కర్నూలు జిల్లాలో ఒక మారుమూల గ్రామం. పేరు కొండజూటూరు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వేదిక సిద్ధంగా ఉంది. అంతకు ముందే నంద్యాల డివిజన్ పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్ల నుండి రెండు వందల మండి దాకా పోలీసులు, ఎనిమిది మంది ఎస్.ఐ.లు, నలుగురు సి.ఐ.లు, ఒక డియస్పీ స్థాయి అధికారి బందోబస్తును పర్యవేక్షిస్తూ బయటి నుండి వచ్చే వాళ్ళ వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా పరిశ్రమ శాఖ అధికారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, ఆర్.డి.ఓ, తాసిల్దారు, తదితర అధికారులు, గ్రామ సర్పంచ్ తో పాటు ఆ ఊరి సమీపంలో ఏర్పాటు చేయబోయే రసాయన పరిశ్రమ చైర్మెన్ శాంతిరాముడు వచ్చారు. వచ్చీ రాగానే కలెక్టర్ గ్రామస్తులనుద్దేశించి ‘టిఫిన్లు తిన్నారా’ అని అడిగారు. “మీ ఊరికి రోడ్డెందుకు వేయలేదు? ఇంత బురద ఏమిటి? వెంటనే పరిష్కరించాలి అని అధికారులను హడావుడి పెట్టించారు. ఏమైనా సమస్యలుంటే చెప్పండని గ్రామస్తులను అడిగారు. వాళ్లేవో చెప్పుకుంటే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఇంతకూ శాంతిరాం నేనో కెమికల్ ప్రాజెక్ట్ రావటం ఎంత మందికి ఇష్టమో చేతులెత్తండి అంటే ఒక్కరూ కూడా ఎత్తలేదు. శాంతిరాముడు, అతని కొడుకులు, వారు వెంటతెచ్చుకున్న గూండాలు అసహనంతో ఊగిపోయారు. ఆడవాళ్ళను బూతులు తిట్టారు. నేనో కెమికల్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండే వ్యక్తిపై దాడి చేయబోయారు. మహిళలు తిరగబడ్డారు. రాళ్ళు తీసుకుని వెంటబడ్డారు. అధికారులు, పెట్టుబడిదారులు వారి అనుయాయులు పోలీసు రక్షణలో అక్కడి నుండి బైట పడ్డారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ ఊరు పోలీసు పహారాలోకి పూర్తిగా వెళ్లిపోయింది.
సింగపూర్ కు చెందిన నానోమెటీరియల్స్ టెక్నాలజీ కంపెనీ, ఇక్కడి శాంతిరామ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో 2015 లో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం మేరకు సింగపూర్ వారి సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ నానో ప్రెసిపిటేటెడ్ కాల్షియంకార్బోనేట్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయబోతున్నారు. నిజానికి ఇక్కడ జరుగుతున్నది సింగపూరు కంపెనీకి అవసరమైన భూమి, నీరు, ఇతర వనరులను చవకగా ఏర్పాటు చేయడం. విదేశీ కంపెనీలకు ఇండియాలో అన్ని వనరులతో పాటు చట్టాలు, ప్రభుత్వ విధానాలూ చవకే. కావాల్సినన్ని రాయితీలు ఇస్తారు. (‘మేకిన్ ఇండియా’ అని మనవాళ్లు బతిమాలుతున్నారు కూడా.) అందుకని అభివృద్ధి చెందిన దేశాలలో కన్నా ఇక్కడ పర్యావరణ అనుమతులను తక్కువ ఖర్చుతో పొందవచ్చు. నిర్వహణ కూడా సులువే. నిబంధనలు పాటించకపోయినా పట్టించుకోరు.
నేనో పరిశ్రమ కోసం శాంతి రామ్ కంపెనీ 150 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ ఏడాది ఫిబ్రవరిలో కొనింది. ఇక గ్రామ సభల అనుమతుల కోసం రాజకీయాలు మొదలయ్యాయి. ఆ భూమి పాణ్యం మండలం కొండజూటూరు గ్రామ ప్రరిధిలో ఉంది. అది నీటి వసతి ఉన్న గ్రామం. కొండజూటూరు చెరువులో నీరు పుష్కలం. ఒకప్పుడు రెండు నెలలకు మించి అందులో నీరు ఉండేవి కావని, ఇప్పుడు కాలువ నీళ్ళు వస్తున్నందున చెరువు నిండుగా ఉంటోందని గ్రామ ప్రజలు చెప్తారు. రాయలసీమ సాధారణ స్థితికి భిన్నంగా, చాలా విచిత్రంగా ఊరికి మూడు వైపులా నీళ్లున్నాయి. ఏడాదికి రెండు పంటలు పుష్కలంగా పండుతున్నాయి. సుప్రసిద్ధమైన కర్నూలు సోనా మసూరి బియ్యం ఇక్కడి 90 శాతం పొలాల్లో సాగవుతోంది. నాణ్యత రీత్యా ఇక్కడి బియ్యం మొదటి శ్రేణిదని గ్రామస్తులు చెప్తున్నారు. ఇటు వంటి చోట ఒక ఫ్యాక్టరీ పెడుతున్నారని తెలిస్తే సాధారణంగా ఎటువంటి స్పందన వస్తుందో అదే వచ్చింది. ఇప్పుడు పరిశ్రమ కడుతున్న స్థలానికి 10 అడుగుల దూరంలో శ్రీశైలం కుడి కాలువ (ఎస్.ఆర్.బి.సి) ఉంది. కిలోమీటర్ దూరంలో గోరుకల్లు రిజర్వాయర్. గ్రామాలకు ఆదరువుగా కొండజూటూరు చెరువు, వద్దిగాండ్ల చెరువు. ఈ చెరువుల్లో నీటి ఊట ఎప్పుడూ ఉంటుంది. నేనో పరిశ్రమ వల్ల మొట్టమొదట ఇక్కడి సాగునీటి వనరు మీద దెబ్బ పడుతుంది. నీటి వనరు చూసుకునే పరిశ్రమ కోసం ఇక్కడ స్థలం సంపాదించుకున్నారన్నది ఎవరికైనా అర్థమవుతుంది. అదొస్తే ఎంత నీరు తోడేస్తారు అన్నది మొదటి ప్రశ్న. రెండోది ఈ నేనో టెక్నాలజీ, నేనో ప్రిసిపిటేటెడ్ కాల్షియం కార్బొనేట్, దాన్ని ఉత్పత్తి చేసే విధానం వంటి వాటి గురించి గ్రామస్తులే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, వివిధ పార్టీల వాళ్ళు కూడా ఎప్పుడూ విననైనా వినలేదు. దీనివల్ల ఏ కాలుష్యమూ ఉండదు అని తప్ప గ్రామస్తులు అడిగిన ఇంకే విషయాలు అధికారులు చెప్పలేదు. దీని వల్ల ఇక్కడి ప్రజలకు ఎంత ఉపాధి దొరుకుందని అడిగితే దానికీ అధికారుల వద్ద సమాధానం లేదు.
నేనో కెమికల్ పరిశ్రమ ప్రభావం కిందకి రాబోయే అతి సమీప గ్రామం కొండజూటూరు అయితే దాని చుట్టుపక్కల గ్రామాలు గోరుకల్లు, గొట్టాల, బలపనూరు, కౌలూరు, బాపణపాడు, వడగండ్ల, రసూల్ పేట, నేరవాడ, సుగాలిమెట్ట, రాంభూపాల్ రెడ్డి తాండ, ఆలమూరు, పాణ్యం, కొనిదేడుగ, గోపవరం. ఫ్యాక్టరీకి స్థలం కొన్న తర్వాత కాంపౌండ్ గోడ నిర్మాణం మొదలయ్యింది. ఎక్కడైనా పరిశ్రమ పెట్టాలంటే పాటించాల్సిన సాధారణ సూత్రాల గురించి ప్రజలు అడిగారు. గ్రామ సభల అనుమతి, పర్యావరణ ప్రభావ అంచనా ఏమీ లేకుండా కట్టడాలు ఎలా మొదలు పెడతారన్నది చాలా న్యాయమైన ప్రశ్న. అధికార్లులను, ఆ ఊరికొచ్చే, రాజకీయ నాయకులను, ప్రజాప్రతినిధులను ఈ విషయమై ఎన్నో సార్లు నిలదీశారు. ప్రజలకు నష్టం కలిగే పని మేమెప్పుడూ చేయం అని అందరూ చెప్తారు. అదే సమయంలో శాంతిరాముడి పనులకు ఆటంకం కలగకుండా చూసుకుంటారు. ఇట్లా ఉంటే జనం ఏం చేస్తారు? నిర్మాణాన్ని అడ్డుకున్నారు. కొండజూటూరు, బలపనూరు, వద్దిగాండ్ల, రసూల్ పేట్ గ్రామాలు నేనో కెమికల్ ఫ్యాక్టరీ కట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో తాము అనుమతించమని గ్రామ సభలు పెట్టుకొని తీర్మానించాయి. ఆరు గ్రామాలకు చెందిన 700వందల మంది రైతులు కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి తమ అభ్యంతరాలు ఒక్కక్కొరూ ఒక్కో పేపర్ చొప్పున 700 వినతి పత్రాలు రాసి అందజేశారు.
మరి పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికార్లు ఏం చేశారు? శాంతిరాముడి మనుషులు ఊర్లల్లో డబ్బులు పంచడం, కులపరంగా గుంపులు చేయడం, గ్రామస్తులను చీల్చి గొడవలు సృష్టించడం చేస్తుంటే కొందరు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇట్లా డబ్బులు పంచుతున్నారు సార్ అంటే ‘ఎలెక్షన్ కోడ్ ఏమైనా ఉందా అని పోలీసు అధికారి వెటకారం చేస్తాడు. శాంతిరాముడి మనుషులు నాపై దాడి చేశారంటే ‘అసలు నువ్వే దాడి చేశావని ఫిర్యాదు ఉంది’ అని ఎస్.ఐ అంటాడు. అంత నీతిగా ఫ్యాక్టరీ కడుతుంటే డబ్బులెందుకు పంచుతున్నారు అని గ్రామస్తుల ప్రశ్న. శాంతిరాముడి పట్ల అధికారుల ఎల్లలు దాటిన సేవాతాత్పరత చూసి ఏమనుకోవాలి అని ప్రశ్న. జిల్లాలో ఇప్పటికే ఎస్.పి.వై రెడ్డికి చెందిన ఆల్కైడ్ ఫ్యాక్టరీ చేస్తున్న కాలుష్యం చూస్తున్నారు. భూగర్భ జలాన్నంతటినీ తోడేసి అదే ఎస్.పి.వై రెడ్డి తక్కువ ధరకు మినరల్ వాటర్ సప్లై అని మాట్లాడుతున్న వైనం చూస్తున్నారు. ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీ కాలుషమూ చూస్తున్నారు. ఎక్కడా పారదర్శకత లేకపోవడం, అడుగడుగునా నిర్లక్ష్యం, ప్రజల ఆరోగ్యాల పట్ల, ప్రాణాల పట్ల లెక్కలేని తనం కనపడుతూనే ఉంది.
దీనికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) కర్నూలుకు చెందిన పర్యావరణ ఇంజనీరు ‘అసలు ఈ నేనో ప్రిసిపిటేటెడ్ కాల్షియం కార్బొనేట్ పరిశ్రమకు ప్రజాభిప్రాయ సేకరణ, పర్యావరణ అనుమతి అక్కర్లేదు’ అంటారు. అయితే ప్రజలకు కొన్ని అపోహలున్నాయని, అనవసరంగా భయబ్రాంతులకు గురై ఫ్యాక్టరీ పనులు అడ్డుకుంటున్నారని, అందువల్ల ఒక కమిటీని నియమించి, వారి ద్వారా గ్రామ ప్రజల అభ్యంతరాలు తీసుకోవాలని కర్నూలు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నిర్ణయించారు. ఈ కమిటీలో కర్నూలు పర్యావరణ ఇంజనీరు, నంద్యాల ఆర్.డి.ఓ, జిల్లా వైద్య అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, అనంతపురం జె.ఎన్.టి.యు ఇంజనీరింగ్ కాలేజ్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం బాధ్యులు ఉన్నారు. ఈ కమిటీ గ్రామంలో పర్యటించినప్పుడు గ్రామస్తులు అడిగిన వేటికీ సంతృప్తికరంగా సమాధానాలు చెప్పలేకపోయారు. గ్రామస్తులు తమ అభ్యంతరాలను కమిటీకి రాతపూర్వకంగా అందజేశారు. వినతులు, నిరసనలు, ప్రదర్శనలు ఎన్నో అయ్యాయి. అధికార పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ప్రజల ఆందోళనలకు మద్దతు తెలిపాయి. మరోవైపు డబ్బులు పంచడం వల్ల ఊర్లల్లో శాంతిరాముడి మాద్దతుదారులు కూడా తయారైనారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 2న జరిగిన ఒక సభలో ఘర్షణ జరిగింది. పోలీసులు కేసులు నమోదు చేశారు. పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్న బాలప్పకు చంపుతామని, హైకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవాలని బెదిరింపులు వచ్చాయి.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో గ్రామస్తుల ఆందోళన, అధికారుల వ్యవహార శైలి, శాంతిరాముడి అత్యుత్సాహం అన్నీ వేదిక ముందు ప్రదర్శితమయ్యాయి. గ్రామస్తులు ఎంతగా ఉద్వేగానికి లోనయ్యారంటే ఒక యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని కలెక్టర్ ముందుకొచ్చాడు. ఒక మహిళ పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించిది. మరెవరికో దేవత పూనింది. ఇంకొకరు నీళ్ళ ట్యాంకు ఎక్కారు. శాంతిరాముడు, అతని కొడుకు, వారి అనుయాయులు జనాల్ని నోటికొచ్చినట్లు తిట్టారు. జనం తిరగబడ్డారు. ఆ రోజలా ముగిశాక హఠాత్తుగా ఒక రోజు రాత్రి (సెప్టెంబర్ 28) బాలప్ప భార్య సురేఖ (28) ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు తనపై కేసు నమోదు చేయడం, శాంతిరాముడి మనుషులు భర్తను నిరంతరం బెదిరించడం వల్ల మానసిక ఒత్తిడితో ఆమె ఆత్మహత్య చేసుకుంది. కొద్ది రోజుగా బాలప్పను ఏమైనా చేస్తారనే భయంతో హైదరాబాద్ వెళ్ళిపోయి ఉద్యోగం చూసుకోమని చెప్పింది సురేఖ. అంతలోనే అక్కడ ఒంటరివాడు కదా, దాడి చేసినా దిక్కు ఉండదని, పైగా ఊర్లో జనం అమ్ముడుపోయాడని అనుకొంటారేమోనని రకరకాల ఆందోళనలతో కుంగిపోయింది. దీనికి తోడు తనపై పోలీసు కేసు. సురేఖ ఆత్మహత్యకు శాంతిరాముడి మనుషులు, పోలీసుల వేధింపులే కారణమని గ్రామస్తులు మృతదేహంతో జాతీయ రహదారిపై దాదాపు ఆరు గంటలపాటు ధర్నాకు దిగారు. పోలీసు అధికారులు దిగి వచ్చి 11 మందిపై కేసులు నమోదు చేసి ఎస్.ఐ పై చర్యలు తీసుకుంటామని, చెప్పడంతో ఆందోళన విరమించారు. దీనంతటికీ కారణం శాంతిరాముడు, అతని ఫ్యాక్టరీ కనక గ్రామస్తులు పట్టుబట్టి సురేఖ శవాన్ని ఫ్యాక్టరీ స్థలంలో పూడ్చి పెట్టారు. ఒక ప్రాణం పోయాకైనా ఇదిలా ముగిసిపోవాలని అమాయకంగా వాళ్లనుకుని ఉంటారు. కానీ పెట్టుబడి కేవలం భావోద్వేగాలతో, సెంటిమెంట్లతో నిలిచిపోయేది కాదు.
అర్ధరాత్రి జనమంతా నిద్రలో ఉండగా పోలీసులు, రెవెన్యూ అధికారులు శవాన్ని తవ్వి తీసి ఎదురుగా ఉన్న జాగాలో పూడ్చారు. ఉదయాన్నే జిల్లా ఎస్.పి కొత్త సమాధి వద్దకు పోయి నివాళులర్పించి, బాలప్పను పరామర్శించి గ్రామంలో సమావేశం పెట్టి.. ఆవేశం అనార్థాలకు దారి తీస్తుందని, వారి ఆందోళన శాంతియుత పద్ధతుల్లో ఉండాలని హితవు చెప్పారు. కర్నూలు, కడప జిల్లాల నుండి 700 మంది పోలీసులు అక్కడ మోహరించారు. నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. సెప్టెంబర్ 29న తాసిల్దారు జారీ చేసిన 144 సెక్షన్ ఉత్తర్వుల్లో సురేఖ ఆత్మహత్య తదనంతర పరిణామాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. సెప్టెంబర్ 14వ తేదీ ప్రజాభిప్రాయ సేకరణ సభలో జరిగిన ఘర్షణను గురించి ప్రస్తావిస్తూ 70 శాతం మంది ప్రజలు ఫ్యాక్టరీకి అనుకూలంగా ఉన్నారని, ఫ్యాక్టరీ వ్యతిరేకులకు వారికి తరచూ ఘర్షణ జరుగుతూ ఉన్నాయని రాశారు.
మరోవైపు సెప్టెంబర్ 14 జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏ ప్రమాణాలు పాటించలేదని, కనీసం ప్రజలకు నెలరోజుల ముందు తెలియపరచడం, పత్రికల్లో ప్రకటించడం వంటిది కూడా చేయలేదని, ప్రర్యావరణ ప్రభావ అంచనా గురించిన నివేదిక కూడా తయారు చేయలేదని ప్రజలు, ప్రజా సంఘాలు అంటే అసలు ఆ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణే అవసరం లేదని, ఆ రోజు జరిగిన సభ కేవలం ప్రజల అనుమానాలు నివృత్తి చేయడానికి ఏర్పాటు చేసినదని అధికారులు అంటారు. ఫ్యాక్టరీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి ఉందా అని ప్రజలు అడిగితే అసలటువంటిదేమీ అవసరం లేదన్నది శాంతిరామ్ సమాధానం. ఇదే మాట పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా అన్నది. కానీ చివరికి ఫ్యాక్టరీకి అనుమతినిస్తూ (ఎందుకైనా మంచిదనేమో) కాగితాలిస్తుంది.
ఇంతకూ ఏమిటీ నేనో ప్రెసిపిటేటెడ్ కేల్షియం కార్బోనేట్? అది కాలుష్యకారక రసాయనం కాదని అధికారులు చెప్తున్నది ఎంత వరకు నిజం? కేల్షియం కార్బొనేట్ అంటే మనందరికీ తెలిసిన సున్నం. నేనో (nano) అనేది దాని పరిణామాన్ని సూచిస్తుంది. నేనో సైజు అంటే మిల్లీ మీటర్ లో 10,00,000వ వంతు. అంటే నేనో మీటర్ తో పోలిస్తే మిల్లీమీటర్ పది లక్షల రెట్లు పెద్దది. పదార్థాన్ని అంత చిన్న సైజులో తయారు చేస్తే నేనో పార్టికల్ అంటారు. కేల్షియం కార్బోనేట్ ను ప్రిసిపిటేషన్ పద్ధతి ద్వారా అంత సన్నటి పరిమాణంలోకి మారుస్తారు. ఈ తయారీ విధానంలో మరికొన్ని రసాయనాలు వాడొచ్చు. ఏవి వాడతారు, ఏ రసాయన సమ్మేళనం జరుగుతుంది, దాని వల్ల చుట్టుపక్కల ఎటువంటి ప్రభావాలు ఉండొచ్చు వంటివేమీ కంపెనీ వారు వెల్లడి చేయలేదు. ప్రెసిపిటేటెడ్ కేల్షియం కార్బోనేట్ కాగితపు పరిశ్రమలో, రబ్బర్ తయారీలో, ఆఫ్ సెట్ ప్రింటింగ్ ఇంక్ వంటి చాలా వాటిల్లో ఇటీవల వాడుతున్నారు. సాధారణ కెమికల్ స్థానంలో నేనో కెమికల్ వాడితే నాణ్యత ఎన్నో రెట్లు పెరుగుతుందని చెప్తారు.
సాధారణ
సున్నానికి దీనికి తేడా ఏమిటి అంటే దీని పరిమాణం అంత సన్నదిగా ఉంటుంది కాబట్టి ఇది
శరీరంలోని చాలా భాగాల్లోకి సులువుగా చొచ్చుకుపోగలదు. మామూలుగా మన శరీరంలో అనేక
ద్వారాల్లో దుమ్ము, ధూళి వంటి పదార్థాలను
ఫిల్టర్ చేసే రక్షణ కవచాలు ఉంటాయి. అవేవీ ఈ నేనో సైజులో ఉండే పదార్థాలను ఆపలేవు. శ్వాస
ద్వారా ఊపిరి తిత్తుల్లోని ఆల్వియోలి కణాలదాకా అవి చేరగలవు. నేరుగా చర్మ
రంధ్రాల్లోకీ వెళ్లిపోగలవు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నేనో పదార్థాలు ఏవైనా సరే
అవి విషపదార్థాల(టాక్సిక్) వంటివే. అట్లాగే అవి పర్యావరణానికి హాని చేసేవే. డబ్యూ.హెచ్.ఓ
(ప్రపంచ ఆరోగ్య సంస్థ) నేనో కెమికల్ పదార్థాల వల్ల మనుషుల ఆరోగ్యాలపై
దుష్ప్రభావాలను నిర్ధారించింది. కేలిఫోర్నియా యూనివర్సిటీ దీని మీద చాలా పరిశోధన
చేసింది. నేనో కెమికల్ వల్ల రిస్క్ ఉంటుందనే అన్ని పరిశోధనలు చెప్తున్నాయి. వీటి
మీద ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ స్థితిలో ప్రపంచంలో ఎక్కడా లేనంత భారీ
పరిశ్రమను కర్నూలు జిల్లాలో పెట్టబోతున్నారు. ఇక్కడి సున్నపు రాయి నిక్షేపాలు, చవకగా భూమి, రెడీగా ఎస్.ఆర్.బి.సి
కాలువ నీళ్ళు, అన్నిటికీ మించి అల్ప
స్థాయి నాణ్యతా ప్రమాణాలు సింగపూరు కంపెనీకి, మన దళారీ శాంతిరామ్ కంపెనీకి
లాభదాయకంగా ఉంటాయి. ఇంతకూ ఫ్యాక్టరీ కోసం సున్నపు రాయి గనులు ఎక్కడ
కేటాయించబోతున్నారన్న ప్రశ్నకూ సమాధానం లేదు. ఏదడిగినా చెప్పారు. నోరు మూసుకుని
రానున్న రిస్క్ ను మోయాల్సింది ఇక్కడి ప్రజలు. అధికారికంగా, అనధికారికంగా లాభాలు
పంచుకునేది కంపెనీ యజమానులు, వారికి సేవ చేసే
అధికారులు. కట్టక ముందే నేనో కెమికల్ ఒకరిని బలి తీసుకుంది. ఇప్పుడే శాంతిరాముడి
ఆగడాలు, అధికారుల తీరు ఇట్లా
ఉన్నాయి. ఇక కెమికల్ ఫ్యాక్టరీ వస్తే తమ పరిస్థితి ఏమిటి? ఈ స్థితిలో ఇక్కడి ప్రజలు
తమ ఆందోళకు మద్దతుగా నిలవమని ప్రతిపక్షాలను, ప్రజాస్వామికవాదులను
కోరుతున్నారు. ఇది ఒక్క కొండజూటూరు కథే కాదు.
కార్పొరేట్ అనుకూల, ప్రకృతి వినాశకర ప్రభుత్వ
విధానాల వల్ల ఇంచుమించు ఇలాంటివే అనేక ఊర్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి.
(అరుణతార డిసెంబర్ 2016)

No comments:
Post a Comment