కొన్ని వేల సంవత్సరాలుగా ప్రకృతి పచ్చని ఒడిలో నివసిస్తున్న మూలవాసీ సమాజాలు నాగరికులుగా చెప్పబడే మనుషులకు ఎప్పుడూ అర్థం కాని ఒక ప్రాకృతిక విశేషం. రాజులు, రాజ్యాలు, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు వేటాడి, ఊచకోతలు కోసి, లక్షలాదిగా నేలమట్టం చేసినా ఇంకా మిగిలి ఉన్న విశేషం ఏదో పెనుగులాడుతూ ఉనికిని నిలబెట్టుకుంటూ ఉంటుంది. రాక్షసులు, అనాగరికులు, బహిష్కృతులు, తీవ్రవాదులు... ఏ పేరైనా పెట్టనీగాక, వాళ్లు వేరొకరి జోలికి పోయేవాళ్లు కాదు. తమ బతుకేదో తాము బతుకుతున్నా, వర్గసమాజపు విస్తరణ కాంక్ష వాళ్లను అట్లా ఉండనివ్వదు. అడవులను దురాక్రమించి, అడవుల్లో నిక్షిప్తమై ఉ న్న ప్రకృతి సంపదను మార్కెట్ చేసుకునేందుకు ఆదివాసుల అడ్డుతొలగించుకునే దురాక్రమణ యుద్ధాలు చరిత్ర అంత ప్రాచీనమైనవి. ఎవరైనా ఆదివాసుల ప్రకృతెరిగి మాట్లాడేవాళ్లయితే వాళ్లమానాన వాళ్లనెందుకలా ఉండనివ్వరు అనే ప్రశ్న వేస్తారు. కానీ ఈ ప్రశ్నకన్నా వాళ్లేందుకు అడవుల్లోనే ఉండిపోతున్నారు అన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నలో నిజాయితీ ఉండొచ్చు. సానుభూతీ ఉండొచ్చు. ఒక తార్కిక అన్వేషణా ఉండొచ్చు. కానీ మనిషికీ ప్రకృతికీ ఉన్న ప్రాచీన బంధమేదో అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న వాస్తవికతను గుర్తించక తప్పదు. దానిని గుర్తించి, గౌరవిస్తేనే ప్రకృతిని, మూలవాసిని హృదయపులోతుల నుండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలం.
అన్ని మానవ సమూహాల్లానే ఆదివాసీ సమాజం కూడా ఒకే ముద్దలా ఉండదు. ఎన్ని తెగలుగా ఉంటున్నారో అంత భిన్నత్వం ఉంది. అయితే అన్నిటినీ కలిపి ఉంచేది ప్రకృతితో వాళ్లకున్న అనుబంధమే. అడవి బిడ్డలుగా తల్లి ఒడి విడవకుండా గడిపే జీవనమే. మానవ నాగరికత క్రమంలో ఆదివాసులను ఒక అవశేషంగానే గురించే మూసను దాటి తక్కిన సమాజం ఆలోచించాల్సిన అవసరం గురించి ఆదివాసులే గుర్తింపజేస్తుంటారు. అనేకానేక యుద్ధాల ద్వారా, పోరాటాల ద్వారానే ఆదివాసీలు తమ గురించి తాము తక్కిన సమాజానికి చెప్పుకోగలిగారు. మైదాన ప్రాంతవాసుల హృదయానికి, ఆదివాసీ అంతరంగానికి ముడివేసినవి మడమ తిప్పని వారి ఉద్యమాలే. ఆదివాసీ గుండెల్లోంచి దించి పాతిన నాగరిక రాజ్యాల జెండాలు అవి చేసిన దుర్మార్గాలకే కాదు, ఓడినా లొంగని ఆదివాసీ ధీరోదాత్తతకూ తల నేలకేసి నిలుచోవాల్సిందే. అత్యంత శక్తివంతమైన రాజ్యాలకు ఇప్పటికీ ఇట్లా సవాలుగా ఎదురు నిలిచి సమూహాలే చరిత్రకు నెత్తుటి ఎరువులద్దుతూ కొనసాగుతున్నాయి. నిర్మాణమవుతున్న చరిత్రకూ వ్యూహాత్మక కేంద్రాలవుతున్నాయి.
సర్వం హరించే పెట్టుబడి విధ్వంసకతకూ, జవజవలాడే ప్రకృతి పునర్నిమాణానికి వైరుధ్యం ఉన్నట్లే, మైదాన ప్రాంత జీవితానికి, ఆడవి జీవితానికి, నాగరీకులకూ, ఆదివాసులకూ వైరుధ్యం ఉంది. ప్రకృతిని నాశనం చేసి సరుకును చేయాలనుకునే, ఆడవిని బోడి చేసి మైదానాలను విస్తరించాలనే పెట్టుబడికి ఆదివాసులు అంతుపట్టరు. అడవెందుకు అడవిలా ఉండాలి అనుకునే పెట్టుబడికి, ఈ మనుషులెందుకు చిక్కుచిక్కు అడవులు వదిలి కాంక్రీట్ మైదానాల్లోకి రారు అని ఆశ్చర్యం. దోపిడి వ్యవస్థకూ, పీడిత ప్రజానీకానికి వైరుధ్యం ఒక దశకు చేరినప్పుడు, ఎంత అడవుల్లో ఉన్నా ఆదివాసీలూ వ్యవస్థలో భాగమే గనక కొనసాగుతున్న ఆదివాసీ పోరాటాలు మైదాన ప్రాంత ఉద్యమాలతో కలవగలవు. ఉమ్మడి శతృవుకు వ్యతిరేక పక్షంలో నిలిచిన రెండింటి మధ్య ఆదాన ప్రదానాలు జరగగలవు. మన దేశంలో దీర్ఘకాలిక లక్ష్యంగల నక్సల్బరీ పోరాటం సుదీర్ఘ ఆదివాసీ పోరాట ప్రవాహానికి ఎంతటి శక్తినిచ్చిందో చూస్తున్నాం. ఇవాల విధ్వంసక బహుళజాతి పెట్టుబడి మావోయిస్టు ఉద్యమం మీద, ఆదివాసీ జీవితాల మీద ఒకే విధమైన శతృదాడి చేయడానికి కారణం అడవుల్లో పెట్టుబడికి అవసరమైన వనరులుండడం, వాటిని అల్లుకొని ఆదివాసులుండడం, మొత్తంగా దోపిడికి అడ్డంగా విప్లవకారులుండడం.
ప్రపంచంలో అరుదైన ప్రకృతి సంపద భారతదేశంలో ఉంది. ప్రపంచంలో జీవివైవిధ్యం అత్యధికంగా ఉన్న భౌగోళిక ప్రాంతాల్లో భారతదేశపు అడవులున్నాయి. విస్తారమైన అడవుల్లో పరచుకున్న జీవవైవిధ్యం భూగోళానికి ఊపిరి వంటింది. ఈ అడవుల్ని కాపాడుకోవడం మానవ జీవనానికి, భవిష్యత్ మనుగడకు అత్యవసరం. సరిగ్గా ఇక్కడే పెట్టుబడిదారులకు అవసరమైన వనరులు కూడా సహజంగానే ఉంటాయి. ఇండియాలో అటు వనరులున్నాయి. ఇటు సరుకులమ్మకోడానికి విస్తారమైన మార్కెట్ ఉ ంది. ఆదివాసులు కూడా ఉన్నారు. ప్రపంచంలో ఆఫ్రికా తర్వాత అత్యధిక ఆదివాసీ జనాభా భారతదేశంలోనే ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం కోటి నాలుగు లక్షల మంది (104 మిలియన్లు) ఆదివాసులు దేశ జనాభాలో 8.6 శాతంగా ఉన్నారు. మరీ ముఖ్యమైన విషయమేమిటంటే ప్రపంచంలోనే అత్యంత అరుదైన, శక్తివంతమైన ఆదివాసీ పోరాటాలు భారతదేశంలో ఉన్నాయి. వీటితో కచ్చితమైన వైరుధ్యం దోపిడి శక్తులకు ఉంది.
రాజ్యాలతో ఎప్పటి నుండో ఉన్న వైరుధ్యం, బ్రిటీష్ వలసవాదుల ప్రవేశం తర్వాత కొనసాగింది. ఆధునికి రాజ్యం అడవి మీద ఆదివాసుల హక్కులు హరించివేయడానికి చట్టాలు తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాలకు పర్యావరణ పరిరక్షణ అనే అందమైన ముసుగు తొడిగింది. ఆదివాసులు అడవుల్ని ధ్వంసం చేయకుండా కాపాడడానికి అటవీ రక్షణ చట్టాలు వచ్చాయి. నిజానికి ఆధునిక చట్టాలు ఉనికిలోకి రాకముందు నుండే కొన్ని వేల ఏండ్ల నుండి ఆదివాసులు పర్యావరణ సహజ సూత్రాలకు అనుగుణంగా వ్యవసాయం చేస్తున్నారు. పోడు వ్యవసాయం అనగానే అత్యంత మొరటు పద్ధతితో చేసే ఉత్పత్తి అని, అందుకు అడువుల్ని విచక్షణారహితంగా కొట్టిపడేస్తారనే అపోహ మనకు ఉంటుంది. నిజానికి ఆదివాసులు ఆడవి మధ్యలో ఒక చిన్న భూభాగంలో చెట్లు నరికి, వ్యర్థాలకు కాల్చివేసి, వర్ష రతువులో విత్తనాలు చల్లుతారు. ఈ విధానంలో నేలను దున్నడం కూడా ఉండదు. అందువల్ల దిగుబడి కూడా చాలా తక్కువ వస్తుంది. పంట చేతికందగానే ఆ భూమిని వదిలి వాళ్లు వేరొక చోటికి పోతారు. మరోచోట ఇదే పద్ధతిలో అడవి నరుక్కుంటారు. పైకి చూడ్డానికి అడవిని నరుక్కుంటూపోవడమే కనిపిస్తుంది. కానీ వాళ్లు వదిలేసిపోయిన భూమిలో ఒక పదేళ్లకు మళ్లీ అడవి పెరుగుతుంది. మళ్లీ అదే ప్రాంతానికి వ్యవసాయానికి ఆదివాసీ సమూహమొకటి (అదే గుంపు కావచ్చు, వేరొక గుంపు కావచ్చు) వచ్చినప్పటికీ దట్టంగా అడవి పెరిగి ఉంటుంది. ఇది ప్రకృతి పునరుత్పత్తికి అనుగుణంగా మనుషులు చేసే అత్యంత ప్రాచీన ఉత్పత్తి. నిజానికి పెరుగుతున్న మానవ అవసరాలకు ఈ పద్దతి సరిపోదు. మరో వైపు వేరువేరు అవసరాల కోసం మైదాన ప్రాంతంలో స్థిర నివాసముంటున్నవాళ్లు అడవుల్ని నరుక్కుంటూ వచ్చాక. మరీ ముఖ్యంగా పెట్టుబడి ప్రవేశించాక పెద్ద ఎత్తున అడవుల్ని కొట్టేయడం జరిగింది. అడవుల విస్తీర్ణం తగ్గింది. పోడు చేసుకుంటూ మళ్లీ మునుపటి ప్రాంతానికి చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలం తగ్గిపోతూ వచ్చింది. పది, పదిహేనేళ్లకు తిరిగి వచ్చేవాళ్లు క్రమంగా నాలుగైదేళ్లకే రావలసిన పరిస్థితి. ఈ వ్యవధి అడవి పెరగడానికి సరిపోదు. ఇట్లాంటి వివిధ కారణాల వల్ల ఆదివాసులు కూడా మెల్లగా స్థిర వ్యవసాయంవైపు మళ్లారు. ఇంకా కొన్ని చోట్ల పోడు వ్యవసాయం ఉంది కానీ అది తగ్గిపోతూ వస్తోంది.
అయితే వ్యవసాయ విస్తరణ కోసం, కలప కోసం, ఖనిజాల కోసం, కిలోమీటర్ల కొద్దీ అడవుల్ని ఆక్రమించుకొని తాము చేస్తున్న విధ్వంసం కనపడక, అతి స్వల్ప భూభాగంలో ఆదివాసులు చేసుకునే పోడు మాత్రమే ఆధునిక రాజ్యానికి విధ్వంసకరంగా కనపడింది. అలాగని అది అట్లా నమ్మబలికింది. అధునిక చట్టాలు మూలవాసులను దురాక్రమణదారులను చేసాయి. అడవి మీద తమ హక్కుకోసం జల్, జంగల్, జమీన్, ఇజ్జత్ కోసం ఆదివాసులు ఎన్నో పోరాటాలు చేసారు. దేశం నుండి బ్రిటీష్ వాళ్లు వెళ్లిపోయి అధికార మార్పిడి జరిగినా మూలవాసులకు రక్షణ లేకుండాపోయింది. ఫారెస్ట్ ఆఫీసర్ లేని అడవుల్లో తమ స్వేచ్ఛ తాము తిరిగిపొందేందుకు ఆదివాసులు ఎన్నో కలలు కన్నారు. పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు వచ్చినా, వన్య ప్రాణుల సంరక్షణ పేరు మీద, అడవుల సంరక్షణ పేరు మీద అవన్నీ ఆదివాసీ వ్యతిరేక చట్టాలే. అడవిలోకి పెట్టుబడిదారులు ప్రవేశించడానికి ప్రభుత్వం చట్టబద్ధంగానే అనుమతులిస్తుంది. అనుమతుల్లేకుండా అడవుల్లో ఆకు తెంపినా నేరమని చెప్పి ఆదివాసుల్ని హింసిస్తుంది. ఇదీ పర్యావరణ చట్టాల్లోని మతలబు.
పర్యావరణం గురించిన స్పృహ ఎంత ముఖ్యమో, అది సరియైన, సమగ్రమైన దృష్టిగా ఉండడం అంతకన్నా ముఖ్యం. ఎందుకంటే పాలకవర్గాలు తమకు అనుగుణమైన కుహనా పర్యావరణవాదాన్ని ఒకదాన్ని తయారుచేసుకుంటాయి. దాన్ని అనుసరిస్తే పర్యావరణాన్ని ఎన్నటికీ కాపాడకపోగా మరింత సంక్షోభపు అగాధంలోకి కూరుకుపోవాల్సిందే. మొట్టమొదట బూర్జువా పర్యావరణవాదులు ప్రకృతిని సర్వసమగ్రంగా చూడను నిరాకరిస్తారు. ప్రకృతిని విలువకట్టి నష్టాన్ని డబ్బు మారకంతో పూడ్చాలని చూస్తారు. వాటి వివరాల్లోకి పోవడం ఈ వ్యాసపరిధి కాదు కానీ అంతరించిపోతున్న వన్యప్రాణుల్ని రక్షించడానికి నిర్మాణం చేసిన నేషనల్ పార్కులు టూరిస్టు కేంద్రాలుగా మారడం మనం చూస్తున్నాం. నిజానికి అడవికి, వన్యప్రాణులకు వచ్చిన బెడద ప్రధానంగా బైటి ప్రాంతాల నుండి వచ్చే మనుషులు, వాళ్ల కార్యకలాపాలు, వాళ్లు పోగుపడేసే చెత్తాచెదారం. ఈ మాత్రానికి అడవుల్లో ఉన్న మానవ ఆవాసాల ఖాళీ చేయించి మరీ మనుషుల నుండి వాటికి రక్షణ కల్పిస్తున్నామనడం ఎందుకో ఆలోచించాలి. ఇది ఆదివాసులను అడవులకు దూరం చేసే కుట్ర అనక మరేమంటారు? నేషనల్ పార్కుల రక్షణ కోసం నిర్దేశించిన చట్టాలు అమాయక గ్రామస్తులను చంపేసిన ఘటనలున్నాయి. అంటే ప్రకృతి పరిరక్షణ పేరు చెప్పి ఆదివాసులను తరిమేస్తున్నారు, చంపేస్తున్నారు. మైనింగ్ కంపెనీల కోసమో, భారీ నీటిపారుదల ప్రాజక్టుల కోసమో ఆదివాసులను విస్థాపితుల చేయడం అభివృద్ధి కోసం అంటారు. అక్కడ పర్యావరణవాదం చెల్లదు. అడవులు, వన్యప్రాణుల పరిరక్షణ గురించి రాజ్యం మాట్లాడితే పర్యావరణం కోసం ఎవరు అడ్డమొచ్చినా, ఎంత కఠినంగానైనా వ్యవహరిస్తాను అన్నట్టుగా ఉంటుంది.
కొన్ని వేల ఏళ్ళుగా ఆదివాసులు అడవుల్లో నివసిస్తున్నారు. వారే అడవుల వినాశనానికి కారకులేతే ఇవాల అడవి ఉండేది కాదు. ఆదివాసుల జీవనశైలి అడవి ఆవరణవ్యవస్థ సమతుల్యతను రవ్వంత కూడా భంగం చేయదుగనకనే ఆదివాసులున్న చోట అడవులు సురక్షితంగా ఉన్నాయి. వ్యవసాయం, పశుపోషణ ఎంత ప్రకృతి ప్రియంగా ఉంటాయంటే మనబోటివాళ్లం ఊహించలేం. ఆదివాసులు పశువుల్ని పెంచుతారు కానీ వాటి పాలు పిండరు. ఎందుకని అడిగితే పాలు ఉండేది దూడ కోసం కదా, ఆ పాలు మనం తీసుకుంటే దూడెలా పెరుగుతుంది అంటారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, వాటిని సంతల్లో అమ్మడం కూడా చూస్తాం కదా, వాళ్లు దేనికోసమైనా సరే ఎక్కడా చెట్టు కూడా కొట్టరు. రాలిపోయిన తాటాకులనే తీసుకొని గుడిసె వేసుకునేంత ప్రకృతి స్నేహం వాళ్లది. ప్రకృతిలో దాగి ఉన్న అద్భుతమైన మూలికలకు సంబంధించి జ్ఞానం, ప్రాచీన వైద్యవిధానం వారి సొంతం. ఆదివాసులు ఉన్న ప్రాంతాల్లోనే అత్యధికంగా ఇటువంటి మొక్కలు కనపడుతున్నాయని, మిగిలిన ప్రాంతాల్లో అది సుమారుగా అంతరించాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఆదివాసుల వేట కూడా ఆకలి తీర్చుకోడానికే తప్ప చర్మాలో, దంతాలో మార్కెట్లో అమ్ముకోడానికి కాదు. ఆకలేస్తే ప్రకృతిలో లభించే ఆహారాన్ని, అది శాఖాహారమైనా, మాంసాహారమైనా వన్య ప్రాణులు ఎలా తీసుకుంటాయో సుమారుగా అలా తీసుకుంటారు. వాళ్లు ఉన్న ప్రాంతంలోనే వన్యప్రాణులు మనుగడలో ఉన్నాయి. కడుపాకలి కోరిక పరిమితం. మార్కెట్ ఆకలికి అపరిమితం. ప్రకృతిలో ఉన్నవాటిని ఉపయోగించుకుంటే ఏ నష్టం ఉండదు. వాటిని అతిగా నిలువ చేసుకొని, అతిగా ఉత్పత్తి కోసం వినియోగించి, మర్కెట్లకు తరలించుకుంటేనే ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. పెట్టుబడిదారులకు దూరంగా ఉంచితేనే అడవులు బతుకుతాయి. కానీ పెట్టుబడిదారుల కోసం అడవి బిడ్డలు గెంటేస్తున్నారు. వారు తమను, తమకు ఆవాసమైన అడవులను కాపాడుకోడానికి పోరాడుతున్నారు.
ఆదివాసులు పోరాడి సాధించుకున్న రాజ్యాంగ గుర్తింపు, తమ భూమిని పరాయివాళ్లు ఆక్రమించుకోకుండా తెచ్చుకున్న 1/ 70, స్వయంపాలన కోసం సాధించుకున్న పీసా చట్టం అమలు కోసం కూడా నిరంతరం పోరాటం చేయాల్సే వస్తోంది. ఈ క్రమంలో 2006లో వచ్చిన అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ఒక గొప్ప మైలురాయి అని ఆదివాసీ ఉద్యమ నాయకులు చెప్తారు. ఆదివాసులు నివసిస్తున్న, సాగుచేసుకుంటున్న అటవీ భూములపై వారి హక్కుల్ని గుర్తించి ప్రభుత్వం ఇచ్చే దృవీకరణ పత్రం అడవిపై వారి అధికారాన్ని సుస్థిరం చేస్తుందని, ఇది ఆదివాసులకు జరిగిన చారిత్రక అన్యాయాలను సవరించడానికి ఉద్దేశించినదని అంటారు. పర్యావరణ పరిరక్షణలో ఆదివాసుల భాగస్వామ్యాన్ని పెంచే అవకాశం కూడా ఈ చట్టం వల్ల వస్తుంది. ఇటువంటి ప్రయత్నాలు మెక్సిలో, కొన్ని యూరోపియన్ దేశాలలో జరుగుతున్నాయి. అడవుల మీద వ్యక్తిగత హక్కులతో పాటు, గ్రామ సభల అధికారాలను గుర్తించి, సామూహిక హక్కులను, అ విధంగా అడవుల పరిరక్షణలో ఆదివాసీ సమూహాల పాత్రను మరింతగా పెంచడానికి ప్రభుత్వ సంస్థలు, పర్యావరణ సంస్థలు పనిచేస్తున్న ఉదాహరణలు మనకున్నాయి.
కానీ ఇక్కడ అటవీ హక్కుల గుర్తింపు చట్టం గుర్తింపు పత్రాలను ఇచ్చే పద్దతి ఎంత లోపభూయిష్టంగా ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అర్థమవుతుంది. అధికారగణం ఎంత నిర్లక్ష్యంగా, అవినీతిమయంగా ఉందో ఈ చట్టం అమలు కూడా అదే విధంగా ఉ ంది. అదట్లో ఉంటే వైల్డ్ లైఫ్ ఫస్ట్ అనే పిచ్చి ఎజ్వో గ్రూపు, మరికొంత మంది ఈ చట్టం అమలులో వన్యప్రాణులకు నష్టం జరుగుతుందని సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తే, దాన్ని పట్టుకొని 'అటవీ హక్కుల గుర్తింపు చట్టం' కింద హక్కు పత్రాలు లేని వాళ్లందరినీ అడవుల నుండి వెంటనే ఖాళీ చేయించాలని ఫిబ్రవరిలో ఒక తీర్పు వచ్చింది. వన్యప్రాణుల పేరు మీద ఇలాంటి పిటిషన్లు గతంలో కూడా దాఖలయ్యాయి. వాటివల్ల అనేక మంది ఆదివాసులు నిర్వాసితులయ్యారు. అసలు అడవిని, ఆదివాసిని వేరుచేసి చూడ్డంలో హ్రస్వ దృష్టి మాత్రమే కాదు, జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక కుట్ర ఉందని అర్థమవుతుంది. తాజా సుప్రీం కోర్టు తీర్పుపై ప్రభుత్వం స్టే కోరింది, కోర్టు స్టే ఇచ్చింది కానీ ఆదివాసుల పక్షాన ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదన్నది స్పష్టం. ఒక బలహీనమైన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం లక్షలాది ఆదివాసుల జీవితాలను ప్రభావితం చేసే తీర్పు ఇవ్వడం, దానిమీద ప్రభుత్వం బలమైన వాదన వినిపించకపోవడం వెనక స్పష్టంగా కార్పొరేట్ కంపెనీల కోసం అడవుల్ని ఖాళీ చేయించే దుర్మార్గమైన వ్యూహం ఉందని అనుమానించక తప్పదు. అడవిలో ఆదివాసులు అవిభాజ్యమని గుర్తించని పర్యావరణ సూత్రాలు పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసమే. వివిధ చట్టాల ద్వారా ఆదివాసీ హక్కులను హరించిన చరిత్ర ఎంతో ఉందికానీ వలసవాదుల చర్యల కన్నా ఎన్నో రెట్లు దుర్మార్గమైన చర్యకు ప్రభుత్వం దిగకముందే దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఒక జాతిహననంగా ఇది చరిత్రలో నిలిచిపోకుండా ఉండాలంటే ఆదివాసులకు అండగా ఉద్యమించాల్సిందే. ఇది ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం, మన భవిష్యత్ తరాల కోసం కూడా అత్యవసరం.
(మాతృక, జులై 2019)

No comments:
Post a Comment