ఒకరు వస్తున్నారు.


 

నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే  పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్చేసి, అక్క దేవతలకు పూజలు చేయను మొగుడూ పెళ్ళాం పోయోచ్చినారని అన్నారు. అప్పుడే ఆ ఊరు పొతే ఇద్దరూ మొదటి సారి శుభ్రమైన బట్టలు కట్టుకొని కనిపించారని జయశ్రీ చెప్పింది.

కొట్టాల గ్రామానికి పోయినప్పుడల్లా కర్ర ఊతంతో అడుగులో అడుగేసుకొని మెల్లగా నడుచుకుంటూ అందరూ కూడే చెట్టు కిందికి వచ్చేవాడు. నోట మాట స్పష్టంగా రాదు. భార్య మునెమ్మ తప్ప అతనికెవరూ లేరు. ఇద్దరూ ఒకరికొకరు అన్నట్టుగా ఉండేవారు. ఎన్నడో ముపై ఏండ్లనాడు ఆ ఊరికి వచ్చినారంట. ఓపికున్నన్నాళ్ళూ కూలి పనులు చేసేవాళ్ళు. వయసు మళ్లింది. యురేనియం వచ్చింది. ఇద్దరికీ గడ్డలు (ట్యూమర్లు) వచ్చాయి. మునెమ్మకు వీపు మీద. నాగప్పకు మెడ మీద వెనకభాగంలో. నవ్వ (దురద) పెడ్తాది మ్మా గీరుకునేకి చెయ్యందదు అనేది మునెమ్మ. ఆమె ఎంత సహజంగా చెప్పేదో వినేవాళ్ళకు అంత దుఖం కలిగేది. ముసలాయనకు బాధ చెప్పుకోనీకి నోరు కూడా లేదు. వచ్చినోల్లకల్లా దండం పెడతాడు. దయగల మనిషెవరో వాళ్లకు ఉండడానికి ఖాళీగా ఉండే పాడుబడిన గది ఇచ్చాడు. ఊర్లో ఎవరో ఒకరు అన్నం పెడతారు. నాగాప్పకు మాత్రమే నెలకు రెండు వేలు పెన్షన్ వచ్చేది. ఇద్దరు మనుషులు, బట్టలు బాగా మాసిపోయి జాలికే జాలిగోల్పేలా ఉండేవాళ్ళు.

నిన్న మధ్యాహ్నం చెట్టు దగ్గరికి మునెమ్మ ఒక్కతే వచ్చింది. నాగప్ప విషయం తెలుసుకొని వాళ్ళ ఇంటికి పొతే మంచానికే పరిమితమై రేపో మాపో అన్నట్టు ఉన్నాడు. ఆస్పత్రికి రానన్నాడట. వద్దన్నా శక్తి కూడదీసుకొని లేచి కూర్చున్నాడు. రెండు చేతులూ జోడించాడు. అస్పష్టంగా ఎదో గొణుగుతూ ఏడ్చాడు. మందుల ఖర్చుకని మాలో ఒకరు కొంత డబ్బు ఇచ్చారు.  ఇప్పుడది చావు ఖర్చుకు పనికొస్తుందేమో. ఇప్పుడు మునెమ్మకు ఎవరూ లేరు. నిజానికి అతనున్నా ఏమీ చేయలేడు. ఆమెకూ అతని బాగోగులు చూసుకునే శక్తి లేదు. కట్టె పట్టుకున్న ఇంకో కట్టెలా ఉంటుంది మునెమ్మ. వంగిన ఎముకల గూడుపైన తోలు కప్పినట్లు ఉంటుంది. పోయినసారి ప్రజాసంఘాల పర్యటనలో రామాసుందరి ‘ఇద్దరిలో ఆమే తొందరగా పోతుంది. ఆయనకు ఇంక ఎవరూ ఉండర’ని బాధపడింది. చావు నాగప్పనే వరించింది. జయశ్రీ అన్నట్లు జాలీ, దయా లేని ప్రభుత్వాల కన్నా చావే గొప్పది- అతనికి రోగాల నుండి, బాధ నుండి విమిక్తినిచ్చింది. మున్నెమ్మవ్వకు ఇప్పుడు మానసికంగా కూడా ఎవరూ లేరు. ఇక ఆమె కూడా తనకు తొందరగా విముక్తి ప్రసాదించమని మృత్యుదేవతను వేడుకుంటూ ఉంటుంది.

పెద్ద వయసు కదా, చావు సహజమే అని ఎవరైనా అనొచ్చు. నిజమే. కానీ యురేనియం ఆ చావును భయానకంగా మార్చింది. ఎవరిమీదైనా విపరీతంగా కోపమొస్తే ‘పురుగులు పడి చస్తాడు’ అని తిట్టుకుంటుంటారు. ఇప్పుడు తుమ్మలపల్లె గ్రామాల ప్రజలు వాళ్లకు ఈ స్థితిని కల్పించిన ఆ రాజకీయ కుటుంబాన్ని శపిస్తున్నట్లుగా. ఎవరికీ హాని చేయని, తమ బతుకేదో తాము బతుకుతూ పూటకింత ముద్ద తప్ప ఏమీ ఆశించని ఆ ముసలి దంపతులకు దాపురించిన నరకం ఎవరి పాపం? శ్రీశ్రీ ‘ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రి గాలి పశ్నించిందని’ రాసినట్లు ఇప్పుడు కొట్టాల గ్రామం అడుగుతోంది. భూమయ్యగారి పల్లె, మబ్బుచింతల పల్లె, కనంపల్లె అడుగుతున్నాయి. తమ పంటలు నిలువునా కుళ్ళి కాలిపోడానికి, చూస్తుండగానే తమ పశువులు దయ్యాల్లా భయంకరంగా మారిపోయి చచ్చిపోడానికి, తమ శరీరం పుండ్లు పడిపోడానికి, ఒంట్లో సత్తువపోయి, నొప్పులు పుట్టి గడ్డలు తేలడానికి కారకులెవరని అడుగుతున్నారు. ఇంగ్లీషు మీడియం పెట్టి ఉద్దరిస్తానంటున్న జగన్మోహనరెడ్డికి మా బాధలు వినపడవెందుకని.

ఇక్కడ పెట్టినట్లుగా మా ప్రాంతంలో కూడా యురేనియం ప్లాంటు పెడదామంటున్నారు. మీరేమంటారు అని పాలమూరు అధ్యయన వేదిక వాళ్ళు అడిగితే ‘వద్దనే వద్దయ్యా... మా సావు ఎవరికీ రావొద్దు’ అన్నారు.

19 నవంబర్ 2019

Sunday, October 13, 2019

అమేజాన్ కార్చిచ్చుకు అసలు కారణం

 


ఆగస్టు 19వ తేదీ బ్రెజిల్ నగరాలపై అలముకున్న దట్టమైన పొగ ప్రపంచాన్నే ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రపంచంలోని అతి పెద్ద ఉష్ణమండల వర్షారణ్యం దారుణంగా తగలబడిపోతోందని సోషల్ మీడియాలో ప్రకంపనలు మొదలయ్యాయి. అమెజాన్ అడవులను కాపాడండడని ట్యాగ్ లైన్లు, సెలబ్రిటీల ప్రకటనలు సూరెత్తాయి. కార్చిచ్చు పడిన భూమిని అంతరిక్షం నుండి చూపించే ఉపగ్రహ చిత్రాలను నాసా విడుదల చేసింది. ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. బహుషా మొదటిసారి ప్రపంచమంతా ఒక్కటై పర్యావరణం కోసం గొంతువిప్పిన సందర్భం ఇదేనేమో. జి7 దేశాల కూటమి కూడా ఈ కార్చిచ్చును గురించి చర్చించింది. ఇది తక్షణ తాత్కాలిక ప్రతిస్పందనే, కాని ఈ వార్తా సంచలనం పర్యావరణ స్పృహను ఎంతో కొంత పెంచగలిగింది. పర్యావరణ సమతుల్యత కోసం అడవుల పరిరక్షణ ఎంత ముఖ్యమో అందరూ మాట్లాడుతున్నారు. భూమ్మీద ప్రాణులకు 20 శాతం ఆక్సీజన్ అమేజాన్ నుండే వస్తుందనే అతిశయోక్తులు చక్కర్లు కొట్టాయి. ప్రపంచానికి ఊపిరితిత్తుల వంటి అమేజాన్ అడవులు ఈ స్థాయిలో తగలబడడానికి కారణం బ్రెజిల్ ప్రభుత్వ పర్యావరణ వ్యతిరేక విధానాలని ఆ దేశాధ్యక్షుడు బోల్సొనారోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా సెప్టెంబర్ చివరి వారానికి కూడా అడవి మండుతూనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఇంకా 1,31,600 కార్చిచ్చులు మండుతూనే ఉన్నాయి.

భూగోళానికి అమేజాన్ అడవుల ప్రాధాన్యత చిన్నది కాదు. అమేజాన్ ఉష్ణమండల వర్షారణ్యాలలో అతి పెద్దది. ఉష్ణమండల వర్షారణ్యాలు భూవాతావరణాన్ని, జీవసమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర వహిస్తాయి. ఎంత దట్టంగా చెట్లు పెరిగి ఉంటాయంటే ఇక్కడ 2 శాతానికి మించి సూర్యరశ్మి నేలను తాకదు. ఏడాది పొడవునా పచ్చగా ఉండే ఈ అడవులు ఆరు శాతం భూమిని ఆక్రమించుకుని ఉంటే, ఇక్కడ 50 శాతం జీవులు నివసిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. ప్రపంచంలోని నాలుగోవంతు ఔషద మొక్కలు ఇక్కడే ఉన్నాయి. అమేజాన్ అడవులు 55 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో (ఇండియా వైశాల్యం 32.8 లక్షల చ.కి.మీ.) ఎనిమిది దేశాలలో నిరంతరాయంగా విస్తరించి ఉన్నాయి. సుమారు 60 శాతం అమేజాన్ అడవి బ్రెజిల్ లోనే ఉంది. ప్రపంచానికి ఊపిరితిత్తులు అనడం అతిశయోక్తి ఏమోగాని అమేజాన్ భూతాపాన్ని చల్లార్చే ఏసీలాగా అయితే పనిచేస్తుంది. కాలుష్యం, ఇతరేతర కారణాల వల్ల భూ ఉపరితలం మీదికి విడుదలయ్యే కొన్ని కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను పీల్చుకునే స్థాయి ఈ దట్టమైన అడవులకు ఉంది. ఈ ఉద్గారాలు భూమి వేడెక్కడానికి ప్రధాన కారకాలు. అమేజాన్ అడవుల విధ్వంసం వల్ల భూతాపం మునుపటి కన్నా తీవ్రంగా పెరిగిపోతుంది. 

నిజానికి అడవుల్లో కార్చిచ్చులు కొత్త కాదు. ఈ ప్రాంతంలో జులై నుండి అక్టోబర్ వరకు ఉండే పొడి కాలంలో మంటలు చెలరేగడం సహజం. పిడుగుపాటు వల్ల కూడా మంటలు వస్తాయి. అయితే ఇక్కడ ఎగసే మంటలకు ప్రధాన కారణం ఎక్కువగా పంటలు సాగు చేసుకోవడం కోసం రైతులు అడవిని నరికి తగలబెట్టడమే. ఇది ప్రతి ఏడాదీ బ్రెజిల్ తోపాటు పెరు, బొలీవియా, కాంగో, అంగోలా, జాంబియా వంటి దేశాలలో ఉండేది. కానీ బ్రెజిల్ లో ఈ ఏడాది జనవరి నుండి ఆగస్టు వరకు 85 శాతం అధికంగా మంటలు చెలరేగినట్లు ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ నివేదించింది. జనవరిలో అధికారంలోకి వచ్చిన జైర్ బొల్సొనారో విధానాలే ఇందుకు కారణమని ప్రపంచమంతా అతన్ని తిట్టిపోస్తోంది. ఇందులో వాస్తవం ఉంది కానీ బొల్సొనారో ఒక్కడే విలన్ కాదు. ఇంకా చెప్పాలంటే ఇతను మెయిన్ విలన్ కాదు. ఇప్పుడు పర్యావరణ చర్చంతా బ్రెజిల్ కేంద్రంగా, ఆ దేశ 'పొగరుబోతు' అధ్యక్షుడి కేంద్రంగా జరుగుతుండడంతో అసలు చర్చనీయాశం ముందుకు రావడం లేదు.

ఇవాల్టి సంక్షోభం అర్థం కావాలంటే బ్రెజిల్ లో యాభై ఏళ్లుగా అమలవుతున్న రాజకీయార్థిక విధానాల గురించి కనీసంగానైనా తెలుసుకోవాలి. 1964 నుండి 1985 వరకు బ్రెజిల్ సైనిక పాలన కింద ఉన్నప్పుడు బహుళ జాతి సంస్థలు ఇక్కడ ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాయి. బ్రెజిల్ ను 'అభివృద్ధి' చేయడానికి ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు ఆ దేశంలో విస్తారంగా రోడ్లు, భారీ డ్యాముల వంటి నిర్మాణాలకు సహకారం అందించాయి. ప్రపంచ బ్యాంకు అభివృద్ధి పథకంలో భాగంగా బ్రెజిల్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు ఇచ్చి గనుల తవ్వకాలను ప్రోత్సహించింది. ఇదంతా జరిగింది అమేజాన్ అడవి ప్రాంతంలోనే. 1972లో బి.ఆర్. 230 అనే 4 వేల కిలో మీటర్ల జాతీయ రహదారి అమేజాన్ అడవిని చీలుస్తూ నిర్మాణమైంది. 1960లలో ప్రారంభమై 1980లో పూర్తయిన మరో రహదారి 4,325 కిలోమీటర్ల మేరా అమేజాన్ పరీవాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలను అనుసంధానించింది. ఇవి అడవి సంపదను తరలించే రహదారులని వేరే చెప్పనక్కర్లేదు. ఇనుము, రాగి, బంగారం తదితర గనుల నుండి ముడిసరుకు ప్రపంచ మార్కెట్ కు సులువుగా చేరే మార్గం పడింది. వ్యాపార పంటలు వ్యవసాయంలోకి ప్రవేశించాయి. సోయాబీన్, చెరకు, కాఫీ, కోకో, పామ్ ఆయిల్ పంటలు, బీఫ్ పరిశ్రమకు అవరమయ్యే పశువుల కోసం పచ్చిక బయళ్ళు విస్తరించే కొద్దీ అడవి తరుగుతూ వచ్చింది.

1970ల ప్రాంతంలోనే చాలా మంది మైదాన ప్రాంతపు చిన్న రైతులు అడవుల్లోకి తరలిపోయి చెట్లు నరికి వ్యవసాయం చేసుకోవడం మొదలైంది. ప్రపంచ మార్కెట్ అవసరాల కోసం వెలిసిన ఆధునిక వ్యవసాయ క్షేత్రాలు, యంత్రీకరణ వల్ల చాలా మందికి పని లేకుండా పోయి ప్రజలు వలసలు పోవలసి వచ్చింది. భూమి అంతకంతకూ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరించబడింది. వలసలు పెరుగుతూపోయి నగరాలు పట్టకుండా అయిపోయాయి. మురికివాడలు విస్తరించాయి. ఇట్లా వలస వచ్చిన జనాభాను నగరాలు పోషించలేకపోయాయి. ఆర్థిక సంక్షోభం, సైనిక పాలన బ్రెజిల్ ను అశాంతితో కుదిపేశాయి. అలజడులు రేగాయి. ప్రజలకు ఉపాధి కల్పించలేని పాలకులు అనివార్యంగా కొంత జనాభాను అడవులవైపు పంపాల్సి వచ్చింది. అమెజాన్ అడవులల్లోకి రోడ్లు కూడా పడడంతో సులభంగా మైదాన ప్రాంతం వాళ్లు లోలోపలికి వెళ్లగలిగారు.

ఎగుమతుల కోసం పండించే పంటలకు ప్రోత్సాహకాలు, అటవీ ప్రాంతంలో నివాసాలు, వ్యవసాయ క్షేత్రాల కోసం కూడా ప్రపంచ బ్యాంకు సహకారం ఉంది. ఇటువంటి అభివృద్ధి ప్రణాళికలే బొలీవియా, మొజాంబిక్, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాల్లో కూడా రచించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి పేద దేశాలను అభివృద్ధి వైపు నడిపించే ఘనమైన లక్ష్యాలు ప్రకటించే ప్రపంచ బ్యాంకు మొదట భారీ రోడ్ల ప్రాజెక్టుతో బయలుదేరుతుంది. సులభంగా ముడిసరుకులు తరలించేందుకు మార్గాలనేర్పరచుకుంటుంది. తమ పరిశ్రమలకు విద్యుత్తు, నీటి సౌకర్యం కోసం పెద్ద పెద్ద డ్యాములు కట్టించుకుంటుంది. తిరిగి తానే సాయం చేస్తున్నట్లు భ్రమింపజేస్తుంది. ఇది ఎప్పటి నుండో నడుస్తున్న పాత కథే. ఈ బలిసిన బహుళజాతి సంస్థలే పర్యావరణ పరిరక్షణ కోసం కూడా సాయం చేస్తామంటాయి. పెద్ద పెద్ద మైనింగ్ సంస్థలు, ప్లాంటేషన్ల దగ్గరి నుండి భూమి, భుక్తి కరువై నిలువనీడ లేక అడవుల్లోకి వలసపోయి సాగు చేసుకుంటున్న పేద రైతుల దాకా అందరూ అడవినే ఆధారం చేసుకున్నారు. అడవిలో పెట్టుబడి కార్చిచ్చు ఎప్పుడో పడింది. అది దశాబ్దాలుగా పర్యావరణాన్ని దహిస్తూనే ఉంది. కానీ మంటల పాపం రైతులు మోస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఆదివాసీలు అత్యంత దారుణమైన దోపిడికి గురవుతున్నారు. సుమారు పది లక్షల మంది ఆదివాసులు ఎప్పటి నుండో ఈ అడవుల్లో ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా వీరి ఉనికి అడవికి, పర్యావరణానికి ఎన్నడూ హాని చేయదు. పైగా అడవులను పరిరక్షించేది కూడా ఆదివాసులే. 

సాధారణంగా ఆదివాసుల పోడు వ్యవసాయం ఎలా ఉంటుందంటే ఒకసారి నరికిన అడవి పునరుద్ధరణ చెందే కాలం కన్నా వేగంగా వాళ్లు అడవిని కొట్టివేయరు. ప్రకృతి సహజ పునరుత్పత్తి క్రమానికి, వీరి ఉత్పత్తి క్రమానికి సుమారుగా వైరుధ్యం ఉండదు. దీనికి విరుద్ధంగా విశాలమైన అటవీ ప్రాంతాలను ధ్వంసం చేసే భారీ ప్రాజెక్టులకు, మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా అమేజాన్ ఆదివాసులు పోరాడుతున్నారు. వీరి ప్రాచీన ఉత్పత్తి విధానం ప్రకృతితో స్నేహపూరితంగా ఉంటుంది కానీ, భారీ లాభాలనాశించే వ్యవసాయ పరిశ్రమ అవసరాలకు అది తగనిది. కాబట్టి పెట్టుబడిదారీ విధానం ఆదివాసీ ప్రాంతాల్లోకి మైదాన ప్రాంతాల వాళ్లను తరలించి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని అమలుజరుపుతుంది. ఫలితంగా ఆదివాసీ సమాజం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అడవి తగలబడుతుంటే నిస్సహాయంగా పరుగులు తీసిన వన్యప్రాణుల అవస్థా, వీరి అవస్థా ఒకటే.

ప్రపంచానికి మా దేశపు అడవులే ఎందుకు ఊపిరినందించాలి అని బొల్సొనారో వితండవాదం చేస్తుండొచ్చు. తమకు అవసరమైన దానికన్నా ఎక్కువ అడవే ఉందని, కానీ వ్యవసాయానికి అవసరమైన భూమి కొరత ఉందని, అయినా గ్లోబల్ వార్మింగ్ వంటి ట్రాష్ మాట్లాడుతూ తమ అభివృద్ధికి అడ్డంపడే హక్కు ఎవరికీ లేదని అతను నోరు పారేసుకోవచ్చు. కానీ ఈ తరహా అభివృద్ధి విధానం, అభివృద్ధి వాదన ఎవరు ప్రవేశపెట్టారు? పర్యావరణ పరిరక్షణ గురించి యూరప్ మాకు పాఠాలు నేర్పుతుందా అని అతను అడగడంలో అసలే లాజిక్ లేదంటామా? అమేజాన్ తగలబడడానికి బ్రెజిల్ రైతులు కారణమా? అటవీ చట్టాలు అమలు చేయని ప్రపంచ పెట్టుబడి సేవకుడైన అధ్యక్షుడు కారణమా? ఆ ఒక్కడిని విలన్ను చేసి తప్పించుకుంటున్న సామ్రాజ్యవాదుల మాటేమిటి? ప్రపంచవ్యాప్తంగా దేశాలను తమ అదుపాజ్ఞల్లో పెట్టుకొని, పర్యావరణ చట్టాలను బలహీనపరిచి తమ పెట్టుబడులకు ప్రోత్సాహకాలిమ్మని ఒత్తిడి చేస్తున్న సామ్రాజ్యవాదులు అడవిని కాపాడ్డానికి సహాయం చేస్తామని అంటున్నాయి. ఎంత విచిత్రం కదూ! 

(వీక్షణం అక్టోబర్ 2019)

 

ప్రకృతి విధ్వంసక ఇ.ఐ.ఎ. 2020

లాక్ డౌన్ సమయంలో బహిరంగ కార్యకలాపాలన్నీ రద్దయిపోయాయి. సమావేశాలన్నీ ఆన్లైన్ మాధ్యమానికి పరిమితమైపోయాయి. అన్ని రకాలుగా చీకటి ఆవరించిన స్థి...