నల్లమలలో నిప్పు పడింది. కవి సమయాల్లో చెప్పుకున్నట్లు జనచైతన్యాన్ని మండించే నిప్పు కాదది. నల్లమలను దహించివేసే నిప్పు. జనం, జీవం మసైపోయే కార్చిచ్చు. కేంద్ర ప్రభుత్వం నల్లమల అడవులను మసి చేసి, ఆ బూడిద కింద భూమిని చీల్చి అగాధంలో నిక్షిప్తమై ఉన్న అణుశక్తిని తవ్వి తీయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటోంది. అణుశక్తిలో దేశప్రయోజనం ఇమిడి ఉందని సాకు తీసుకొని, అటవీ, ఆదవాసీ చట్టాలను అతిక్రమించి అడవిని చెరబట్టాలని దూసుకొస్తోంది. ఇదో అసాధారణ విపత్తు. దక్షిణ భారతదేశానికి రక్షణ కవచం తొలిచివేసి, మృతభూములను, ఎడారుల్ని మిగిల్చే విపత్తు. అత్యంత ప్రాచీన నాగరికతా ఆనవాళ్లను ఇమడ్చుకున్న నల్లమల, కృష్ణా తీరంలో విస్తరించిన జీవనం, తూర్పు కనుమలతో పెనవేసుకున్న జీవవైవిధ్యం, తెలుగు సమాజాల పురాస్మృతులు, ఇప్పటికీ పచ్చిగా, వెచ్చగా పొదువుకున్న జ్ఞాపకాల గని. ఢిల్లీ అధికారానికి అది యురేనియం గని మాత్రమే. అంటే పెట్టుబడి సంబంధం మాత్రమే. గని తవ్వుతామంటున్న ప్రాంతం పొడవునా నల్లమల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉత్తరాన రాచకొండ గుట్టల నుండి దక్షిణాల శేషాచలం కొండలదాకా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలు మొదలుకొని కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కడప, చిత్తూరు జిల్లాలదాకా ఒక ప్రాకృతిక అస్తిత్వం. తల్లితో బిడ్డకు ఉన్న బొడ్డు పేగు సంబంధం. ఇది అడవి ఒడిలో నివసిస్తున్న చెంచులు, ఇతర ఆదివాసీ, ఆదివాసేతర బడుగు వర్గాల ప్రజలకే కాదు, ఆ అడవి కరిగించిన మేఘాలు తడిపే నేల పొడవునా, అడవి గుండా మైదానాలకు ప్రవహించే కృష్ణానదీ తీర ప్రాంతాల జీవితాలకు ఉండే సంబంధం. ఇక్కడ అణువణువూ నల్లమల అంశే.
అడవి పలుచబడుతున్న కొద్దీరుతుపవనాలకేసి చూసే ఎదురుచూపులు, ఆనకట్టలు కట్టి మలుపుకునే నదీ జలాల న్యాయమైన పంపకాల కోసం పడే యాతనలు, పంటను నిలుకునేందుకు అప్పులు చేసి వేసే బోర్లు అన్నిటికీ నల్లమల సాక్షీభూతం మాత్రమే కాదు, కార్యాకారణ సంబంధం కూడా. శ్రీశైలం ప్రాజెక్టు కోసం కొంత అడవిని పణం పెట్టింది నల్లమల. ప్రాజెక్టు కోసం భూములిచ్చిన ప్రజలు, తాగునీటి కోసం గొంతెత్తి అరవాల్సివస్తే జీవవైవిధ్యానికి నెలవైన నల్లమల వ్యవస్థ తెచ్చిపెట్టే వైరుధ్యాలను చూసి ఆశ్చర్యపోయి ఉంటుంది. పులులకే కాదు, వేలాది జీవరాశులకు అభయమైన నల్లమలను పులుల అభయారణ్యంగా మాత్రమే ఉండమన్నప్పుడు చెంచుబిడ్డల కోసం ఆక్రోశించి ఉంటుంది నల్లమల. ప్రకృతి జీవుల మధ్య లేని కృత్రిమ వైరుధ్యాన్ని సృష్టించి, ఎక్కడెక్కడి పులుల్నో తెచ్చి చెంచుల్ని తరిమిన పాలకులు ఇప్పుడు అత్యధిక పులులు సంచరించే ప్రాంతాన్ని యురేనియం కోసం తవ్విపోస్తామంటున్నారు. పదేళ్ల క్రితమే మొదలుపెట్టి వేలాదిగా బోర్లు వేసి నల్లమలను నిశ్శబ్దంగా తూట్లు పొడుస్తుంటే తన బిడ్డలు చేసిన ప్రాచీన యుద్దాల నుండి నిన్నటి పీపుల్స్ 'వార్' దాకా తనకు సాయుధ రక్షణగా నిలిచిన పోరాటాలను తలపోసుకుని ఉంటుంది. తన చరిత్రను, తానే చరిత్ర అయిన ఘట్టాలను స్మృతిలోకి తెచ్చుకొని ఉంటుంది. రక్షకుల వేషంలో వచ్చిన దురాక్రమణదారులను, కలప దొంగలను, వజ్రాల దొంగలను విడిగా ఎదర్కున్నట్లు కాదు, ఇప్పుడు అందరూ కలిసి ఎగబడుతున్నారని గుర్తించి ఉంటుంది. ఇప్పుడు బహుషా మండడానికి సిద్ధంగా ఉన్న ఇంధనంలా ఉంటుంది.
యురేనియం అణు ఇంధనమే. ప్రపంచదేశాలు ముట్టుకొని వదిలేసిన మహమ్మారిని ఇక్కడి దళారీలు కావలించుకుంటున్నారు. ఎన్నో అనుభవాల తర్వాత ప్రపంచమంతా అణు ఇంధనం వద్దనుకుంటోంది. అభివృద్ధి చెందిన దేశాలు పక్కన పడేసిన అణురియాక్టర్లను దిగుమతి చేసుకొని దేశాన్ని వ్యర్థాల కుప్పగా, ప్రకృతిని విషతుల్యంగా తయారుచేస్తూ సిగ్గులేకుండా దేశాభివృద్ధి మాయమాటలు చెప్పి దబాయిస్తున్నారు మన దేశభక్త పాలకులు. వీళ్లు వాస్తవంగా దేశాన్ని నిలువునా రేడియేషన్లో తగలేస్తున్నారని చెప్పడానికి అణు ఇంధన ఉత్పత్తిని విపరీతంగా పెంచాలని తీసుకున్న నిర్ణయమే నిదర్శనం. అణుశక్తి కోసం యురేనియం లేదా ప్లూటోనియం వెలికితీసి వాటిని రియాక్టర్లలో విచ్ఛిన్నం చేస్తారు. ముడి యురేనియం నిక్షేపాల కోసం దేశమంతా వెదికారు. మైనింగ్ దగ్గరికొచ్చేసరికి జనం అడ్డుతగులుతున్నారు. ఎందుకంటే జార్హంలో జాదూగూడ యురేనియం గనుల అనుభవం విన్నంతనే గగుర్పాటును కలిగిస్తుంది.
యురేనియం తవ్వకాల దుష్ఫలితాలు తెలుసుకొని జనం తిరగబడితే మొదట మేఘాలయ నుండి నల్లగొండకు, నల్లగొండ నుండి పులివెందులకు పోయి ఆ ఫ్యాక్షన్ అడ్డాలో తిష్ట వేసాక యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) నిశ్శబ్దంగా చాలా చోట్ల సర్వేలు చేస్తూ పోయింది. సుమారు పదిహేనేళ్లుగా అది నల్లమలలో బోర్లేసుకుంటూ శాంపిల్ సర్వేలు చేసుకుంటూ పోతున్నా ఫారెస్టు అధికారులు, పర్యావరణ శాఖ చప్పుడు చేయలేదు. ఈ గోప్యత వెనక దాగి ఉన్న కుట్ర నల్లమలలో దాగి ఉన్న ఖనిజాల ఆనుపానులు తెలుసుకొని, సందు చూసుకొని దురాక్రమించడం. మొదట టైగర్ జోన్ కోసం అడవిని తొలిచారు. ఆదివాసుల మీదికి పులుల్ని ఉసిగొల్పిన దుర్మార్గం పర్యావరణం, వణ్యప్రాణి సంరక్షణ వంటి సున్నితమైన భాషను ముసుగులా తొడుక్కుంది. టైగర్ జోన్ దగ్గర అది ఆగకుండా ఎకో టూరిజం అని మరింతగా అడివిని ఆక్రమించారు. సహజమైన ప్రకృతి, వికారమైన టూరిజం కలిపి సృష్టించిన వికృతి ఎకో టూరిజం. అది అభివృద్ధి చెందిన మేరా అడవిని నాశనం చేసింది.
ఇప్పుడు బహుషా దేశరక్షణ కోసం అణుఇంధనం అని చెప్పి దురాక్రమణ దేశభక్తి ముసుగును తొడుక్కోవచ్చు. అడవికున్న మానవ రక్షణలు తొలగించి ఆదివాసీ గ్రామాలను తొలగించి, మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించి దేశవిదేశీ కార్పొరేట్ దొంగలకోసం భారత ప్రభుత్వం దండకారణ్యంలో, పశ్చిమ కనుమల్లో, ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో సైన్యాన్ని దించి నెత్తుటి నదులు పారిస్తోంది. నల్లమలలో యురేనియం మిషతో సైన్యం వస్తుంది. దేశభద్రతకు సంబంధించిన వ్యవహారంగా మైనింగ్ చుట్టూ బలగాలు అడవి మొత్తాన్నీ అధీనంలోకి తీసుకోగలవు. ఆ తర్వాత ప్రభుత్వం తనకు నచ్చిన దొంగలందరికీ అడవిని పంచివ్వవచ్చు. పిడికెడు మంది స్వార్థం ప్రకృతంతా నాశనం చేయగలదు. ఇక్కడ చట్టాలు, కోర్టులు అడ్డురావు. అడ్డుకోగలిగినవి ప్రజా ఉద్యమాలే. తెలంగాణ ఉద్యమ త్యాగాల నెత్తుడి తడి ఆరనైనా లేదు, తెలంగాణ వనరులు అన్యాక్రాంతం కాబోతున్నాయి. నీళ్ల కోసం గొంతెత్తిన రాయలసీమకు ఎడారులు ఎదురురాబోతున్నాయి. కృష్ణ పొడవునా కాలుష్యం, అసలు నీరే ఇంకిపోయే విధ్వంసం పసిగట్టి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్ర, తెలంగాణ పాలకుల గులాంగిరిని నిలెయ్యకపోతే నల్లమలను బతికించుకోలేం. నల్లమలను కాపాడుకోలేకపోతే గతించిన చరిత్ర, నాగరికతలుగా మనం మిగులుతాం. చరిత్ర ముందు దోషులమవుతాం.
(అరుణతార ఆగస్టు 2019 సంపాదకీయం)

No comments:
Post a Comment