ప్రకృతిలో ప్రతి ఆవరణ వ్యవస్థ మరో ఆవరణ వ్యవస్థతో పేగుముడి వేసుకొని ఉంటుంది. నేల (శిలావరణం), నీరు (జలావరణం), గాలి (వాతావరణం), ప్రాణకోటి (జీవావరణం) దేనినీ వేరొకదాని నుండి వేరుచేసి చూడ్డానికి వీల్లేదు. మన సౌకర్యం కోసం ఒక్కోదాన్ని విడిగా పరిశీలించి అర్థం చేసుకున్నా, వాటి మధ్య ఉంటే బాంధవ్యాన్ని మర్చిపోడానికి లేదు. ఒకటి వేరొకదాన్ని ప్రభావితం చేస్తుందని, అట్లాగే వేరొకదానితో ప్రభావితం అవుతుందని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. ఉదాహరణకు నీరు నేల స్వభావాన్ని ప్రభావితం చేస్తే, నేల స్వభావం నీటి లక్షణాలను ప్రభావితం చేస్తుంది. రేండూ వాటిలో నివసించే జీవరాశులను ప్రభావితం చేస్తాయి. జీవరాశులు అవి నివసించే ఆవరణను ప్రభావితం చేస్తాయి. చెట్లు వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. వాతావరణం మొక్కల పెరుగుదలను నిర్దేశిస్తుంది. ఇట్లా అన్నీ అన్నింటితో సంబంధంలో ఉంటాయి. పర్యావరణాన్ని సమగ్రంగా చూసి అర్థం చేసుకోకపోతే పర్యావరణ సమస్యలను వర్గీకరించి వాటికి విడివిడిగా పరిష్కారాలను సూచించే ప్రమాదం ఉంటుంది. అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. ఎందుకంటే ఏదీ విడిగా ఉండదు. విడిగా పనిచేయదు. ఒక మూలకం మార్పు చెందినా అది దాని చుట్టూ ఉండే వాటిని ప్రభావితం చేసి గొలుసుకట్టు మార్పులకు అది దారి తీయవచ్చు.
మానవులు ప్రకృతి సూత్రాలను అర్థం చేసుకొని అందులోని వనరులను ఉత్పత్తికి వినియోగించుకోవడంలో గాని, సురక్షిత, సౌకర్యవంతమైన జీవితాన్ని నిర్మించుకోవడంలో గాని ప్రకృతితో క్రియాత్మక సంపర్కంలోకి వెళ్లి దానిని ప్రభావితం చేస్తారు లేదా మార్పుకు గురిచేస్తారు. ప్రకృతి తన ప్రతిచర్య ద్వారా మానవుల మీద ప్రభావం చూపిస్తుంది. ఒక్క మనుషులే కాదు, చుట్టూ ఉన్న జీవ, నిర్జీవ పదార్థాలు ప్రభావితమవుతాయి. అది వినాశకర ఫలితంగా పరిణమిస్తోందని తన జ్ఞానం ద్వారా అర్థం చేసుకొని ప్రకృతితో మెరుగైన ఆచరణలోకి దిగి తిరిగి దానిని పునరుద్ధరించే అవకాశం కూడా మానవులకే ఉంటుంది. వేరే ఏ ప్రాణులూ ఆ పని చేయలేవు.
నీటి వనరులను సంరక్షించుకోవాలనే మానవుల సంకల్పం ఈనాటిది కాదు. చెరువులు, కుంటలు, బావుల ద్వారా నీటిని నిలువచేసుకొని కరువు కాలానికి వాడుకునే సంప్రదాయం వ్యవసాయంతో పాటు విస్తరించింది. సాంకేతికత పెరిగాక పెద్ద పెద్ద ఆనకట్టల నిర్మాణం మొదలై అది ఉత్పిత్తిని పెంచి, ఎటువంటి సామాజిక పరిణామానికి దారితీసిందో మనకు తెలుసు. డ్యాం వంటి నిర్మాణం శాస్త్ర విజ్ఞానం సాధించిన ఒక అద్భుతం. నీళ్ళు నిలువచేసుకునే ప్రాజెక్టులు ప్రజలందరి ఉమ్మడి అవసరాలు తీర్చాలని, నీటి పారుదల, వినిమయంలో అసమానతలు తొలగించాలని వచ్చిన ఉద్యమాలు ఆయా ప్రాంతాల కోసం డ్యాములు కట్టి సహజ న్యాయసూత్రాలను అమలు చేయాలని కోరుతున్నాయి. ప్రజల నీటి అవసరాలు తీర్చడం కోసం ఆనకట్టలు కట్టడం అనేది మానవ హక్కుల పరిధిలో కూడా మాట్లాడుకుంటున్నాం. మదురుతున్న నీటి సంక్షోభం నుండి 'ఇంత సాంకేతికత అభివృద్ధి చెందినా మనిషికి గుక్కెడు నీళ్లివ్వలేరా' అని ప్రభుత్వాలను నిలదీస్తున్నది ఆనకట్టలు కట్టమనే. ప్రతి నీటి బొట్టూ ఒడిసి పట్టుకోవాలి అనే నినాదం, నదులను అనుసంధానం చేయాలనే చర్చ కూడా నీటి పారుదల ప్రాజెక్టుల కేంద్రంగా వస్తున్నవే.
అయితే నీటి కరువుకు పరిష్కారం నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణమేనా? ఈ ప్రాజెక్టులు కరువును రూపుమాపడమే కాదు, వరదలను నివారిస్తాయని, పనిలో పనిగా ఎటువంటి కాలుష్యం లేకుండా జలవిద్యుత్ ఉత్పత్తి కూడా చేసుకోవచ్చని మనకున్న సాధారణ జ్ఞానం. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ప్రాజెక్టులు చేకూర్చే ప్రయోజనాలు పరిమితమైనవి. పర్యావరణ ప్రభావాలు అపరిమితమైనవి. మొదట్లో లాభనష్టాలు బేరీజు వేసుకొని విస్థాపన, అడవుల విధ్వంసం వంటి ప్రతికూలతలున్నా ఆనకట్టల నిర్మాణం వల్ల ప్రయోజనాలే అధికమని నిర్ధారణ చేయడం ఉండేది. పర్యావరణశాస్త్రాన్ని చదువుకునే విద్యార్థులు ఇట్లాంటి పాఠం ఒప్పచెబుతారు.
డ్యాముల చుట్టుపక్కల పరిసరాల్లో చోటుచేసుకున్న మార్పులపై లోతైన అధ్యయనాలు బైటికొచ్చాక క్రమంగా వాటిని పర్యావరణానికి నష్టం చేకూర్చే నిర్మాణాలుగా ఎంచడం ప్రారంభమైంది. ప్రత్యామ్నాయాల చర్చ సీరియస్ గా ముందుకొచ్చింది. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో పర్యావరణ ఉద్యమాలు, ఇప్పటి వరకూ ఉన్న సాంకేతికతకు ప్రత్యామ్నాయ ఆలోచనలు బలంగా వస్తున్నాయి.
మన దేశంలో ఇప్పటికీ ఆనకట్టలు అభివృద్ధికి చిహ్నాలు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకించడమనే ఆలోచనను పాలకవర్గాలు అలా ఉంచితే విస్థాపన సమస్య లేని సాధారణ ప్రజలు అస్సలు ఆమోదించరు. నిజానికి కరువు ప్రాంతాలకు నీరందించేందుకు ప్రాజెక్టులు కట్టాలని ఒకవైపు ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒక సాంకేతికత కాలం చెల్లిందని బైట చర్చ నడుస్తుంటే మన దగ్గర ఆ సాంకేతికత అందరికీ సమన్యాయం చేయాలని ఆందోళనలు ఇంకా ఉన్నాయంటే అర్థం దాని వినిమయమే సరిగ్గా జరగలేదని.. అమెరికాలో పెద్ద ఎత్తున డ్యాములను కూల్చివేస్తున్న సంగతి బహుషా మనలో చాలా మందికి తెలీదు. 1990 నుండి 2015 మధ్య సుమారు 900 డ్యాములు పూర్తిగా నేలమట్టం చేసారు. ఈ తొలగింపు కూడా ఒక పెద్ద ప్రాజెక్టు. ప్రతి డ్యాముకు కొంత జీవితకాలం ఉంటుంది. ఆ కాలపరిమితి దాటితే అవి బలహీనమైపోయి ప్రమాదకరంగా తయారవుతాయి. వాటి నిర్వహణ ఖర్చు తడిసిమోపెడవుతుంది. కాబట్టి కాలం చెల్లిన వాటిని తొలగించాల్సి వస్తుంది. భారీ ప్రాజెక్టులు భూమి పొరల్లో ఒత్తిడి కలిగించి ప్రకంపనలకు దారితీయవచ్చు. అటువంటి ప్రకంపనలు గుర్తించినప్పుడు డ్యామును తొలగిస్తారు. జల పర్యావరణ వ్యవస్థ దెబ్బతినడం, ప్రాజెక్టు వల్ల చేకూరే ప్రయేజనం కన్నా నష్టం ఎక్కువని తేలినప్పుడు కూడా డ్యామును తొలగిస్తున్నారు. వాషింగ్టన్ లో ఎల్వా నది మీద కట్టిన డ్యామును 2011-2012 మధ్య తీసేసారు. అది అమెరికాలో అతి పెద్దదైన డ్యాం. సహజ ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల నదీ ఆవరణ వ్యవస్థ విధ్వంసమై తీరప్రాంతమంతా నిర్ణమైపోయే పరిస్థితి వచ్చినప్పుడు, దానిని పునరుద్ధరించడానికి అనివార్యంగా డ్యాములు తొలగించాల్సిందే అన్న నిర్ధారణకు వస్తున్నారు. ఎల్వా నది మీద ఆనకట్ట తొలగించాక మెల్లగా ఆ నది, నదిలో సాల్మన్ చేపలు, తీరప్రాంతం పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయని అంటున్నారు.
ఇంతకూ నీటి పారుదల ప్రాజెక్టులు పర్యావరణం మీద చూపించే ప్రభావం ఏమిటో చూద్దాం. నేలా, నీరు మధ్య సహజ ప్రాకృతిక బంధం ఉంటుంది. ఒక నీటి చినుకు నుండి మసూధృత నది దాకా నీరు నేలకు ఒక ఆకృతినివ్వడానికి దోహదం చేస్తుంది. తన ప్రవాహంతో పాటుగా మోసుకుపోతున్న నిక్షేపాలను నది నేలకు బట్వాడా చేస్తుంది. అదే విధంగా నేల నుండి నది కూడా కొన్ని పదార్థాలను తనలో భాగం చేసుకుంటుంది. వాటిని సముద్రంలోకి మోసుకుపోతుంది. ఆనకట్టలు నదుల సహజ ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. ఫలితంగా నదికి, దాని పరీవాహక ప్రాంతానికి మధ్య బంధం తెగిపోతుంది. భారీగా నీటిని నిలువ ఉంచడం వల్ల వాటిలోని నిక్షేపాలు డ్యాం అడుక్కుచేరి పేరుకుపోతాయి. నీటిలో ఉండే పోషకాలు తీరప్రాంత నేలలకు పంపిణీ కాక ఒక్కచోటనే పూడికలా చేరిపోతాయి. క్రమంగా డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం కూడ తగ్గుతూ వస్తుంది.
నేలకు అందాల్సిన పోషకాలు అందక, నదీ పర్యావరణంలో కలవాల్సిన మూలకాలు కలవక అటు తీరంలో, ఇటు నదిలో జీవిస్తున్న ప్రాణులకు హానికలుగుంది. కాలువల కింది వ్యవసాయంలో పోషకాలు తగ్గడం వల్ల కృత్రిమ ఎరువులు వాడవలసి వస్తుంది. నదిలో స్వేచ్ఛగా తిరిగే చేపలు దీనివల్ల తీవ్రంగా నష్టపోతాయి. నేల స్వభావాన్ని బట్టి కొన్నిచోట్ల భారీ ప్రాజక్టుల వల్ల భూకంపాల ప్రమాదం పొంచి ఉంటుంది. పోలవరం సందర్భంలో ఈ విషయం బాగా చర్చకు వచ్చింది. డ్యాములు నిండితే అనూహ్యంగా వచ్చిపడే వరద వినాశనకరంగా పరిణమిస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని భారీ ప్రాజెక్టుల నిర్మాణం నష్టదాయకమని పర్యావరణవాదులు ఎప్పటి నుండో హెచ్చరిస్తున్నా మన పాలకులు ఎంత పెద్ద ప్రాజెక్టు కడితే అంత గొప్ప అని ప్రచారం చేసుకుంటున్నారు. కాలేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పూనుకోవడం మతిలేని చర్య తప్ప మరోటికాదు. ఈ డ్యాం కట్టడానికి సుమారు ఎనభై వేల కోట్లు ఖర్చయితే, విద్యుత్తు ఉపయోగించి నీళ్లు ఎత్తిపోయడానికి ఏటా 18వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. కాంట్రాక్టుల పేర డబ్బు దోచుకోడానికి తప్ప వాస్తవానికి ఇది నష్టదాయక ప్రాజెక్టు. నిర్వాసిత సమస్య, పర్యావరణ విధ్వంసం, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు వేటినీ ఖాతరు చేయకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టు మీద కోర్టులో వందల కేసులు దాఖలయ్యాయి. అటు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎన్నో ఆందోళనలు జరిగాయి. అన్నిటినీ తోసేసి ఇవి బృహత్తర పథకాలని, ప్రపంచ రికార్డులని సూరు పెట్టి, టూర్లు వేసి జనాన్ని తీసుకుపోయి ప్రచారం చేసుకున్నారు. ఇది జనాన్ని ఒక మాయోలో ముంచడానికి తప్ప వేరొకందుకు కాదు.
భారీ ప్రాజెక్టుల బదులు నది ప్రవాహానికి అనుగుణంగా వరద స్థాయి డ్యాములు నిర్మించడం మేలని ఇంజనీర్లు ప్రతిపాదిస్తున్నారు. దీని వల్ల నీటి పారుదల విస్తీర్ణం పెంచవచ్చు. జపాన్ వంటి చోట్ల ఉపరితర డ్యాములకు ప్రత్యామ్నాయంగా భూగర్భ నీటి ప్రాజెక్టులు కడుతున్నారు. దీని వల్ల ఉపరితల నీటి ప్రవాహానికి అంతరాయం కలదని, భూగర్భ జలాల నిల్వ పెరుగుతుందని చెబుతున్నారు. విస్థాపన సమస్యగాని, అడవుల విధ్వంసంగాని, పూడిక సమస్యలు గాని లేకుండా వీటి నిర్మాణం, నిర్వహణ ఉన్నంతలో పర్యావరణ హితంగా ఉంటుందని ప్రతిపాదిస్తున్నారు.
తక్షణం సంప్రదాయ నీటి నిర్వహణ పద్ధతులను పునరుద్ధరించి, భూగర్భ జలాలు పెంచడం చేయకపోతే ఎన్ని డ్యాములు కట్టినా అన్ని ప్రాంతాలకు నీరు అందదు. ఒక చోట నీటి ఆపి, వేరొక చోటికి తరలించడంలో ఒక ప్రాంతాన్ని ఎండబెట్టడం మన అనుభవంలో ఉంటున్నది. ప్రాంతాల మధ్య నీటి పంపిణీని న్యాయబద్ధంగా చేయక, అస్తవ్యవస్థంగా కట్టిన ప్రాజెక్టులను, కాలం చెల్లిన ప్రాజెక్టులను బహుషా మనం కూడా తొలగించుకోవలసి ఉంది. ఇప్పటికే దేశంలో కాలం చెల్లిన ప్రాజెక్టులు 115 దాకా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇటువంటి పాత డ్యాములు ఉన్నాయి.
అభివృద్ధి అంటే ఒకే పాత మూసలో అర్థం చేసుకోకుండా, పెరిగిన పర్యావరణ జ్ఞానం నుండి నష్టాలను గుర్తించి ప్రత్యామ్నాయాలను ఆలోచించాలి. పర్యావరణ దృష్టిలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను పరిశీలిస్తే, నదుల అనుసంధానం ఒక మూర్ఖపు ఆలోచన అని తేలిపోతుంది. నిజంగా ఎంత వరకు సాధ్యమో గాని అలా చేస్తే గనక పెద్ద ఎత్తున జీవావరణ వ్యవస్థను మొత్తాన్నీ మన చేతుల్లోకి తీసుకొని నాశనం చేసి పర్యావరణాన్ని శాశ్వతంగా పునరుద్ధరణకు వీలుకాని నష్టానికి గురిచేసిన వాళ్లమవుతాము.
(అరుణతార, జులై 2019)
No comments:
Post a Comment