కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం వల్ల ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి ముప్పు ఉందని పూవుళగిన్ నర్గళ్ (భూమి మిత్రులు) వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు అందులో లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకుంటూనే విశాల భారతదేశ ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధి దృష్ట్యా అణువిద్యుత్ కేంద్రానికి ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించింది. ఫుకుషిమా ప్రమాదం తర్వాత అణుశక్తి మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ జపాన్, జర్మనీ, ఇటలీ వంటి ఎన్నో దేశాలు అణువిద్యుత్ కేంద్రాలను మూసివేసే నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, భారతదేశం అందుకు విరుద్ధంగా సామ్రాజ్యవాద దేశాలతో చేసుకున్న అణుఒప్పందాలను దూకుడుగా అమలుచేస్తూ పోతున్న సమయంలో ఈ తీర్పు వెలువడింది. భారతదేశంలో అణురాజకీయాలను చర్చకు పెట్టిన కూడంకుళం ప్రజాపోరాటం నేపథ్యంలో వచ్చిన ఈ తీర్పు సహజంగానే చర్చనీయాంశమైంది. పాతిక సంవత్సరాల తమిళనాడు అణుశక్తి వ్యతిరేక ఉద్యమం ఈ తీర్పు ప్రజావ్యతిరేకమైనదని ప్రకటించి ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పింది.
అత్యంత 'ప్రజాస్వామ్య బద్ధంగా, శాంతియుతంగా కొనసాగిన కూడంకుళం ఉద్యమం కోర్టులతో సహా అన్ని రాజ్యాంగ వ్యవస్థలను పరీక్షించింది. ఈ వ్యవస్థ మమ్మల్ని అర్థం చేసుకోలేదు అని కూడంకుళం తీర ప్రాంత మత్స్యకారుల సంఘం నాయకుడు ఒక మీడియా ఇంటర్యూలో చేసిన వ్యాఖ్య అడుగడుగునా రుజువవుతున్నది. మండల స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు చేసిన విజ్ఞప్తులు బుట్టదాఖలయ్యాయి. నెలల తరబడి చేసిన దీక్షలు, సత్యాగ్రహాలు ప్రభుత్వాలను కదిలించలేదు. సంవత్సరాల తరబడి చేసిన ఆందోళలను పట్టించుకున్న ప్రభుత్వాలే లేవు. ఒకవేళ కోర్టుకు పోతే ఏమైనా న్యాయం జరుగుతుందేమోనని కోర్టులను ఆశ్రయించారు. విద్యుదుత్పత్తి చేసే రియాక్టర్ల భద్రత కోసం అణుశక్తి నియంత్రణ బోర్డు సిఫారసు చేసిన 17 సిఫారసులను అమలు చేసిన తర్వాత కాని వాటిలో ఇంధనం నింపకూడదని, అప్పటిదాకా స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌ను 2012 ఆగస్టులో మద్రాసు హైకోర్టు కొట్టివేసి ఇంధనం నింపడానికి పచ్చజెండా ఊపింది.
హైకోర్టు తీర్పు అన్యాయమని రియాక్టర్లలో యురేనియం నింపకుండా మేము అడ్డుకుంటామని ఆందోళనకారులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. హైకోర్టు తీర్పుతో మరింత ఉత్సాహంగా ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగింది. అణువిద్యుత్తుకు వ్యతిరేకంగా ఏ చిన్న నిరసన తలెత్తినా ఉక్కుపాదం మోపింది. సెప్టెంబరు 10న సముద్రపు ఒడ్డున నిరసన తెలుపున్న రెండు వేల మంది జనంపై రాత్రికి రాత్రి ఇసుకనేల పైన రోడ్డువేసుకొని మరీ తరలివచ్చిన పోలీసులు విరుచుకుపడ్డారు. ముళ్ళు కర్రలతో చావబాది వందల కేసులు మోపారు. దీనిపై నిజనిర్ధారణకు వెళ్ళిన ప్రజాసంఘాల బృందాన్ని నిర్బంధించి నెలరోజులపాటు వేధించింది. ఒకపక్క ఆందోళన కొనసాగుతుండగానే కేసు సుప్రీం కోర్టుకు పోయింది. అణువిద్యుత్ కేంద్రం వల్ల ప్రజల జీవనానికి రాబోయే ముప్పు గురించి, పొంచి ఉన్న పర్యావరణ వినాశనాన్ని గురించి, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ శాస్త్రవేత్తల అభిప్రాయాలను, నిర్ధారణలను, మరీ ముఖ్యంగా కూడంకుళం అణువిద్యుత్ ప్లాంటు కోసం తీసుకున్న రియాక్టర్ల భద్రతపై ఎంతోమంది నిపుణులు వెలిబుచ్చిన అనుమానాలను ప్రభుత్వం ముందు ఉంచినట్లే కోర్టు ముందూ పెట్టారు. వెయ్యి మెగా వ్యాట్ల సామర్థ్యంతో రష్యా నుండి దిగుమతి చేసుకున్న రియాక్టర్ల చుట్టూ మొదటి నుండి అనేక వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మొట్టమొదట అవి ఇక్కడ వాడే డిజైను భిన్నంగా ఉన్నాయని, వాటిని నిర్వహించే అనుభవం భారతదేశానికి లేదని, ఇందులో చాలా రిస్క్ ఉందని ప్రఖ్యాతిగాంచిన వివిధ పరిశోధనా సంస్థలకు సంబంధించిన శాస్త్రవేత్తలు తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులకు ఒక లేఖ రాశారు. దీనికి తోడు మొదటి రియాక్టరులో నాలుగు సేఫ్టీ వాల్వులు సరిగా లేవని బైటపడింది. స్వయంగా అటామిక్ ఎనర్టీ రెగులేటరీ బోర్డు ఒప్పుకున్న కొద్ది రోజులకే సుప్రీం కోర్టు తీర్పు వెలువడటం గమనార్హం. అంతే కాదు ఈ రియాక్టరును సప్లై చేసిన రష్యన్ రోసాటం కంపెనీకి సంబంధించిన అధికారి రియాక్టర్లలో నాసిరకం భాగాలను పెడుతున్నారనే ఆరోపణ కింద అరెస్టయ్యాడు.
అయితే అణువిద్యుత్ ప్లాంటు భద్రతను సమీక్షించిన వివిధ నిపుణుల కమిటీలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ విషయంలో అవి ఏకాభిప్రాయంతో కూడా ఉన్నాయి. కోర్టులు కూడా సంతృప్తి చెందాయి. సాంకేతిక అంశాలలో అవి ప్రభుత్వ నిపుణుల బృందాల నివేదికల మీదే ఆధారపడటం సహజం. ఆ నివేదికలు ఎట్లా ఉంటాయో ఊహించగలం. అదట్లో ఉంచితే సుప్రీం కోర్టు తీర్పులో మరో ముఖ్యమైన విషయం ఉంది. తన 247 పేజీల తీర్పులో సుప్రీం కోర్టు స్పష్టం చేసిన అంశం ఏమిటంటే కూడంకుళంలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ప్రభుత్వ విధానంలో భాగమని, విధాన నిర్ణయాల్లో కలగజేసుకోవలసింది ప్రజాప్రతినిధులు తప్ప కోర్టులు కావు అని. భద్రతా ప్రమాణాల విషయంలో అణునియంత్రణ బోర్డులు ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నాయని, అవి సమర్థవంతగా, జవాబుదారీతనంతో పనిచేయాలని, రియాక్టర్ల భద్రతను పూర్తిస్థాయిలో సమీక్షించకుండా పనిలోకి దిగకూడదన్న సుప్రీం కోర్టు ఆదేశాలు ఇక్కడ పెద్దగా ఎవరి లెక్కలోనికి రాలేదు. ఏ సంస్థనైతే కోర్టు తప్పుపట్టిందో అదే ఎన్ పిసిఐఎల్ సంస్థ కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసి తక్షణం పనులు ప్రారంభిస్తామని ప్రకటించింది.
ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోవలసిన అనేక సమస్యలు కోర్టుల ముందు పోవడం నిజానికి దానంతటదే పెద్ద సంక్షోభం. ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే విధానాలను ఏ మాత్రం జవాబుదారీతనం లేని ప్రభుత్వాలు చట్టసభల్లో ప్రవేశపెడుతున్నాయి. దాని మీద కనీస స్థాయిలో కూడా చర్చ జరగదు. మౌళికంగా అన్ని పార్లమెంటరీ పార్టీల విధానం ఒకటే అయినప్పుడు దీనిని ఎవరూ ఆశించలేరు. కేవలం పాలకులను ఎన్నుకోడానికి తప్ప ఏ నిర్ణయాల్లోనూ ప్రజల భాగస్వామ్యం లేని బూటకపు ప్రజాస్వామ్యంలో ప్రతి అయిదేళ్ళకోసారి తాము ఎవరిచేతిలో దోపిడీకి గురికావాలో ప్రజలు ఎంచుకుంటున్నారు.
వివిధ ఆందోళనల రూపల్లో మీరు తీసుకుంటున్న నిర్ణయాలు తప్పు, నిజంగా మేము కోరుకుంటున్నది వేరే అని ప్రభుత్వాలకు చెప్పడం ద్వారానో, అవి వినకపోతే వ్యవస్థలను స్థంబింపజేసి ఒత్తిడి తీసుకురావడం ద్వారానో కొంత మార్పు తీసుకురావచ్చు. రాజ్యాంగ పరిరక్షణ చేసేవిగా కోర్టులు కొన్ని సందర్భాల్లో కనపడినా దాని వెనక ప్రజా ఉద్యమాల ఒత్తిడి, చైతన్యం పనిచేస్తాయి. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలు అభివృద్ధి ముసుగేసుకొని విద్యావంతులను, ఆలోచనాపరులను లొంగదీసుకుంటున్నాయి. విడివిడిగా అక్కడక్కడ తలెత్తే ఉద్యమాలు ఎక్కడికక్కడ కార్నర్ చేయబడుతున్నాయి. కూడంకుళం విషయమే తీసుకుంటే విద్యుత్ సంక్షోభాన్ని నివారించడానికి అణువిద్యుత్ కేంద్రం అత్యవసరం అని తమిళనాడు ప్రజలు అభిప్రాయపడేలా ప్రభుత్వం, దాని తరపున మేధావులు ఒక భావజాలాన్ని వ్యాపింపజేశారు. దగ్గరలోని కొన్ని మత్స్యకార గ్రామాల ప్రజల గోడు ఎవరికి పడుతుంది? పర్యావరణ విధ్వంసం తక్షణం అందరికీ అర్థమయ్యే సమస్య కాదు. బలమైన విప్లవరాజకీయాలున్న ప్రాంతాల్లో తప్ప వనరుల విధ్వంసానికి వ్యతిరేకంగా సంఘటిత ప్రజాస్వామిక పోరాటాలు పెద్దగా లేవు. ఈ సందర్భంలో నిజానికి కోర్టు తీర్పులు మరింత ఆశనిపాతంలా ఉంటాయి తప్ప ఏ మాత్రం ప్రజాపయోగంగా ఉండవు. కూడంకుళంపై సుప్రీం కోర్టు తీర్పు తర్వాత హరియానాలో గోరఖ్ పూర్ అణువిద్యుత్ కేంద్రంపై రైతులు వేసిన అనేక పిటిషన్లను పంజాబ్ హరియానా కోర్టు కొట్టివేసింది. ఇందుకు అది కూడంకుళంపై సుప్రీం కోర్టు తీర్పును ఉటంకించింది. అణువిద్యుత్తు విశాల దేశప్రజల ప్రయేజనాలకు, అభివృద్ధికి అత్యవసరమని తేల్చి చెప్పింది. పోస్కో కోసం ఇనుప ఖనిజం గనుల కేటాయింపు విషయంలోనూ ఒడిసా హైకోర్టు నిర్ణయాన్ని రద్దుచేసి ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పులన్నీ వెంటవెంటనే వెలువడటం యాదృచ్చికం ఏమీ కాదు. అయితే సుప్రీం కోర్టే చెప్పింది కదా అనిపించడం ప్రభుత్వ విధానాలకు ఒక విధంగా నైతిక బలాన్నిస్తుంది. ఏమైనా అటు తరిగి, ఇటు తిరిగి చివరకు ఇవి ప్రజాకోర్టుకు చేరవలసిందే. తీర్పు చెప్పవలసింది ప్రజా ఉద్యమాలే. వాటిని బలోపేతం చేసే దిశగా ప్రజాస్వామిక శక్తులు ప్రత్యమ్నాయ అభివృద్ధి భావజాలాన్ని జనంలోకి తీసుకుపోవాలి.
(వీక్షణం, జూన్ 2013)

No comments:
Post a Comment