ఉదయం నుండి నగరం గాఢ నిద్రలోకి కూరుకుపోయే దాకా సాగిన ఎడతెగని ప్రయాణం తాత్కాలిక మజిలీకి చేరుకుంది. జీపు కిటికీలోంచి ఆబగా చూసిన ప్రపంచం ఇక కనిపించదు. భారీ పరిమాణంలో ఉన్న నరక ద్వారాలు మమ్మల్ని మింగే సేలోగా చుట్టుముట్టిన ఖాకీ బలగాల సందుల్లోంచి చివరిసారిగా బైటికి చూశాను. రాత్రిని వెలిగించే విద్దుద్దీపకాంలో మెరిసిపోతున్న అంగళ్ళు. అర్థంకాని భాషలో వేలాడుతున్న బోర్డులు. అన్నీ మాయమై మా చుట్టూ ఆకాశాన్నంటే ఎత్తైన గోడలు మొలుచుకొచ్చి మాకాళ్ళూ, కళ్ళూ పరిమిత ప్రపంచంలోకి కుదించుకుపోయాయి. ఊహించిందా ఇది? బహుషా ఊహించి ఉండాల్సింది. మనుషులకోసం తపిస్తున్నప్పుడు, రేపటి కోసం కలలు కంటున్నప్పుడు ఇటువంటి దొకటి ఊహించి ఉండాల్సింది.
ఏ వైపరిత్యమో వచ్చినడ్డట్లు, సునామీ అలలు తెగిపడినట్లు వాళ్ళెట్లా వచ్చారు? బస్సులో జారగిలపడి రెండు రోజుల ప్రయాణానికి అలసిన శరీరాలు నిద్రకు తూగుతూ.. మరి కాసేపట్లో వల్లియూర్. అక్కడి నుండి కూడంకుళం. మనిషినీ, నేలనూ, సముద్రాన్ని సమస్త ప్రకృతిని ప్రేమించే మనుషులం కదా. సమస్తాన్నీ సరుకు కింద చుట్టేయాలని వాడు తెగబడుతుంటే కలత చెందీ, కోప్పడీ అన్యాయమని అరుస్తున్న వాళ్ళం కదా. తమ రెండు చేతులడ్డం పెట్టి నేలనూ, సముద్రాన్ని సమస్త భూగోళాన్ని మింగివేయాలపి వస్తున్న పెట్టుబడిని అడ్డుకుంటూ రక్తమోడుస్తూ, ప్రాణాలిస్తూ ఉన్న ప్రకృతి బిడ్డల్ని గురించి విన్నాక ఎలా ఆగగలం? అందుకే కూడంకుళం బయలుదేరాం. ఇదేమీ కొత్త కాదే! రాజ్యం గుప్పిట బిగించి కప్పెట్టిన నిజాన్ని వెలికితీయడానికి, మనిషిపై జరుగుతున్న యుద్ధాన్ని ప్రపంచానికి చాటాలని, తోటి మనుషులకు చెప్పాలని ఎన్ని సార్లు 'నిజ' నిర్ధారణకు వెళ్ళాం. బహుషా ఇక నిజాన్ని మాట్లాడటమే కాదు, నిజాన్ని తెలుసుకోవటమూ నేరమని ప్రకటిస్తాడేమో! అందుకే నిజనిర్థారణకు వెళ్తున్నాం అని మేం ప్రకటించి బయలుదేరాక రహస్యంగా వెంబడించాడు. బహిరంగంగా అడ్డుకున్నాడు. మేం ప్రయాణిస్తున్న బస్సాపి కాలర్ పట్టుకుని ఒక్కొక్కర్నీ కిందకి లాగి, చేతుల్లో, జేబుల్లో ఉన్న సెల్ ఫోన్లు లాగేసుకొని వంద మంది రక్షక భటులు మమ్మల్ని గద్దల్లా తన్నుకుపోయారు. ఇదంతా జరుగుతున్నప్పుడు మాతోటి ప్రయాణీకులు ఏమనుకున్నారో? మమ్మల్ని బందిపోట్లనుకున్నారో, తీవ్రవాదులనుకున్నారో?
పోలీసు స్టేషన్ కు తీసుకెళ్ళకుండా మమ్మల్ని కళ్యాణ మండపానికి ఎందుకు తీసుకొచ్చారో? అడిగిందే అడుగుతూ, వెతికిందే వెతుకుతూ ఫోటోలు, వీడియోలు తీస్తూ మీడియాను రానివ్వకుండా, మా కోసం వచ్చిన న్యాయవాదులును అడ్డుకొని ఏం చేయానుకున్నారో మెల్లమెల్లగా అర్థం కాసాగింది. వదిలేస్తాం, వదిలేస్తామని మెల్లమెల్లగా ఉచ్చు బిగిస్తున్నారు. మా చుట్టూ మోహరిస్తున్న పోలీసుల సంఖ్య పెరిగింది. మేం మాట్లాడుతున్న చట్టాలనూ, అన్యాయమని అరుస్తున్న అరుపులనూ కట్టడి చేస్తూ షట్టర్లు మూసుకున్నాయి. కళ్యాణమండపమంతా పోలీసులమయం. మీమీ ప్రాంతాలకు వెళ్ళిపోతామంటే వదిలేస్తాం అని చెప్పినప్పుడు చేయగలిగిందేమీ లేదని తెలిసి సరే అన్నాం. వదల్లేదు కానీ ఎక్కడి నుండో భోజనం తెచ్చి పెట్టారు. మమ్మల్ని వదిలేసేవరకూ తినమన్నాం. నిరసనగానే నిరాకరించాం. నిజానికి తినాలని అనిపించలేదు. సాయంకాలానికి విపరీతమైన అలసట, ఆకలి. రెండు రోజుల ప్రయాణం కంటే రోజంతా నడిచిన తతంగం మాలోని శక్తిని పూర్తిగా పీల్చేసింది. బైట వాతావరణం మా మానసిక స్థితికి ప్రతిబింబంగానే ఉంది. విపరీతమైన ఉక్కపోత. కాసేపటికి భోరున వర్షం. ఆ తర్వాత చలి మొదలైంది. వెచ్చగా టీ తాగి రిలాక్స్ కమ్మన్నాడు ఓ అధికారి. పౌరుషం తన్నుకొచ్చింది. ఆకలి చంపుతున్నా రాత్రి భోజనమూ అట్లాగే తిరస్కరించాం.
కథ తయారైంది. ఏవేవో సెక్షన్ల కింద కేసులు రాశారు. తమిళం అర్థం అయినవాళ్ళు అవి చూసి తమిళంలోనే విరుచుకుపడ్డారు. భాష తెలియని మాలాంటి వాళ్ళం మొహామొహాలు చూసుకున్నాం. అప్పుడున్న స్థితిలో అనువదించి చెప్పమని మా మిత్రుల్ని అడగలేకపోయాం . తర్వాత తెలిసింది. ఆ ఎస్ఎఆర్ లో మహిళా పోలీసులను అసభ్యంగా దూషించినట్లు రాసిన విషయం (అందులో బూతులు కూడా రాశారు) మా బృందంలోని పౌరహక్కుల కార్యకర్తలకు ఆవేశం తెప్పించిందది. వాళ్ళు అక్కడున్న మహిళా పోలీసులనడిగారు, దీన్ని మీరెలా ఒప్పుకుంటారని. వాహనం సిద్ధమైంది. చీకటి మెరిపిస్తూ చక చక మని కెమెరా ఫ్లాష్ లు. బైట గుంపులు గుంపులుగా మనుషులు, కెమెరాలు. మా మిత్రులు తమిళంలో నినాదాలిచ్చారు. "కండిక్కిండ్రోం, కండిక్కిండ్రోం- కావల్ తురై కండిక్కిండ్రోం” అర్థం కాకపోయినా మేమూ గొంతు కలిపాం. తమిళం తెలియని ఇతర భాషీయులను కూడా బంధించారని చెప్పడానికేమో మరికొందరు మిత్రులు హిందీ, ఇంగ్లీషులో నినాదాలిచ్చారు. అత్యంత స్వాభావికంగా 'పోలీసు జులుం నశించాలి' నినాదం నాలోనుండి ఉబికి వచ్చి నన్నే ఆశ్చర్యపరిచింది. నా ఇద్దరు తెలుగు మిత్రులు గొంతుకలిపారు. మా పదకొండుమందినీ మెజిస్ట్రేటు ముందు హాజరుపరిచారు. మా బృందంలోనే ఉన్న ముగ్గురు న్యాయవాదులు అప్పటికప్పుడే బెయిలుకోసం విజ్ఞప్తి చేశారు కాని మమ్మల్ని కొద్దిరోజులు ఖైదు చేయడానికి మందే నిర్ణయించినట్టున్నారు. మగవాళ్ళందరినీ పాళయంకొట్టై సబ్ జైలుకు, మిగిలిన నలుగురు ఆడవాళ్ళను కొక్కిరాకుళం సబ్ జైలుకు తరలించారు.
మమ్మల్ని డాక్టరుకు చూపించి, మేం ఆరోగ్యంగానే ఉన్నామని రాయించుకున్న తర్వాత అర్దరాత్రి ఏ రెండు గంటలకో అప్పటికే ఏడు మంది రియాండు ఖైదీలతో నిండుగా ఉన్న సెల్ లో మమ్మల్ని ఇరికించారు. మొదటి సారి జైలుకు. మధ్యతరగతి మనస్తత్వం క్షణంపాటు గింజుకుంది. మావాళ్ళేమనుకుంటారో! కిక్కిరిసిన గదుల మురికిలో కుప్పబోసినట్లున్న నిర్భాగ్యుల వేదనాభరిత ప్రపంచం. ఏమిటి? ఇక్కడున్నవాళ్ళంతా నేరస్తులా? వీధికుళాయిల దగ్గర కొట్లాటలు, అత్తాకోడళ్ళ తగాదాలు, పొలంగల పోట్లాటలు, కడుపు కక్కుర్తికి వెయ్యో, రెండువేలో దొంగిలించడం, శరీరాన్నమ్ముకోవడం, ఇవన్నీ నేరాలా? మరి లక్షలకోట్ల కుంభకోణాలనూ, లక్షలమంది ఊచకోతలనూ ఏమనాలో? ఆ మాటే అంటే వీళ్ళేమన్నారు? “వాళ్ళు ఏమైనా చెయ్యగలరు. మనం చేసి తప్పించుకోగలమా? తప్పే చేశాం. చెయ్యకుండా ఉండాల్సింది. ఏ జన్మలో చేసిన పాపమో కూడా కలిసినట్టుంది.” ఎన్నెన్ని పశ్చాత్తాప ప్రకటనలో. వీళ్ళు సరే. మరి విష్ణు ఏం తప్పు చేశాడు? మూడేళ్ళ విష్ణు తల్లితోపాటు జైల్లో ఉండాల్సిందేనా? వాడికది జైలని తెలుసా? తనలాంటి పిల్లలు మామూలుగా ఏం చేస్తుంటారో తెలుసా? అయినా వీడు లేకపోయి ఉంటే ఆ ముప్పైమంది ఖైదీల ముఖాల్లో నవ్వు ఉండేదా? 'మీరు హక్కుల సంఘాల వాళ్ళా? మీరు ప్రజల కోసం పోరాటాలు చేస్తారా? అసలు జైళ్ళనేవే లేకుండా చేయండి. పాతికేళ్ళు కూడా లేని ముత్తులక్ష్మి ఎంత లోతైన మాటన్నది. వీళ్ళింత ఉద్వేగపు మనుషులు? వెర్రిగా కేకలు వేస్తూ పాడుతూ, ఆడుతూ అంతలోనే భోరుమని ఏడుస్తూ. ఎవరో భక్తిపారవశ్యంలో పాటెత్తుకుంటారు. ఇంకొకరికెవరికో అమ్మోరు పూని జుట్టు విరబోసుకొని శివాలెత్తుతుంది. మరొకరు బూతుపాటలు పాడతారు. కూతురు ప్రసవించబోతోంది. తల్లి జైల్లో. చూసుకునే దిక్కులేదు. పిల్లవాడు తల్లినే కలవరిస్తూ జబ్బుపడి ఉన్నాడు. బెయిలు రాదు. నిండు గర్బిణి. రేపోమాపో ఖైదులోనే మరో ప్రాణి జన్మిస్తుంది. ఎవరి కోసం ఈ జెయిళ్ళు? ముత్తులక్ష్మి పశ్న ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.
మూడోరోజు మమ్మల్ని కోర్టులో ప్రవేశపెట్టాక, వస్తుందనుకున్న బెయిలు వాయిదాపడి మమ్మల్ని మూడు జిల్లాలు దాటించి సెంట్రల్ జైలుకు తరలిస్తుంటే ఇప్పుడిప్పుడే బైటపడతామన్న ఆశను బలవంతంగానైనా పక్కన పెట్టక తప్పలేదు. అయితేనేం. అక్రమ నిర్భంధం నుండి సక్రమ నిర్భంధంలోకి, చిన్నజైలు నుండి పెద్దజైలుకు మార్చాక మమ్మల్ని ఎవరితో కలవనీయకూడదని వాడంత ప్రయాసపడ్డాడో వాళ్ళ వద్దకే చేరుకున్నాం. కూడంకుళం అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేస్తున్న ఇడిందకరై మహిళల్ని బంధించిన సెల్ వద్దకే నేరుగా మమ్మల్ని తీసుకుపోయారు. అటుతిరిగి, ఇటుతిరిగి చివరికి మేము చేరుకోవల్సిన చోటుకే చేరుకున్నామన్నమాట.
ఎంత ఆశ్చర్యం! కడలిని కళ్ళల్లో చూడటం ఎంత అద్భుతం! వాళ్ళేమన్నారు? రోజంతా ఊళ్ళన్నీ తిప్పి అర్ధరాత్రి అక్కడికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళేమన్నారు? భాషా సమస్య. దేశంలో ఇన్ని భాషలెందుకున్నాయో! ఈ మాటే అంటే ప్రియ ఏమన్నది? దేశంలో ఇన్ని భాషలు కాదు. ఇన్ని దేశాలు కలిసున్నవని కదూ. తమిళ జాతీయత చెప్పకనే చెప్పింది. వాళ్ళేమన్నారో కానీ మమ్మల్ని చూసి భగ్గుమన్నారని మాత్రం అర్థం అయింది. మళ్ళీ సెల్ లో మొత్తం ఏడుమంది. అమ్మలాగా కనిపించే ఆ అమ్మకు ఎందుకంత కోపమొచ్చింది? అదేదో వాళ్ళ ఇళ్ళైనట్లు మమ్మల్ని రానీయమని ఎందుకన్నారు. నా తమిళ సహచరి అగరాది వాళ్ళకేదో సర్ది చెప్పింది. వాళ్ళు మమ్మల్ని పోలీసు మనుషులనుకున్నారట. ఈ జైల్లో ఇంతమంది పోలీసుల మధ్య, అంత పెద్ద రాజ్యం, దాని బలగాలు వీళ్ళని కన్న తిప్పలు పెడుతుంటే బందీఖానానుండే అచ్చం సముద్రపు హోరువలె, సముద్రపు అలలవలె ఎంత భీకరంగా విరుచుకుపడ్డారు. మేం పోలీసు మనుషులం కాదు, పోరాట మనుషులం అని తెలుసుకున్నాక ఎంత ఉద్వేగపడ్డారు. ఆ కళ్ళలో రౌద్రం మాయమై క్షణాల్లో ప్రేమ ఉబికింది. సముద్రాన్ని చూడలేకపోయినా సముద్రం వంటి మనుషులను చూశాము. నెలరోజుల ముందు వీళ్ళనిక్కడికి పట్టుకొచ్చారు. సెప్టెంబర్ 10నాటి పోరాట సన్నివేశాన్ని, శాంతియుత ప్రదర్శనపై పోలీసుబలగాల భీభత్సకాండను వాళ్ళు కళ్ళకుకట్టారు. చదువురాని ఆ అమ్మలు ఎన్నో విషయాలు చెప్పారు. అణువుల గురించే కాదు. వ్యవస్థ స్వభావాన్ని అణువణువూ విడమర్చి చెప్పారు. క్రైస్తవ భక్తి గీతాలు పాడే వీరు ఉద్యమ పాటలు పాడి వినిపించారు. ప్రతిదీ అనువదించి చెప్పే నా తమిళ సహచరులు లేకపోతే ఈ విషయాలు అర్థం కాకపోవడమే కాదు, జైళ్ళో నా పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉండేది.
దేశంలోనే అతి పెద్ద అణువిద్యుత్ కేంద్రమైన కూడంకుళం న్యూక్లియర్ పవర్‌ప్లాంటుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన ఈనాటిది కాదు. 1988లో భారత రష్యా ప్రభుత్వాల మధ్య ఒప్పదం జరిగి సన్నాహాలు మొదలు పెట్టినప్పుడు అది అణువిద్యుత్ కేంద్రమని వాళ్ళకు తెలీదట. ఏదో కంపెనీ వస్తోందని, ఉద్యోగాలొస్తాయని చెప్పారట. తర్వాత అసలు విషయం తెలిసి ఆందోళన మొదలయ్యింది. అయితే అప్పుడంత మీడియా ప్రచారం లేదు. తర్వాత రాజకీయ పరిణామాల వల్ల సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడం, ఆ తర్వాత సిటిబిటి ఒప్పందం నేపథ్యంలో అమెరికా అడ్డుచెప్పడంతో అది వెనక్కిపోయింది. మళ్ళీ పాత ఒప్పదాన్ని బైటికితీసి 2001 నుండి నిర్మాణం మెదలు పెట్టినా ఫుకుషిమా ప్రమాదం తర్వాతే ఉద్యమం వెల్లువెత్తింది. అణువిద్యుత్ కేంద్రాల భద్రతను తనిఖీ చేసే అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ సూత్రాలనుసారంగా అణురియాక్టరులో ప్రమాదం జరిగినప్పుడు ఎంటువంటి జాగ్రత్తలు పాటించాలో స్థానిక ప్రజలను అప్రమత్తం చేయడంలో భాగంగా ఏర్పాటు చేసిన డ్రిల్ లో చెప్పిన విషయాలు అప్పటికే ఉన్న సందేహాల్ని మరింత పెంచాయి. సర్కస్ ను, ఇంద్రజాలాన్ని గుర్తుకు తెచ్చిన ఆ మీటింగ్ లో చెప్పిన విషయాలటువంటివి మరి. తలుపులు మూసేసుకోవాలి, గుడ్డను నీళ్ళలో తడిపి ముక్కు, నోరు మూసుకొని రేడియేషన్ పోయేదిశలోనే పరిగెత్తాలి. కనీసం పది కిలోమీటర్లు అవతలికి పోవాలి. ఆహారపదార్ధాలు మూసి ఉంచాలి. ఇటువంటి జాగ్రత్త చర్యలు సూచించినప్పుడు సహజంగానే అనేక ప్రశ్నలు తలెత్తాయి. రేడియేషన్ ప్రభావం 10 కిలోమీటర్ల వరకు ఉంటే మరి మా నివాస స్థలాలకు అరకిలోమీటరులోపే అణువిద్యుత్ కేంద్రం ఎలా కడతారు? (అణువిద్యుత్ కేంద్రాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో నివాసస్థలాలు ఉండకూడదని స్వయంగా తమిళనాడు ప్రభుత్వమే 1991లో విడుదల చేసిన జీవోలో స్పష్టం చేసింది.) సునామీ రిలీఫ్ క్యాంప్ కూడా ఇక్కడే ఉంది. 30కిలోమీటర్ల పరిధిలో 10లక్షల మంది దాకా నివసించే ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధ్యం. ఇక ఆహార పదార్థాలు మూసి ఉంచాలంటే ఎంతసేపు మూసి ఉంచాలి తినేటప్పుడు ఏంటి పరిస్థితి? వీటికి సమాధానం చెప్పేవాళ్ళు మాత్రం ఈనాటికీ లేరు. చప్పేదేదో చెప్పిపోయారు. చేసే పని చేస్తూ పోయారు. జనానికి అనుమానమొచ్చింది. అభధ్రత, అసహనం నుండి ఉద్యమం పుట్టింది. ఆ తర్వాతే ఉదయ్ కుమార్ గానీ, మరి కొందరు పర్యావరణ ఉద్యమకారులుగానీ వచ్చింది. ప్రభుత్వం చెప్తున్నట్టు ఎవరో రెచ్చగొడితేనో, మాయమాటలు చెబితేనో అది పుట్టలేదు. నిజానికి మాయమాటలు చెప్పింది ప్రభుత్వం. మొట్టమొదటి రోజు నుండి అది ఏరోజూ నిజం చెప్పలేదు. ప్రజలు అడుగుతూనే ఉన్నారు. అన్నిటినీ నాశనం చేసే అణువిద్యుత్ ఎవరికోసమని. దేశాన్ని విదేశాలకు తాకట్టు పెట్టడమేనా ప్రభుత్వ విధానమని పాటలు ద్వారా ప్రశ్నిస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు.
“తానాతానా ఇదు సరిదానా? లేసాలేసా ఇదు విడలామా?”
(తానాతానా ఇది సరైనదేనా? లేసాలేసా దీన్నిలాగే వదిలేద్దామా)
పర్యావరణ ఉద్యమకారులు, శాస్త్రవేత్తలు, పౌరహక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామికవాదులు ఈ విధ్వంసకర ప్రాజెక్టును వ్యతిరేకించడానికి స్పష్టమైన కారణాలు చెబుతున్నారు.
కూడంకుళం అణురియాక్టర్లను చల్లబరచడానికి వాడిన నీటిని, తక్కువ స్థాయి వ్యర్థాలను సరాసరి సముద్రంలోకి వదిలేస్తారు. దీని వల్ల చేపల ఉత్పత్తిపై వినాశకర ప్రభావం పడుతుంది. లక్షలాది మంది జీవనోపాధిని కోల్పోవడే కాదు, దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ ఆహారభద్రతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. రియాక్టర్ లో ప్రమాదం జరిగినప్పటి మాట అటుంచి అది మామూలుగా నడుస్తున్నప్పుడు కూడా అయోడిన్ 131, 132, 133, సీసియం 134, 136, 137, ఫ్రాన్షియం, ట్రీట్రీయం, టెల్లూరియం వంటి అణుధార్మిక పదార్థాలు పర్యావరణంలోకి విడుదలై గాలి, నీరు, నేల కలుషితమై పంటలు, పశువులు, సముద్రజీవులు విషపూరితమవుతాయి. ఇప్పటికే దక్షిణ సముద్రతీర ప్రాంతం గనుల తవ్వకాలతో కుదేలవుతూ ఇటీవల కాన్సర్, మానసిక రుగ్మతలే కాకుండా వైకల్యాలతో పుట్టే పిల్లల సంఖ్య కూడా పెరుగూ ఉంది. ఇక కూడంకుళం కూడా దీనికి తోడవుతుంది. రియాక్టర్ల భద్రత విషయంలోనూ స్వయంగా ఈ ప్లాంటు నిర్మాణంలో పనిచేసిన వాళ్ళ దగ్గరి నుండి శాస్త్రవేత్తల దాకా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియాక్టర్లు సురక్షిత భూభాగంలోనే ఉన్నాయని, భద్రతపై పదేపదే రాజకీయ నాయకులు, అధికార్లు హామీలిస్తున్నారు గాని 2004 సునామీ ఇదే కూడంకుళం నిర్మాణాలను ముంచివేసింది. 2006లో కూడంకుళం పరిసర గ్రామాల్లో, 2011లో తమిళనాట కనీసం 7జిల్లాల్లో భూప్రకంపనలొచ్చాయి. వీటన్నిటి కన్నా ముఖ్యంగా 2008లో భారత రష్యా ప్రభుత్వాల మధ్య రహస్యంగా కుదిరిన అణుఒప్పందంలో రియాక్టర్లు చెడిపోయినా, ఎటువంటి నష్టం సంభవించినా ఎపిసిఐఎల్ (న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)దే బాధ్యత అని ఉంది! భోపాల్ గ్యాస్ దురాగతం తర్వాత కూడా ఇంతటి అవమానకర ఒప్పందాలకు శిరసు వంచుతున్న మన ప్రభుత్వాలనేమనాలి? అందుకే ఇడిందకరై మహిళలు “మన్మోహన్ ఉనక్కు ఎంద చిల్లరబుద్ధి ఎదుకు” (మన్మోహన్ నీకు, ఈ చిల్లరబుద్ధి ఎందుకు) అని నిరసన పాట ఎత్తుకుంటున్నది.
కనీస సమాచారం ఇవ్వకుండా, పర్యావరణ ప్రభావ అధ్యయనాన్ని బహిర్గతం చేయకుండా, భద్రతపై ఎటువంటి శాస్త్రీయ అంచానాలున్నాయే చెప్పకుండా, చివరికి ఏ ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా రెండు అణువిద్యుత్ ప్లాంట్లను నిర్మాణం చేయడం చూస్తే ప్రభుత్వం ప్రజల జీవితాల పట్ల ఎంత దుర్మార్గమైన నిర్లక్ష్యాన్ని చూపిస్తోందో అర్థం అవుతోంది. తాను తయారు చేసిన చట్టాలను ఎంత నిస్సిగ్గుగా అతిక్రమిస్తోందో కనపడుతోంది. అంతాచేసి ప్రాజెక్టు కోసం 14 వేల కోట్లు ఖర్చుచేశామని, ఈ గొడవతో ప్రజల డబ్బంతా వృధా అవుతోందని చిత్రమైన వాదన తీసుకొస్తోంది. దీనికితోడు తమిళనాటంతా విద్యుత్ కోతలు విధించి కూడంకుళం ప్లాంటు పూర్తయితేగాని విద్యుత్ సంక్షోభం తీరదని ప్రచారం చేస్తోంది. మధ్యతరగతి ఈ ప్రచారంలో సులభంగానే కొట్టుకుపోయారు. అయితే ఆందోళనకారులు మాత్రం తప్పుడు ప్రచారంతో కూడుకున్న ఉత్తుత్తి విద్యుత్ కోతలను తక్షణం ఎత్తివేయలని డిమాండ్ చేస్తున్నారు.
2011, ఆగస్టు 15న నల్లజెండాలు ఎగిరాయి. వీటివెనక ఏ మావోయిస్టులూ లేరు. ఆగస్టు 16నుండి ఆందోళన మొదలయ్యింది. అధికారులు బుజ్జగింపులకు దిగారు. కొంత సమయం ఇమ్మని అడిగారు. ప్రజలకు సహనమెక్కువ కదా, చాలా సమయమే ఇచ్చారు. ఏ సమాధానమూ రాలేదు. అయినా జనం విధ్వంసానికి దిగలేదు. ఏకంగా నూట ఇరవై అయిదు మంది కలిసి 12 రోజలు నిరాహారదీక్ష చేశారు. పెద్దమనుషులు వచ్చారు. మధ్యవర్తిత్వం నెరిపారు. నిమ్మరసం తాగించి ముఖ్యమంత్రికి విపతి పత్రం ఇప్పించారు. రోజులు గడుస్తున్నా ఏమీ జరగలేదు. మళ్ళీ 8 రోజులు నిరాహారదీక్ష చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి వచ్చింది. “మక్కళోడు మక్కలాయ్ ఇరుపేన్” (నేను ప్రజలతోనే ఉంటాను) అని ప్రకటించింది. ప్రజలకున్న అనుమానాలు తొలగించేవరకు ప్లాంటు మొదలు పెట్టకూడదు అని కేంద్రానికి తన మాటగా చెప్పింది. అక్టోబరు 17న పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ప్రజలు అందులో పాల్గొన్నారు. నిరాహారదీక్ష విరమించి మరీ పాల్గొన్నారు. డిసెంబరు నెలంతా రాష్ట్రవ్యాప్త ప్రచారం చేశారు. అణువిద్యుత్ కేంద్రం వల్ల మూడు మహాసముద్రాల మహాద్భుత సంగమమైన కన్యాకుమారికి ముప్పురాబోతోంది కనుక అక్కడే సభపెట్టారు. తర్వాత రెండువేలకు పైగా ప్రజలు రాజధానికి పోయి మరీ నిరసన తెలిపారు. ఈ క్రమమంతా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన ఉందని నమ్మారు. అలా ఉండేదో, అలా నమ్మించిందో మరి. అయినా జనం ప్లాంటు ముందు టెంటు వేసుకొని కూర్చొని ప్లాంటులోకి ఇంజనీర్లను పోనివ్వకుండా అడ్డుకున్నారు. గుర్తింపు కార్డులు చూసి మొయింటెనెన్స్ పనివాళ్ళను మాత్రమే అనుమతిచ్చారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి అనేకమార్లు వినతి పత్రాలు సమర్పించుకున్నారు.
జనవరి 2012 ప్రధాని రష్యా పర్యటన తర్వాత ఫిబ్రవరిలో కలెక్టరుతో చర్చలు జరపడానికి పోయిన కూడంకుళం ఆందోళన కమిటీ ప్రతినిధులపైనా, మహిళలపైనా సంఘపరివారానికి చిందిన హిందూమున్నని కార్యకర్తలు దాడిచేశారు. పోలీసులు ప్రజలను రక్షిస్తున్నట్లు నటించి దాడిచేసేవాళ్ళకే సహకరించారు. ప్రజలు ఇక చర్చలకు పోకూడదని నిర్ణయించారు. మార్చి 18 శంకరన్ కోయిల్ నియోజకవర్గంలో ఉపఎన్నికలు ముగిసాక కాని ప్రభుత్వం అసలు రంగు బైట పెట్టలేదు. ఈ విషయం చెప్తూ “అమ్మా జయలలితా, నువ్వు నిజంగానే గొప్ప నటివం”టూ ఇడిందకరై ఖైదీలు పాటపాడి వినిపించారు. అయితే మామూలుగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా ఈ విషయంలో తన మద్దతు ప్రకటించడం గమనిస్తే అణుఒప్పందం నుండి సాధారణ అభివృద్ధి నమూనా విషయంలో పాలకవర్గాలు ఎలా ఐక్యమవుతున్నాయో చూడగలం. ఉపఎన్నిక ముగిసిన మరుసటి రోజే కూడంకుళం వద్ద టెంటులో కూర్చున్న మొత్తం నలభైతొమ్మిది మందిని అరెస్టు చేశారు. పారామిలిటరీ దిగింది. నూటనలభైనాలుగు సెక్షన్ విధించారు. ఆందోళనను నడిపిస్తున్న ఇడిందకరై వంటి గ్రామాలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యుత్ సరఫరా నిలిపేసింది. నీరు, పాలు, నిత్యవసరాలూ, బందు చేశారు. బస్సులు నిలిపేశారు. ఉన్న ఒకే ఒక్క రవాణా మార్గం సముద్రం. తూతుకుడి, కన్యాకుమారి ప్రాంతాల నుండి ప్రజలు సముద్రం ద్వారా రహస్యంగా సరఫరాలు చేశారు. నిరసన ప్రదర్శనలు, నిరాహారదీక్షలు నడుస్తూనే ఉన్నాయి. ఒకరోజు సముద్రంలో మునిగి, మరోరోజు ఇసుకలో కూరుకుపోయి - ఇట్లా నిరసనలోనూ విభిన్న రూపాలు తీసుకున్నారు.
అయితే 144 సెక్షన్ వల్ల బైటివాళ్ళెవరూ అక్కడికి పోలేని పరిస్థితి. ఉద్యమం మాత్రం ఆగలేదు. ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్లు ఏ విదేశీ నిధులో ఉద్యమాన్ని పోషించడం లేదని వాళ్ళు ఒకింత ఆగ్రహంతోనే చెప్తారు. స్వార్థం కోసం దేశాన్ని తాకట్టు పెట్టే పాలకులకు మాగురించి మాట్లాడే నైతికత లేదంటారు. ముప్పై గ్రామాల్లో ప్రతి మత్యకార కుటుంబం ఉద్యమం కోసం తమ రెక్కల కష్టంలో కొంత భాగాన్ని ధారపోస్తోంది. విడతలు విడతలుగా ప్రజలు నిరసన దీక్షలకు కూర్చుంటున్నారు. మహిళలు ముందుంటున్నారు. ఆగస్టులో యురేనియం నింపుతున్నట్లు ప్రకటించారు. మళ్ళీ నల్లజెండాలు ఎగిరాయి. ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని శవపేటికను ఊరేగించారు. సెప్టెంబరు మొదటి వారంలో యురేనియం నింపుతున్నారని తెలిసి ఉద్యమం తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. సెప్టెంబరు 9న ఆరు గ్రామాల నుండి రెండువేల మంది ప్రజలు సముద్రం ఒడ్డున మార్చ్ చేసి కూర్చున్నారు. రాత్రికి రాత్రే ఇసుకలోనే తాత్కాలిక రోడ్డు వేసి మరీ బలగాలను తరలించారు. మరుసటి రోజు పోలీసు హింసాకాండలో వందలాది మంది గాయపడ్డారు. ఒక ప్రాణం గాలిలో కలిసింది. ఎంతమంది మీద కేసులు పెట్టారో లెక్కలేదు. వాళ్ళలో 15-16 ఏళ్ళ వయసున్న నలుగురు అబ్బాయిలున్నారు. అందరిలాగే వీరి మీదా 121(ఏ), 395, 307 సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
అణువిద్యుత్ వద్దంటున్న వేలాది మంది ప్రభుత్వాన్ని కూల్చే కుట్రపన్నుతున్నారంటున్నది ప్రభుత్వం. ఫుకుషిమా అణుప్రమాద తర్వాత అణువిద్యుదుత్పత్తిలో అపార అనుభవమున్న జపాన్, జర్మనీ, స్విజర్ ల్యాండ్, ఇటలీ వంటి అనేక దేశాలు వెనక్కు తగ్గితే భారత ప్రభుత్వం ఎందుకంత దూకుడుగా వ్యవహరిస్తోంది? స్వయంగా భారతదేశానికి అణుసాంకేతికతను ఎగుమతి చేస్తున్న అమెరికా రాష్యాలు తమ దేశాల్లో అణుప్రమాదాలు జరిగిన తర్వాత మూడు దశాబ్దాలుగా ఒక్క అణురియాక్టర్ ను కూడా కొత్తగా నిర్మించలేదు కాని భారత్ వంటి దేశాలకు టెక్నాలజీని అమ్ముకోవడం వెనక ఉన్న సామ్రాజ్యవాద ప్రయోజనాన్ని, దానికి దాసోహమన్న మన దళారీ పాలక ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహమంటోంది. నిరసన ప్రదర్శన, నిరాహార దీక్షే కాదు భావప్రకటనా ప్రభుత్వంపై యుద్ధమేనంట. ఈ నేపథ్యంలో నిజనిర్ధారణకు వెళ్ళిన ఎంతో మందిని పోలీసులు అడ్డుకుంటున్నారు. మమ్మల్నైతే దాదాపు నెలరోజులు నిర్భధించి పౌరహక్కుల కార్యకర్తలకు, ప్రజాస్వామికవాదులకు హెచ్చరిక జారీచేసింది.
మాకు మద్దతుగా న్యాయవాదులు, మరికొన్ని ప్రజాసంఘాలు ముందుకొచ్చాయి. వెనువెంటనే మా పైన మావోయిస్టు ముద్రవేసి ప్రచారం చేశారు పోలీసులు. అక్టోబరు 17వ తేదీ తమిళ పత్రికలు మా గురించి రాసిన కథనాన్ని చూసి నిర్ఘాంతపోయాం. జైల్లో ఏరోజు దినపత్రిక ఆరోజు అందదు. మరుసటి రోజు దనమలర్ (తమిళ పత్రిక)లో నా ఫోటోతో ప్రచురితమైన కథనాన్ని ఒక ఇడిందకరై అమ్మ బిగ్గరగా చదువుతూ ఉంది. మా పేర్లు, మావోయిస్టు తీవ్రవాదులు అనే పదాలు మాత్రం అర్థమయ్యాయి. విరసం కార్యదర్శినైన నాగురించి కాస్త ఎక్కువగానే రాసినట్లున్నారు. అప్పటికే మాకు బాగా దగ్గరైన ఏడుగురు ఇడిందకరై అమ్మలు దాన్ని సాంతం చదివేసి నవ్వుతూ చప్పట్లు కొడుతున్నారు. దాని సారాశం విన్న తర్వాత విపరీతమైన అసహనమూ, అంతలోనే నా నిస్సహాయత తలపుకొచ్చి తల భారంగా వేలాడేశాను. నేను తమిళనాట విధ్వంసం సృష్టించడానికొచ్చిన మావోయిస్టుననే కాదు, నేనో మావోయిస్టు అగ్రనేతకు భార్యనని రాశారు. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన సమాచారమట. అర్థమవుతున్నది. ఇదో మానసిక యుద్ధం. ఒక మహిళపై సాధారణంగా ప్రయోగించే అస్త్రం. మీడియా తనవంతు కంటే ఎక్కువ పాత్రే పోషించింది. నా వ్యక్తిగత ప్రపంచంపై దాడి. ఇంటి దగ్గరి నుండి బయలు దేరితే చాలు ఒకటికి నాలుగుసార్లు ఫోన్లు చేసే సాదాసీదా మధ్యతరగతి భద్రజీవితంలో నన్నెంతగానో ప్రేమించే నా తల్లిదండ్రులు. నా బంధుమిత్రులు, సహోద్యోగులు - టీవీ తెరలో నుండి లోకాన్ని చూసే చిన్న ప్రపంచం వాళ్ళది. అక్కడి నుండి నా గురించి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన అమ్మనాన్నలు తలపుకొచ్చారు. నా మానసిక స్థితిని అర్థం చేసుకున్న నా సహచరులు నా చుట్టూ చేరి భుజాలపై చేతులు వేసి ఏం చెప్తున్నారో కాసేపు ఏమీ అర్థం కావటం లేదు.
అవునూ! ఇది చదివి వాళ్ళు చప్పట్లు కొట్టారేమిటి? సాపాడు తిందామని పిలుస్తున్నారు. ఒక అమ్మ భోజనం వడ్డించింది. నాకు చెప్పాల్సింది నా తమిళ సహచరికి చెప్పింది. “వాళ్ళు మిమ్మల్ని మావోయిస్టులు అంటున్నారంటే మీరు నిజంగా ప్రజలకోసం పోరాటం చేసేవాళ్ళని అర్థం. వాడు రాసే నానా చెత్తా చూసి మీరు బాధపడతారా? మా గురించి ఎతెంత రాశారో మీకు తెలీదు. తేలిగ్గా తీసుకోవాలి. పోరాటం చేసేవాళ్ళకు ఇవన్నీ మామూలే.” మావోయిజం ఏమిటో, మావోయిస్టులెవరో తెలీకున్నా రాజ్యస్వభావాన్ని మాత్రం క్షుణ్ణంగా అర్థం చేయిస్తూ, తడబడినప్పుడు వాళ్ళ ప్రేమనే ఊతంగా ఇచ్చిన ఇడిందకరై అమ్మలకు ఎంతగా రుణపడి ఉన్నానో.
మరుసటి రోజు మధ్యాహ్నం మాకు కండీషన్ బెయిలు వచ్చింది. (బైకికొచ్చాకగానీ తెలీలేదు, అది మరో పెద్ద జైలని). వీడ్కోలు చెప్పడానికి వాళ్ళు లేరు. ఉదయాన్నే అన్ లాకప్ అవగానే వాళ్ళను కోర్టుకు తీసుకెళ్ళారు. మేం వస్తూ వస్తూ వాళ్ళు రోజూ ప్రార్థన చేసుకునే జీసెస్ ఫోటో ఉంచిన గూటి దగ్గర నిలబడిపోయాము. నా మిత్రురాలు తమిళంలో చిన్న చీటీ రాసి పెట్టింది. “త్వరలోనే మీరూ విడుదలవుతారు. మీ పోరాటాన్ని కొనసాగిస్తారు. మిమ్మల్ని మేం తప్పకుండా కలుస్తాం.”
(అరుణతార, సెప్టెంబర్ - అక్టోబర్ 2012)


No comments:
Post a Comment