కొట్టాల గ్రామానికి పోయినప్పుడల్లా కర్ర ఊతంతో అడుగులో అడుగేసుకొని మెల్లగా నడుచుకుంటూ అందరూ కూడే చెట్టు కిందికి వచ్చేవాడు. నోట మాట స్పష్టంగా రాదు. భార్య మునెమ్మ తప్ప అతనికెవరూ లేరు. ఇద్దరూ ఒకరికొకరు అన్నట్టుగా ఉండేవారు. ఎన్నడో ముపై ఏండ్లనాడు ఆ ఊరికి వచ్చినారంట. ఓపికున్నన్నాళ్ళూ కూలి పనులు చేసేవాళ్ళు. వయసు మళ్లింది. యురేనియం వచ్చింది. ఇద్దరికీ గడ్డలు (ట్యూమర్లు) వచ్చాయి. మునెమ్మకు వీపు మీద. నాగప్పకు మెడ మీద వెనకభాగంలో. నవ్వ (దురద) పెడ్తాది మ్మా గీరుకునేకి చెయ్యందదు అనేది మునెమ్మ. ఆమె ఎంత సహజంగా చెప్పేదో వినేవాళ్ళకు అంత దుఖం కలిగేది. ముసలాయనకు బాధ చెప్పుకోనీకి నోరు కూడా లేదు. వచ్చినోల్లకల్లా దండం పెడతాడు. దయగల మనిషెవరో వాళ్లకు ఉండడానికి ఖాళీగా ఉండే పాడుబడిన గది ఇచ్చాడు. ఊర్లో ఎవరో ఒకరు అన్నం పెడతారు. నాగాప్పకు మాత్రమే నెలకు రెండు వేలు పెన్షన్ వచ్చేది. ఇద్దరు మనుషులు, బట్టలు బాగా మాసిపోయి జాలికే జాలిగోల్పేలా ఉండేవాళ్ళు.
నిన్న మధ్యాహ్నం చెట్టు దగ్గరికి మునెమ్మ ఒక్కతే వచ్చింది. నాగప్ప విషయం తెలుసుకొని వాళ్ళ ఇంటికి పొతే మంచానికే పరిమితమై రేపో మాపో అన్నట్టు ఉన్నాడు. ఆస్పత్రికి రానన్నాడట. వద్దన్నా శక్తి కూడదీసుకొని లేచి కూర్చున్నాడు. రెండు చేతులూ జోడించాడు. అస్పష్టంగా ఎదో గొణుగుతూ ఏడ్చాడు. మందుల ఖర్చుకని మాలో ఒకరు కొంత డబ్బు ఇచ్చారు. ఇప్పుడది చావు ఖర్చుకు పనికొస్తుందేమో. ఇప్పుడు మునెమ్మకు ఎవరూ లేరు. నిజానికి అతనున్నా ఏమీ చేయలేడు. ఆమెకూ అతని బాగోగులు చూసుకునే శక్తి లేదు. కట్టె పట్టుకున్న ఇంకో కట్టెలా ఉంటుంది మునెమ్మ. వంగిన ఎముకల గూడుపైన తోలు కప్పినట్లు ఉంటుంది. పోయినసారి ప్రజాసంఘాల పర్యటనలో రామాసుందరి ‘ఇద్దరిలో ఆమే తొందరగా పోతుంది. ఆయనకు ఇంక ఎవరూ ఉండర’ని బాధపడింది. చావు నాగప్పనే వరించింది. జయశ్రీ అన్నట్లు జాలీ, దయా లేని ప్రభుత్వాల కన్నా చావే గొప్పది- అతనికి రోగాల నుండి, బాధ నుండి విమిక్తినిచ్చింది. మున్నెమ్మవ్వకు ఇప్పుడు మానసికంగా కూడా ఎవరూ లేరు. ఇక ఆమె కూడా తనకు తొందరగా విముక్తి ప్రసాదించమని మృత్యుదేవతను వేడుకుంటూ ఉంటుంది.
పెద్ద వయసు కదా, చావు సహజమే అని ఎవరైనా అనొచ్చు. నిజమే. కానీ యురేనియం ఆ చావును భయానకంగా మార్చింది. ఎవరిమీదైనా విపరీతంగా కోపమొస్తే ‘పురుగులు పడి చస్తాడు’ అని తిట్టుకుంటుంటారు. ఇప్పుడు తుమ్మలపల్లె గ్రామాల ప్రజలు వాళ్లకు ఈ స్థితిని కల్పించిన ఆ రాజకీయ కుటుంబాన్ని శపిస్తున్నట్లుగా. ఎవరికీ హాని చేయని, తమ బతుకేదో తాము బతుకుతూ పూటకింత ముద్ద తప్ప ఏమీ ఆశించని ఆ ముసలి దంపతులకు దాపురించిన నరకం ఎవరి పాపం? శ్రీశ్రీ ‘ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రి గాలి పశ్నించిందని’ రాసినట్లు ఇప్పుడు కొట్టాల గ్రామం అడుగుతోంది. భూమయ్యగారి పల్లె, మబ్బుచింతల పల్లె, కనంపల్లె అడుగుతున్నాయి. తమ పంటలు నిలువునా కుళ్ళి కాలిపోడానికి, చూస్తుండగానే తమ పశువులు దయ్యాల్లా భయంకరంగా మారిపోయి చచ్చిపోడానికి, తమ శరీరం పుండ్లు పడిపోడానికి, ఒంట్లో సత్తువపోయి, నొప్పులు పుట్టి గడ్డలు తేలడానికి కారకులెవరని అడుగుతున్నారు. ఇంగ్లీషు మీడియం పెట్టి ఉద్దరిస్తానంటున్న జగన్మోహనరెడ్డికి మా బాధలు వినపడవెందుకని.
ఇక్కడ పెట్టినట్లుగా మా
ప్రాంతంలో కూడా యురేనియం ప్లాంటు పెడదామంటున్నారు. మీరేమంటారు అని పాలమూరు అధ్యయన
వేదిక వాళ్ళు అడిగితే ‘వద్దనే వద్దయ్యా... మా సావు ఎవరికీ రావొద్దు’ అన్నారు.
19 నవంబర్ 2019

No comments:
Post a Comment