జీవనానికి మూలం వైవిధ్యం. వైవిధ్యం లేని ఏ వ్యవస్థా జీవంతో ఉండదు. ఈ వైవిధ్యం మధ్య అధ్భుతమైన జీవన బంధం ఆవరణ వ్యవస్థలను పట్టి ఉంచుతుంది. భూమి అనే ఆవరణ వ్యవస్థలో సుమారు కోటి రకాల ప్రాణులు ప్రకృతితో పేగుముడేసుకొని ఉంటున్నాయి, మనిషితో సహా. అదే సమయంలో ఈ అన్ని జీవరాశులకూ మధ్య కనిపించని పేగుబంధం అల్లుకుపోయి ఉంటుంది. ప్రకృతిలో ఏజీవీ ఏజీవితో సంబంధం లేకుండా ఉండదు. కంటికి కనిపించని సూక్ష్మప్రాణులు మొదలు మహావృక్షాలు, ఏనుగులు, తిమింగలాల వరకు అన్నీ బంధువులే. మానవ సమాజాన్ని ఉత్పత్తి సంబంధాలు ముడివేసినట్లు సకల ప్రాణులకూ మధ్య ఆహారోత్పత్తి సంబంధాలు ఉంటాయి. ప్రకృతి నుండి ప్రకృతిలోకి నిరంతరం ప్రవహించే మూలకాలు, వాటికి వాహికలుగా జీవరాశులు, వాటి మధ్య ఇచ్చి పుచ్చుకునే పదార్ధాల పరమార్థాలు మనిషి అన్వేషణకు మూల బిందువులు. మట్టి నుండి మట్టిలోకి అని అలవోకగా అంటుంటాం. మాంసకృతులు, పిండి పదార్థాలు వగైరా వగైరాలతో నిర్మాణమైన దేహాలన్నీ మట్టిలో కలిసి అతిచిన్న మూలకాలుగా శిధిలమై శకలమై మళ్ళీ అవే మూలకాలు ఆహార పదార్థాలై, రక్తమాంసాలై నడయాడటం ప్రకృతిలోని పదార్థాలన్నీ నిత్యం చలిస్తూ, మారుతూ, మార్చుతూ ఉండటం - వీటన్నిటీ మూలం వైవిధ్యమే.
ఈ వైవిధ్యంలో ఒకటైన మనిషి ప్రకృతిలో ఒక భాగమే. జీవవైవిధ్యం గురించి మాట్లాడబోయో ముందు మనిషా- ప్రకృతా, ప్రకృతిలో భాగమైన మనిషా అన్న ప్రశ్న వేసుకోవాలి. ప్రకృతిలో భాగమైన మనిషే కానీ ఇతర భాగాల వంటి భాగం కాదు. ఇతర భాగాలకన్నా ప్రకృతిని చాలా ఎక్కువగా ప్రభావితం చేయగలిగే స్థాయిలో మనిషి ఉండటమే మానవ చారిత్రక వికాసక్రమానికి మూలం. ప్రకృతిని నుండి ఎంతెంతగా ఉత్పత్తి పెంచుతూ పోయాడో అంతంతగా మానవ సమాజం వివిధ దశల గుండా పరిణామం చెందింది. శాస్త్ర జ్ఞానం ఉన్నతంగా అభివృద్ధి చెందిన క్రమంలో సరుకుల ఉత్పత్తి గురించే కాదు, ప్రకృతి శక్తులను అర్థం చేసుకునే జ్ఞానమూ వృద్ధి చెందుతూ వచ్చింది. శాస్త్రసాంకేతిక ఉత్పత్తుల మంచి చెడ్డలు బేరీజు వేసుకునే జ్ఞానం మునుపటికన్నా పెరుగుతూ వస్తోంది. అయితే మితిమీరిన సరుకుల ఉత్పత్తి సృష్టిస్తున్న విధ్వంసానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ఎక్కడా కనపడటం లేదు. జీవావరణం మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న విధ్వంస ఉత్పత్తి విధానం గురించి ఏ మాత్రం ప్రశ్నించవీలులేని రాజకీయ వాతావరణంలోనే అన్ని పర్యావరణ సదస్సులు, జీవవైవిధ్య సదస్సులు జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలుగా పిలవబడుతున్న సామ్ర్యాజ్యవాద దేశాలు పీల్చివేస్తున్న మూడో ప్రపంచ దేశాల మూలుగుల నుండి ప్రశ్నించే లక్షలాది గొంతుకలపై ఆంక్షలు విధిస్తూనే జరుగుతున్నాయి.
అటువంటి ఒక జీవవైవిధ్యసదస్సు ఈసారి మన ప్రాంతానికొస్తోంది. వస్తున్న సమయంలో వేడెక్కిన రాజకీయ వాతావణం ఉంది. అది వెయ్యి కిలోమీటర్ల పొడవు సముద్రతీర ప్రాంతంలోని అద్భుతమైన జీవివైవిధ్యాన్ని ధ్వంసం చేస్తున్న కోస్టల్ కారిడార్‌ను ప్రశ్నిస్తోంది. జీవరాశిని చంపి, ప్రకృతిని మసిబార్చే విద్యుత్ కేంద్రాలను వేలం వెర్రిగా స్థాపిస్తున్న ఉన్మాదాన్ని ప్రశ్నిస్తోంది. కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టే దుర్మార్గాన్ని ప్రశ్నిస్తోంది. వేల ఎకరాల్లో అడవిని, లక్షలాది ప్రాణికోటిని, వందలాది గ్రామాలను మంచివేస్తున్న పోలవరాలను ప్రశ్నిస్తోంది. అడవిని, ఆదివాసుల్ని, పర్యావరణాన్ని తవ్విపడేసే, మసిచేసే వందలాది బహుళజాతి మైనింగ్ పెట్టుబడులను నిలువరిస్తున్న విప్లవ ప్రజానీకంపై లక్షలాది సైన్యంతో ప్రభుత్వం మారణకాండ సృష్టిస్తోంటే దండకారణ్యం యుద్ధమే చేస్తోంది. మనిషితో పాటు సకల జీవరాశులకూ జీవించే హక్కు ఉందనే సున్నితమైన విషయాలను చర్చించేందుకు వేదికలేర్పాటు చేస్తున్న పెద్దమనుషులు మా వనరుల నుండి, మా భూముల నుండి మమ్మల్ని పరాయీకరిస్తున్నారని, మా నేలమీద మాకు ఆత్మగౌరవంతో బతికే హక్కులేకుండా చేస్తున్నారని కోటి గొంతుకల తెలంగాణ నిలదిస్తోంది. మనుషుల జీవనంలో వైవిధ్యాన్ని, సంస్కృతిలో వైవిధ్యాన్ని గౌరవించలేని వివక్షను వీరు దశాబ్దాలుగా ప్రశ్నిస్తున్నారు. లక్షలాది ఎకరాల్లో వనరుల దోపిడిని, విషాన్ని పంచుతూ మనుషుల్ని బతికున్న శవాలుగా మారుస్తున్న ప్రకృతి విధ్వంసాన్ని గురించి అడుగుతున్నారు. ప్రభుత్వం వీటికి సమాధానం చెప్పదు. వందలాది ప్రజలు నిలువునా కాలిపోయినా స్పందించదు. 193 దేశాల ప్రతినిధులు, పది వేలమంది డెలిగేట్లతో ప్రభుత్వం నిర్వహిస్తున్న జీవవైవిధ్య జాతర దేశానికి గర్వకారణమంటుంది. మీ గోలంతా పక్కన పెట్టి ఈ బహ్మాండమైన జాతరకు సహకరించమంటుంది.
ఈ జాతరతో ప్రజలకు సంబంధం ఏమిటి? ఇక్కడ ఏం చేస్తారు? మహాఅయితే జీవవైవిధ్యానికి కలుగుతున్న ముప్పుగురించి ప్రకృతి శాస్త్రవేత్తలంతా చర్చిస్తారు. ఎన్ని జాతులంతరించిపోయాయో, ఎన్ని అంతరించబోయే ప్రమాదంలో ఉన్నాయో లెక్కలుకగతారు. ఏట్లోవేసినా ఎంచి వేయాలన్నట్లు ఏదైనా లెక్కల ప్రకారం జరగాలి కదా. ఇంకా జీవవైవిధ్యాన్ని పరిరక్షించే చర్యల గురించి ప్రతిపాదనలు చేయవచ్చు. ప్రణాళికలు వేయవచ్చు. వాటిలో హైదరాబాదు వంటి చోట్ల ఓ పదిపదిహేను ఎకరాల్లో బయోడైవర్సిటీ మ్యూజియంలు ఏర్పాటు చేయాలని తీర్మానాలు చేయవచ్చు. పులుల సంరక్షణ కోసం పార్కులు ఏర్పాటు చేయడానికి మనుషుల్ని తరిమేయవచ్చు. రానున్న పది, ఇరవై, ముప్పై ఏళ్ళలో ఎంత తక్కువగా ప్రకృతిని నాశనం చేసి సరుకుల ఉత్పత్తిని, అభివృద్ధిని నిరాఘాటంగ కొనసాగింవచ్చని ఆలోచనలు పడవచ్చు. ఇందులో చాలా జాగ్రత్తగా వ్యవసాయంలో జీవవైవిధ్యం క్షీణించడం, అది జన్యుమార్పిడి ఉత్పత్తుల వంటి బహుళజాతి కంపెనీల సరుకుల వల్ల జీవవైవిధ్యం కింద పేలడానికి సిద్ధంగా టైంబాంబు టిక్కుబిక్కుమంటోందన్న విషయాన్ని , ఇంకా ఇటువంటి అనేక విషయాల్ని మాత్రం పక్కన పెడతారు. ప్రకృతి సంపదను ముడిసరుకుగా, జీవరాశుల్ని జూపార్కులో పదర్శన అంశాలుగా మాత్రమే చూడగలిగే సామ్రాజ్యవాద మార్కెట్ శక్తులు ఈ ఇరవై రోజులూ నగరమంతా స్పాన్సరర్ల హోర్డింగులతో, సరుకుల్ని ప్రమోట్ చేసుకునే అడ్వటైజ్ మెంట్లతో నింపివేసి భారతదేశంలో పెట్టుబడుల విస్తరణ అవకాశాలను బేరీజు వేసుకుంటాయి. మన దళారీ పాలకులు అతిరథ మహరధుల రాకకోసం, రోడ్లన్నీ శుభ్రం చేసి వారి వాహన రాకపోకల కోసం దారి పొడవునా ఇప్పటికే వందలాది చెట్లు నరికేశారు. అదే సమయంలో తెలంగాణ ప్రజల నిరసనను అడ్డుకునేందకు వేలాది పోలీసుబలగాల్ని దింపుతున్నారు.
మరోపక్క ఇదే పాలకుల విధ్వంస అభివృద్ధి బుల్డోజరును అడ్డుకుంటూ మధ్యభారత ఆదివాసులు యుద్ధం మధ్యనే సామ్రాజ్యవాద మార్కెట్ అభివృద్ధి నమూనాకు ప్రత్యామ్నాయాన్ని రచిస్తున్నారు. చావుబతుకుల వ్యవసాయం కాదు మా సమిష్టి వ్యవసాయాన్ని చూసిపొండని మనసున్న మనుషుల్ని ఆహ్వానిస్తున్నారు. జీవవైవిధ్యానికి, మానవజీవిత సారానికి సరైన అర్థం చెబుతున్నారు. నిజంగా వైవిధ్యాన్ని అర్థం చేసుకుని కాపాడుతున్నదీ, వైరుధ్యాల్ని పరిష్కరించే ఉద్యమం చేస్తున్నదీ వారే.
(అక్టోబర్ 4 (?) 2012 న ఆంధ్రజ్యోతి ప్రచురించిన వ్యాసం ఒరిజినల్ వర్షన్)

No comments:
Post a Comment