నెల్లూరు పవర్ ప్రాజెక్టులకింద నష్టం నిజం, పరిహారం మిథ్య, అభివృద్ధి మాయ
కృష్ణపట్నం ఓడరేవు వస్తే నెల్లూరు రూపమే మారిపోతుందన్నప్పుడు గుడిసెల స్థానంలో మేడలు, మట్టి అంటని ఉద్యోగాలు, పిల్లలకు పెద్ద చదువులు, పూటపూటకూ వెతుక్కునే యాతన లేకుండా దేనికీ తక్కువ లేకుండా చేతినిండా డబ్బు వాళ్ళ కళ్ళముందు మెదిలి ఉంటాయి. పెదకాపు బేతాలయ్య మాటల్లో చెప్పాలంటే 'గొట్టాల కింద గులాబీలు పూయిస్తాం, మీకేం లోటు ఉండదు అన్నా'రట పోర్టువాళ్ళు. నెల్లూరు రూపు మారిపోవడం నిజమే. బహుషా రేపది అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతాల్లో ఒకటి కావచ్చు. కాని ప్రతిచోట జరిగినట్టుగానే స్థానిక ప్రజల కలలు విచ్చిన్నమైనాయి. కయ్యల్లో సవకవేసి అవి పెరిగి పెద్దవై అమ్మకానికొచ్చేదాక నీళ్ళు కట్టడానికో, ఎరువు పెట్టడానికో, పురుగుమందు వెయ్యడానికో కూడా తిరిగి చూసుకునే అవసరం లేని భూములు విషం కక్కే పవర్ ప్లాంటు వశమైపోయాయి. 'పొయ్యిమీద ఎసురు పెట్టి చేపల వేటకు పోయే'ంత నిశ్చింత భగ్నమైపోయింది. ఇచ్చిన నష్టపరిహారం కరిగిపోగా, చేసేందుకు పనుల్లేక, పోర్టులో, ప్లాంటులో వాళ్ళిచ్చే పనులు చేయలేక భారంగా పొద్దుదిగుతోంది. టైం పాస్ కు ఇసకలో యువకులు వాలీబబాల్ ఆడుతోన్నా, గుడిముందు ముసలివాళ్ళు కబుర్లాడుకుంటున్నా, ఆడవాళ్ళు గుంపులు గుంపులుగా కూర్చొని పూసలాటలు ఆడుకుంటున్నా రేపటిని ఎన్నో రోజులు వాయిదా వేయలేమని వాళ్ళకు తెలుసు. ఒక్కొక్కటిగా పవర్‌ప్లాంట్లు పూరైతే నాలుగు దిక్కుల నుండి అవి ఎగజిమ్మే కాలుష్యం నీడన ఎలా బతకాలన్నది వెన్నంటే సమస్య. అయినా 30 కిలోమీటర్ల పరిధిలో పాతిక దాకా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎలా అనుమతిస్తారని వాళ్ళు ప్రభుత్వాన్ని అడగడం లేదు. లక్షల సంవత్సరాల ప్రకృతి సంపదను, వేల ఏళ్ళ మానవ శ్రమ ఇంకిన నేల సారాన్ని వెల కట్టే అహంకారాన్ని, ధ్వంసం చేసే దుర్మార్గాన్ని ఎదుర్కోలేకపోయారు. మమ్మల్ని ఇక్కడి నుండి తరలించండి అని మాత్రమే అడుగుతున్నారు. మరో మాటలో పోరాడుతున్నారు. మెరుగైన నష్టపరిహారంతో మెరుగైన జీవితాన్ని ఆశించారు. డబ్బులెక్కల మాయాజాలం పెట్టుబడిదార్లకు తెలిసినంతగా వీళ్ళకు తెలిసే అవకాశం లేదు. డబ్బు - పెట్టుబడి - లాభం లెక్కలు అంత సులభంగా అంతుపట్టేవి కావని, అదొక పద్మవ్యూహం అని వాళ్ళకు ఇప్పుడు అర్థమై ఉంటుంది.
ఇక్కడ పర్యావరణం పట్ల వ్యక్తమవుతోన్న ఆందోళన ఉద్యమరూపం తీసుకోకపోయినా, లేదా కనీసం పాపులర్ కాకపోయినా ఈ విధ్వంసం దేశవిదేశాల పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేసిన ఒరిస్సా వేదాంత ప్రాజెక్టు కంటే ఎన్నోరెట్లు అధికమైనది. భోపాల్ విషవాయువు కన్నా ప్రమాదకరమైనది. నియమగిరి కొండల్లాగా, సోంపేట తంపర, బీల భూముల్లాగ ఇక్కడ కూడ అరుదైన ప్రకృతి సంపద ఉంది. సముద్రతీరపు వేలాది ఎకరాల ఇసుక భూముల్లో కేవలం మూడడుగుల్లోపల ఉబికివచ్చే మంచినీటి ఊటలు ప్రకృతి అద్భుతాల్లో ఒకటి. నేలటూరుపాలెం బాలయ్య మాటల్లో చెప్పాలంటే ఆ నీళ్ళు టెంకాయ పాల మాదిరి ఉంటాయి. ఇటువంటి స్ప్రింగ్ ఛానల్స్ ప్రపంచంలోనే అరుదైనవిగా చెప్తారు. ఈ నీటి ఊటల ద్వారా వచ్చే నీటిని కాలువల (సొన కాలువలు) ద్వారా చెరువుల్లోకి పారించి వ్యవసాయానికి ఉ పయోగిస్తారు. ఈ కాలువల కింద వేలాది ఎకరాల భూమిని సాగుచేస్తున్నారు. దాని కోసం మట్టి తోలుకున్నారు. వీటిల్లో వరి, వేరుశనగ, సవక, జీడిమామిడి, పుచ్చ, నువ్వు పంటలు పండిస్తారు. అక్కడ ఎడారిలాగా ఎటు చూసినా ఇసకే. కాని ఆ ఇసక వెంబడే అద్భుతమైన పచ్చదనం.
చిల్లకూరు మండల గ్రామాల గుండా పోతుంటే దారి పొడవునా రెండు వైపులా నీటి ఊటలు. పుస్తకాల్లో, ఇంటర్ నెట్లో తప్ప మనం చూడలేని ఎన్నో రంగుల పక్షులు. అద్భుతమైన జీవవైవిధ్యం మధ్యన ప్రకృతి స్నేహంతో మనిషులు పండించిన పైర్లు. ఏపుగా పెరిగిన సవక, జీడిమామిడి తోటలు, వేరుశనగ పంటలు. అది ప్రకృతి కాన్వాస్ పై నేలా నీరూ సముద్రం కేంద్రంగా మనిషి గీసిన అద్భత చిత్రం. ఆ నేల సారం వెల కట్టలేనిది. “సవక వేస్తే మేం తిరిగి చూడాల్సిన పని ఉండదు. భూసారాన్ని పీల్చుకొని అవే ఎదుగుతాయి. మందులూ, ఎరువులూ పనిలేదు. ఇక్కడ పండే విత్తనాలను, వరినారును ఇతర ప్రాంతాల రైతులొచ్చి తీసుకెళ్తారు” అని గతమైపోతున్న వైభవమైనా ఒకింత గర్వంగా చెప్తారు రైతులు. అయితే ఆ నేలలోని విలువైన ఖనిసంపదని పసిగట్టిన పెట్టుబడి సిలికా మైనింగ్ రూపంలో మొట్టమెదట వనరుల దోపిడి, పర్యావరణ విధ్వంసం మొదలు పెట్టింది. ఇప్పుడు అంతకంటే పెద్ద పెట్టుబడి మైనింగ్ భూములతోసహా సముద్రాన్ని, వాటిని ఆనుకొన్న అడవుల్ని, తీరప్రాంత గ్రామాల్ని పాతికవేల ఎకరాల సాగుభూమితో సహా దిగమింగుతోంది. సముద్రం లక్షలాది జీవరాసులకే కాదు, 137 గ్రామాల ప్రజలకు జీవనాధారం. జీవనాధారమైన సముద్రం ప్రకృతి ప్రకోపించినప్పుడు ఉప్పొంగి జీవితాల్ని ముంచేయకుండా మడ అడవులు కట్టడిచేస్తాయి. పోర్టు వచ్చాక చేపలు మత్స్యకారులకు దొరకలేనంత లోపలికి పారిపోయాయి. పోర్టు నుండి పవర్ ప్రాజెక్టులకు బొగ్గు తరలించడానికి కన్వేయర్ బెల్లు నిర్మించడానికి మడ అడవుల్ని కొట్టేశారు. రేపు పవర్ ప్రాజెక్టులన్నీ ఉత్పత్తి మొదలు పెడితే అవి సముద్రంలోకి విడుదల చేసే వేడినీరు, రసాయన వ్యర్థాలు, ఖనిజాలు సముద్రజీవాల్ని చంపేస్తాయి. బూడిదతో సహా రకరకాల కలుష్యకారక వాయువులు జీవరాశి ఉనికిని ప్రమాదంలోకి నెట్టేస్తాయి.
సమీప భవిష్యత్తులో దేశంలలోనే అత్యంత కలుషితమైన ప్రాంతంగా నెల్లూరు జిల్లా మారబోతోంది. ఎందుకంటే కృష్ణపట్నం ఓడరేవుకు 30 కిలోమీటర్లలోపు పరిసర ప్రాంతాల్లో రాబోతున్న పవర్ ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం 28 వేల మెగావ్యాట్ల పైగా ఉంటుంది. నిపుణుల అంచనా ప్రకారం వీటి కోసం రోజుకు 4లక్షల టన్నుల బొగ్గును మండించాల్సి ఉంటుంది. దీని వల్ల రోజుకు 15 లక్షల టన్నుల బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్), 1.75 లక్షల టన్నుల బూడిద, 2,700టన్నుల సల్ఫర్ వాతావరణంలోకి విడుదలౌతుంది. ఇవి కాక అణుధార్మిక పదార్థాలు, ఆర్సెనిక్, క్రోమియం, పాదరసం వంటి భారలోహాలు, 70 రకాల రసాయన పదార్థాలు వచ్చి చేరుతాయి. నేరుగా 137 తీర ప్రాంత గ్రామాలపై, పరోక్షంగా మొత్తం జిల్లా పై వీటి ప్రభావం ఉంటుంది. ఇప్పదాకా అయితే బొగ్గు ఆధరిత విద్యుత్ కేంద్రాలు విడుదల చేసే కాలుష్యం గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మ సంబంధిత వ్యాధులేకాక క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని, పంటలు గణనీయంగా దెబ్బతింటియని తేల్చిన పరాశోధనలు విడివిడి ధర్మల్ ప్రాజెక్టులపై చేసినవి. ఇటీవలి కాలంలో పారిశ్రామిక కేంద్రాలు ఏర్పాటు చేసి ఒకే చోట కర్మాగారాలు కట్టడం మార్కెట్ వేలంవెర్రిగా సాగుతోంది. వీటి దుష్పరిణామాలు చైనా వంటి దేశాల్లో బయటపడుతున్నాయి. ఇన్నేసి విద్యుత్ కేంద్రాలు ఒకేచోట ఉంటే ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోడానికి నెల్లూరు మంచి ప్రయోగశాల అవుతుంది. ఉ త్తర్ ప్రదేశ్ లోని మీర్జాపూర్, మధ్యప్రదేశ్ లోని సిద్ది ప్రాంతాంల్లోనూ ఎక్కువ విద్యుత్ కేంద్రాలు ఒకే చోట కేంద్రీకరించి ఉన్నా మొత్తం సామర్థ్యంలో నెల్లూరు పవర్ ప్రాజెక్ట్ కాంప్లెక్స్ దేశంలోనే అతి పెద్దది. కాలుష్య నియంత్రణ మండలి, ఇఐఏ రిపోర్టు (ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్-పర్యావరణంపై ప్రభావాన్ని అంచనా వేసే నివేదిక) ప్రజాభిప్రాయ సేకరణ అన్నీ అపహాస్యం పాలై పెట్టుబడి పట్ల నిబద్దతను చాటుకుంటున్నాయి. ఎవరెన్ని చెప్పినా, ప్రజలు వ్యతిరేకించినా పట్టించుకోకుండా ప్రభుత్వం వేలం వెర్రిగా అనుమతులు ఇవ్వడమే కాదు, కంపెనీలకు దళారి పాత్ర నిర్వర్తిస్తూ ప్రజల భూముల్ని వాటికి దోచిపెడుతోంది. అందుకవసరమైన చట్టాల రూపకల్పన చేసుకుంది.
పెరుగుతున్న విద్యుత్ అవసరాల నేపథ్యంలో, గ్రామీణాభివృద్ధి లక్ష్యాలను అందుకోడానికి, సబ్సిడీల భారం మోయలేని ఆర్థిక స్థితిలో ప్రభుత్వం విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిందని చెప్పుకున్న 2003 విద్యుత్ బిల్లు (ఎలెక్ట్రిసిటీ యాక్ట్) ప్రధానంగా ప్రైవేటు రంగంలో విద్యుదుత్పత్తిని ప్రోత్సహించడానికే వచ్చింది. అందుకు అనుగుణంగా ప్రైవేటు పెట్టుబడులకు నిబంధనలు సరళతరం చేశారు. అంతే కాదు ఒక్క ఎ.పి జెన్ కో తప్ప మిగతా పవర్ ప్రాజెక్టులన్నీ అవి ఉత్పత్తి చేసిన విద్యుత్తును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో పెట్టుబడిదారులకు వనరుల్ని కట్టాచేసి ఖనిజాల్ని అమ్ముకోవడం తర్వాత ఇంధన రంగం, పవర్ ప్రాజెక్టులు ఆకర్షణీయంగా కనపడ్డాయి. తమ చేతుల్లో ఆడే ప్రభుత్వాలే కాబట్టి దేశం నలుమూలలా ప్రకృతి సంపదను వశం చేసుకోవడం కష్టం కాదు, ప్రజాప్రతిఘటన ఎదురైతే తప్ప. ఈ ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణ, చట్టాలు సరే. అవన్నీ పక్కన పెట్టినా పొగలు గక్కే ఫ్యాక్టరీలు ఒక్కచోటే గుంపులు గుంపులుగా పెట్టడానికి ఫ్యాక్టరీల వాళ్ళకైనా, ప్రభుత్వానికైనా కనీస ఇంగిత జ్ఞానం లేకుండెనా అని సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. కాని పెట్టుబడికి అది ఉండదు. పెట్టుబడి రూపంలో సంపదను పోగుచేస్తూ విస్తరించడమే పరమావధిగా ఉండే పెట్టుబడిదారీ వ్యవస్థకు అది ఉండే అవకాశం లేదు. నెల్లూరు పారిశ్రామిక కేంద్రం మన రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి నెల్లూరు దాకా కోస్టల్ కారిడార్ పేరుతో స్వదేశీ, విదేశీ పెట్టుబడిదార్ల వశమవుతోన్న 972 కిలోమీటర్ల పొడవు, 3-5 కిలోమీటర్ల వెడెల్పు సముద్రతీర ప్రాంతంలో ఒక ముక్క మాత్రమే. కోస్టల్ కారిడార్ కూడ గుజరాత్ నుండి బెంగాల్ దాకా ఉన్న 8వేల కిలోమీటర్ల పొడవైన దక్షిణ భారత తీరప్రాంతంలో ఒక భాగమే. ఈ ప్రాంతమంతా మళ్ళీ అభివృద్ధి ప్రణాళికలో భాగం. తీరప్రాంతాలే కాదు ఖనిజ సంపదకు ఆలవాలమైన అడవులు, కొండలు కూడ అభివృద్ధి ప్రణాళికలో భాగం. ఇది సామ్రాజ్యవాదానికి, గుత్త పెట్టుబడికి దళారీగా వ్యవహరిస్తున్న భారతదేశ పాలకవర్గం ప్రవేశపెట్టిన అభివృద్ధి ప్రణళిక.
దీని వల్ల పాత ఉత్పత్తి విధానాలు నాశనమై ప్రజలు రోడ్డునపడుతున్నారు. వాళ్ళు కొత్త ఉత్పత్తి విధానంలో భాగం కాలేక, పాతది కాపాడుకోలేక ఘర్షణ పడుతున్నారు. కష్టమో నష్టమో కొంత కాలం పోర్టులో ఇనుపఖనిజం లారీలు వచ్చేటప్పుడు కూలిపనులకు పోయేవాళ్ళు. దాని వల్ల అనేక ఆరోగ్యసమస్యలొచ్చినా ఇంకోదారి లేక ఆ పనులే చేసేవాళ్ళు. తరతరాల జీవనాధారాన్ని కంపెనీలకు అర్పించేసినా వాళ్ళకు కనీసం ప్రత్యామ్యాయ జీవనోపాధి చూపలేదు. నెల్లూరు పవర్ ప్రాజెక్టుల్లో స్థానిక మత్స్యకారులకు గాని, రైతులకు గాని ఉపాధి దొరకలేదు. అక్కడ కూలి పనులు చేయలేక చాలా మంది పని మానుకున్నారు. అది వాళ్ళకు అలవాటులేని పని. పోర్టులో, పవర్ ప్రాజెక్టుల్లో ఉత్తరాది వారిని పనుల్లో పెట్టుకున్నారు. నష్టపరిహారంతో మరోచోట భూములు కొనుక్కోవడం అసాధ్యమైపోయింది.
ముందే చెప్పినట్లు నోట్లకట్టల నష్టపరిహారం ఒక మాయాజాలం. అదొక ఆకర్షణీయమైన వల. నిజానికి తరాలుగా సాగు చేసుకుంటున్న భూమికి వెల కట్టడంలో ఎంత శాస్త్రీయత ఉంటుంది? ముత్తకూరు, చిల్లకూరు మండలాల్లో మెట్టభూముల్ని తీసుకుంటే కనీసంగా వాటి మార్కెట్ విలువ 30-40వేలు. వాటికి నష్టపరిహారం మార్కెట్ ధరకు మూడు రెట్లు అధికంగా ఇచ్చారు. అయినా కూడ అది 5-6 ఏళ్ళ పంట దిగుబడికి సమానం. ఇదే మాట వరగలి గ్రామస్తులు చెప్పారు. మరి భూమి ఉంటే మీ పిల్లలకు కూడ ఆదరువు కదా, ఎలా ఇచ్చేశారు అని అడిగితే “లక్ష రూపాయలు ఎప్పుడు కళ్ళజూస్తామని ఇచ్చేశాం” అన్నారు. ఒక్కసారిగా కళ్ళకు కనపడే లక్ష రూపాయలు వాళ్ళ భూమి విలువను మసకబార్చిందనే అర్థం ఆ మాటల్లో ఉంది. డబ్బు వస్తుందనగానే సుఖప్రదమైన జీవితం తాలూకు అనేక ఆకర్షణలు.
పవర్ ప్రాజెక్టుల తరపున ప్రభుత్వం డబ్బు రూపంలో ఇచ్చిన నష్టపరిహారం భూయాజమాన్యాన్ని బట్టి, ఊరి స్థితిగతుల్ని బట్టి 40వేల నుండి 7లక్షలదాకా ఉంది. పట్టాలు లేని భూములకైతే రైతుల్ని నోరెత్తనివ్వకుండా దబాయించి అంతో ఇంతో డబ్బు చేతిలో పెట్టారు. పట్టాభూములైతే మార్కెట్ రేటుకు రెండు మూడు రెట్లు అధకంగా డబ్బు ఆశ చూపారు. ముత్తుకూరు మండలంలో ఎకరానికి 7లక్షలు అనే సరికి అమ్ముకోవడం మించి మరో ఆలోచన చేయలేకపోయారు. మరోవైపు ఊరి పెద్ద రైతులు ముందుగానే ఒప్పందం చేసుకొని వాళ్ళ కింద ఉన్న విశాలమైన సాగు భూమిని ఇచ్చేసి కోట్లు డబ్బు చేసుకున్నారు. ఏ రెడ్డికి ఎంత భూమి ఉండింది, వాళ్ళకెన్ని కోట్లు వచ్చింది అనే విషయం అన్ని గ్రామాల్లోని ప్రజలు నోటి లెక్కలు వేసి చెప్తారు. ఈ భూస్వాములకు భూములు సాగుచేసే అగత్యం లేదు. అప్పటికే వాళ్ళు పట్టణాల్లో వ్యాపారాలు చేసుకుంటూ భూముల్ని కౌలుకిచ్చుకున్నారు. నేలటూరులో రైతులు 12 లక్షలు డిమాండ్ చేశారు. ధర్నా కూడా చేశారు. అయితే 7లక్షలకు ఒప్పుకోకపోతే ప్ర్యాక్టరీ ఇంకచోట పెట్టుకుంటాం అన్నారట కంపెనీ వాళ్ళు. దాంతో దిగొచ్చారు. అంతేగాని భూములివ్వం అని ఎవరూ ప్రతిఘటించలేదు. రైతులకు నష్టపరిహారం అందేలోపే మార్కెట్లో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఒక ఎకరాకు వచ్చిన నష్టపరిహారంతో చుట్టుపక్కలెక్కడా సెంటు భూమి దొరకలేదు. పట్టణాలతో సంబంధాలు, డబ్బు లావాదేవీలలో అనుభవం ఉన్న భూస్వాములు మాత్రం రియలెస్టేట్ లో పెట్టుబడులు పెట్టి మరింత లాభపడ్డారు. దొరికిన చోటల్లా భూములు కొన్నారు. రైతులు మాత్రం రియలెస్టేట్ లో, షేర్ మార్కెట్లో పెట్టి ఉన్నది పోగొట్టుకున్నారు. భూమి ఉపయోగపు విలువ నుండి డబ్బు విలువగా మారాక అదిక వాళ్ళ చేతుల్లో లేకుండా పోయింది. దాంతో వ్యవహరించడం వీళ్లకు సాధ్యం కాలేదు. డబ్బు వల్ల మానసిక అశాంతి, కుటుంబ కలహాలు, అభద్రత. కొంత మంది పిచ్చివాళ్ళైపోయారు కూడా అని లెనిన్ ధనిశెట్టి చెప్పారు. ఈ మొత్తం విధ్వంసాన్ని కళ్ళకు కట్టిన సెజ్ కథలోనూ రాశారు.
పవర్ ప్రాజెక్టుల మధ్య ఉండలేరు కాబట్టి ఇప్పుడు ఊర్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చాక కోల్పోయిన భూమికి, వాళ్ళ ఊరికి, మొత్తంగా వాళ్ళ జీవితాలకు కంపెనీ ఎంత చవకగా వెల కట్టిందో ఆలోచిస్తున్నారు ప్రజలు. పల్లెవాని దిబ్బ గ్రామస్తులు ఇంటికి 50లక్షలు నష్టపరిహారం ఇచ్చి తమను తరలించాలని అడుగుతున్నారు. కాని ఫ్యాక్టరీ పని మొదలు పెడితే చచ్చినట్లు ఖళీ చేసి పోతారని కంపెనీవాళ్ళు గాని, ప్రభుత్వం గాని పలకడం లేదట. కంపెనీల లెక్కలన్నీ పెట్టిన పెట్టుబడి ఎంత తొందరగా వెనక్కొస్తుందనే. లాభాల లెక్కలేగాని ప్రజలకు, ప్రకృతికి కలిగే నష్టాలు లెక్కకట్టడం వాళ్ళకేం అవసరం?
ఇటువంటి అనుభవాలే అనేక చోట్ల పునరావృతమవుతుంటే ప్రభుత్వ హామీలను, పునరావాస ప్యాకేజీలను జనం నమ్మడం లేదు. ఏ నిర్మాణాలూ లేకున్నా కొన్ని చోట్ల ప్రజలు మిలిటెంట్ గా తిరగబడుతున్నారు. తీవ్రమైన అణచివేత ప్రయోగించినా పరిశ్రమల స్థాపన ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది. అభివృద్ధి పథకాన్ని వెనక్కి తీసుకోవడం ఇష్టం లేని ప్రభుత్వం, పెట్టుబడిదారీ మేధావులు, మీడియా ఒక విచిత్రమైన వాదనను ముందుకు తీసుకొస్తున్నాయి. అదే 'ప్రజల్ని అభివృద్ధిలో భాగం చేయడం'. అది కొన్ని చోట్ల మైనింగ్ లాభాలను ప్రజలకు పంచాలనే దాకా పోయింది. భూమిపై హక్కు నుండి వాళ్ళను తొలగించి వేశాక, ఆ భూమి వేరెవరి యాజమాన్యం కిందికో వెళ్ళిపోయాక ఆచరణలో ఇదెంత అసాధ్యమో తెలియంది కాదు. అయినప్పటికీ 'అభివృద్ధి' పరమమనే భావనను స్థాపించడానికి ఇలాంటి వాదనలు తెస్తుంటారు. “అభివృద్ధి అవసరమే. కాదని ఎవరూ అనరు. అయితే ఆ అభివృద్ధిలో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే ప్రజల మద్దతు పొందగలరు” ఇట్లా సాగుతుంది. స్థానిక ప్రజలను అభివృద్ధి చేయడం, స్థానిక ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేయడం - ఈ రెండూ వేరు వేరు అంశాలు. మొదటిది ప్రజలు నివశించే భౌగోళిక పరిస్థితుల్లో వారి జ్ఞానాన్ని అభివృద్ధి చేసి, జీవన విధానాన్ని, ఉత్పత్తి విధానాన్ని మెరుగు పరచొచ్చు. ఉ దాహరణకు నెల్లూరు జిల్లాలో సొన కాలువల ద్వారా ప్రజలు సమష్టిగా అభివృద్ధి చేసుకున్న వ్యవసాయం. పాత సమాజపు వ్యవసాయ విధానానికి ఇది ఒక గొప్ప అభివృద్ధి. ప్రభుత్వాలు నిజంగా అభివృద్ధి చేయాలంటే మరింత విస్తారమైన భూమిని సాగుయోగ్యం చేయొచ్చు. వైవిధ్యమైన పంటలు పండించడానికి ప్రోత్సాహమివ్వచ్చు. ఆ పంటలకు మార్కెట్ కల్పించవచ్చు. ఆ ప్రాంతాలకు విద్యా, వైద్య సదుపాయాలు కల్పించవచ్చు. కాని మొత్తం ప్రాంతాన్ని పరిశ్రమలకు ఇచ్చేస్తే అది అక్కడి జనానికి పూర్తిగా సంబంధం లేని ఉత్పత్తి విధానం కాబట్టి అందులో వాళ్ళు భాగస్వాములు కాలేరు. వాళ్ళ ఊరు పరాయిదైపోతుంది. నష్టపరిహారం కింద వాళ్ళకెంత డబ్బిచ్చినా నష్టమే మిగులుతుంది తప్ప పరిహారం ఉండదు.
ఈ కల్లోలం, విధ్వంసం అలా ఉంచితే మొత్తంగా అభివృద్ధి పథకాల వల్ల దేశంలో ఎంత మేరకు ఉత్పత్తి విధానాలు, ఉత్పత్తి సంబంధాలు మార్పుకు గురవుతున్నాయని అంచనా వేయడం దీర్ఘకాలిక ప్రజా ఉద్యమ నిర్మాణాలకు అవసరం. సెజ్ లు, పారిశ్రామిక కారిడార్లు వంటి విధానాలు పెద్దఎత్తున విస్థాపనకు దారి తీస్తున్న క్రమంలో వ్యవసాయం మీద ఆధరపడ్డ అధిక జనాభాపైన ఎటువంటి ప్రభావం ఉంటుంది? పాత సమాజాలు ఏ మార్పు దిశగా పోతున్నాయి? ఈ మార్పులో ప్రజలు ఏమి కాబోతున్నారు? వివిధ అభివృద్ధి పథకాల కింద నిర్వాసితులవుతున్న వాళ్ళు కొత్త ఉత్పత్తి సంబంధల్లోకి పోతున్నారా? కనీసం గత దశాబ్ద కాలంలో నిర్వాసితులవుతున్న వాళ్ళ గురించి పరిశోధన ఆసక్తికరంగా ఉ ంటుంది. మరో వైపు మన దేశంలో పారిశ్రామికీకరణ పేరుతో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పెట్టుబడిదారుల పోకడలు ఎక్కువగా లంపెన్ స్వభావం కలిగి ఉన్నట్లు చాలా సార్లు రుజువవుతోంది. పరిశ్రమల పేరు చెప్పి భూముల్ని కట్టా చేసి వనరుల్ని దోచుకుపోతూ ఉత్పత్తి ఏమీ లేకుండానే మార్కెట్ ను స్పెక్యులేట్ చేసి డబ్బు చేసుకునే వర్గం ఒకటి తయారయింది.
దానికి చాలా ఉదాహరణలు దొరుకుతాయి గాని ఇటీవల మీడియాలో బాగా ప్రచారమైన గాలి జనార్దనరెడ్డి ఉదంతం అందరికీ తెలిసిందే. గాలి జనార్దనరెడ్డికి 'బ్రాహ్మణి స్టీల్స్' కోసం కడపజిల్లా జమ్మలమడుగులో ప్రభుత్వం 10,700 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చింది. ఆ భూమిలో ఫ్యాక్టరీ రాలేదు కాని దాన్ని పెట్టుకొని ఇటు బ్యాంకు రుణం పొందడమేకాక అటు అనంతపురం జాల్లాలో ఓబులాపురం ఇనుపఖనిజం ఇష్టారాజ్యంగా అమ్ముకొని ఆయన ఎన్ని వేల కోట్లు సంపాదించాడో లెక్కలేదు. సెజ్ కోసం సేకరించిన వేల ఎకరాల్లో ఎన్ని పరిశ్రమలొచ్చాయి, వచ్చిన పరిశ్రమలకు వాస్తవంగా ఎంత స్థలం కావాలి, ఎంత మేరకు కంచెలు కట్టారు అని చూస్తే భూ దందా అర్థమవుతుంది. ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు పొంది భూముల్ని సేకరిస్తున్న పవర్ ప్రాజెక్టులను ఈ కోణం నుండి కూడ పరిశీలించడం అవసరమేమో.
వివిధ అభివృద్ధి పథకాల్లో నిర్వాసితుల సమస్యతోపాటు ప్రకృతి విధ్వంసం, వనరుల దోపిడి ఇటీవల ఎక్కవ చర్చకొస్తోంది. భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనల నుండి దండకారణ్య ప్రాంతంలో బహుళజాతి కంపెనీలతో ప్రభుత్వం చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు, గ్రీన్ హంట్, వివిధ ప్రాంతాల్లో కాలుష్యకారక పరిశ్రమల స్థాపనకు వ్యతిరేకంగా ముందుకొస్తున్న ఉద్యమాల వరకు పర్యావరణ పరిరక్షణ ప్రధాన వాదనగా వినిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణ సంస్థలు ప్రజా ఉద్యమాలకు మద్దతునిస్తున్నాయి, కొన్నిచోట్ల ముందుండి నడిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో అభివృద్ధి, ప్రజాప్రతిఘటన, పర్యావరణం వీటి మధ్య తార్కిక సంబంధం చర్చించుకోవాలి.
చిత్తడినేలల పరిరక్షణ కోసం సోంపేట, కాకరాపల్లి ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాడటం వెనక, నియంగిరి కొండల మీద ఆదివాసుల పోరాటం వెనక ప్రకృతి, మానవ సమాజం మధ్య ప్రాణప్రదమైన సంబంధం ఉంది. అక్కడ ప్రజల ఉనికికి మూలం ఆ సజీవ సంబంధమే. పర్యావరణ పరిరక్షణ దీర్ఘకాలిక మానవ మనుగడకు సంబంధించిన విషయంగా పర్యావరణవేత్తలు విశ్లేషిస్తుంటే అక్కడి ప్రజలకు అది తక్షణ జీవన్మరణ సమస్యగా ఉద్యమాలకు వారిని సమీకరిస్తోంది. దండకారణ్య ఆదివాసులు ఒక ప్రత్యామ్యాయ రాజకీయ నిర్మాణం కింద చేస్తున్న పోరాటం ఈ కోణాన్ని స్పష్టం చేస్తుంది. ఎదిరించడానికి ప్రజలకు నిర్మాణాలు లేని చోట్ల కూడ ప్రకృతి విధ్వంసం మొదట ప్రభావం చూపేది దానితో అరమరికలు లేని సంబంధాన్ని కొనసాగిస్తున్న ప్రజల పైనే. ఇప్పుడది ఎక్కువగా మత్స్యకారులపైన కనిపిస్తోంది. మూడేళ్ళ క్రితం మత్స్యకారులు దక్షిణ భారత సముద్ర తీర ప్రాంతమంతా సుదీర్ఘయాత్ర చేసి తమ సమస్యలను లోకానికి చాటే ప్రయత్నం చేశారు. ఈ యాత్ర గుజరాత్ నుండి కోల్కటా దాకా 2008 మే 1 నుండి జూన్ 27 వరకు జరిగింది. అద్భుతమైన జీవవైవిధ్యం ఉన్న 3200 తీర ప్రాంతగ్రామాలను, సముద్రాన్ని, మత్స్యసంపదను కాపాడే దిశగా ఉద్యమ నిర్మాణం ఎంతైనా అవసరం. తీర ప్రాంత భూముల్లో పండే ఆహార పంటలే కాదు, సముద్రం ద్వారా దేశ ప్రజలకు అందే విలువైన పోషకాహారాన్ని కోల్పోయే ప్రమాదం గురించి పర్యావరణవేత్తలు చేసే హెచ్చరిక కాదనలేని నిజం.
పర్యావరణం గురించి చర్చ వచ్చినప్పుడల్లా అభివృద్ధిని పోటీగా తీసుకురావడం మామూలే. అభివృద్ధి ఫలాలు అందుకుంటున్న మధ్యతరగతి కాస్త చిరాకును ప్రదర్శిస్తారు కూడ. అయినా ఈ మధ్య కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పులు, గ్లోబల్ వార్మింగ్ గురించి మీడియా, ఎన్జీవో సంస్థలు చేస్తున్న ప్రచారం సమస్యను గుర్తింపజేస్తున్నాయి. కాని అవి పెట్టుబడిదారీ వనరుల దోపిడిని చాకచక్యంగా మరుగుపరుస్తున్నాయి. అభివృద్ధిని, పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయాలని, అంతకు మించి మరో మార్గం లేదని ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఇదెలా ఉంటుందంటే పాతిక వేల ఎకరాల పంటపొలాల్ని థర్మల్ ప్లాంట్లకు ఇచ్చేసి పర్యావరణ పరిరక్షణ కోసం ప్యాక్టరీల చుట్టూ గ్రీన్ బెల్ట్ నిర్మించినట్టు. (నిజానికి వాళ్ళు ఇది కూడా చేయటం లేదు.) విచక్షణారహితంగా అడవుల్ని నరికేసి అంతరించిపోతున్న జీవరాశుల్ని తెచ్చి 'జూ'లలో, సంరక్షణాకేంద్రాల్లో ఉంచినట్టు.
పర్యావరణసంక్షోభంపై అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలలో పర్యావరణ సమతుల్యతతో కూడిన అభివృద్ధి గురించే చర్చలు జరుగుతాయి. సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉండేలా ప్రపంచ పర్యావరణ సదస్సులు నిర్దేశంపబడతాయి. 1992 రియో శిఖరాగ్ర సమావేశం భూవనరుల్ని సంరక్షించాలని తీర్మానిస్తూ పర్యావరణ సమతుల్యతతో కూడిన అభివృద్ధికి మద్దతు తెలిపింది. అసలు 'అభివృద్ధి అనే దాన్ని ఏ అర్థంలో వాడుతున్నారు? ఆర్థికాభివృద్ధి అనే మార్కెట్ అర్థంలోనే. అంటే ఆర్థికాభివృద్ధి నిలకడగా ఉంటూనే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలని. అన్ని ఆర్థిక కార్యకలాపాలకు వనరులు అవసరం. అన్నీ వ్యర్థాలను(కాలుష్యాన్ని) ఉత్పత్తి చేసేవే. మరి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఆర్థికాభివృద్ధిని వదులుకోవాలా అనే వైరుధ్యం వెంటనే వచ్చి పడుతుంది. ఇది ఎప్పటికీ పరిష్కారం కానిది. పైకెన్ని చట్టాలున్నా లాభాల్ని తగ్గించుకోవడం ఇష్టం లేని పెట్టుబడిదారులు కాలుష్య నియంత్రణ కోసం కనీస చర్యలు తీసుకోకపోవటం, ప్రభుత్వాలు వాటిని చూసీ చూడట్లు ఉండటం ప్రపంచమంతటా ఉంది. దేశాల మధ్య ఎక్కువ తక్కువ తేడాలతో. రియో సమావేశం నుండి క్యోటో(1997), కోపెహాగన్ (2010) సమావేశాలకంతా సంక్షోభనివారణ దిశగా స్పష్టమైన నిర్ణయం ఏదీ తీసుకోలేని అశక్తత బయటపడింది.
ఎందుకంటే అసలు సమస్య మార్కెట్ దృష్టికోణంలో ఉంది. మార్కెట్ కు ప్రకృతిని చూసే దృష్టికోణం దుర్మార్గంగా ఉంటుంది. దీన్ని ప్రముఖ మార్కిస్టు విశ్లేషకుడు జాన్ బెలామీ ఫాస్టర్ ఇలా వివరిస్తాడు. “మార్కెట్ అడవులను కలపగానే చూస్తుంది తప్ప దాన్ని సజీవమైన పర్యావరణ వ్యవస్థగా చూడదు. ఆ అడవిలోని వందల సంవత్సరాల వయసున్న చెట్లు వడ్డీ రేటుతో సమంగా పెరగవు. అటువంటి అనుత్పాదక సంపదలను త్వరగా కోతకోసి డబ్బు చేసుకోవాలి. ఆ స్థాసంలో పారిశ్రామిక స్థాయిలో ఒకటి రెండు దశాబ్దాలలో పెరిగి కలపనిచ్చే చెట్లను నాటి రసాయన ఎరువులతో వాటిని ముంచెత్తి పెంచాలి”.
పర్యావరణ విధ్వసం తాలూకూ ఏ గణాంకాలను చూసినా ఆర్థికాభివృద్ధికి సమాతరంగా ప్రకృతి విధ్వంసం కనపడుతుంది. ప్రపంచ జనాభాలో కేవలం 4శాతం జనాభా ఉన్న అమెరికా 25శాతం కాలుష్యాన్ని విడుదల చేస్తోంది. ప్రపంచీకరణ ఆర్థిక విధానాలొచ్చాక కాలుష్యకారక పరిశ్రమలు మూడో ప్రపంచ దేశాలకు వలస పోవడం ఊపందుకుంది. దీన్ని ప్రపంచ బ్యాంకు దుర్మార్గంగా సమర్థించడాన్ని 1992 ఫబ్రవరి 8 నాటి 'ఎకనమిస్ట్' పత్రిక బయట పెట్టింది. 1991 డిసెంబరు 12న ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త లారెన్స్ సమ్మర్స్ పంపిన నివేదికలోని కొంత భాగం అది ప్రచురించింది. దాని సారాంశం ఇది.
కాలుష్యం వల్ల నష్టం ఎంతనేది దానివల్ల కోల్పోయిన ఆదాయాన్ని బట్టి ఉంటుంది. పేద దేశాల్లో వేతనాలు తక్కువ కాబట్టి అనారోగ్యాల వల్ల, మరణాల వల్ల కోల్పోయే ఆదాయం కూడా తక్కువే. ధనిక దేశాల్లో వేతనాలు ఎక్కువ కాబట్టి కాలుష్యం వల్ల కల్పోయే ఆదాయం ఎక్కువ. మొత్తం మానవాళి ఆర్థిక విలువ ఎక్కువ నష్టపోకుండా ఉండాలంటే పేద దేశాల్లో కాలుష్యకారక పరిశ్రమలు పెట్టాలి. మరో విషయం ఎక్కువ ఆదాయ వెసులుబాటు ఉన్న దేశాల్లో పరిశుభ్రమైన పరిసరాలు, మంచి ఆరోగ్యం కోరుకోవడం, అందుకోసం కోసం వెచ్చించడం సహజం. ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చినా నయం చేయించుకొని బతికే అవకాశం ఉన్న దేశంలో క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ఏ కొంచెం పెంచే రసాయన పదార్థమైనా ఎక్కువ సంచలనం కలిగిస్తుంది. వెయ్యికి రెండొందల మంది అయిదేళ్ళ వయసు లోపలే చనిపోయే దేశంలో దాన్ని ఎవరూ పట్టించుకోరు.
ఇది సామ్రాజ్యవాదానికి మూడో ప్రపంచదేశాల ప్రజల పట్ల ఉన్న వైఖరి. ప్రస్తుతం పర్యావరణ కాలుష్యం వల్ల జరిగే నష్టాన్ని లెక్క కట్టే పద్ధతి ఇదేనంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. దీనికొక ఉదాహరణ ఇస్తాను. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దేశంలో మూడు బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు, ఒక గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం, ఒక జల ఆధారిత విద్యుత్ కేంద్రం పరిశోధనకు తీసుకొని వాటి వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలు, సామాజిక ఆర్థిక ప్రభావాలు అధ్యయనం చేసింది. ఆ నివేదిక ప్రకారం బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల వల్ల ప్రజల ఆరోగ్యానికైన ఖర్చు ఒక మెగావ్యాట్ విద్యుదుత్పత్తికి గాను 0.00013 నుండి 0.047 రూపాయలు. గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తికి ఒక మెగా వ్యాట్ కు 0.001 రూపాయలు. వ్యవసాయ రంగానికి జరిగిన నష్టం - బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తికి ఒక మెగావ్యాట కు 0.0002 నుండి 0.00084 రూపాయలు, గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తికి ఒక మెగావ్యాట్ కు 0.0000 రూపాయలు. మార్కెట్ విలువ ముందు అన్ని విలువలూ శూన్యమైపోతుంటే ఇక పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడ్డం హాస్యాస్పదమవుతుంది.
నిజానికి నష్టపరిహారాన్ని లెక్కకట్టే విధానంలోనూ ఇలాంటి జిమ్మిక్కులే ఉంటాయి. అది సాధ్యమైనంత సులభంగా, చవగ్గా ప్రజలనుండి భూములు లాక్కోవాలనే సూత్రం తప్ప వేరొకటి కాదు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో సొన కాలువల ద్వారా విస్తారంగా సాగుచేసుకుంటున్న భూమి విలువను లెక్కకట్టాలంటే ఇసుక నేలలను సాగుయోగ్యం చేయటానికి సుదూర ప్రాంతాల నుండి మట్టిని తరలించడానికి, నీటి ఊటల్ని అనుసంధానించి కాలువలు తవ్వడానికి తరతరాల రైతులు పడిన శ్రమను లెక్కకట్టాలి. అన్నింటి కంటే అక్కడ అరుదైన నీటి ఊటలు ఏర్పడటానికి లక్షల సంవత్సరాలు భూగోళంలో జరిగిన రాపిడిని ఎవరు లెక్కకడతారు. ఎందుకంటే కోల్పోయిన ప్రకృతి సంపదలను మళ్ళీ స్థాపించడం సాధ్యం కాదు. భూగర్భంలో, సముద్ర గర్భంలో ఖనిజాలైనా, సహజవాయువైనా, విశాలమైన ప్రకృతిలో ఏ వనరులనయినా పెట్టుబడిదారులు ఏ అధికారంతో, ఎవరికి ఏ మూల్యం చెల్లించి సొంతం చేసుకుంటున్నారు? కేవలం వాళ్ళు ప్రకృతిలో కోట్ల కొద్దీ జీవరాశుల్లో ఒకటైన మానవ జాతిలో అత్యల్ప సంఖ్యాకులు. ఈ అల్పసంఖ్యకులు అధిక సంఖ్యాకులపైన పెత్తనం చేస్తు వాళ్ళ అభివృద్ధిని దేశాభివృద్ధి అనో, వెనకబడిన దేశాల అభివృద్ధి అనో మభ్యపెడుతూ ప్రజల్ని, ప్రకృతిని దోపిడి చేస్తున్నారు. అంతే కాదు, మితిమీరిన సరుకుల ఉత్పత్తితో పర్యావరణంలోకి విషపూరిత వ్యర్థాలను విడుదల చేసి ప్రకృతిని మరెంతగానో నాశనం చేస్తున్నారు. ఈ ప్రకృతి సంపద మొత్తం మానవ జాతికి, వారి భవిష్యత్ తరాలకు, సకల జీవరాశులకు సంబంధించినది. ఈ సత్యాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ పక్కన పెడుతుంది. మొదట అది మనిషిని, ప్రకృతిని వేరు చేసి చూస్తుంది. మనిషి ప్రకృతిపై ఆధరపడటాన్ని గుర్తించ నిరాకరించి ప్రకృతిపై ఆధిపత్యం అనే వికృత సంస్కృతిని ప్రోత్సహిస్తుంది. అది ప్రకృతిని మనిషి సేవకోసం ఉన్న వస్తువుగా చూస్తుంది. అక్కడి నుండి ప్రకృతి వ్యక్తిగా ఆస్తిగా మారిపోతుంది. అది వ్యక్తిగత యాజమాన్యం కిందికి అంటే పెట్టుబడిదారీ యాజమాన్యం కిందికి వెళ్ళిపోతుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రకృతి ఏమవుతుందో మార్క్స్ ఇలా చెప్పాడు. “మెట్టమెదటి సారిగా మానవజాతి దృష్టిలో ప్రకృతి పూర్తిగా ఒక ఉపయోగ వస్తువుగా మారిపోతుంది. అది స్వయం ప్రతిపత్తిగల ఒక శక్తిగా గుర్తింపుకోల్పోతుంది. ప్రకృతి నియమాలపై పరిశోధనలు, సిద్ధాంతాల ఆవిష్కరణ కేవలం మానవావసరాలకు ప్రకృతిని వినియోగ వస్తువుగా, ఉత్పత్తి సాధనంగా పరిమితం చేసే ఒక కుయుక్తి అయిపోతుంది.”
ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థ ఉనికి లాభాలను పోగుచేయడం మీద ఆధారపడి ఉంటుంది. డబ్బు రూపంలో పెట్టుబడి సరుకుగా మారి, సరుకు లాభంతో కూడిన డబ్బు ఎక్కువ డబ్బు)గా మారాలి. ఇట్లా వచ్చిన ఎక్కువ డబ్బు మళ్ళీ సరుకుల్ని ఉత్పత్తి చేయాలి. ఇది మరింత డబ్బును సృష్టిస్తుంది. ఈ విధంగా పెట్టుబడి సంచయనం (accumulation of capital) వల్ల సరుకుల ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోతుంది. ఇక్కడ అసలు లక్ష్యం మానవావసరాల కోసం సరుకుల్ని ఉత్పత్తి చేయడం కాదు. లాభాలను పెంచుకుంటూ పోవడం. ఈ చక్రం ఆగిపోతే పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడలో ఉండదు. మితిమీరిన ఉత్పత్తి పర్యావరణం మీద వేసే ప్రభావాన్ని చర్చించడానికి పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు ఇష్టపడరు. పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నా వాటిని దాటవేయాలనే చూస్తారు.
కాని పర్యావరణ విధ్వంసం మానవ సమాజం పైన ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అది తక్షణ సమస్యలతో పాలు దీర్ఘకాలిక సమస్యలను ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వ ప్రణాళికల్లో ఆర్యోకరమైన పరిసరాలు, తాగునీరు వంటివి తప్పనిసరిగా ఉంటాయి. దీంతో పాటు పరిశ్రమల వల్ల విడుదలయ్యే వ్యర్థాలను సురక్షితంగా వదిలించుకోవడం, వనరుల(అడవులు, కొండలు, నదులు వగైరా) పరిరక్షణ లక్ష్యాలుగా ప్రత్యేక బోర్డులు, చట్టాలు ఉంటాయి. అయితే సంకుచిత దృష్టి ఉండే పెట్టుబడికి, వీటికి పొసగదు. పెట్టుబడిదారుడికి పెట్టిన పెట్టుబడి ఎంత తొందరగా వెనక్కొస్తుంది, లాభాలను ఎంత ఎక్కువగా, త్వరత్వరగా పిండుకోవాలి అనే ధ్యాస తప్ప వేరే ఉండదు. పర్యావరణ పరిరక్షణకు అత్యంత అవసరమైనది దీర్ఘకాలిక దృష్టి. మరింత స్పష్టంగా చెప్పాలంటే భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకోవడం. అది పెట్టుబడిదారీ దురాశకు, స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్లకు పొసగని వ్యవహారం.
పర్యావరణ దృష్టితో కూడిన ప్రత్యామ్యాయ ఉత్పత్తి విధానం సాధ్యమవ్వాలంటే పెట్టుబడి సంకెళ్ళ నుండి సమాజాన్ని విడుదల చేయాలి. మానవ సమాజం ప్రకృతిలో భాగమనే స్పృహ సాధారణ జ్ఞానంలో భాగం కావాలంటే ప్రకృతి వనరులపై వ్యక్తిగత యాజమాన్యం రద్దు కావాలి. ఉత్పత్తి సమాజపరమైనప్పుడు లాభాలకోసం కాక మానవావసరాల కోసమే ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి ఉంటుంది. ప్రకృతితో స్నేహపూర్వక సంబంధంలో ఉత్పత్తి, శాస్త్ర పరిశోధనలు జరిగే అవకాశం ఉంది.
ప్రకృతి శాస్త్రవేత్తలు పర్యావరణ సంక్షోభం గురించి మాట్లాడినా, వాళ్ళ ఆందోళనలో నిజాయితీ ఉన్నా వాళ్ళు సమస్య మూలాల్ని అర్థం చేసుకోలేరు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతోనో, నియంత్రణతో కూడిన వనరుల వినియోగం వల్లో సమస్య తీవ్రతను తగ్గించాలని చూస్తారు. పర్యావరణ సంక్షోభాన్ని ఉత్పత్తితో ముడిపడిన సామాజిక వ్యవహారంగా కాకుండా సాంకేతిక అంశంగా చూడడంలో వాళ్ళ పరిమితి ఉంది. ఆ పరిమితి ఉన్నా సామ్రాజ్యవాద వనరుల దోపిడీ వాస్తవ రూపంలో కళ్ళకు కడుతున్నప్పుడు, ప్రజలకు ప్రకృతికి అసలు శతృవులు పెట్టుబడిదార్లూ, వాళ్ళ దళారీలూ అన్న నిజం గుర్తించక తప్పని స్థితి వచ్చింది. కాబట్టి దేశ వ్యాప్తంగా సామ్రాజ్యవాద అభివృద్ధి పథకాలకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ప్రజా సమూహాలు, ప్రకృతి ప్రేమికులు ఉద్యమ నిర్మాణాల్లోకి రావల్సిన తరుణం వచ్చింది.
మన వనరుల్ని సామ్రాజ్యవాద శక్తుల పరంకాకుండా కాపాడుకోవాలి. అంతే ముఖ్యంగా మానవ నివాసాలను, చెరువులు, నదులు, కొండలు, గుట్టలను దేశీయ దోపిడిదార్ల నుండి రక్షించుకోవాలి. పరిశుభ్రమైన గాలి, నీరు, ఆరోగ్యకరమైన పరిసరాలు ప్రజల కనీస హక్కు వీటిని దోపిడి చేస్తున్న, ధ్వంసం చేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా కింది స్థాయి నుండి ఉద్యమాన్ని నిర్మించాల్సి ఉంది. పర్యావరణ ఉద్యమం సామాజిక ఉద్యమాల నుండి విడదీయరానిది.
11.05.2011
(అరుణతార జనవరి 2012)

No comments:
Post a Comment