దక్షిణ భారతదేశానికి ప్రాకృతిక రక్షణ కవచం వంటి నల్లమల గర్భంలో అపారమైన జీవశక్తి ఉంది. అది అడవికి సహజంగా ఉండేదే. ఈ జీవశక్తే మనుషులకు, పశుపక్ష్యాదులకు, వృక్షాలకు ఆధారం. రోజూ బంగారు గుడ్డు పెట్టే బాతు కడుపులో ఎంత బంగారుందో అని ఒక మూర్ఖుడు దాని కోసి చూసాడని ఒక కథ చెప్పుకుంటాం. నల్లమల గర్భంలో సంపద ఉందని దాన్ని తవ్వేవాడు అటువంటి మూర్ఖుడైతే కాదు కానీ నల్లమలను తవ్వితే మాత్రం దానిలోని జీవశక్తిని తోడేసినట్లే. నల్లమల గర్భంలో ఏమేం ఖనిజాలున్నాయో గాని ఇప్పుడు అణుశక్తి ఇంధనం యురేనియం తవ్వి తీయాలనే ప్రభుత్వ ప్రయత్నం అలజడి రేపుతోంది. అడవుల విధ్వంసం ప్రమాదకరమైతే, అణుశక్తి మరింత ప్రమాదకరమని జనం ఆందోళన చెందడం అత్యంత సహజం.
అణువిద్యుత్ కోసం, అణ్వాయుధాల కోసం వెరసి దేశ రక్షణ, అభివృద్ధి కోసం యురేనియం వెలికితీత ఎంత అవసరమో రేపు రేపు ఈ ప్రాంతాల్లో ప్రభుత్వాలు ప్రచారం చేస్తాయి. అత్యంత అధునాతన టెక్నాలజీ ఉపయోగించి పని చేస్తామని, కాలుష్యం జరక్కుండా చూస్తామని కూడా చెప్తాయి. కాదన్నోళ్లని దేశద్రోహులని కూడా ప్రచారం చేయగలరు. దాన్ని తిప్పికొట్టాలి. అందుకోసం అణుశక్తి శాస్త్రీయ సాంకేతిక అంశాల గురించి, అణురాజకీయాల గురించి కూడా విస్తృతంగా ప్రచారం జరగాలి.
అణుశక్తిని దాని ప్రచండమైన రూపంలో మానవాళి మొట్టమొదట చూసింది రెండో ప్రపంచ యుద్ధంలో. 1945 యుద్ధం ముగిసే సమయంలో అమెరికా జపాన్‌లోని రెండు నగరాలపై అణుబాంబులు వేసింది. ఆగస్టు 6న హిరోషిమా మీద, 9న నాగసాకి మీద జరిగిన అణ్వాయుధ దాడిలో 3 లక్షల మంది చనిపోయారు. లెక్కలేనంత మంది రేడియేషన్ బారిన పడి నరకం చూశారు. ప్రపంచం నివ్వెరపోగా అమెరికా జబ్బచరిచి తన బలం చూపించింది. ఇంతటి ఉన్మత్త మారణకాండకు దారితీసిన శాస్త్రవిజ్ఞానంపై చాలా చర్చలు జరిగాయి. మానవ మేధస్సు ఇంత వినాశకరంగా కూడా ఉండగలదా? సాంకేతికత లక్ష్యం ఏమిటి? శాస్త్రీయ ఆవిష్కరణల ప్రయాణం ఎటు? వంటి ప్రశ్నలు ప్రపంచాన్ని కుదిపేసాయి. జపాన్ ప్రభుత్వమే ముందుకొచ్చి తనతో సహా అణ్వాయుధాల్ని ఎవరూ తయారు చేకూడదని, ఇలాంటి పరిస్థితి భూమ్మీద ఎవరికీ రావొద్దని తీర్మానించింది. అణుశక్తి వంటి అపారమైన శక్తి వనరులను మానవ వినాశనానికి కాక మానవకళ్యాణానికి ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలన్నారు. అప్పటికే అణుశక్తిని ఒక పద్ధతి ప్రకారం నియంత్రించి విద్యుదత్పత్తి చేయొచ్చని కనుగొన్నారు. శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తి అన్న నినాదం అప్పుడే మొదలయ్యింది. 1950ల్లో అణ్వస్త్ర నియంత్రణ ఒప్పందాల్లో చాలా దేశాలు భాగమయ్యాయి.
అయితే పైకి ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా అణుఇంధనం ఉపయోగించి విద్యుదుత్పత్తితో పాటు అణ్వాయుధాల తయారీ పెనవేసుకునే ఉంటుందన్నది బహిరంగ రహస్యం. అణ్వస్త్రపోటీలో చిన్నా పెద్దా దేశాలన్నీ కూరుకుపోయాయి. కూడు లేకపోయినా అణ్వాయుధాలుండడం దేశానికి అత్యవసరం అని భావించే స్థితి తొందరగానే వచ్చింది. అదలా ఉంచితే అసలు అణువిద్యుదుత్పత్తి అయినా ఎంత శాంతియుత ప్రయోజనమో మెల్లమెల్లగా తెలియవచ్చింది. అణువిద్యుత్ కేంద్రాల్లో ప్రమాదం ఎంత విధ్వంసపూరితంగా ఉంటుందో త్రీమైల్ ఐలాండ్, చెర్నోబిల్ దుర్ఘటనలు తెలియజేస్తే అణుధార్మిక శక్తి జీవరాశిని నిశ్శబ్దంగా నాశనం చేస్తుందంటూ అణుకార్యకలాపాల పరిసర ప్రాంతాల్లో జరిపిన అనేక అధ్యయనాలు చెప్పాయి. అణుధార్మిక శక్తి ఉన్న యురేనియం వంటి పదార్థాలను భూమిలో నుండి ఒక్కసారి వెలికి తీస్తే అవి ముడిపదార్థాల స్థాయి నుండి అంతిమ ఉత్పత్తిదాకా రేడియేషన్‌ను విడుదల చేస్తూనే ఉంటాయి.
అణువిద్యుత్ ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా అనేక భయానక అనుభవాలను మిగిల్చింది. 2011లో జరిగిన ఫుకుషిమా (జపాన్) అణుప్రమాదం తర్వాత చాలా దేశాలు అణువిద్యుత్ ఉత్పత్తిని బాగా తగ్గిస్తూ కేంద్రాలను మూసివేయడం ఊపందుకుంది. జపాన్‌లో అణుప్రమాదం జరిగిన రెండున్నర నెలల తర్వాత జర్మనీ ప్రభుత్వం అణుశక్తికి స్వస్తి చెప్తున్నట్లు ప్రకటించింది. ఇటలీ ప్రభుత్వం 2008లో అనుమతిచ్చిన 4 అణువిద్యుత్ కేంద్రాల నిర్మాణాలను 2011 మే చివర్లో నిలిపివేసింది. స్విజర్‌ల్యాండ్ కొత్తగా నిర్మించాలనుకున్న అణువిద్యుత్ కేంద్రాల ప్రతిపాదనను వెనక్కు తీసుకుంది. ఇక జపాన్ 7 రియాక్టర్లను వెంటనే మూసేసి మిగిలినవి కూడ క్రమంగా మూసేయాలని నిర్ణయించింది. నిజానికి 1986 చెర్నోబిల్ దుర్ఘటన, అంతకు ముందు 1979నాటి త్రీమైల్ ఐల్యాండ్(అమెరికా) ప్రమాదం మూలంగా అణుపరిశ్రమ అనివార్యంగా వెనకడుగు వేయాల్సి వచ్చింది. ముఖ్యంగా అమెరికా, యూరోప్ దేశాల్లో వెల్లువెత్తిన ప్రజాందోళనల ఫలితంగా అక్కడ చాలా ముందుగానే అణువిద్యుత్ పరిశ్రమ ఆగిపోయింది. కాని ఆసియా దేశల్లో పురోగమించి ఫుకుషిమా దుర్ఘటన తర్వాత ప్రపంచమంతా అణువిద్యుత్ గురించి పునరాలోచనలోపడింది. ఇది మాత్రమే కాదు. అణువిద్యుత్ ఉత్పత్తి ఖర్చు భారమైపోయి కంపెనీలు సంక్షోభంలో పడ్డాయి. అణువిద్యుత్ చుట్టూ ఉండే ప్రమాదాల నుండి భద్రతా ఏర్పాట్లు చేయడానికి అయ్యే భారీ ఖర్చే దీనికి కారణం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం విద్యుదుత్పత్తిలో సుమారు 11 శాతం ఉన్న అణువిద్యుత్తు 2050 నాటికి 5.6 శాతానికి పడిపోనున్నదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నివేదిక చెప్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉంటే ఇండియాలో అణువిద్యుత్ వాటాను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఇండియా అణురియాక్టర్లను కొనుక్కుంటోంది. వాటి నిర్మాణం, నిర్వహణలో ఆయా దేశాల కంపెనీలతో అనేక భద్రతా పరమైన అంశాలో రాజీపడుతోంది. దేశ ప్రజల ప్రాణాలను ఫణంగాపెట్టి సిగ్గువిడిచి ఈ ఒప్పందాలు చేసుకోవడంలో కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు పోటీపడ్డాయి.
అణుధార్మిక శక్తి ఏమంత ప్రమాదకరం కాదని, అణువిద్యుత్ కేంద్రాలు సురక్షితమేనని ప్రభుత్వాలు ప్రచారం చేయడం తమ దళారీతనంలో భాగమే. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టి సమాజంలో పర్యావరణ చైతన్యం పెంపొందడానికి అణుశక్తి గురించి ప్రాథమిక అంశాలైనా తెలుసుకోవడం అవసరం.
అణుధార్మిక శక్తి (రేడియేషన్) అంటే ఏమిటి?
కొన్ని రకాల మూలకాలకు అణుధార్మిక స్వభావం ఉంటుందని మొట్టమొదట 1896లో హెన్రీ బెక్విరెల్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. సైన్స్‌లో చాలా ఆవిష్కరణల్లాగానే అది అనుకోకుండా జరిగింది. అతను ఒక రాయిని వెలుతురు సోకని ఒక టేబుల్ సొరుగులో పెట్టాడు. అంతకు ముందే ఆ సొరుగులో ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేటు ఉంది. కొన్ని వారాల తర్వాత దానిని బైటకు తీసి డెవలప్ చేసినపుడు అతను పెట్టిన రాయి తాకినంత మేరా దాని మీద కాంతి కిరణాలు ప్రసరించి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఎటువంటి ప్రేరణా లేకుండానే (రసాయన చర్య, సూర్యరశ్మి కూడా లేకుండా) ఒక రాయి నుండి శక్తి విడుదలైంది. కొన్ని పరిశోధనల తర్వాత దీనినే అణుధార్మిక శక్తిగా బెక్వెరెల్ గుర్తించాడు. ఇది జరిగిన కొన్నాళ్ళకు మేడమ్ క్యూరీ దీని మీద మరింత పరిశోధన చేసింది. దీని కోసం ఆమె ఎర్జ్ పర్వతాల నుండి యురేనియం ముడిఖనిజాన్ని సేకరించి దానిని శుద్ధి మూలకంగా మార్చేందుకు దానిని పొడిచేసి ఆమ్లక్రియ జరిపి యురేనియంను వేరు చేసింది. (ఇప్పటికీ యురేనియంను వేరుచేయడానికి ఇదే పద్ధతిని అవలంబిస్తారు.) అట్లా వేరుచేసిన తర్వాత కూడ ఆ రాయిపొడిలో అణుధార్మిక శక్తి ఉన్నట్టు కనుగొంది.
మేడమ్ క్యూరీ రేడియం అనే యురేనియం ఉపపదార్థాన్ని (యురేనియం శిధిలాల నుండి ఏర్పడేది) కనుగొన్నారు. రేడియంను తగిన జాగ్రత్తలతో ఉపయోగించడం ద్వారా క్యాన్సర్‌ను నయం చేయవచ్చని నిరూపించారు. ఇప్పటికీ అణుధార్మిక పదార్థాల వల్ల మానవాళికి జరిగే మేలు ఇదొక్కటే. రేడియోధార్మిక పదార్థాలపై సుదీర్ఘకాలం పరిశోధనలు చేసే క్రమంలో వాటి ప్రభావం వల్ల ఆమె లుకేమియా(రక్త కాన్సర్)కు గురై 1935లో మరణించారు. అప్పట్లో ఆమె వాడిన రాతప్రతులలో, పుస్తకాలలో ప్రమాదకరమైన స్థాయిలో అణుధార్మికత ఇంకా మిగిలే ఉంది.
అన్ని పదార్థాలూ చిన్నచిన్న అణువుల కలయికతో నిర్మాణమై ఉంటాయి. ఒక మూలకం తన రసాయనిక స్వభావం కోల్పోకుండా ఎంత చిన్న ముక్క కాగలదో అదే అణువు అంటే. ప్రతి అణువులో ఒక కేంద్రకం (న్యూక్లియస్), ఆ కేంద్రకం చుట్టూ ఎలెక్ట్రన్లు ఉంటాయి. కేంద్రకంలోపల ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ప్రకృతిలోని దాదాపు అన్ని పదార్థాలలో అణువులు స్థిరంగా ఉంటాయి. ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలెక్ట్రాన్ల సంఖ్య నిర్దిష్టగా ఉంటుంది. వీటికి భిన్నంగా అణుధార్మిక పదార్థాలలో అణువులు స్థిరంగా ఉండవు. ఇవి సూక్ష్మస్థాయిలో విస్ఫోటనం చెందుతూ ఆ క్రమంలో శక్తిని విడుదల చేస్తుంటాయి. ఈ ప్రక్రియను 'అణుధార్మిక శక్తి శిధిలం' అంటాం. అణుధార్మిక మూలకాలు విస్ఫోటనం చెందినపుడు శక్తివంతమైన ఆల్ఫా, బీటా, గామా కిరణాలు విడులవుతాయి. రెండు ప్రోటాన్లు, రెండు న్యూట్రాన్లుÛ ఉన్న పదార్థాన్ని ఆల్ఫా అని, ఒక ఎలెక్ట్రాన్, లేదా పాజిట్రాన్ అయితే బీటా అని అంటారు. ఇవి శక్తి తరంగాలుగా పరమాణువు నుండి విడుదలవుతాయి. ఇవి విడుదలయినప్పుడు శక్తివంతమైన గామా కిరణాలు కూడా తూటాల్లాగా దూసుకొని వస్తాయి. (విద్యుత్తుగానీ విధ్వంసంగానీ ఈ శక్తితోనే.) ఒక అణువు విస్ఫోటనం చెందినప్పుడు అది ఇంకో కొత్త అణువుగా రూపాంతరం చెందుతుంది. అట్లా యురేనియం పగిలిపోయి ప్రొటాక్టినియంగా, ప్రొటాక్టినియం మళ్ళీ విడిపోయి థోరియంగా, థోరియం రేడియంగా, రేడియం రేడాన్ వాయువుగా, రేడాన్ సంతతిగా మూరుతుంటాయి. ఇలా యురేనియం నుండి ఒక డజను పైగా 'శిథిల ఉత్పత్తులు' ఏర్పడతాయి. ఇవన్నీ కూడ అణుధార్మిక శక్తి కలిగి ఉంటాయి. ఇవి కొన్ని వందల ఏళ్ల వరకు రేడియేషన్‌ను విడుదల చేస్తుంటాయి. భూగర్భంలో స్థిరమైన మూలకాల మధ్య ఈ అస్థిర మూలకాలు ఉన్నప్పుడు ఎలాంటి ప్రమాదమూ ఉండదు. వీటిని బైటికి తీస్తే ప్రాణం మీదికి తెచ్చుకున్నట్లే. వీటి సహజ ప్రక్రియ ఇలా ఉండగా, వీటిని అసహజంగా అంటే బలవంతంగా ప్రేరేపించినప్పుడు (అణువిచ్ఛిత్తి చేస్తే) జరిగే వినాశనం అంతా ఇంతా కాదు.
యురేనియం అణువును ఒక న్యూట్రానుతో ఢీకొట్టించి అణువిచ్ఛిత్తి చేస్తే అది రెండుగా విడిపోతుంది. దీనితో పాటు రెండు, లేదా మూడు న్యూట్రానులు విడుదలవుతాయి. రెండుమూడు న్యూట్రానులు మరో రెండుమూడు యురేనియం అణువులను ఢీ కొంటాయి. ఇలా గొలుసు కట్టు విచ్ఛేదనాలు జరుగుతూ మొత్తం పదార్థమంతా దగ్ధమవుతుంది. రెప్పపాటు కాలంలో జరిగే ఈ మొత్తం ప్రక్రియలో బ్రహ్మాండమైన శక్తి విడుదలవుతుంది. దాని ఖరీదు హిరోషిమా, నాగసాకీలంత. ఇదే ప్రక్రియను ఒక పద్ధతి ప్రకారం నియంత్రించి, తక్కువ శక్తి విడుదలయ్యేలా చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు.
యురేనియం మొత్తం మూడు దశల్లో తయారవుతుంది.
1.మైనింగ్: డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ లాంటి సాంప్రదాయ పద్దతుల్లో ముడిఖనిజాన్ని సేకరించి దానిని ప్రొక్లేనర్లు, టిప్పర్ల సాయంతో క్రషింగ్ ప్లాంటు వద్దకు చేరుస్తారు. బ్లాస్టింగ్ వల్ల ఎగిసే ధూళి కణాలు అణుధార్మికతను వ్యాపింపచేస్తాయి. ముడిఖనిజాన్ని రవాణా చేసే క్రమంలో మొత్తం రవాణా చేసినంత దూరం పరిసరాలు ప్రమాదకరమైన అణుధార్మికతకు లోనవుతాయి.
2.ప్రాసెసింగ్: ముడిఖనిజాన్ని క్రషింగ్ చేసి పొడి చేస్తారు. ఇక్కడ కూడ అణుధార్మికతతో కూడిన ధూళికణాలు వాతావరణంలో కలుస్తాయి. తర్వాత మెత్తటి ధూళిని మూడు రెట్లు నీటితో కలిపి పేస్టులాగ తయారు చేస్తారు. దీనికి ఆమ్ల క్రియ జరిపి యురేనియం కణాల్ని వేరుచేస్తారు. పేస్టు లాగా ఉన్న యురేనియంను డ్రైయర్స్‌లో ఉంచి ఎల్లో కేక్ తయారుచేస్తారు.
3.ఎన్‌రిచ్‌మెంట్: ఎల్లో కేకును డ్రమ్ముల్లో భద్రపరచి ఎన్‌రిచ్‌మెంట్ ప్లాంటుకు తరలిస్తారు. అక్కడ యురేనియం అణువులలో అణువిచ్ఛిత్తికి సహకరించే యు235 ఐసోటోపు అణువుల శాతాన్ని పెంచి ఎన్‌రిచ్‌డ్ యురేనియంగా తయారు చేస్తారు. ఇదే రియాక్టర్లకూ, అణుబాంబులకు ఉపయోగపడే చివరి దశ యురేనియం.
అణురియాక్టర్‌లో విద్యుదుత్పత్తి:
అణువిచ్ఛిత్తి నుండి విడుదలయ్యే శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తారు. అణువు విచ్ఛిత్తి ప్రక్రియ ఒక యురేనియం అణువులోని కేంద్రకాన్ని న్యూట్రాన్ ఢీ కొట్టడంతో ప్రారంభమై గొలుసుకట్టు చర్య జరిగి మొత్తం యురేనియం పదార్థం దగ్ధమవుతుంది. చైన్ రియాక్షన్ అనబడే ఈ ప్రక్రియ అసాధారణ శక్తిని విడుదలచేస్తుంది. అణుబాంబు విస్ఫోటనం ఇలా జరుగుతుంది. అయితే అణురియాక్టర్‌లో ఇదే చైన్ రియాక్షన్ నియంత్రిత పద్ధతిలో జరుగుతుంది. అణురియాక్టర్‌లో అయిదు విభాగాలుంటాయి. 1) అణుఇంధనం (యురేనియం లేదా ప్లూటోనియం పధార్థాలను ఇంధనంగా వాడతారు. అవి కడ్డీలుగా అమర్చి ఉంటాయి). 2) అణువిచ్ఛిత్తి నుండి విడుదలయ్యే న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించి శక్తిని నియంత్రించే మోడరేటర్. 3) అణువిచ్ఛిత్తి నుండి విడుదలయ్యే వేడిని గ్రహించి దాన్ని బాయిలర్‌కు సరఫరా చేసే రియాక్టర్ కూలెంట్, 4) రియాక్టర్‌లో జరిగే అణువిచ్ఛిత్తి ప్రక్రియని నియంత్రణలో ఉంచే కడ్డీలు (కంట్రోల్ రాడ్స్). 5) రియాక్టర్ నుండి బైటికి రేడియేషన్ వెలువడకుండా అపే మందపాటి కవచం వంటి 'షీల్డ్ అండ్ కంటైన్‌మెంట్ సిస్టం.
ఇక అణువిద్యుత్ ఎలా ఉత్పత్తి చేస్తారు అంటే సింపుల్. థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గును మండించి, నీటిని వేడిచేసి తద్వారా విడుదలయ్యే ఆవిరితో టర్బైన్లు తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేయటంలో ఉండే సూత్రమే ఇక్కడ కూడా ఉండేది. అక్కడ బొగ్గును మండిస్తాను, ఇక్కడ యురేనియం లేదా ప్లూటోనియం అణువుల విచ్ఛిన్నం చేస్తారు.
సాంప్రదాయ ఇంధన వనరులకు అణువిద్యుత్ ప్రత్యామ్నాయమా?
బొగ్గు, సహజవాయువు వంటి సాంప్రదాయ ఇంధన వనరులకు అణువిద్యుత్ ప్రత్యామ్నాయమని అణు ఇంధనశాఖ వారు, ప్రభుత్వాలు ప్రచారం చేస్తుంటాయి. అది శుభ్రమైనదని, చవకైనదని చెప్తాయి. వాస్తవం ఏమిటంటే అణుధార్మిక కాలుష్యం కంటికి కనిపించదు కాని అది ఇతర సాంప్రదాయ ఇంధనాల నుండి వెలువడే కాలుష్యం కంటే ఎన్నో రెట్లు ప్రమాదకరమైనది. చవకైనదని ఎందుకంటారంటే ఒక గ్రాము యురేనియం 10 లక్షల వ్యాట్ల శక్తిని విడుదల చేయగలదు. ఇది దాదాపు వెయ్యి టన్నుల బొగ్గుతో సమానం. కాని ముడిఖనిజం నుండి ఒక గ్రాము యురేనియం వెలికి తీయాలంటే ఎంతో ఖర్చుకు, వ్యయప్రయాసలకోర్చాలి. అది చాలా చాలా తక్కువ శాతంలో ఉంటుంది. దాని తవ్వకం, శుద్ధి, రవాణా, ఉత్పత్తి క్రమంలో జరిగే పర్యావరణ నష్టం వెలకట్టలేనిది, అరికట్టలేనిది. థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ఉత్పత్తి ఖర్చు మూడు రూపాయల వరకు ఉంటే, అణువిద్యుత్ కేంద్రంలో ఇరవై నుండి ముప్పై రూపాయల వరకు ఉంటుంది. అణువిద్యుదుత్పత్తి నష్టాలనే ఉత్పత్తి చేస్తుందన్నది లెక్కలు వేస్తే తేలిపోయే అంశమే.
అణుధార్మికత వల్ల ఎటువంటి ప్రమాదాలు?:
అణుధార్మికత (రేడియేషన్) వల్ల సంభవించే ఆరోగ్య సమస్యల్ని రెండు రకాలుగా గుర్తించారు. ఒకటి ఆల్ఫా, బీటా, గామా కిరణాలు నేరుగా కణాల మీద దాడి చేసి నాశనం చేయడం లేదా వాటిని కాన్సర్ కణాలుగా మార్చడం. నిజానికి మానవ కణాలు చనిపోతే నష్టం లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త కణాలు పుడుతూ ఉంటాయి కాబట్టి. కాని చనిపోకుండా బతికిపోయిన కణాలు కాన్సర్‌గా అభివృద్ధి చెందుతాయి. ఇలా అణుధార్మిక ప్రభావం వల్ల సాధారణంగా రక్త కాన్సర్, ఊపిరితిత్తుల కాన్సర్‌లు సంభవిస్తుంటాయి. ఇవికాక రొమ్ము కాన్సర్, చర్మ కాన్సర్, ఎముకల కాన్సర్, జీర్ణకోశ కాన్సర్, మూత్రపిండాల కాన్సర్ వంటి మొత్తం 13 రకాల కాన్సర్‌లు రేడియేషన్ ప్రభావిత ప్రాంతాల్లో కనుగొన్నారు.
ఇక రెండో రకం కణంలోని డి.ఎన్.ఏ దెబ్బతినడం వల్ల వచ్చే జన్యుపరమైన లోపాలు. మానవ శరీర నిర్మాణాన్ని, అందులోని వివిధ అంగాలు నిర్వర్తించే క్రియల్ని ఈ డిఎన్‌ఏ నియంత్రిస్తుంది. ఇది దెబ్బతినడం వల్ల అసహజమైన శరీర ఆకృతులు, ఉదాహరణకు మెదడు చిన్నదిగా పుట్టడం, కొన్ని శరీర భాగాలు ఎదుగుదల లేకపోవటం లేదా లోపించటం, ఒక్కోసారి అదనపు అంగాలు ఉండటం వంటివి సంభవిస్తాయి. మానసిక లోపాలు కూడా అణుధార్మికత ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో తరచుగా కనపడుతుంటాయి. గర్భిణీ స్త్రీలకు అణుధార్మికత సోకితే గర్భస్రావాలు, శిశుమరణాలు ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. అణుధార్మిక కాలుష్యం కొన్ని వందల, వేల ఏళ్ల వరకు కూడా ఉంటుంది. అంటే అణుధార్మిక పదార్థాలు తరతరాలను ప్రభావితం చేస్తాయి.
రేడియేషన్ మునుషుల్లో కణాలను ఎలా నాశనం చేస్తుందో, అలానే జంతువుల్లో, మొక్కల్లో కూడా కణాలను నాశనం చేస్తుంది. ప్రకృతిలో ఉండే సహజ పునరుత్పత్తి శక్తి మీద ఇది ప్రభావం చూపుతుంది. పర్యావరణం ధ్వంసమవుతుంది.
అనుభవాలు ఏం చెప్తున్నాయి?:
భారతదేశంలో యురేనియం తవ్వకాలు 1967 నుండి జార్ఖండ్‌లోని జాదూగూడలో, 2007 నుండి కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తుమ్మలపల్లిలో జరుగుతున్నాయి. యురేనియం గనుల తవ్వకాలు మొదలు కాకముందు జాదూగూడ అడవి పొత్తిళ్ళలో ప్రశాంతంగా ఉండే ఒక గిరిజన ప్రాంతం. నదీలోయ వద్ద విస్తారమైన వనసంపద. జాదూగూడ అన్న పేరు జాగోగోర, అంటే ఆముదపు చెట్ల తోపు(వనం) నుండి వచ్చిందని చెప్తారు. ఇక్కడ 'సంతాల్', 'హో' తెగలకు చెందిన ఆదివాసులు నివసిస్తారు. జార్ఖండ్ రాష్ట్రం సింగ్ భూమ్ జిల్లాలోని ఈ ప్రాంతం అపారమైన ఖనిజ సంపదలకు నెలవు. బ్రిటీష్ పాలన నాటి నుండే ఇక్కడ గనుల తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇనుము, రాగి, మాంగనీస్, బాక్సైట్, యురేనియం వంటి 26 ఖనిజాలను ఇక్కడ వెలికి తీస్తున్నారు. యురేనియం గనులు విస్తారమైన అడవుల మధ్య సువర్ణముఖి నదీలోయ ప్రాంతం వద్ద ఉన్నాయి. మైనింగ్ వల్ల భయంకరమైన విధ్వంసం జరిగింది.
ముడి యురేనియం వెలికి తీసిన తర్వాత దాన్ని మిల్లులో పొడిచేసి, ఆమ్లంలో కరిగించి యురేనియంని వెలికితీస్తారు. ప్రస్తుతం జాదూగూడలోని గనుల్లో 0.06 శాతం, పులివెందులలో 0.04 శాతం యురేనియం ఉంది. కాబటి దాన్ని వెలికి తీసిన తర్వాత మిగిలిన 99.94 శాతం లేదా 99.96 శాతాన్ని వ్యర్థాలుగా వదిలేస్తారు. ఈ వ్యర్థాల్లో 85 శాతం అణుధార్మికత మిగిలే ఉంటుంది. ఉదాహరణకు రోజుకు 1000 టన్నుల ప్రాసెసింగ్ జరిగితే ప్రతి సంవత్సరం 330,000 నుండి 360,000 టన్నుల వ్యర్థాలను పారబోస్తారు. అలా పులివేందులలో యుసిఐఎల్ 4500 టన్నుల ముడిఖనిజం వెలికితీత లక్ష్యంగా పనులు చేసుకుపోతోంది. అణుధార్మిక వ్యర్థాలను టైలింగ్స్ అంటారు. ఇవి ప్రమాదకరమైనవి గనక ఎక్కడ పడితే అక్కడ వదిలేయడానికి వీల్లేదు. వీటిని సున్నంతో కలిపి వీటిలో నుండి రాతి ముక్కలను, పొడిరాయిని వేరుచేస్తారు. రాళ్ళను మునుపు తవ్విన గనుల్లో తిరిగి నింపుతారు. పొడిరాయిని నీటితో కలిపి టైలింగ్ డ్యాంకు తరలిస్తారు. ఇక అదే వీటికి శాశ్వత స్థానం. ఇది కట్టుదిట్టమైన పోలీసు రక్షణ వలయాల నడుమ అత్యంత రహస్యంగా రచిస్తున్న మారణకాండ.ఈ టైలింగ్ డ్యాముల నుండి 80వేల సంవత్సరాల వరకు అణుధార్మిక కిరణాలు వెలువడుతూనే ఉంటాయి. మానవ జీవిత కాలంతో పోల్చుకుంటే ఎన్ని వందల తరాలో! జాదూగూడలో ఈ టైలింగ్ డ్యాములు ఒకప్పుడు దేశానికి తిండి పెట్టే వరిమడులు.
టైలింగ్ చెరువుల నుండి వెలువడే అణుధార్మిక వ్యర్థాల్లో ముఖ్యమైనది రేడాన్ వాయువు. రేడాన్ వాయువు గాలికన్నా 8 రెట్లు ఎక్కువ బరువుగా ఉండి భూమికి చాలా ఎత్తులో ప్రయాణిస్తుంటుంది. జీవరాశి ఎక్కువగా దీని బారిన పడుతూ ఉంటుంది. టైలింగ్స్ ఎండిపోయిన తర్వాత వ్యర్థాలు మెత్తటి ధూళిలా ఉండి సన్నటి గాలికి సైతం కొట్టుకుపోతాయి. ఇవి గాలి, నీటితో కలిసి ఆహారంతోపాటు జంతువుల, మొక్కల దేహాల్లో కలిసి ఆహారపు గొలుసు, అంటే మొత్తం జీవావరణంలోకి ప్రవేశిస్తాయి. అందుకే వీటిని మానవ నివాసాలకు దూరంగా నిలువ చేసి చుట్టూ కంచె నిర్మించి గట్టి భద్రత ఏర్పాటు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. నిజానికి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా పర్యావరణానికి హాని తప్పదు. గనుల నుండే కాక శుద్ధి కర్మాగారాలు, అణురియాక్టర్ల నుండి రోజురోజూ పోగుపడుతున్న లక్షల కొద్దీ టన్నుల అణుధార్మిక వ్యర్థాలను భద్రంగా నిల్వ ఉంచడమే తప్ప వాటిని సురక్షితంగా పారబోయడమూ, నిర్వీర్యం చేయడమూ ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. దీని మీద పరిశోధన జరుపుతున్నామని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వంటి పరిశోధనా సంస్థలే చెప్తాయి. ఇవే అణువిద్యుత్ సురక్షితమని కూడ అంటాయి.
ఇక మనదేశంలో యురేనియం తవ్వకాలు చేపట్టే యుసిఐఎల్ నిర్లక్ష్యానికి, అహంకారానికీ మారుపేరు. అది ప్రపంచంలోని యురేనియం సంస్థలన్నింటి కంటే అత్యంత హీనంగా ప్రాజెక్టు పనులు నిర్వహిస్తుందని పేరు తెచ్చుకుంది. ప్రైవేటు సంస్థతో సహా దేశంలోని ఏ సంస్థా యుసిఐఎల్ అంత బాధ్యతారాహిత్యంగా ఉండదనడానికి నిదర్శనాలెన్నో. జాదూగూడలో 20 శాతం మందికి క్యాన్సర్ ఉన్నట్టు స్థానికులు చెబుతారు. అయితే యుసిఐఎల్ వాళ్ళు ఈ వాస్తవాలను దాచిపెడతారు. వారి హాస్పిటల్ రిపోర్టులు ఎక్కవగా 'టీబి' నే నిర్ధారిస్తాయి. వాస్తవంగా అది సిలికోసిస్ లేదా ఊపిరితిత్తుల కాన్సర్ అయి ఉంటుందని, నష్టపరిహారం చెల్లించవలసి వస్తుందని వాళ్ళు అట్లా అబద్దపు రిపోర్టు రాస్తారని నిజనిర్ధారణ కమిటీలు తేల్చాయి.
జాదూగూడలో ఒక కన్ను, ఒక ముక్కు, తొమ్మిది చేతివేళ్ళు, పదకొండు కాలివేళ్ళతోనూ, పుట్టినప్పటినుండి మంచానికే పరిమితమైన పిల్లలు కనిపిస్తారు. ప్రతి ఏడాదీ ఇక్కడ జన్మిస్తున్న పిల్లల్లో దాదాపు పది శాతం మంది విపరీతమైన అంగవైకల్యాలతో పుట్టి చనిపోతున్నారని ఒక సర్వే తేల్చింది. అత్యధిక సంఖ్యలో టిబి, కాన్సర్ మరణాలు, మహిళల్లో గర్భశ్రావాలు ఇక్కడ నమోదవుతున్నాయి.
దీనికంతటికీ కారణం యురేనియం వ్యర్థాలను నిలువచేసే టైలింగ్ పాండ్ల నిర్వహణ అత్యంత ఘోరంగా ఉండటమే. అంతర్జాతీయ అణుశక్తి కమిషన్ సిఫారసుల మేరకు టైలింగ్ చెరువుకు ఒకటిన్నర కిలోమీటరు పరిధిలో నివాసాలు ఉండకూడదు. 1998లో బీహార్ అసెంబ్లీ (అప్పటికింకా జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడలేదు) టైలింగ్ చెరువుకు 5 కిలోమీటర్ల పరిధిలో నివాసాలు లేకుండ చూడాలని తీర్మానించింది. కానీ ఎండిపోయిన టైలింగ్ చెరువు మీద మనుషులు నడుచుకుంటూ పోతుంటారు. దాని మీదే పశువులు గడ్డి మేస్తుంటాయి. దానికి దగ్గరలోనే ప్రాథమిక పాఠశాల, స్థానికుల నివాస గృహాలు ఉన్నాయి. అంతే కాదు. యురేనియం ఖనిజాన్ని ట్రక్కుల్లో రవాణా చేసేటప్పుడు దాన్ని సరిగ్గా కప్పి ఉంచరు. ముడి ఖనిజం రోడ్డు మీద పడుతూ ఉంటుంది. యూసిఐఎల్ నిర్లక్ష్యానికి, అవినీతికి పరాకాష్ట ఏమిటంటే గనుల్లో వృధాగా ఉన్న రాయిని యూసిఐఎల్ కాట్రాక్టరు ఒకరు సమీపంలోని గ్రామస్తులకు అమ్మాడు. అణుధార్మికత గురించి తెలియని గ్రామస్తులు ఆ రాయి, కంకరతో ఇళ్ళు కట్టుకున్నారు. అక్కడ నివసించే వాళ్ళు విపరీతమైన రేడాయేషన్‌కు గురవుతున్నారు. యుసిఐఎల్‌లో పనిచేస్తున్న సాధారణ కార్మికులకు, సెక్యూరిటీ సిబ్బందికి రేడియేషన్ గురించి తెలియదు. ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్నో వాళ్ళకెవరూ చెప్పరు. ఇక గని నుండి విడుదలయ్యే నీళ్ళు గ్రామంలో అందరి అవసరాలు తీర్చే కాలువలో నేరుగా కలుస్తుంది. 'అణుభారత్' నిర్మాణానికి, ప్రపంచదేశాల్లో భారతదేశ 'కీర్తి' ఇనుమడించడానికి ఇటువంటి వేల మంది ప్రజలు తమ జీవితాలను బలివ్వాలి. అందుకే ఆ దుర్మార్గమైన దోపిడికి, నిశ్శబ్ద మారణహోమానికి వ్యతిరేకంగా మూడు దశాబ్దాలుగా ప్రజలు ఉద్యమిస్తున్నారు.
పులివెందులలో మైనింగ్ మొదలైన మూడునాలుగు సంవత్సరాలకే భారీగా భూగర్భజలాలు పడిపోయాయి. వందలాది బోర్లు ఎండిపోయాయి. నీళ్లు ఉన్న చోట కలుషితమైపోయాయి. మనుషుల్లో, పశువుల్లో రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తాయి. పశువులు ఎద కట్టడం లేదని, కట్టినా గర్భం నిలవడం లేదనని గ్రామస్తులు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. అధికారులు పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా ఉత్పత్తి లక్ష్యాలను పెంచుతూ మైనింగ్ విస్తరణ కోసం యుసిఐఎల్ రెండో ప్లాంటు పెట్టే ప్రయత్నాలు చేస్తే జనం అడ్డుకున్నారు.
మైనింగ్ జరిగే చుట్టు పక్కల ప్రాంతాల్లో క్రమంగా నేలంతా ఉప్పు తేలి వ్యవసాయానికి పనికిరాకుండా పోయింది. మైనింగ్ ప్రక్రియ, వ్యర్థాల నిల్వ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటామని ఎన్నో హామీలిచ్చిన యుసిఐఎల్ ప్రజల్ని నిలువునా ముంచేసింది. యురేనియం వ్యర్థాలను నిలువ చేసే టైలింగ్ పాండ్ నిర్వహణ జాదూగూడలో లాగానే పరమ అధ్వాన్నంగా ఉంది. టైలింగ్ పాండ్‌లోకి వ్యర్థాల్ని మోసుకొచ్చే పైపు లీకేజీ గురించి రైతులు ఫిర్యాదు చేసారు. అది మాత్రమే కాదు టైలింగ్ పాండ్‌కు కలుషిత నీళ్ళు భూగర్భంలోకి ఇంకకుండా మందపాటి లైనింగ్ వేయాలి. అది వేయలేదు. ఇష్టం వచ్చినట్లు వ్యర్థాల్నికొండగుట్టల నుండి అందులోకి పోస్తున్నారు. ఎన్ని సార్లు రైతులు, ప్రజాసంఘాలు అధికార్లకు నివేదించినా యుసిఐఎల్ క్రిమినల్ నిర్లక్ష్యాన్ని పదేళ్లుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రశ్నించనేలేదు. ఇక ఆ ప్రాంతం కూడా మరో జాదూగూడలా మారబోతోంది.
ఏం చేయాలి?
నల్లమలలో యుసిఐఎల్
అడుగుపెట్టకుండా చూడాలి. అణురాజకీయాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. నల్లమల
పరిధిలోకి వచ్చే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పాలకులను ప్రశ్నించాలి.
కేంద్ర ప్రభుత్వం నిశ్శబ్ధంగా తన పని చేసుకుపోతుంటే స్థానిక నాయకులు
నోరువిప్పకుండా ఉండడంపై నిలదీయాలి. అందరం కలిసి నల్లమలను కాపాడుకోవాలి. లేకపోతే
జరిగే నష్టానికి ఈ తరం భవిష్యత్తు తరాలకు జవాబుచెప్పాల్సి వస్తుంది.
(స్టూడెంట్ మార్చ్
-సెప్టెంబర్ 2019)

No comments:
Post a Comment