Saturday, December 9, 2017

పొగచూరిన దేశం

చీపుళ్లు పట్టుకొని స్వచ్చ భారత్ అంటూ మీడియాకు ఫోజులిచ్చే నాయకుల చెంప ఛెళ్లుమనిపించేలా ప్రశ్నించింది ఢిల్లీ పొగమంచు. గాలి కూడా విషాన్ని మోసుకొస్తుంటే ఇక మాట్లాడండి స్వచ్ఛత గురించి అని. ఈ నవంబర్ నెలలో మొత్తం భూమ్మీదే అత్యంత కలుషిత నగరంగా రికార్డుల్లోకెక్కింది ఢిల్లీ. దేశ రాజధానిలో గాలి పీల్చడం అంటే ఖర్చు లేకుండా రోజుకు యాభై సిగరెట్లు తాగడంలో సమానం. స్వయంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాటల్లో చెప్పాలంటే సిటీ ఒక గ్యాస్ ఛాంబర్ అయింది.

ఇది హఠాత్తుగా ఊడిపడిన ప్రకృతి వైపరిత్యం కాదు. భారతదేశపు నగరాల్లో గాలి కాలుష్యం ప్రమాదపు అంచును చేరుకుంటున్నదనే చర్చ కూడా ఇవాల్టిది కాదు. ఢిల్లీకి ఉన్న ప్రత్యేక నైసర్గిక, వాతవరణ పరిస్థితుల వల్ల చలికాలం వచ్చేసరికి పొగమంచు కమ్ముకోవడం కూడా కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. వేరువేరు మూలాల నుండి వెలువడే కాలుష్య కారకాలు గాలిలో కలిసాక, అవి సుదూరంగా వ్యాపించి చెదిరిపోకుండా మంచు అడ్డగిస్తుంది. అవి మంచుతో కలిసిపోయి చిక్కటి పొగమంచుగా అలముకుంటుంది. మంచు కరిగిపోయేదాకా ఆ కలుషితాలు దట్టంగా ముసురుకుంటాయి. ప్రతిసారీ జనం కొన్ని రోజులు విషపు గాలిని పీల్చి చస్తూ బతకడం, తర్వాత మంచు కరిగి, వర్షం పడి తెరిపివ్వడం తప్ప కాలుష్య కారకాలను తగ్గించే దిశగా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నది లేదు. రెండు మూడేళ్ళ నుండి ఇది జాతీయ, అంతర్జాతీయ వార్త అయిపోయి చర్చోపచర్చలు జరుగుతున్నాయి కానీ పరిష్కారం వైపు ఒక్క అడగు కూడా పడలేదు. ఒక్క దీపావలి టపాసులు నిషేధించడం తప్ప. ఒక రకంగా మనుషుల ప్రాణాలను అలా గాలికి ధూళికి వదిలేసారు. ప్రకృతి దయాదాక్షిణ్యాల వల్ల మంచు తొలగి జనం ఊపిరి పీలుస్తున్నారు. ఈ అవస్థ ఏడాదికేడాదికి పెరిగిపోతున్నది.

ఈ ఏడాది కూడా అంతే. నవంబర్ మొదటి వారం దాటిందో లేదు యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై 20 మీటర్ల సమీపంలో ఉన్న వాహనాలు కూడ కనిపించనంత దట్టమైన పొగమంచు. ధూళితో నిండిపోయిన మంచుతెరల మాటున దారి కనిపించక రోడ్డు ప్రమాదాలు. ఈసారి గాలిలో సూక్ష్మ ధూళికణాలు పరిమతికి మించి ఎన్నో రెట్లు అధికమయ్యాయి. పి.యం 2.5 గా (2.5 మైక్రాన్ల పరిమాణం ఉండే ధూళి కణాలు) చెప్పబడే సూక్ష్మ ధూళికణాలు సాధారణ మోతాదుకు అయిదు నుండి పది రెట్లు ఎక్కువయ్యాయని కాలుష్య నివేదికలు తెలిపాయి. పి.యం 2.5 పరిమితి ఎక్కువలో ఎక్కువ 60 మెక్రాన్లు ఉండాలి. (మిల్లీ మీటర్ లో వెయ్యోవంతును మైక్రో మీటర్ లేదా మైక్రాన్ అంటారు. ఒక వెంట్రుక మందం సుమారుగా 10 మైక్రాన్లు.) పి.యం 10 పరిమితి 100 మైక్రాన్లు. నవంబర్ 7న వీటి పరిమాణం అత్యధికంగా 999 మైక్రాన్లకు చేరింది. నవంబర్ 8న పి.యం 2.5 449 మైక్రాన్లు, పి.యం 10 663 మైక్రాన్లుగా నమోదయ్యింది. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ కూడా మోతాదుకు మించి ఎన్నో రెట్లు ఢిల్లీ వాతావణాన్ని ఆవరించాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనిని పర్యావరణ అత్యవసర స్థితిగా పేర్కొంది. 

వారం రోజులు పైగా ఢిల్లీ ప్రజలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. విషగాలి ఊపిరితిత్తుల్లో చేరి ఆస్తమా, అలర్జీల బారిన పడ్డారు. కళ్లు మంటలు పుట్టి నానా అవస్థలపాలయ్యారు. చర్మ సమస్యలు అదనం. ఇవి తక్షణ సమస్యలు మాత్రమే. క్యాన్సర్ కు కారణమయ్యే విషపదార్థాలు గాలిలో అన్ని రోజులపాటు ఉండటం వల్ల దీర్ఘకాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. గాలిలో అధిక మోతాదులో చేరిన వాయివుల వల్ల సగటు మనిషి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటున్నది. ముఖ్యంగా చిన్న పిల్లల మీద మరింత ప్రభావం పడుతున్నది. ఎందుకంటే వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. మొత్తం మీద దేశ రాజధానిలో జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. నిజానికి పొగమంచు సీజన్ పక్కన పెట్టినా ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో ఢిల్లీ 11వ స్థానంలో ఉంది.

ఇంతటి కాలుష్యానికి కారణం ఏమిటి? దీన్నెలా నివారించవచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చిన్న పిల్లల సైన్స్ పుస్తకాల్లో కూడా ఉంటుంది. కాని ఆచరణలో అది వ్యవస్థలోని రుగ్మతలతో ముడిపడినది. ఒకే చోట కేంద్రీకృతమైన పరిశ్రమలను, కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా, ఒక పద్ధతి, పాడూ లేకుండా వ్యర్థాల్ని గాలిలోకి, నీటిలోకి వదులుతూ వాటిని నడిపే పెట్టుబడిదారుల్ని నియంత్రించాలి. కానీ మన పాలకులు 'మీ కోసం మా చట్టాల్ని చెత్త బుట్టలో పడేస్తాం' అని బహుళజాతి కంపెనీలకు సాష్టాంగపడతారు. ఉన్న ఊర్లో ఉపాధి దొరకక లక్షలాదిగా పట్టణాలకు తరలిపోయే జనం, కిక్కిరిసిన రోడ్లు, వాహనాలు, దుమ్ము, ధూళి ఏం చేస్తే తగ్గుతుంది? దీనికి తోడు ప్రజా రవాణా వ్యవస్థ కన్నా ఎన్నో రెట్లు మోటారు వాహనాలు కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తున్న పెట్టుబడి అనుకూల విధానాలు. ఇక్కడొక చిన్న విషయం. టాటా కంపెనీ డీజల్ కార్లను ప్రవేశపెట్టేటప్పుడు పర్యావరణవాదులు కోర్టుకెళ్లారట. అన్నేసి డీజల్ వాహనాలు పర్యావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తాయని. (పెట్రోలు కన్నా డీజల్ చాలా ఎక్కువ మోతాదులో కలుషితాలను విడుదల చేస్తుంది) కొద్ది రోజులు సుప్రీం కోర్టు స్టే విధించింది. కానీ టాటాల లాబీ ముందు ఆ కేసు ఎక్కువ కాలం నిలవలేదు. పదేళ్లు తిరక్కముందే ఇప్పుడు పొగమంచు సందర్భంలో డీజల్ వాహనాల మీద చర్చ జరుగుతోంది. అట్లాగే బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాల గురించి కూడా చర్చ ఉంది. బదరీ పూర్ థర్మల్ కేంద్రం మూసేయాలని చాలా కాలంగా పర్యావరణవాదులు డిమాండ్ చేస్తున్నారు. కానీ పొగమంచు సమయంలోనే దాన్ని మూసేశారు. అది కూడా 2018 జనవరి 31 వరకు మూసేయాలని ఆదేశించారు.

ఇవన్నీ అలా ఉంటే ఇప్పుడు అన్నిటి కన్నా ఎక్కువగా రైతులు పంట వ్యర్థాల్ని పొలాల్లో కాల్చేయడం గురించి చర్చ నడుస్తోంది. పంజాబ్, హర్యాణా రాష్ట్రాల్లో వరి, గోధుమ పంటల కోత అయ్యాక మిగిలిన వ్యర్థాల్ని పొలంలోనే కాల్చేసి వెంటనే ఇంకో పంట వేయడానికి సిద్ధమవుతావు. ముఖ్యంగా అక్టోబర్ చివరికి వరి చెత్త తొలగించేసి నవంబర్ రెండోవారం ముగిసేలోగా గోధుమ పంట వేస్తారు. ఇక్కడ సంవత్సరానికి రెండు, మూడు పంటలు వేయడం చాలా మామూలు విషయం. పంటకు, పంటకు మధ్య సమయం తక్కువగా ఉండటం, కూలీలకయ్యే ఖర్చు వల్ల పొలంలోనే వ్యర్థాల్ని కాల్చేయడం రైతులకు సులువైన పని. ఈ పద్ధతి చాలా రాష్ట్రాల్లో ఉంది. అయితే ఢిల్లీకి సమీపంలో ఉండడం, గాలి వీచే దిశ వల్ల కూడా పంజాబ్, హర్యాణా పంట పొలాల నుండి వచ్చే పొగ అసలే కాలుష్యం అధికంగా ఉండే రాజధానిని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోందని అంటున్నారు. రైతులు నచ్చజెప్తే వినడం లేదని ఈ మధ్య కేసులు కూడా నమోదు చేస్తున్నారు. దీంతో మీ పరిశ్రమల వల్ల, వాహనాల వల్ల వచ్చే కాలుష్యాన్ని పక్కనబెట్టి మామీద పడతారేంటని రైతులు ఆగ్రహిస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్, హర్యాణా రాష్ట్రాల్లో వేరు వేరు పార్టీలు అధికారంలో ఉండడం వల్ల ఇది పరస్పరం ఆరోపణలు చేసుకునే అవకాశాన్నిచ్చింది. ఏ కారణం వల్ల ఎంత కాలుష్యం అని అధ్యయం చేసి నివేదికలిచ్చే సంస్థలు ఆయా కేంద్రాల, సమూహాల వాదనా ప్రయోజనాలకు తగ్గట్టు వ్యాఖ్యానిస్తున్నాయి. నిజానికి పంట వ్యర్థాల్ని పొలాల్లో కాల్చే విధానం శాస్త్రీయమైనది కాదు. అది మట్టి నాణ్యతను కూడా దెబ్బతీస్తుంది. అయితే రైతులకు ఇది ఖర్చుతో ముడిపడిన వ్యవహారం. అంటే పెట్టుబడి, మార్కెట్లో గిట్టుబాటు ధరతో ముడిపడి ఉంది. ఈ మౌలిక సమస్య తీరక దేశంలో లక్షలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

వీటన్నిటి మధ్య ఒక్క నిర్ణయం మాత్రం కాస్త గట్టిగా తీసుకున్నట్లు కనపడుతోంది. ఢిల్లీలో దీపావలి టపాసుల అమ్మకాల్ని నిషేధించడం వల్ల ఎవరికీ నష్టం ఉండదు అనుకున్నారేమో. గత ఏడాది విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు ఈ ఏడాది కూడా కొనసాగించింది. టపాసులు కాల్చకుండా పండుగ జరుపుకునేలా జనాన్ని ఒప్పించే ఒక ప్రచార కార్యక్రమం కూడా నడిచింది. అయితే హిందుత్వవాదులు మా పండుగకు ఆంక్షలు పెడతారా అంటూ కోర్టు ఆదేశాల్ని ధిక్కరించి మరిన్ని ఎక్కువ టపాసులు కాల్చండి అని విచిత్రమైన ప్రచారాన్ని అందుకున్నారు. ఇప్పుడేమో 'చూసారా, దీపావలి టపాసులు నిషేధించడం వల్ల కాలుష్యం ఏ మాత్రం తగ్గలేదు' అంటూ చంకలెగరేస్తున్నారు. బహుషా ఢిల్లీ పొగమంచును చూసి సంబరపడిపోయిన ఏకైక పరివారం అదే. ప్రతి ఏడాది దేశంలోని ప్రధాన నగరాల్లో దీపావలి మరుసటి రోజు గాలిలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు రెండు రెట్లు అధికమైనట్లు కాలుష్య నివేదికలు చెబుతున్నాయి. సూక్ష్మ ధూళికణాలు అయిదారు రెట్లు అధికంగా నమోదవుతున్నాయి. ఇక శబ్దకాలుష్యం లెక్కలేదు. ధర్మం పేరుతో గాలిని, నీటిని కలుషితం చేయడం కూడా మనోభావాల హక్కుగా దబాయించే అనాగరిక స్థితి ఒక వైపు, పారిశ్రామిక కాలుష్యం ఒక వైపు. ఇది భారతదేశపు అభివృద్ధి ప్రణాళిక వికారమైన ముఖం. రోగం ముదిరిపోయాక మందు వేసినట్లు ఢిల్లీలో పొగమంచు తగ్గించడానికి తాత్కాలిక చర్యలేవేవో చేశారు. చివరికి వర్షం పడ్డాక గానీ నగరం ఊపిరితీసుకోలేదు. మంచు కరిగి చర్చ సద్దుమణగొచ్చు కానీ ఇవాల పర్యావరణం దేశంలో కీలక సమస్య అయింది. అది నేరుగా ప్రజల జీవించే హక్కుతో ముడిపడి ఉంది. ప్రధాన నగరాలన్నీ కాలుష్యాన్ని భారంగా మోస్తున్నాయి. పర్యావరణ చట్టాలు మాత్రం అన్ని ప్రజాప్రయోజన చట్టాల కన్నా హీనంగా తయారైనవి. హైదరాబాద్ కాలుష్యం కొన్ని ఏరియాల్లో ఢిల్లీ స్థాయిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలోనే పర్యావరణ చట్టాలను కాల్చి బుగ్గి చేసి పడేశాడు గొప్ప విజన్ ఉన్న చంద్రబాబు.

ఒకప్పుడు కాలుష్యం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలు ఎక్కువగా చర్చలోకి వచ్చేవి. ఇప్పుడది మూడో ప్రపంచ దేశాలకు మారింది. అక్కడ అంతా బాగుందని కాదు కానీ ఆ సమాజాల్లో అంతో ఇంతో పర్యావరణ చైతన్యం అభివృద్ధి చెందింది. ఇప్పుడు ధనిక దేశాలు కాలుష్య కారక పరిశ్రమల్ని ఇండియా లాంటి దేశాల్లో పెట్టడానికి మొగ్గు చూపున్నాయి. పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన దేశం కదా మరి. స్వచ్చభారత్ గురించి జిఇఎస్ సదస్సులో ప్రస్తావించాడు మోడీ. దేశవిదేశీ పెట్టుబడిదారులు ప్రజల శ్రమనంతా పీల్చి వదిలే వాయువులు భోపాల్ గ్యాస్ లా, అణువిద్యుత్ రేడియేషన్ ఎంత స్వచ్చమో!

(అరుణతార, డిసెంబర్ 2017)

 

No comments:

Post a Comment

ప్రకృతి విధ్వంసక ఇ.ఐ.ఎ. 2020

లాక్ డౌన్ సమయంలో బహిరంగ కార్యకలాపాలన్నీ రద్దయిపోయాయి. సమావేశాలన్నీ ఆన్లైన్ మాధ్యమానికి పరిమితమైపోయాయి. అన్ని రకాలుగా చీకటి ఆవరించిన స్థి...