Friday, July 2, 2010

పర్యావరణ సంక్షోభానికి కారకులెవరు?


కోపెన్ హాగన్ లో మార్కెట్ ప్రయోజనాలకు పర్యావరణాన్ని బలిపెట్టాక, ఎప్పటినుంచో భారత పార్లమెంటులో న్యూక్లియార్ బిల్లు పొంచి ఉన్నాక, భోపాల్ దురాగతంపై పాతికేళ్ళుగా నడుస్తున్న అమానవీయ వ్యవహారానికి క్లైమాక్స్ గా జూన్ 7న వెలువడిన తీర్పు ఆశ్చర్యపరచదు గాని రోజురోజుకూ చులకనవుతున్న ప్రజల ప్రాణాల విలువ బాధపెడుతుంది. పెట్టుబడి ముదిరితే సామ్రాజ్యవాదమూ, యుద్ధమూ దాని అనివార్య అంతర్గత లక్షణాలవుతాయని 20వ శతాబ్దంలోనూ, 21వ శతాబ్ది మొదట్లోనూ ఎన్నోసార్లు నిరూపితమైంది. ఇప్పటి సోషలిస్టులకు వీటితోపాటు పర్యావరణ సంక్షోభం జోడించి చెప్పవలసి వస్తోంది.

పారిశ్రామిక పూర్వయుగం నుండి ఇప్పటికి వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయనీ, మన భూగోళం సంక్షోభం దిశగా పోతోందనీ శాస్త్రవేత్తలు ఎప్పటినుండో హెచ్చరిస్తున్నా ముప్పై ఏళ్ళ వరకు దీనికంత ప్రాముఖ్యత లేదు. ఉష్ణోగ్రతల్లో విపరీత మార్పులు, గతి తప్పుతున్న రుతువులు, పెరిగిపోతున్న కరువులు, వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరిత్యాలు ఇప్పుడు ఆందోళన పెడుతున్నాయి. రెండు డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ వేడెక్కితే (పారిశ్రామిక పూర్వకాలం నుండి) ప్రకృతి సహజ క్రియలు విచ్ఛిన్నమవుతాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూతాపంతో ఇప్పటికే ధృవప్రాంతాల మంచు గణనీయంగా కరిగిపోతోందని, తీరప్రాంతాలను, దీవులను ముంచెత్తబోతోందని గణాంకాలు చెబుతున్నాయి. (ఇప్పటికే సముద్రమట్టం 7 మీటర్లు వరకు పెరిగింది.) అతివృష్టి, అనావృష్టివల్ల ప్రపంచవ్యాప్తంగా పంట దిగుబడులు పడిపోతున్నాయి. కోట్లాది జనం నీటికొరతను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) అంచనా ప్రకారం ఏడాదికి ఒక లక్షా యాభై వేల మంది వాతావరణ మార్పులవల్ల సంభవించే విపత్తులకు చనిపోతున్నారు.

మనం పీల్చే గాలిలో, తాగేనీటిలో, తినే ఆహారంలో ఎన్నో కాలుష్య కారక విషపదార్థాలు చేరి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం వేస్తున్నాయి. కాని అంతకన్నా తీవ్రమైన పర్యావరణ సంక్షోభానికి దోహదం చేసేవి co2 (బొగ్గు పులుసు వాయువు), మీథేన్ వంటి హరిత గృహవాయువులు, సూర్యరశ్మి భూమిపై పడి ప్రతిఫలనం చెందేటప్పుడు ఈ హరిత గృహ వాయువులు దానిలోని ఇన్ఫ్రారెడ్ కిరణాలను అడ్డుకొని భూ ఉపరితలంపై వాటిని పట్టి ఉంచుతాయి. దానివల్ల భూమి వేడెక్కుతుంది. అయితే ఇది జరగకపోతే భూమి 18 డిగ్రీల సెల్సియస్ చల్లగా ఉంటుంది. కాని హరిత గృహ వాయివులు ఎక్కువైతే భూమి అంతకంతకూ వేడెక్కుతుంది.  హరిత గృహ వాయువుల్లో ప్రధానమైన co2 శాతం అంతకంతకూ పెరుగుతోందని, ఆ పెరుగుదల ప్రతి ఇరవై సంవత్సరాలకు పది శాతం వరకు ఉంటోందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అడవుల విధ్వంసం, బొగ్గు, సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం వాతావరణంలోకి ఎక్కువ మొత్తంలో co2 విడుదలవడానికి ముఖ్య కారణాలు. పారిశ్రామిక విప్లవం తర్వాత co2 30 శాతం, మీథేన్ రెండు రెట్లు పెరిగాయి. ఈ పెరుగుదలలో సింహ భాగం అమెరికా వాటానే. ప్రపంచంలో 4శాతం జనాభా గల అమెరికా నాలుగో వంతు (1/4) co2 ని విడుదల చేస్తోంది. బ్రిటన్ ఎనిమిదో వంతు (1/8) co2 ని విడుదల చేస్తోంది. ఎవరి వాటా ఎంత అని లెక్కిస్తూ పోతే జీవన విధానమూ, పెట్టుబడిదారీ అభివృద్ధి ప్రకారంగానే లెక్కలు తేలుతాయి. ఇదెంత సరిగ్గా సరిపోతుందో అంతే సరిగ్గా కాలుష్యంలో అధిక వాటా ఇంధన వినియోగం నుండి వచ్చే వాయువులదైతే, అంతర్జాతీయ పెట్టుబడిలో అధిక వాటా ఇంధన వనరులదిగా ఉంది. కార్లు, పెట్రోలియం పరిశ్రమలది మొత్తం ప్రపంచ పెట్టుబడిలో మూడింట రెండో వంతు (2/3). ఇవి ఒక దేశ అభివృద్ధి నమూనాను, జీవన విధానాన్ని ఎట్లా నిర్దేశిస్తాయో ఒక చిన్న ఉదాహరణ. 1940లో అమెరికా రవాణా కాంట్రాక్ట్ తీసుకున్న జనరల్ మోటార్స్ (స్టాండర్డ్ ఆయిల్ , ఫైర్ స్టోన్ కంపెనీలతో కలిసి) 45 నగరాల్లో రైల్వేలైన్లను, బస్సు, ట్రాము సౌకర్యాలను ధ్వంసం చేసింది. ప్రజల్ని సొంత వాహనాలు కొనుగోలు చేసేలా చేసి మోటారు వాహనాల, పెట్రోలియం ఇంధనాల మార్కెట్ ను పెంచుకునే ధ్వంస రచన అది. 1974లో దీనిపై చర్చ జరిపిన అమెరికా సెనేట్ జనరల్ మోటార్స్ కు ఐదు వేల డాలర్ల జరిమానా విధించింది !

భారతదేశంలో పరిశ్రమల కోసమే, మార్కెట్ల కోసమే చేస్తున్న అభివృద్ధి రచన మరింత విస్తృతార్థంలో రోజురోజుకీ స్పష్టమవితూనే ఉంది. అది సెజ్ లు (ప్రత్యేక ఆర్థిక మండలాలు), ఎం.ఒ.యుల  (పరస్పర వాణిజ్య అంగీకార ఒప్పందాలు) కింద విస్తారమైన పంటపొలాలూ, అడవులూ, సముద్రాలూ అన్నిటినీ బడా కంపెనీల అధీనం చేస్తోంది.

లాభాల మార్కెట్టును విస్తరించడమే ఏకైక లక్ష్యమైన పెట్టుబడికి ప్రజలను, ప్రకృతిని చివరకంటా దోపిడీ చేయడంలోనే మనుగడ. శ్రమ దోపిడి అదనపు విలువ లెక్కకందుతుందేమో గాని ప్రకృతి వనరుల దోపిడి ఏ బ్యాలెన్స్ షీట్ కు అందితింది? ఏ నియంత్రణ లేని అసహజ, అపరిమిత పెట్టుబడి అంతకంతకూ రెట్టింపవుతూ పోయే క్రమంలో అంతే మొత్తంలో ప్రకృతి వనరులు నాశనమవడంతోపాటు ప్రమాదకర వ్యర్థాలు పర్యావరణంలోకి విడుదలవుతాయి. అవి మరింతగా ప్రకృతిని నశింపజేస్తాయి. ఇక్కడ మళ్ళీ ప్రజల సంపదనూ, ఆరోగ్యాన్నీ కొల్లగొడతాయి. హైదరాబాద్ పటాన్ చెరు పరిసర పంటభూములనూ, ప్రజల ఆరోగ్యాన్నీ నాశనం చేసిన ఫార్మాకంపెనీలు ఒక చిన్న ఉదాహరణ. అలాంటివి దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్నాయి.

ప్రపంచ పరిశ్రమ, దాని ఉత్పత్తులు ప్రతి 25 సంవత్సరాలకు రెట్టింపవుతోందని ఒక అంచెనా. అంటే వంద సంవత్సరాలకది 16 రెట్లు, రెండువందల సంవత్సరాలకు 250 రెట్లు పెరుగుతుంది. ఇంత మితిమీరిన ఉత్పత్తి వ్యవస్థలో ఎట్లా అంతర్గత సంక్షోభానికి హేతువవుతుందో అదే విధంగా అది పర్యావరణ సంక్షోభానికీ దారి తీస్తుంది. ప్రకృతి వైపరిత్యాలు లేని సరుకుల ఉత్పత్తి ఇప్పటికే సాధ్యమవడం లేదు. పెట్టుబడి తన గోతిని తనే తవ్వుకునే మాటేమోగాని తాను నివసిస్తున్న భూమిని మాత్రం మొత్తంగా వినాశనం వైపు తీసుకుపోతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పెరిగిన ఆయుధ పోటీ దాదాపు అన్ని దేశాలనూ చాతనైనంత విధ్వంసక పదార్థాన్ని అణ్వాయుధాల రూపంలో నిలువ చేసుకునేలా చేసింది. 1980ల నాటికే ప్రపంచం మొత్తాన్నీ యాభై సార్లు పేల్చి వేయగల ఆయుధ సంపత్తి తయారైపోయింది. (వాటిని తయారు చేసే క్రమంలో విడుదలయ్యే అణుధార్మిక వ్యర్థాలు అదనం.) మార్కెట్ కోసమే ఎంత అసంబద్దమైన సరుకులనైనా తయారు చేసి జనంలో కృత్రిమ అవసరాల్ని సృష్టించే వినియోగ సంస్కృతిని పెంచి పోషించే పట్టుబడే పర్యావరణాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఆధునిక మానవుని జీవన శైలిని ఎత్తి చూపుతుంది. పెరుగుతున్న అవసరాలంటూ ఇంకా ఇంకా ప్రకృతిని కొల్లగొడుతుంది. మన అకడమిక్ పర్యావరణ శాస్త్రం అంతటికీ మనిషిని బాధ్యునిగా చూపుతుంది. అందమైన ప్రకృతి మానవ ప్రమేయం వల్ల వికృతిగా మారుతోందని, మనిషి స్వార్థం, దురాశే దీనికి మూలమని తేల్చి చెబుతుంది. మన ప్రచార సాధనాలు ప్రపంచ పర్యావరణ దినం నాడు గ్లోబల్ వార్మింగ్ మీద గంభీరమైన వార్తా కథనాలు వినిపించి భూతాపాన్ని తగ్గించడానికి మీవంతు తోడ్పడండంటూ ఒక గంట పాటు విద్యుద్దీపాలు ఆర్పేసి, కొవ్వొత్తులు వెలిగించమని చెప్తాయి. లేదా వారితోపాటు పది కిలోమీటర్లు పరిగెత్తమంటాయి.

ప్రత్యామ్యాయ శక్తి వనరులను వినియోగంలోకి తేవడం అంటే పెట్టుబడికి సామ్యవాదం అన్నంత భయం. ప్రభుత్వాలు పైకెన్ని మాట్లాడినా ఆచరణలో ఇంధన పరిశ్రమకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి. క్యోటో వాతావరణ సదస్సులో ఇది నిరూపితమైంది. కోపెన్ హాగన్ కు వచ్చేసరికి మాట మాత్రంగానైనా అటువంటి హామీలకు, ఒప్పందాలకు అగ్రదేశాధినేతలు, వారికి తాబేదార్లైన ఇండియా లాంటి దేశాల ప్రతినిధులు సిద్ధపడలేదు. నిజానికి పర్యావరణ సమస్యలు కిక్కిరిసిన నగరాలున్న భారతదేశానికి పెద్ద సవాలు. రెండు దశాబ్దాలలో ఆర్థిక వృద్ధిరేటు రెండున్నర రెట్లు పెరిగిందని చేప్పుకుంటున్న మన దేశంలో పరుశ్రమల కాలుష్యం ఎనిమిదిరెట్లు, వాహన కాలుష్యం నాలుగు రెట్లు పెరిగింది. కాని కాలుష్య నియంత్రణకు చేపట్టిన చర్యలు చెప్పుకోదగ్గవేమీ లేవు. ఇప్పుడు హరిత గృహ వాయువుల విషయంలో అత్యంత కలుషిత దేశాలలో భారతదేశం ఐదవది. భారతదేశ నగరాలు విడుదల చేసే వ్యర్థాలు 80 శాతం వరకు నదుల్లోకి చేరుతున్నాయంటే కనీస పారిశుద్ధ్యంలో మన దేశం ఎంత అద్ధ్వన్నంగా ఉందో అర్థమవుతోంది. మన దేశంలో యుద్ధాల్లో కంటే ఎక్కువ జనం కలుషిత నీటివల్ల చనిపోతున్నారని ఇటీవలి సర్వేలు చెప్తున్నాయి. వీటికి తోడు రసాయన ఎరువులు, పురుగు మందులపై ఎటువంటి నియంత్రణ లేకపోవడంవల్ల మన ఆహారంలోనూ, నీటిలోనూ నిరాటంకంగా చేరిపోయి అట్టడుగు స్థాయిలో ఉన్న దేశ ప్రజల ఆరోగ్యం మరింతగా దిగజారి దేశం రోగగ్రస్తం అయిపోతోంది. నగరం మధ్యన న్యూక్లియర్ కాంప్లెక్సులు, పారిశ్రమిక కేంద్రాలు బహుశా భారతదేశంలోనే ఉంటాయేమో. భోపాల్ గ్యాసు ప్రమాదానికి కారణమైన యూనియన్ కార్బైడ్ కర్మాగారాల వంటివి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దేశవ్యాప్తంగా ఉన్నాయి.

ఉత్పత్తిని, ఆర్థిక వృధ్ధిరేటును పెంచగల శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కాలుష్యాన్ని అరికట్టలేక కాదు. కర్బన ఉద్గారాల్ని తగ్గించే పరికరాలు అందుబాటులో ఉన్నా పరిశ్రమలు ఆ అదనపు ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉండవు. కాలుష్య రహిత ప్రత్యామ్యాయ శక్తి వనరులను మార్కెట్ శక్తులు ఎదగనివ్వవు. ఎందుకంటే సూర్యరశ్మి, గాలి వంటివి పెట్రోల్ లాగా సరుకు కాలేవు కాబట్టి. సూర్యరశ్మిని గ్రహించడానికి ఫోటో వోల్టాయిక్ సెల్ అవసరమైన చోట ఒక సారి ఏర్పాటు చేస్తే అంతటితో అయిపోతుంది. గాలి మరలు కూడా అట్లాంటివే. ఇప్పటికవి ఉత్పత్తి చేసే విద్ద్యుత్తు చాలా తక్కువ శాతం ఉన్నా పోను పోను సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. పెట్రోల్ రవాణా కోసం ఇంధన దేశాల్ని లొంగదీసుకొని కొన్ని వేల కిలోమీటర్ల పొడవు పైప్ లైన్లు వేసుకుని, సముద్రాల్ని, వాతావరణాన్ని కలుషితం చేసే అసంబద్ధ పరిశ్రమలు నిజానికి అవసరం లేదు. ఈ విధ్వంసక ఉత్పత్తి విధానాన్ని సరిచేయకపోతే వినాశనం పొంచి ఉంది. కాని పర్యావరణాన్ని పరిరక్షించే విధానాలు ఏవైనా సామ్రాజ్యవాద మార్కెట్లో మనగలగలేవు.

పెట్టుబడి వ్యతిరేక, వర్గదృష్టి లేని పర్యావరణ వాదానికి లెక్కలేనన్ని పరిమితులుంటాయి. దానికి పర్యావరణం, ప్రజారోగ్యం, ప్రజాధనంతో ముడిపడిన దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టి ఉన్నప్పటికీ, అది కోపెన్ హాగన్ వంటి చోట్ల వీగిపోతుంది. లేదా దీర్ఘకాలిక కార్యాచరణగా బలహీన పడుతుంది. ఆచరణలో పర్యావరణ వాదం ఆదర్శంగానే మిగిలి పోతుంది. ఉదాహరణకు సేంద్రీయ వ్యవసాయం అట్లాంటి ఒక ఆదర్శం. ఇప్పటి భౌగోళిక పరిస్థితుల్లో అధిక శాతం రైతులకది సాధ్యం కాదు. పెట్టుబడి దాని మార్కెట్ చట్రంలో సకల ఉత్పత్తి విధానాలను బిగించి వేస్తుంది. ఇక్కడ మనిషికి, ప్రకృతికి ఉండాల్సిన సజీవ సంబంధం తెగిపోతుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాల్లో సామాజిక సంపద నుండి వ్యక్తిగత ఆస్తి వేరుపడిపోవడంతో పాటు మనిషికి, ప్రకృతికి ఉండాల్సిన సజీవ సంబంధం ప్రకృతి వనరుల మీద యాజమాన్యమైపోతుంది.

ఉత్పత్తి విధానంలో మార్పు కోసం ఉత్పత్తి సంబంధాల్లో మార్పుతోపాటు ప్రకృతికి మనిషికి మధ్య ఘర్షణను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అయితే 20వ శతాబ్ది సోషలిస్టు ప్రయోగాల్లో ముఖ్యంగా సోవియట్ యూనియన్ లో పారిశ్రామిక ప్రగతి అప్పటి పెట్టుబడిదారీ దేశాల కంటే భిన్నంగా ఉన్న ప్రకృతి వనరుల మీద యాజమాన్యం రాజ్యం వహించిందనిపింస్తుంది. అప్పటి రాజకీయావసరాల్లో పర్యావరణం అప్రధానమై పోయిందనుకునే దానికంటే ఇప్పటిలా అదంత గంభీరమైన ప్రశ్నల్ని లేవనెత్తలేదు.

అయితే మనం ఆక్రమణదారులుగా వ్యవహరించినప్పుడల్లా ప్రకృతి మనల్ని హెచ్చరిస్తుంది. మునుపటి కంటే ఇప్పుడు శాస్త్రసాంకేతికాభివృధ్ధి వాతావరణ మార్పుల్ని ముందే ఊహించగలుగుతోంది. ఏమైనా మానవ శ్రమకు మూలం, ప్రయోగాలకు కేంద్రం ప్రకృతేనన్నది మర్చిపోకూడదు. ఎంగెల్స్ అన్నట్లు మనం రక్తమాంసాలతో, బుద్ధితో ప్రకృతి జీవులం. ప్రకృతి ఒడిలో నివసిస్తున్నం. ప్రకృతిపై మన పట్టు అంతా మిగతా జీవులన్నింటికంటే మెరుగ్గా ప్రకృతి సూత్రాలను మనం అర్థం చేసుకోవడంలో వాటిని సరిగ్గా అన్వయించుకోవడంలో ఉంది.  

(వీక్షణం -జులై 2010)

No comments:

Post a Comment

ప్రకృతి విధ్వంసక ఇ.ఐ.ఎ. 2020

లాక్ డౌన్ సమయంలో బహిరంగ కార్యకలాపాలన్నీ రద్దయిపోయాయి. సమావేశాలన్నీ ఆన్లైన్ మాధ్యమానికి పరిమితమైపోయాయి. అన్ని రకాలుగా చీకటి ఆవరించిన స్థి...