Sunday, June 28, 2020

విషవాయువుల గుప్పిట ఉత్తరాంధ్ర

 
మే 7 మధ్యరాత్రి దాటాక విశాఖ శివారులో గాలి ఆకస్మికంగా బరువెక్కింది. ఊపిరితిరక్క ఉలికిపడి లేచి చూస్తే మంచుగా అగుపించిన ఘాటైన రసాయనాల పొగ. వందలువందలుగా కుప్పకూలిపోతున్న జనం. 12 మరణాలు. కిక్కిరిసిన ఆసుపత్రులు. జీవం కోల్పోయిన పాడి, పంట. మసైపోయిన ప్రకృతి. లాక్ డౌన్ తర్వాత తెరుచుకున్న ఎల్.జి.పాలిమర్స్ హఠాత్తుగా అన్లాక్ చేసిన విషం గోపాలపట్నం పరిసరాలను నిర్జీవంగా మార్చివేసింది. నిలువ వుంచిన ట్యాంకు నుండి ఏకంగా 800 టన్నుల స్టెరిన్ గ్యాస్ గాలిలో కలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే మూడు వేల మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని తెలుస్తున్నది కాని నిజానికి దీనివల్ల విస్తృతమైన, దీర్ఘకాలిక ప్రభావాలుంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అవి ఎలా ఉండబోతున్నాయో ఇప్పటికి అంచనా లేదు. ఎందుకంటే ఈ అనుభవం కొత్తది కాబట్టి. అలా విశాఖ ప్రపంచానికి ఒక పరిశోధనా వస్తువైంది. 

ఇంతకూ స్టెరిన్ గ్యాస్ ఎలా లీకయ్యింది? ట్యాంకుకు అనుసంధానమైన రెఫ్రిజిరేషన్ యూనిట్లో సమస్య ఉందా? విరుగుడు రసాయనం ఎందుకు అందుబాటులో లేదు? గ్యాస్ లీకైనప్పుడు అలారం ఎందుకు ఇవ్వలేదు? అంచనాకు మించిన ప్రభావం కనపడుతున్నదంటే స్టైరితోపాటు ఇంకేమైనా రసాయనం కలిసిందా? సాంకేతిక ప్రశ్నలు ఎలాగూ ఉంటాయి. కానీ గుర్తించవలసింది ఏమిటంటే ఇది పైకి కనపడినట్లు హఠాత్తుగా వచ్చిపడ్డ విపత్తు కాదు. ఏ ఒకరిద్దరి నిర్లక్ష్యమో దీనికి కారణం కాదు. ఈ క్షణం కాకపోతే మరుక్షణం పేలవలసిన బాంబు అక్కడ ఎప్పటి నుండో సిద్ధంగా ఉంది. క్షణకాలంలో జరిగిపోయే ఆక్సిడెంట్స్ వెనక కూడా దీర్ఘకాలావధిలో కార్యాకారణ సంబంధాలుంటాయి.

స్టెరిన్ గ్యాస్ అనుభవం కొత్తది కానీ, మనకు పాతికేళ్ళనాటి మిథైల్ ఐసోసయనైడ్ (భోపాల్ గ్యాస్) దారుణ అనుభవం ఉంది. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ యజమాని దర్జాగా దేశం దాటడం, బాధితులు అలా శాపగ్రస్తుల్లా మిగిలిపోవడం ఇవన్నీ ఇండియాలో రానున్న పరిణామాలకు ఆనాటి సూచికలు. అయితే ప్రజల నుండి వడ్చిన ఒత్తిడి మూలంగా పాలకులు ఫ్యాక్టరీల చట్టం ఒకటి చేశారు. ప్రమాదకర పదార్థాలతోనూ, ప్రక్రియలతోనూ వ్యవహరించే పరిశ్రమలకు తప్పనిసరిగా పాటించాల్సిన విధివిధానాలను ఆ చట్టంలో పొందుపరిచారు. అటువంటి ఫ్యాక్టరీలలో ప్రమాదాలను నివారించడానికి పాటించాల్సిన భద్రతా ఏర్పాట్ల కోసం ఒక కమిటీ ఉండాలి. అందులో కార్మికులకు కొన్ని నిర్ణయాధికారాలు ఉండాలి. ఏదైనా జరిగితే తీసుకోవలసిన తక్షణ జాగ్రత్తల గురించి కార్మికులకు, చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అవగాహన కల్పించాలి. స్టెరీన్ వాయువు ప్రమాదకర రసాయనాల జాబితాలో లేదు. అయితే అలా గుర్తించబడిన రసాయనాల పరిశ్రమల్లో కూడా చట్టాలు అమలు కావు. రిస్క్ ఎదురుకుంటూ పనిచేస్తున్న కార్మకుల కోసం వారి పనిస్థలాల్లో పాటించాల్సిన ప్రమాణాలకు సంబంధించిన చట్టాలుకూడా ఉన్నాయి. అసలు పరిశ్రమల స్థాపనకు అనుమతుల విషయంలో చెప్పుకోదగ్గ పర్యావరణ చట్టాలున్నాయి. ఒక్క విశాఖపట్టణాన్నే తీసుకున్నా ఇవన్నీ కాగితాలకే పరిమితమని, అధికారులు ఆఫీసులకే పరిమితమని, ఇంకా చెప్పాలంటే క్రిమినల్ పెట్టుబడిదారులకే అనుకూలమని బల్లగుద్ది చెప్పొచ్చు.

ఎల్.జి.పాలిమర్స్ విషయంలో ఏం జరిగింది? అసలు దానికి పర్యావరణ అనుమతి లేదు. నాలుగేళ్ళ క్రితం ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, సాధారణ తనిఖీల సమయంలో అధికారికంగానే బైటపడింది. అయినా ఫ్యాక్టరీ విస్తరణకు కాలుష్య నియంత్రణ మండలి (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు - పిసిబి) నుండి అనుమతులొచ్చాయి. అన్నీ తెలిసిన పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నిద్ర నటించింది. అన్నిటికన్నా విచిత్రమేమిటంటే లాక్ డౌన్ తర్వాత ఈ ఫ్యాక్టరీ నడుపుకునే అనుమతి ఇవ్వడానికి ప్రాతిపదిక ఏమిటంటే అది తక్షణ ప్రజా అవసరాల కిందికి వస్తుందని! ఒక ప్లాస్టిక్ తయారీ పరిశ్రమ తక్షణ అవసరం ఎలా అయింది?

ఎల్.జి.పాలిమర్స్ నేర చరిత్ర, దానికి ప్రభుత్వాల ప్రత్యక్ష అండ ఈనాటిది కాదు. అసలు 1961లో హిందుస్తాన్ పాలిమర్స్ పేరుతో మొదట వచ్చిన కంపెనీ చేతులు మారుతూ వచ్చి 1997లో ఎల్.జి.పాలిమర్స్ పరమయ్యేనాటికే విలువైన ప్రభుత్వ భూములు ఒకరి తర్వాత ఒకరు కాజేసి లాభపడ్డారు. ఎల్.జి. వచ్చాక చుట్టుపక్కల భూముల్ని కూడా అది మింగేసింది. వారి భూదందాకు అన్ని ప్రభుత్వాలు సహకరిస్తూ వచ్చాయి. ఇదంతా ఇంకో కథ అవుతుంది గాని చుట్టుపక్కల జనావాసాలు విస్తరిస్తూ వచ్చాక కూడా ఫ్యాక్టరీ విస్తరణకు అనుమతులిచ్చి, అదీ నిబంధనలకు విరుద్దంగా ఎటువంటి పర్యావరణ ప్రభావ మదింపు చేయకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చి పిసిబి కూడా నేరంలో భాగస్వామి అయింది. ఎవరైతే కాలుష్య నియంత్రణకు ఫ్యాక్టరీలను నియంత్రించాలో వారే ఫ్యాక్టరీ యజమానులతో చేతులు కలపడం కొత్త విషయమైతే కాదు.

ఇటువంటివన్నీ అవినీతి, నిర్లక్ష్యం, నియమాల అతిక్రమణలుగా కనపడతాయి కానీ ఫ్యాక్టరీల విషయంలో ఇవి 'దేశ ఆర్థికాభివృద్ధి' కోసం, ‘ప్రజాప్రయోజనం' కోసం రాజీపడవలసిన విషయాలుగా మాట్లాడుతున్నారు. పెట్టుబడిదారులు ఏ ఇబ్బందులు లేకుండా సులువుగా కంపెనీలు నడపగలిగే వాతావరణం ప్రభుత్వమే కల్పించాలంటున్నారు. దీనినే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. అంటే పర్యావరణ అనుమతులు, కార్మికుల, ప్రజల భద్రత కోసం చేసిన ఫ్యాక్టరీ చట్టాలు సడలించాలని, అప్పుడే పెట్టుబడులను ఆకర్షించగలం అని ప్రభుత్వాలు ఏకంగా విధాన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చట్టాల అమలు గురించి మనం మాట్లాడితే, అసలు చట్టాలనే రద్దు చేసే నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి.

ఎల్.జి.ఘటన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి ముందుకొచ్చి అది చాలా ప్రతిష్టాత్మక కంపెనీ అని మాట్లాడాడు. మామూలుగా నష్టపరిహారం కంపెనీ నుండి రాబట్టాలి. కానీ కోటి రూపాయల పరిహారమిచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన ఉదారత చాటుకుంది. ప్రభుత్వం కితాబిచ్చిన ప్రతిష్టాత్మక కంపెనీ, నిజంగానే తన ప్రతిష్టతో అన్ని చట్టాలను ఉల్లంఘించి, లాభాలు దండుకొన్నది. ప్రజలు బలిపశువులై, అంతా బట్టబయలైన తర్వాత కూడా అది తన ప్రతిష్టతో దర్జాగా లోపల నిలువవున్న సరుకును దేశం దాటించి అమ్ముకుని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంది. స్టైరీన్, పెంటేన్ వంటి రసాయనాల స్టాకు కొరియాకు తరలించడానికి విశాఖ పోర్టు నుండి ప్రత్యేకంగా నౌకలను ఏర్పాటు చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహకారాన్ని అందించింది. ఆందోళన చేస్తున్న ప్రజలను ఈడ్చేసి, టెంటు పీకేసిన పోలీసులు కంపెనీ పెద్దమనుషులతో ప్రశాంతంగా చర్చలు జరిపారు. కంపెనీని సీజ్ చేయకుండా ప్రమాదం జరిగిన ఆధారాలను పూర్తిగా తుడిచేశారు. ఎక్కడా దాపరికం లేకుండా ఇదంతా బహిరంగంగా జరిగింది. ఇక యాజమాన్యాన్ని అరెస్టు చేయడమా? ఎంత దురాశ! కొసమెరుపేమిటంటే అంతా అయ్యాక హైకోర్టు ఫ్యాక్టరీని సీజ్ చెయ్యమని ఆదేశించింది.

ఇది ఎల్.జి. కథ మాత్రమే కాదు.

భోపాల్ విషాదం తర్వాత నేర్చుకున్న పాఠాలేమిటి? బహిరంగంగా కంపెనీలకు వస్తాసునివ్వడం, ప్రజల నోర్లు మూయించడం ఎలా అని. కనుక విశాఖ చుట్టూ ఉన్న సుమారు 80 పరిశ్రమలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎల్.జి. ఘటన సందర్భంగా గతంలో ఈ ప్రాంతంలో జరిగిన అనేక ప్రమాదాలు కూడా చర్చకు వచ్చాయి. 1997లో హెచ్.పి.సి.ఎల్. గ్యాస్ ట్యాంకులు పేలినప్పుడు 60 మంది చనిపోయారు. జనమంతా ప్రాణాలరచేతబట్టుకొని కొండలు, గుట్టలెక్కి పారిపోయారు. అదే కంపెనీలో మళ్ళీ నాలుగేళ్ళ క్రితమే కూలింగ్ టవర్ కూలిపోయి 38 మంది చనిపోయారు. 2012లో విశాఖ స్టీల్ ప్లాంట్ లో గ్యాస్ లీకై ట్యాంకర్ పేలిపోవడంతో 19మంది చనిపోయారు.

ఇక విశాక పరవాడ ఫ్మాసిటీ ప్రాంతం ప్రత్యక్ష నరకం. ఇక్కడ ప్రమాదాలు జరగడం రివాజు. గత ఏడేళ్ళలో 30 ప్రమాదాలు జరిగినట్లుగా పత్రికలు రాశాయి. నలభై మంది కార్మికులు మరణించగా, వందమందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ ఫార్మాసిటీలో ప్రస్తుతం 72 కంపెనీలు పనిచేస్తుండగా, మరో 25 ఫ్యాక్టరీలు నిర్మాణంలో ఉన్నాయి. ఫార్మాసిటీలో 2006 నుండి ఉత్పత్తి మొదలైంది. ఇక్కడి పరిసరాల్లో భరించలేని దుర్వాసన. భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మామూలైపోయాయి. ఫార్మాసిటీ నిర్మాణం కోసం మొదట 9 గ్రామాలు విస్థాపనకు గురైతే ఇప్పుడు మరికొన్ని గ్రామాల ప్రజలు తమను అక్కడి నుండి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది హృదయం ద్రవించే దయనీయ స్థితి. అవసరం తీరిపోయింది కనక అక్కడి ప్రజలను పట్టించుకునే అగత్యం కంపెనీలకుగాని, ప్రభుత్వానికిగాని లేదు. ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. ఈ ఫ్యాక్టరీలన్నిటిలో వెయ్యిమంది నిర్వాసితులకు మాత్రమే ఉపాధి దొరికింది. అభివృద్ధిలో స్థానిక ప్రజలను భాగస్వాములను చేస్తామని ప్రభుత్వ అంటూ ఉంటుంది. కానీ వాస్తవంగా అది బలిచేస్తుంది. ప్రజలను, ప్రకృతిని కూడా.

పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉండడం, కాస్త సంచలన వార్త అయినప్పుడు (ఎల్.జి. పాలిమర్స్ విశాఖ నగరానికి అతి సమీపంలో ఉంది కాబట్టి వార్త అయింది) హడావిడి చేయడం తప్ప అసలు సమస్య ఎక్కడుంది అన్న చర్చ జరగదు. ఒకవేళ జరిగినా ఇవన్నీ మానవ తప్పిదాలుగా నమోదవుతాయి. ఇలా నమోదు కావడం అంటేనే, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, ఏమీ చేయలేం అని చెప్పడం. చేసేదేమైనా ఉంటే సాంకేతిక కారణాలేవో వెలికితీసి ఒకరిద్దరు ఉద్యోగుల మీద తాత్కాలిక చర్యలు తీసుకొని, బాధితులకు పరిహారం ఇచ్చి సమస్యను మూసేస్తారు.

ఇక్కడ సమస్యను మూసేయడం అంటే ఫ్యాక్టరీ యజమానులకు కలిగిన అసౌకర్యాన్ని తొలగించడం తప్ప మరొకటి కాదు. నష్టపరిహారం ఏ అర్థంలో చూసినా అసలు నష్టపరిహారం కాదు. పోయిన ప్రాణాల గురించి, ప్రజారోగ్యం గురించే కాదు, పర్యావరణానికి కలిగిన నష్టం ఏ విధంగానూ పరిహరించలేదు. పోనీ ఇకనైనా మరింత నష్టం జరగకుండా చూడాలంటే ముందు సమస్యను గుర్తించి అంగీకరించాలి. సమస్య ప్రభుత్వ విధానాలలో ఉంది. కార్పొరేట్ పెట్టుబడి పేరాశలో ఉంది. దానిది ఎన్నటికీ తీరని లాభాల దాహం. భూగోళాన్నే దహించివేసే ఆకలి. ఈ అప్రతిహత దోపిడి కోసం పథకాలు రూపొందించి, ప్రభుత్వాల తమ చెప్పుచేతల్లో పెట్టుకొని వారిద్వారా విధానాలను అమలు చేస్తారు గనక ఇవి ప్రణాళికాబద్ద నేరాలు.

ఈ నేరాలే విశాఖ నగరంతో పాటు పరిసర ప్రాంతాలను అంతకంతకూ కాలుష్యకాసారం చేస్తున్నాయి. ఇప్పటికే పారిశ్రామిక కాలుష్యం సగటుకన్నా అనేక రెట్లు పెరిగిపోయింది. మితిమీరిన సంఖ్యలో పరిశ్రమల వుండడం ఒక సమస్య అయితే విశాఖ భౌగోళిక స్వరూపం వల్ల కూడా ఇక్కడ కాలుష్యం కేంద్రీకృతమవుతోంది. చుట్టూ మూడువైపులా కొండలు, ఒకవైపు బంగాళాఖాతంతో విశాఖ ఒక స్పూన్ ఆకారంలో ఉంటుంది. అందువల్ల ఇక్కడ వెలువడిన కాలుష్యం బైటికెళ్ళడానికి అవకాశం తక్కువ. ఫలితంగా వాయికాలుష్యం ఇక్కడి వాతావరణంపై మరింత ఎక్కువ ప్రభావం వేస్తోంది. విపరీతమైన ఉష్ణోగ్రతలు, తుఫాన్లు, అతివృష్టి రూపంలో ఇప్పటికే వాతావరణ మార్పు కనపడుతోంది. ఈ దీర్ఘకాలిక పర్యావరణ ప్రభావాలు కూడా కార్పొరేట్ నేరాల జాబితాలో వేయవలసిందే.

విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా ప్రభుత్వ విధానాలవల్ల ప్రమాదకర పరిశ్రమలెన్నో వచ్చాయి. మరెన్నో రాబోతున్నాయి. పైడిభీమవరం, చిలకపాలెం పరిసర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు స్థాపించారు. ఈ ప్రాంతాల్లోనూ అనేక ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాల నుండి కాపాడేపని మాది కాదంటూ పరోక్షంగా ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. అంతే కాదు. కంపెనీ యజమానులతో చేతులు కలిపాయి కూడా. 2012లో శ్రీకాకుళం నాగార్జున అగ్రిపరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు ప్రజలను ఇళ్ళు వదిలి పారిపొమ్మని స్వయంగా కలెక్టరే చెప్పాడట!

ఉత్తరాంధ్ర పరిశ్రమల్లో సుమారుగా అన్నీ ప్రత్యేక ఆర్థిక మండలాల్లో నెలకొల్పినవే. ముందు చెప్పిన 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన కేంద్రాలు కాబట్టి ఇక్కడ కంపెనీల యజమానులు సాధారణ నియమాలు కూడా పాటించక్కర్లేదు. కారుచవకగా కావలసినంత భూమి, ఎయిర్ పోర్టు, సముద్రతీరం, వీటితో పాటు వెనుకబాటుతనం వల్ల కారుచవకగా శ్రామికులు కూడా దొరుకుతారుగనక ఉత్తరాంధ్రలో పెట్టుబడిదారులు పాగావేస్తున్నారు. ప్రజా ఉద్యమాల వల్ల సోంపేట, కాకరాపల్లి వంటి ప్రాంతాల్లో థర్మల్ కేంద్రలు రాకుండా వెనక్కిపోయాయి గాని కొవ్వాడలో అత్యంత భారీ అణువిద్యుత్ కేంద్రం కోసం భూసేకరణ జరిగింది. ఇది ఒకరకంగా ఉత్తరాంధ్రను ఆటంబాంబు మీద కూర్చోబెడుతోంది.

ఉత్తరాంధ్ర తూర్పుకనుమల చెంత ఉంది. వనరులు పుష్కలం. భూములు బంగారం. వ్యవసాయానికే కాదు, మత్స్యసంపదకు కొరవలేని ప్రాంతం. కానీ పాలకులకు ఇక్కడి వనరులను సొమ్ముచేసుకోవడం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు. అద్భుతమైన జీవవైవిధ్యం, నదీ ప్రవాహాలు, పచ్చని ప్రకృతి, జీవసంపదతో అలరారే తూర్పు కనుమలు ఇప్పటికే చాలా విధ్వంసానికి గురయ్యాయి. అటవీ భూములు ఆక్రమణలపాలయ్యాయి. బాక్సైట్ తవ్వకాల కోసం నెత్తురెంతో పారించిన ప్రభుత్వాలు పట్టువదలని ప్రజా ఉద్యమాల ఫలితంగా వెనక్కితగ్గాయి కానీ అవకాశం కోసం చూస్తూనే వున్నాయి. ప్రభుత్వాలకు ప్రజల పట్ల, పర్యావరణం పట్ల ఎంత బాధ్యత ఉంటుందో ఉత్తరాంధ్ర ప్రాంతంలో విస్తరించిన రసాయన పరిశ్రమలు దేశంలోనే చెప్పుకోదగ్గ ఉదాహరణగా నిలిచాయి.

ఉత్తరాంధ్ర ఒకవైపు విషవాయివుల మధ్య చిక్కుకుంటోంది. అయితే మరో చివర నుండి ఈ చిక్కుముడిని ఛేదించే పోరాటం కూడా చేస్తోంది. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుని తూర్పు కనుమల జీవసమతుల్యాన్ని కాపాడిన సాయుధపోరాటం నుండి సోంపేట ఉద్యమం దాకా పర్యావరణ చట్టాలు, కోర్టులు చేయలేనిపని ప్రజలు ఎలా చేయగలరో చెప్పే అనుభవాలు దానికున్నాయి. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం మీద, ప్రభుత్వాల వివక్ష మీద చదువుకున్న మధ్యతరగతి ఇప్పుడు మాట్లాడుతోంది. అభివృద్ధి పేరుతో జీవావరణం పై జరుగుతున్న దోపిడిని ఆ చర్చల్లో భాగం చేయగలగాలి. రేపు రాజధాని పేరుతో జరగబోయే మరింత విధ్వంసం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రకృతిని కొల్లగొడితే దానిని ఎన్నటికీ వెనక్కి తెచ్చుకోలేం.

(అరుణతార, ఏప్రిల్ -జూన్ 2020)

 

No comments:

Post a Comment

ప్రకృతి విధ్వంసక ఇ.ఐ.ఎ. 2020

లాక్ డౌన్ సమయంలో బహిరంగ కార్యకలాపాలన్నీ రద్దయిపోయాయి. సమావేశాలన్నీ ఆన్లైన్ మాధ్యమానికి పరిమితమైపోయాయి. అన్ని రకాలుగా చీకటి ఆవరించిన స్థి...